16, జనవరి 2022, ఆదివారం

             శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం, మేల్పడి 

                        


ఆలయాల రాష్ట్రం తమిళనాడులోని అనేకానేక చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయాలు గల గ్రామాలలో ఒకటి మేల్పడి. వెల్లూరు జిల్లాలోని ఈ గ్రామంలో నెలకొల్పబడిన  రెండు ఆలయాలది ప్రత్యేక స్థానం.  
వీటిల్లో ఒకటి శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం కాగా రెండవది శ్రీ చోళేశ్వర స్వామి ఆలయం. ప్రస్తుతం ఈ రెండు చారిత్రక నిర్మాణాలు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి. 





శ్రీ సోమనాధీశ్వర స్వామి వారి ఆలయాన్ని ఒకటవ పరాంతక చోళుడు నిర్మించినట్లుగా శాసనాల ఆధారంగా తెలియవస్తోంది. 

పావన పాలరు నది 

కర్ణాటక రాష్ట్రం లోని నేటి చిక్కబళ్లాపుర జిల్లాలోని నంది కొండల్లో ఉద్భవించి తొలుత ఆ రాష్ట్రంలో  తరువాత   ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొంత భాగం చివరికి తమిళనాడులో అత్యధిక భాగం ప్రవహించి చివరికి వయలూర్ వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది పాలార్ నది. ప్రవాహ మార్గంలో సుమారు ఏడు దాకా ఉపనదుల ప్రవాహాన్ని తనలో కలుపుకొని వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ, ఎన్నో నగరాల నీటి అవసరాలను తీరుస్తుంది పాలార్ నది. ఈ పావన నదీతీరంలో ఎన్నో విశేష ఆలయాలు నెలకొల్పబడినాయి. 
వాటిలో భాగమైన ఈ రెండు ఆలయాలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా నిర్మించబడినాయి. 









శ్రీ సోమనాధీశ్వర స్వామి ఆలయం 

మేల్పడి గ్రామాన్ని గతంలో ఒకటవ రాజరాజ చోళుని పేరు మీద "రాజాశ్రయ పురం " అని పిలిచేవారట. ఆ కాలంలో ఈ ప్రాంతం చోళ మరియు రాష్ట్రకూట సామ్రాజ్యాల సరిహద్దు ప్రాంతం. రాజకీయంగా కీలకమైనదిగా  గుర్తించబడినది. అత్యధిక కాలం చోళుల ఆధీనంలో ఉన్నప్పటికీ రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణ పాలనలో కొంతకాలం వారి పాలనలో ఉండినది అని శాసనాలు తెలుపుతున్నాయి. 
విశాల ప్రాంగణంలో రెండు ప్రాకారాలతో నిర్మించబడిన ఈ ఆలయానికి సంబంధించి ప్రత్యేక పురాణగాథ ఏది అందుబాటులో లేదు. చోళుల ఆరాధ్యదైవం అయిన మహేశ్వరునికి మరో ఆలయాన్ని నిర్మించి తమకు అప్రతిహతంగా లభిస్తున్న విజయాలకు కృతజ్ఞత తెలుపుకోవాలన్న భావనతో ఈ ఆలయాన్ని ఒకటవ పరాంతక చోళుడు నిర్మించాడన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు చరిత్రకారులు. 








తూర్పు ముఖంగా ఉండే ఆలయానికి దక్షిణం పక్కన రాజగోపురం లేని ప్రధాన ద్వారం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే రెండో ప్రాకారం వెళ్లే ద్వారానికి మూడు అంతస్థుల గోపురం ఉంటుంది. 
గోడల పైన చిన్న చిన్న శిల్పాలను చక్కగా చెక్కారు. 
రెండో ప్రాకారంలో ఉన్న కళ్యాణ మండపం మరియు ఇతర మండపాల స్తంభాల పైన శ్రీ గణపతి, శ్రీ వీరభద్ర, శ్రీ భైరవ, సప్త మాతృకలు, కంకాళనాథర్, వృషభనాథర్, గంగాధరుడు, సూర్య, చంద్ర మరియు నాగులు తదితర రూపాలను ప్రాణం లేని రాతి మీద జీవకళ ఉట్టి పడేలా మలిచారు ప్రజ్ఞావంతులైన నాటి శిల్పులు. 
















నాటి శిల్పుల గొప్పదనాన్ని తెలిపే పెద్ద రాతి నీటి తొట్టి ఆలయ ప్రాంగణంలో కనపడుతుంది. 
ఎలా చెక్కారా అని ఆశ్చర్యం కలుగుతుంది చూపరుల మదిలో ! 
ఉపాలయాలలో శ్రీ గణపతి మరియు అమ్మవారు శ్రీ తపస్కృత దేవి కొలువై దర్శనమిస్తారు. 
సహజంగా ఎక్కడైనా గర్భాలయం పైన ఉండే విమానాన్ని పలుచని ఇటుకలను సున్నపు పూతతో ఏర్పాటు చేసి చక్కని శిల్పాలుగా మలుస్తారు. కానీ మేల్పడి లోని రెండు ఆలయాల విమానాలను నల్ల మరియు ఆకుపచ్చని మరకత శిలలతో నిర్మించారు. 
ఇలా నిర్మించిన  విమానాలు కలిగిన ఆలయాలు చాలా అరుదు అని పేర్కొనాలి. 



















సహజంగా మూలవిరాట్టుకు ఎదురుగా ఉండే ధ్వజస్థంభం మరియు నంది ఇక్కడ ముఖమండపానికి వెలుపల ఉండటం చెప్పుకోదగిన విషయం. నందీశ్వరుడు స్వామిని చూడటానికి వీలుగా రాతితో కిటికీ మలచిన విధానం గొప్పగా ఉంటుంది. 
గర్భాలయానికి ఎదురుగా ఉన్న ముఖ మండపం గుండ్రటి స్తంభాలతో ప్రత్యేకంగా కనపడుతుంది. ఈ స్తంభాల మీద ఎలాంటి శిల్పాలు ఉండవు. గర్భాలయానికి ఇరుపక్కలా ఉన్న నిలువెత్తు ద్వారపాలకుల విగ్రహాలు గంభీరంగా కనిపిస్థాయి  వారి ఆభరణాలు, ఆయుధాలు సహజత్వానికి దగ్గరగా ఉండటం విశేషం. గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ గణేష, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ బ్రహ్మ, శ్రీ లింగోద్భవమూర్తి, శ్రీ విష్ణు దుర్గ కొలువై ఉంటారు. 
పెద్ద లింగ రూపంలో శ్రీ సోమనాథేశ్వర స్వామి చందన, విభూది రేఖలతో కుంకుమ మరియు పుష్ప అలంకరణలో సర్ప భూషణం ధరించి నేత్రానందంగా దర్శనం అనుగ్రహిస్తారు.పురావస్తు శాఖవారి ఆధ్వర్యంలో ఉన్నా నిత్య పూజలు జరుగుతాయి. 
అమావాస్య, పౌర్ణమి, త్రయోదశి పూజలు జరుపుతారు. నియమంగా నాలుగు పూజలు రోజులో నిర్వహిస్తారు. 
శివరాత్రికి విశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.  












శ్రీ చోళేశ్వర స్వామి ఆలయం 


మనం అధికంగా చూసే ఆలయాలను, రాజ భవనాలను ఫలానా రాజ వంశానికి చెందిన ఫలానా రాజు నిర్మించారు అని తెలుసు కొంటుంటాము. కానీ అంతటి వైభవాన్ని చూసిన రాజుల చివరి విశ్రాంతి ప్రదేశం ఏమిటంటే ఎవరూ చెప్పలేరు. 
పల్లవ, చోళ, పాండ్య, విజయనగర, నాయక, చెర, హొయసళ, రాష్ట్రకూట, చాళుక్య ఆదిగా గల రాజవంశాల వారు భారత దక్షిణాపథాన్ని వందల సంవత్సరాల పాటు పాలించారు. కానీ వారెవ్వరి సమాధులను మనం ఎక్కడా చూడం. 
ఇందరు మహామహులైన పాలకులలో రాజరాజ చోళుని సమాధి మండపం మాత్రం కుంభకోణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న "ఉదయాలూరు" (శ్రీ గాంగేయపురం)లో కనపడుతుంది. మిగిలిన వారివి ఎక్కడ ఉన్నాయో ?
మనకెన్నో గొప్ప ఆలయాలను, నిర్మాణాలను అందించిన చోళ రాజులలో మరొకరి సమాధి మందిరం మేల్పడిలో కనిపిస్తుంది.  












అదే నేడు శ్రీ చోళేశ్వర స్వామి గా పిలవబడుతున్నఆలయం ఒకటవ పరాంతక చోళ మహారాజు ఆఖరి పుత్రుడైన "అరింజయ చోళుని సమాధి మందిరం. ఆయన పాలించింది తక్కువ కాలమైనా రాజ్యం పైన తనదైన ముద్ర వేశారని చరిత్ర గ్రంధాల వలన అవగతమౌతుంది. 
అరింజయుడు ఇక్కడికి సమీపంలోని ఆరూర్ వద్ద జరిగిన సమరంలో 967వ సంవత్సరంలో  అసువులు బాశారని తెలుస్తోంది. ఆయన పార్ధీవ శరీరాన్ని పాలరు నదీతీరంలోని మేల్పడి వద్ద సమాధి చేశారట. 
తదనంతర కాలంలో ఆయన మనుమడైన ఒకటవ రాజరాజ చోళుడు తాత మరణించిన నలభై ఏడు సంవత్సరాల తరువాత 1014వ సంవత్సరంలో ఆయన సమాధి మీద ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా గర్భాలయ వెలుపలి గోడల పైన ఉన్న శాసనాలు తెలియచేస్తున్నాయి. 
  










శాసనాల ప్రకారం గతంలో అరింజీశ్వర ఆలయంగా పిలవబడిన ఈ ఆలయం శ్రీ సోమనాధీశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా పాలరు నదీ తీరంలో ఉన్నది. సమాధి మీద నిర్మించిన ఇలాంటి నిర్మాణాలను "పల్లి పడై ఆలయం" అని పిలుస్తారు. 
కాలక్రమంలో శ్రీ చోళేశ్వరస్వామి ఆలయంగా పిలవబడుతున్న ఈ ఆలయం విమానంతో సహా పూర్తిగా రాతి నిర్మితం. ఈ నలుచదరపు నిర్మాణంలో ధ్వజస్థంభం, బలిపీఠాలు లాంటివి కనపడవు. ఒక చిన్న ముఖ మండపం మరియు గర్భాలయం మాత్రమే ఉంటాయి. 






ముఖ మండపంలో నందీశ్వరుడు కొలువై ఉంటారు. గర్భాలయ వెలుపలి గోడల పైన రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు వేసిన  వివిధ కాలాలకు చెందిన శాసనాలు కనపడతాయి. గర్భాలయానికి నలువైపులా శ్రీ దక్షిణామూర్తి, శ్రీ మహా విష్ణు, శ్రీ బ్రహ్మ, శ్రీ విష్ణు దుర్గ కొలువై కనపడతారు. 
ఈ పరివార దేవతల పై భాగాన శ్రీ కన్నప్ప, ఋషి పత్నులతో ఉన్న శివుని మరో రూపం అయిన భిక్షందార్, శివ పూజ చేస్తున్న ఒకటవ రాజరాజ చోళుడు శిల్పాలను సుందరంగా మలచారు.  
గర్భాలయ ద్వారానికి ఇరుపక్కలా నిలువెత్తు ద్వారపాలక విగ్రహాలు ఉంటాయి. చిన్నదైన గర్భాలయంలో మూడు అడుగుల ఎత్తైన లింగ రూపంలో శ్రీ చోళేశ్వర స్వామి చక్కని పుష్ప అలంకరణలో దర్శనమిస్తారు. 
పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. 
 
















వెయ్యి సంవత్సరాల చరిత్రకు మౌన సాక్షిగా నిలచిన ఆలయాల నిలయమైన మేల్పడి పాలరు నదీ తీరంలో పచ్చని పొలాల మధ్య చక్కని పల్లె వాతావరణానికి మారు పేరులా ఉంటుంది. 

ఈ చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రదేశం వెల్లూరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఎలాంటి వసతి, భోజన సౌకర్యాలు లభించవు. సమీపంలోని తిరువాళం , వల్లిమలై లాంటి ప్రదేశాలను మేల్పడి తో కలిపి దర్శించడం ఉచితం. అన్నీ పక్క పక్కనే ఉంటాయి. విశేష పౌరాణిక మరియు చారిత్రక నేపధ్యం గల ప్రదేశాలే ! అద్దెకు వాహనం తీసుకొని వెళ్లడం సౌకర్యంగా ఉంటుంది. 

అన్ని రకాల వసతి, భోజన సౌకర్యాలు వెల్లూరు (కాట్పాడి)లో లభిస్తాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైలు మార్గంలో కాట్పాడి చేరుకోవచ్చును. 

నమః శివాయ !!!!

 
















1 కామెంట్‌:

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...