14, జనవరి 2022, శుక్రవారం

Thiruvahindrapuram Divyadesam

 

                        తిరువహీంద్రపురం        


నూట ఎనిమిది దివ్యదేశాలలో ప్రతి ఒక్క క్షేత్రం తమవైన విశేషాలతో అక్కడ స్వయం దేవాధి దేవుడు నడయాడారని  నిర్ధారణ చేస్తున్నాయి. అందుకే ఈ దివ్య క్షేత్రాల పౌరాణిక గాథలు అనేక పురాణాలలోను మరియు పురాతన తమిళ గ్రంధాలలోను ప్రముఖంగా ప్రస్తావించబడినాయి. అదే కోవ లోనికి వస్తుంది తిరువహీంద్ర పురం దివ్యదేశం.  

శ్రీ వైకుంఠ వాసుడు శ్రీ దేవాధిదేవన్ గానే కాకుండా శ్రీ రంగనాధునిగా, శ్రీ రామునిగానే కాకుండా జ్ఞాన ప్రదాత శ్రీ హయగ్రీవునిగా కూడా కొలువైన  ఈ క్షేత్రం విరజా (గరుడ) నదీతీరంలో ఉన్నది. 

బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం మరియు బృహన్నారదీయ పురాణాలలో తిరువహీంద్ర పురం గురించి సవివరంగా వివరించబడినట్లుగా తెలుస్తోంది. వాటి ప్రకారం ఈ క్షేత్ర పురాణ గాధ అనేక విశేషాల సమాహారం అని అర్ధం అవుతుంది. 

పురాణ గాధ 

బ్రహ్మదేవుని నుండి పొందిన వర గర్వంతో ముల్లోకవాసులను హింసించసాగారు . వాని బారి నుండి కాపాడమని దేవతలు,మహర్షులు లయకారుని ఆశ్రయించారు. తారకాసుర కుమారులైన తారకాక్ష, విద్యున్మాలి మరియు కమలాక్ష ముగ్గురూ మూడు  విమానాలలో సంచరిస్తూ త్రిలోకాల వారిని ముప్పతిప్పలు పెడుతుండేవారు. కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ మూడు విమానాలు ఒకటిగా కలిసిపోతాయి. అప్పుడు  ఒకే ఒక్క శరంతో దానిని కూలిస్తే ముగ్గురు అన్నదమ్ములు మరణిస్తారు. ఇది వారికి బ్రహ్మ ఇచ్చిన వరం. 
అలా చేయడానికి కావలసిన బాణం  శక్తివంతమైనదిగా ఉండాలి. అందుకోసం దేవతలు అందరూ తమతమ శక్తులను ధారపోశారు. శ్రీ మహా విష్ణువు తనను తాను  అస్త్రం లో ఐక్యం చేసుకొన్నారు. దానితో శరం శక్తి రెండింతలైనది. అసురుల అంతం సాధ్యమైనది. 
అసురులను అంతం  ఆనందంతో తాండవం చేస్తున్న నటరాజు రాక్షసుల రక్తం తో ఏర్పడిన ప్రవాహంలో చిక్కుకొని సాగరం లోనికి వెళ్లిపోయారట. శ్రీమన్నారాయణుని ఆదేశంతో సముద్రుడు ముక్కంటిని క్షేమంగా  చేర్చారట. ఈ సంఘటనకు గుర్తుగా తమిళ నెల "మాసి "లో   పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తారు.  
సమారానంతరం అలసి పోయిన శ్రీహరి గరుత్మంతుని నీరు తెమ్మని చెప్పారట. అతను రావడం ఆలస్యం కావడంతో ఆదిశేషుడు తన తోకతో భూమి మీద కొట్టి గంగను రప్పించారట. అదే  ప్రాంగణంలోని శేష తీర్ధం. ఈ నీటితోనే స్వామివారి ప్రసాదాలు తయారు చేస్తారు. అంతే కాదు ఈ   ప్రాంతంలోని భక్తులు నాగుల చవితినాడు పాలను పాము పుట్టలలో కాకుండా ఈ  తీర్ధం లో సమర్పిస్తారు. ఆరోగ్యాన్ని కోరుకొంటూ  ,బెల్లం  మిరియాలను  శేష తీర్ధంలో సమర్పించుకొంటారు. 
దూరంగా పాతాళంలో ప్రవహిస్తున్న విరజా నదిని  వినతా సుతుడు తన  ముక్కుతో మార్గం మార్చి ఇక్కడికి మరల్చారట. కానీ అప్పటికే  దాహం తీర్చుకొన్న పరమాత్మ  శేష తీర్ధం  చూసి బాధపడుతున్న అతనితో  చింతించవలదని  ఈ నది గంగతో సమానమని, ఇక నుండి గరుడా నది  పిలుస్తారని వరమిచ్చారట.ఆ ప్రకారం ఆలయ మూలవిరాట్టుకు తిరుమంజనం గరుడానది నీటి తోనే జరుపుతారు.  విశేషం ఏమిటంటే గరుడానది ఈ క్షేత్రం  ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. 
శ్రీహరి సలహా మేరకు దేవేంద్రుడు  సంక్రమించిన బ్రహ్మహత్య దోషాన్ని ఈ  స్నానమాచరించి శ్రీ పెరుమాళ్ ని  తొలగించుకొన్నారని చెబుతారు.బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంలో సహాయ పడమని అర్థిస్తూ తిరువహింద్రాపురంలో తపస్సు చేసి శ్రీ దేవాధినాథన్ అభయం పొందారట. 

ఆలయ విశేషాలు 

అంత విశాలమైన ప్రాంగణం కాకపోయినప్పటికీ ప్రధాన ఆలయంతో పాటు ఎన్నో ఉప ఆలయాలు   ఉన్నాయి. తొలి ఆలయాన్ని చోళరాజుల  శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతర కాలానికి చెందిన చోళులు, పాండ్యులు, విజయనగర  నాయక రాజులు తమ వంతు కైంకర్యాలు సమర్పించుకున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేశారని తెలుస్తోంది. వివిధ కాలాలకు చెందిన యాభైకి పైగా శిలాశాసనాలు ఆలయంలో కనిపిస్తాయి. 
గర్భాలయం తూర్పుముఖంగా ఉన్నా అయిదు అంతస్థుల రాజగోపురం మాత్రం పడమర దిశలో ఉంటుంది. ప్రాంగణానికి నాలుగు వైపులా ఎత్తైన దుర్భేద్యమైన ప్రహరీ గోడ ఉంటుంది. 
ఆలయానికి వెలుపల ఉత్తరాభిముఖుడై అంజనాసుతుడు దర్శనమిస్తాడు. 
ప్రాంగణంలో శ్రీ రంగనాధ స్వామి, శ్రీ రామానుజాచార్య, శ్రీ వేదాంత దేశిక మరియు పన్నిద్దరు ఆళ్వారుల ఉపాలయాలు ఉంటాయి. 
శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉపాలయం ఉత్తర దిశగా ఉంటుంది. అత్యంత సుందరంగా మలచిన  నిలువెత్తు విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనపడతాయి.  సన్నిధిలో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి  ఉంటారు.  నృసింహ క్షేత్రాలలో స్వామి వారి ఎడమ తొడ  కూర్చొని  సముద్ర రాజ తనయ ఇక్కడ మాత్రం కుడి తొడ మీద కూర్చొని కనిపిస్తారు. అరుదైన విషయం ఇది. 
అమ్మవారు శ్రీ హేమాంబుజ వల్లి  తాయారు (వైకుంఠ నాయకి) ప్రత్యేక సన్నిధిలో కొలువై భక్తులను అనుగ్రహిస్తారు. 

శ్రీ దేవాధి నాథన్ పెరుమాళ్ 

 స్వయంవ్యక్త మూర్తి అయిన శ్రీ దైవ నాయకన్ స్థానక భంగిమలో తూర్పు ముఖంగా   రమణీయ పుష్పాలంకరణలో  దర్శనమిస్తారు. 
ఉత్సవమూర్తిని "మువ్వర్ అళియ ఒరువన్" అని పిలుస్తారు. అనగా త్రిమూర్తి  స్వరూపుడు అని అర్ధం. త్రిపురాసురాలను కడతేర్చడానికి దేవతలు అందరూ తమ శక్తులను ధారపోసారు  కదా ! త్రిమూర్తులు ఏకమై ఆ శక్తులతో రాక్షసులను అంతం చేశారు. ఆ కారణంగా ఈ ఆలయ ఉత్సవ మూర్తి కుడిచేతిలో ధరించిన పద్మాన్ని విధాతకు సంకేతంగా,జటాజూటాలు,నుదుటన  నేత్రం లయకారునికి, వెనుక హస్తాలలో ఉన్న శంఖు చక్రాలు శ్రీహరి చిహ్నాలుగా కనపడతాయి . మరెక్కడా ఇలాంటి ఉత్సవ మూర్తిని చూడలేము . 
స్వామివారితో పాటు గర్భాలయంలో శ్రీ భృగు మహర్షి మరియు శ్రీ మార్కండేయ ముని ఉంటారు. వీరు ఇరువురూ ఇక్కడ ఉండటానికి సంబంధించిన కధలు ఇలా ఉన్నాయి. 

శ్రీ భృగు మహర్షి 

భృగు మహర్షికి తులసీ వనంలో  పసి బాలిక లభించినది. ఆయన  అల్లారు ముద్దుగా పెంచారు. చిన్నతనం   శ్రీమన్నారాయణుని  వినడం వలన బాలిక శ్రీ మహావిష్ణువే  అని భావించసాగింది. భూదేవి అంశతో లభించిన చిన్నారికి వైకుంఠవాసునితో వివాహం చేయాలని మహర్షి కూడా సంకల్పించుకొన్నారు. 
వారు మనోభీష్టాలను నెరవేర్చేవానిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ దేవాది నాథన్ కొలువు తీరిన తిరువహీంద్ర పురం చేరుకొని గరుడానదీ తీరాన అనంతశయనుని అనుగ్రహం కొరకు తపస్సు చేశారు. 
వారి దీక్షకు సంతసించిన గరుడ వాహనుడు సాక్షాత్కరించి బాలికను వివాహం చేసుకోడానికి సమ్మతించారు.  భృగు మహర్షి మహా వైభవంగా కుమార్తె కల్యాణాన్ని కమలనాభునితో జరిపించారు. 
పుత్రికను అప్పగించిన తరువాత విడిచి వెళ్లలేక పోతున్న మామగారిని కూడా  తమతో పాటే ఉండమన్నారు కల్యాణమూర్తి. అందువలన  అల్లునితో సహా గర్భాలయంలో భృగు మహర్షి కనపడతారు. భృగు పుత్రికగా తాయారును "భార్గవి" అని కూడా పిలుస్తారు. 

శ్రీ మార్కండేయ మహర్షి 

సప్త చిరంజీవులలో ఒకరైన శ్రీ మార్కండేయ మహర్షి రోజు రోజుకి పెరిగిపోతున్న ఆకృత్యాలను చూడలేక తరుణోపాయం కొరకు శ్రీ మహా విష్ణువును ఆశ్రయించడానికి వైకుంఠం వెళ్లారట. కానీ  ఆయన అక్కడ కనపడలేదట.అనేక  క్షేత్రాలలో ఆయనను అన్వేషిస్తూ చివరికి తిరువహీంద్ర పురంలో భృగు మహర్షి కుమార్తెను కళ్యాణమాడుతున్న స్వామిని చూసి శరణు కోరారట. మహర్షి మనోవేదనను అర్ధం చేసుకొన్న శ్రీ హరి ఆయనను కూడా తమతో ఈ  పవిత్ర క్షేత్రంలో ఉండమన్నారట. అలా శ్రీ మార్కండేయ మహర్షి గర్భాలయంలో స్వామివారి సన్నిధిలో ఉండి పోయారు. 

ఔషధగిరి 

రామ రావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు  వేసిన అస్త్ర ప్రభావంతో సృహ తప్పిన లక్ష్మణుని తెలివి లోనికి తేవడానికి హనుమంతుడు హిమాలయాల నుండి సంజీవినీ పర్వతం తెస్తున్న సమయంలో దాని నుండి కొంత  భాగం గరుడానది తీరంలో పడినదట. 
అదే ఆలయ తూర్పు ద్వారానికి ఎదురుగా ఉన్నఔషధగిరి. సంజీవని పర్వతంలో భాగం కనుక ఈ గిరి అనేక అనారోగ్యాలను నయం చేసే ఔషధాల నిలయంగా ఔషదగిరి  పిలుస్తారు. పై భాగానికి చేరుకోడానికి సుమారు అరవై సోపానాలు మార్గం కలదు. 
శిఖరాగ్రాన శ్రీ మన్నారాయణుని అవతారాలలో ఒకటి జ్ఞానప్రదాత అయిన శ్రీ హయగ్రీవుని ఆలయం ఉన్నది. ఈ  స్వయంగా తయారు చేసుకొని ప్రతిష్టించినది శ్రీ వైష్ణవ గురువులలో ఒకరైన శ్రీ వేదాంత దేశికులు. ఆయన తపమాచరించి మండపాన్ని కూడా చూడవచ్చును. 

శ్రీ వేదాంత దేశికాచార్య 

సప్త ముక్తి క్షేత్రాలలో ప్రముఖమైన కాంచీపురానికి సమీపంలోని  అగ్రహారంలో జన్మించారు. ఈయన క్రీస్తుశకం పదమూడవ శతాబ్దంలో ప్రముఖ  శ్రీ వైష్ణవ ఆచార్యులుగా ప్రసిద్ధి చెందారు. అనేక శ్రీవైష్ణవ క్షేత్రాలను సందర్శిస్తూ గరుడానది ఒడ్డున ఉన్నతిరువహీంద్రపురం చేరుకొన్నారు. ఆ క్షేత్రం యొక్క గొప్పదనాన్నితెలుసుకొని , అక్కడి శ్రీ సీతారాముల విగ్రహాల సౌందర్యాన్ని చూసి ఆకర్షితులై  ఆరాధ్య దైవమైన శ్రీ హయగ్రీవుని ఔషదగిరి  ప్రతిష్ఠించుకొని తీవ్ర తపస్సు చేసి ఆయన దర్శనాన్ని పొందారు. ఇక్కడే నాలుగు దశాబ్దాలకు పైగా నివసించి రామాయణం లోని ముఖ్య ఘట్టాలను ఉటంకిస్తూ "రఘువీర గద్యం" తో సహా అనేక కావ్యాలను రచించారు. 
శ్రీ వైష్ణవంలోని సంప్రదాయాలకు కాలానుగుణంగా నూతన భాష్యాలను రూపొందించి అనేకులను ఆకర్షించారు.  
ఇలా ఎన్నో విశేషాల నిలయమైన శ్రీ దేవాధి నాథన్ నిలయమైన తిరువహీంద్ర పురం ఉత్సవాలలో కూడా  ప్రత్యేకత కలిగి ఉన్నది. 

ఆలయ  ఉత్సవాలు 

ఉదయం ఆరు గంటల నుండి   పన్నెండు  వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు  తెరిచే ఆలయంలో ప్రతి నిత్యం ఆరు పూజలు జరుపుతారు.  అన్ని పర్వ దినాలలో విశేష పూజలు చేస్తారు. నెలకొక ఉత్సవం చేస్తారు. సంవత్సరంలో నాలుగు సార్లు తడవకు పది రోజుల చొప్పున ఆలయ బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలు, వైశాఖి వికాసం మరియు మహా దేశిక ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, శ్రీ కృష్ణాష్టమి, శ్రీ నృసింహ జయంతి, శ్రీ రామ నవమిల సందర్భంగా లక్షలాదిగా భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి తరలి వస్తారు.

దివ్యదేశం 

పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఒకరైన శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే శ్రీ దేవాధి నాథన్ పెరుమాళ్ ని కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు.  ఈ కారణంగా  తిరువహీంద్ర పురం నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో శాశ్విత స్థానం సంపాదించుకున్నది. 

మార్గం 

చెన్నై నుండి పాండిచ్చేరి, కడలూరు మీదగా తిరువహీంద్ర పురం రహదారి మార్గంలో చేరుకోవచ్చును. చిదంబరం నుండి కూడా సులభంగా చేరుకోవచ్చును. వసతి సౌకర్యాలు పాండిచ్చేరి, కడలూరు లేదా చిదంబరంలలో అందుబాటు ధరలలో లభిస్తాయి. 


ఓం  నమో నారాయణాయ !!!!     

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...