6, జనవరి 2022, గురువారం

Sri Suryanarayana Temple, Maroli

                            మార్తాండుడు కొలువైన మరోలి


ప్రత్యక్ష నారాయణునిగా కీర్తించబడుతూ లోకాలకు వెలుగును తద్వారా ఆహారాన్ని , నీటిని అన్ని అవసరాలకు కేంద్రంగా భాసిల్లుతున్న ఆదిత్యునికి ఉన్న ఆలయాల గురించి అడిగితే ఎవరైనా మొదటగా టక్కున చెప్పేవి మన రాష్ట్రంలోని అరసవెల్లి, ఒడిషా లోని కోణార్క చెబుతారు. ఉన్న ఆలయాలు తక్కువే గానీ అన్నీ కూడా  విశేష ఆలయాలు కావడం చెప్పుకోవలసిన అంశం.  

అలాంటి ప్రత్యేక ఆలయాల్లో  చాలా కొద్ది మందికి, స్థానికంగా భక్తులు అమిత భక్తి విశ్వాసాలతో సందర్శించే ఒక ఆలయం కర్ణాటకలోని ప్రసిద్ధ పట్టణం అయిన మంగళూరు నగరంలో నెలకొని ఉన్నది . 

ఆలయ చరిత్ర ప్రకారం ఇక్కడ మార్తాండుడు కొలువైనది ఎప్పుడో తొలి యుగంలో అని, తొలి  ఆలయం నిర్మించి పన్నెండు వందల సంవత్సరాలైనది అని తెలియవస్తోంది. 

అదే "మరోలి" లోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం. 

సూర్య ఆరాధన 

కృత యుగం నుండి హిందూ సంప్రదాయంలో సూర్య ఆరాధన ఉన్నది అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. రామాయణ, భారతాలలో సూర్య భగవానుని గురించి, ఆయనను ఆరాధించడం గురించి, సూర్య అనుగ్రహం పొందడం గురించి  అనేక సంఘటనలు కనిపిస్తాయి. 
సూర్య ఆరాధనలో ముఖ్యమైనది అయిన "ఆదిత్య హృదయం " అగస్త్య మహర్షి రామరావణ యుద్ధం సందర్భంగా శ్రీ రామచంద్రునికి ఉపదేశించారని. ఆయన శ్రీ సూర్య నారాయణుని సహకారంతో రావణుని మీద విజయం సాధించారని రామాయణం చెబుతోంది. ఇలా అన్ని యుగాలలో కూడా ప్రసిద్ధి చెందినది శ్రీ సూర్య ఆరాధన. 
ముఖ్యంగా ఆరోగ్యం కొరకు సూర్య నమస్కారాలు చేయడం, సూర్య కిరణాలలో నడవడం మరియు నదీజలాలలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో స్నానమాచరించడం లాంటివి ఎన్నో తరాల నుండి అభ్యాసంలో ఉన్నవే కదా !

ఆలయ పురాణ గాధ 

దివాకరుడు ఈ క్షేత్రంలో కొలువు తీరడానికి సంబంధించిన పురాణగాథ ఇదుమిద్దంగా తెలియ రాకున్నా ఒకప్పుడు ముని ఆశ్రమంగా పేరొందిన ఇక్కడ అనేక మంది మహర్షులు నివసించేవారట. వారు తమ అర్ఘ్యపాదులను, పూజలను స్వయంగా కొలువుతీరి అందుకోమని చేసుకొన్న విన్నపాలకు సంతుష్టుడైన అరుణుడు అనుగ్రహించి అర్చామూర్తిగా అవతరించారని ఒక గాధ స్థానికంగా వినిపిస్తుంది. 

ఆలయ చరిత్ర 

భానునికి ఇక్కడ తొలి ఆలయం సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రిందట స్థానిక పాలకులు నిర్మించినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో ఇది ఒక ప్రముఖ తీర్థస్థలి. కారణం ఈ క్షేత్రం నేత్రావతి నదీ తీరంలో నెలకొని ఉన్నది. సమీపంలో అరేబియా సముద్రం కూడా ఉండటంతో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చేవారు. కానీ కాలగతిలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా క్షేత్ర ప్రాముఖ్యం క్షీణించింది అని తెలుస్తోంది. భక్తుల సంఖ్య తగ్గిపోయింది.  
అనంతర కాలంలో ఈ క్షేత్ర ప్రాధాన్యత పూర్తిగా తగ్గు ముఖం పట్టింది. ఆలయ నిర్మాణం కూడా శిథిలావస్థకు చేరుకొన్నది. రాజ్యకాంక్షతో నిరంతరం యుద్ధాలలో మునిగి తేలుతున్న పాలకులు కూడా ఆలయ సంరక్షణ విషయంలో శ్రద్ధ చూపకపోవడంతో నిర్మాణం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. 
ఇది స్థానికంగా శ్రీ సూర్యనారాయణ స్వామిని కులదేవతగా ఆరాధించే "మరోలి, పడవు, అలపే, బజల్, కన్నూర్, జప్పు మరియు కంకనాడి అనే ఏడు గ్రామాల ముఖ్యులు నిర్ణయించుకున్నారట. గ్రామాల ప్రజలతో సంప్రదింపులు జరిపి, విరాళాలు సేకరించి ఆలయాన్ని పునః నిర్మించడానికి సన్నాహాలు చేశారట. అలా నిర్మించబడిన ఆలయం కూడా కూడా కాల పరిస్థితులకు మరోసారి శిథిలావస్థకు చేరుకొన్నదట. తిరిగి ఈ గ్రామాల వారే నిధులను సేకరించి ప్రస్తుత రూపంలో ఆలయాన్ని భక్తులకు అందుబాటు లోనికి తెచ్చారు. నేటికీ ఆ ఏడు గ్రామాల వారే ఆలయ కమిటీ సభ్యులుగా ఉన్నారు. 
చివరిసారి ఆలయ పునః నిర్మాణ మరియు మర్మత్తులను సుమారు ఏడు సంవత్సరాల క్రిందట చేపట్టినట్లుగా తెలుస్తోంది. వాటిల్లో పురాతన నిర్మాణాలకు మరమత్తులు, కొన్ని కొత్త నిర్మాణాలు ఉన్నాయి. 

ఆలయ విశేషాలు 

నేడు ప్రధాన అర్చనామూర్తిగా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజలందుకొంటున్న ఈ క్షేత్రంలో తొలినాళ్లలో వివిధ సిద్ధాంతాలను అనుసరించేవారట. తొలుత పరబ్రహ్మగా, తరువాత శివాగమన ఆధిపత్యంలో  పరమశివ మరియు పరాశక్తిగా  ఉమ్మడి రూపమైన అర్ధనారీశ్వర శక్తిగా, అనంతరం వైష్ణవ సంప్రదాయం ప్రకారం  శ్రీమన్నారాయణునిగా పూజించేవారట. కానీ చివరికి తిరిగి ప్రత్యక్ష సాక్షి రూపం లో పూజాదులను ప్రారంభించారని చెబుతారు. కానీ త్రిమూర్తి రూపాయ దివాకర అన్నట్లుగా ఉదయం సృష్టికర్త శ్రీ బ్రహ్మదేవునిగాను, మధ్యాహన్నం మహేశ్వరునిగాను, అస్తమాన సమయంలో మహావిషు గాను శ్రీ సూర్యనారాయణకు పూజలు చేస్తారు. అదే విధంగా నవరాత్రులలో ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి దేవికి సరస్వతి, మహాలక్ష్మి మరియు శ్రీ దుర్గ రూపాలలో పూజలు నిర్వహిస్తారు. ప్రాంగణంలో ఉన్న మరో ఉపాలయం శ్రీ వినాయకునిది
తూర్పు ముఖంగా ఉన్న ఆలయం కేరళ నిర్మాణశైలిలో  ఉంటుంది. మధ్యలో ఉన్న గర్భాలయం పైన ఉన్న విమానం కూడా కేరళ శైలిలోనే నిర్మించబడటం విశేషం. పూజలు కూడా  కేరళ విధానంలో తంత్ర ప్రధానంగా ఉంటాయి. ఉత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసే  మేళతాళాలు  కూడా కేరళ రాష్ట్రానికి చెందిన పంచ వాయిద్యాలు కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బహుశా కేరళ సరిహద్దులలో ఉండటం, చాలా కాలం కేరళ పాలకుల యేలుబడిలో ఉండటం కారణాలు కావచ్చును. 
సుమారు రెండు ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయానికి వెలుపలి ప్రాంగణం ముందు ఒక ధ్వజస్థంభం ఉంటుంది. ధ్వజ స్తంభ మూలం వద్ద "సప్తాశ్వ రథమారూఢం.... " అన్న దానికి నిదర్శనంగా ఏడు అశ్వ రూపాలను సుందరంగా మలచి నిలిపారు. లోపలి ప్రాకారంలో ఉన్న నమస్కార మండప స్తంభాల పైన చెక్కిన శ్రీ నృసింహ, బాల గణపతి, భక్త గణపతి, శక్తి గణపతి మరియు ఇతర దేవీ దేవతల శిల్పాలు  సజీవకళ ఉట్టిపడుతూ దర్శనమిస్తాయి. 
రాతి శిల్పాల కన్న మండప, మరియు ఆలయ అంతర్భాగంలోని పై కప్పుకు, గోడల వద్ద చెక్క మీద చెక్కిన లతలు, చెట్లు ఇతర సూక్ష్మ చెక్కడాలు ఎంతో సుందరంగా చెక్కినవారి నేర్పరితనాన్ని తెలుపుతాయి.  
వర్తులాకార గర్భాలయానికి ఉన్న స్తంభాలను మనకున్న అరవై సంవత్సరాలకు ప్రతీకగా పేర్కొంటారు. గర్భాలయంలో ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవానుడు స్థానిక భంగిమలో చతుర్భుజుడై చందన పుష్ప అలంకరణలో నయనమనోహరంగా దర్శనమిస్తారు. 
ఉదయం అయిదు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల కొరకు తెరిచి ఉండే ఈ దేవాలయంలో నిత్యం నియమంగా నాలుగు పూజలు నిర్వర్తిస్తారు. 
రధ సప్తమి సందర్బంగా అయిదు రోజుల పాటు ఉత్సవాలను నిర్వర్తిస్తారు. వేలాదిగా భక్తులు పక్క రాష్ట్రాల నుండి కూడా తరలి వస్తారు. గణేష చతుర్థి, ఉగాది, ఆర్క పూజ, నవరాత్రులు, మహా శివరాత్రి,  తులసి పూజ, శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ రామ నవమి మరియు దీపావళి సందర్బంగా విశేష పూజలు జరుపుతారు. 
ముఖ్యంగా స్థానిక భక్తులు గ్రహ మరియు జన్మ నక్షత్ర పూజలు జరిపించుకొంటుంటారు. అదే విధంగా వివాహం కానీ యువతీయువకులు స్వామివారిని దర్శించుకొని పూజలు జరిపించుకొంటే శీఘ్రగతిన కళ్యాణం అవుతుందని అంటారు. అలానే సంతానం లేని దంపతులు శ్రీ సూర్యనారాయణునికి ప్రత్యేక పూజలు జరిపించుకొని, ప్రదక్షణలు చేస్తే తప్పకుండా వంశాంకురాలను పొందుతారన్నది తరతరాల నమ్మకం. 
ఆదిత్యుడు ఆరోగ్యప్రదాత . ముఖ్యంగా చర్మ, నరాల మరియు నేత్ర సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా స్వామిని సేవించుకొంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని విశ్వసిస్తారు. దూర ప్రాంతాల నుండి కూడా ఎందరో అనారోగ్యవంతులు వస్తుంటారు.
స్థానికంగా తప్ప బాహ్య ప్రపంచానికి అంతగా పరిచయం లేని మరోలి ఆలయంలో కొలువు తీరిన శ్రీ సూర్యనారాయణ స్వామిని సేవించుకొంటే ఇహలోక ఇక్కట్లు తొలగిపోతాయన్న విశ్వాసంతో ప్రతి నిత్యం ఎందరో భక్తులు వస్తుంటారు. 
సాగరతీర నగరం, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మంగళూరు నగరంలో ఉన్న అనేక  పురాతన,నూతన ఆలయాలలో తప్పక సందర్శించుకోవలసిన జాబితాలో తొలి వరుసలో ఉండవలసినది మరోలిలో మార్తాండుడు కొలువైన ఆలయం. 

ఓం నమో ఆదిత్యాయ నమః !   
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...