6, జనవరి 2022, గురువారం

SriPardhasaradhi Perumal Temple, Triplicane, Chennai

 

         శ్రీ పార్ధ సారధి ఆలయం, ట్రిప్లికేన్



తమిళనాడు రాష్ట్ర రాజధాని నేటి చెన్నై (గతంలో చెన్నపట్టణం, మద్రాస్ )నగరంలోనూ, చుట్టుపక్కల ఎన్నో విశేష ఆలయాలు కలవు. వీటిల్లో శ్రీ వైష్ణవ దివ్య దేశాలు (తిరుపతులు) ఏడు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆలయం తమవైన ప్రత్యేకతలను కలిగి ఉంటాయి.
అన్నింటి లోనికి మరీ ముఖ్యంగా చెప్పాలంటే నూట ఎనిమిది దివ్య దేశాలలో అగ్రగామిగా ఉన్న కొన్నింటిలో ఒకటిగా గుర్తింపబడిన శ్రీ పార్ధసారధి ఆలయం చెన్నై నగర  నడి బొడ్డున ఉన్న ట్రిప్లికేన్ ప్రాంతంలో ఉన్నది.  
నాలుగు యుగాలతో ముడిపడి ఉన్న ఆలయగాధ, చరిత్ర ఈ ఆలయ సొంతం. మరే దివ్య దేశం లోనూ కానరాని అనేకానేక విశేషాల సమాహారమే ఈ దేవాలయము. బ్రహ్మాండ, విష్ణు మరియు నారద పురాణాలాలలో ఈ క్షేత్ర ప్రస్థాపన ఉన్నట్లుగా తెలుస్తోంది. 

తిరువళ్ళి కేని

తొలి యుగం నుండి  అనేక ముని వాటికలకు నిలయం ఈ తులసీ వనం లేదా బృందారణ్యం. వీరు చేసే యజ్ఞయాగాలకు కావలసిన నీటి అవసరాలను తీర్చే పుష్కరిణి అందమైన పుష్పాలతో నిండి ఉండేది. ముని వాటికలో ఉండి పవిత్ర కార్యక్రామాలకు ఉపయోగించే స్వచ్ఛమైన నీటితో పాటు సుందర పుష్పాలతో ఉన్నందున "తిరు అల్లి కేణి" అని పిలిచేవారట. అదే కాలక్రమంలో నేడు "ట్రిప్లికేన్" గా పిలవబడుతోంది. 
ఈ కోనేటి ఒడ్డున చేసే ధ్యానం, జపం, ఆరాధన, దానం, పితృకార్యం ఇలా ఏదైనా పావన గంగా తీరాన చేసిన దానితో సమానం అని విశ్వసిస్తారు. అందుకే నేటికీ ఈ పుష్కరణి నలుదిక్కులా ఉన్న ఆలయాలు, మఠాలు, ధ్యాన మందిరాలతో అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది.  
ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాలలో ముఖ్యమైనది శ్రీ పార్ధసారధి ( వెంకట కృష్ణుడు) కొలువైనది. సువిశాల ప్రాంగణంలో శ్రీమన్నారాయణుడు స్థానిక, ఉపస్థిత, శయన భంగిమలలో తన వివిధ అవతారాలలో ఉపాలయాలలో దర్శనమిస్తారు. ప్రతి ఒక్క అవతారమూర్తి సన్నిధి వెనుక ఒక కధ ఉండటం విశేషం.వీరిని మహర్షులైన అత్రి, మరీచి,మార్కండేయ, భరద్వాజ, గౌతముడు ఆదిగా గలవారు అర్చించినట్లుగా ఆలయ పురాణ గాధలు తెలుపుతున్నాయి. ప్రధాన అర్చామూర్తి  శ్రీ పార్ధసారధి స్వామి ఇక్కడ కొలువు తీరడానికి సంబంధించిన పురాణ గాధ ఇలా ఉన్నది. 

 శ్రీ పార్ధ సారధి సన్నిధి 

స్థానికులు ఈ క్షేత్రాన్ని తిరుమలకు సమానంగాను, స్వామిని ఏడుకొండలవానికి ప్రతి రూపంగానూ విశ్వసిస్తారు. 
సుమతి అనే రాజు శ్రీ మహా విష్ణువుకు పరమ భక్తుడు. ప్రజారంజకంగా పాలన సాగిస్తూ, నిరంతరం శ్రీ హరి నామస్మరణలో ఉండేవారు. ఆయనకు ఒక కోరిక ఉండేది. కురుక్షేత్ర సంగ్రామంలో విజయుని రధసారధిగాను, రానున్న కలియుగంలో కొలువు తీరనున్న కలియుగ వరదుడు శ్రీ వేంకటేశ్వరుడు కలగలసి ఉండే రూపంలో తన ఆరాధ్య దైవాన్ని సందర్శించాలని. సతతం తన
ఆలోచనలలో ఆ రూపాన్ని ఊహించుకుంటూ ఆనందపడేవాడు. ఒకనాటి స్వప్నంలో వైకుంఠ వాసుడు దర్శనమిచ్చారు. బృందారణ్యంలో ఉన్న తిరు అల్లి కేణి వద్దకు వెళ్లి తపస్సు చేయమని, అభీష్ట సిద్ది కలుగుతుందని తెలిపారు. 
వ్యాస మహర్షి శిష్యుడు ఆత్రేయ మహర్షి.ప్రస్తుతమే మారుతున్నమనుష్యుల నడవడి,మటు మాయం అవుతున్న నీతినియమాల పరిస్థితి రాబోయే కలియుగంలో ఏ విధంగా వుండ బోతుందోనని ఆందోళన చెందసాగారు. శిష్యునికి ధైర్యం తెలిపి, తాను నిత్యం ఆరాధించే శ్రీ కృష్ణుని విగ్రహాన్ని తులసీ వనంలో ప్రతిష్టించమని తెలిపారు వ్యాస భగవానుడు. తాను హిమాలయాలకు తరలి వెళ్లిపోయారు. ఆత్రేయ ముని విగ్రహాన్ని తీసుకొని బృందారణ్యం చేరుకొన్నారు. అక్కడే తపమాచరిస్తున్న రాజు సుమతి తన ఇష్టదైవాన్ని దర్శించుకొని ఆలయాన్ని నిర్మించారు. 
గర్భాలయంలో స్థానక భంగిమలో కుడి చేతిలో పాంచజన్య శంఖాన్ని ధరించి, ఎడమ చేతిని జ్ఞాన ముద్రగా పాదాలను చూపుతూ రమణీయ పుష్పాలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. 
మూలవిరాట్టుకు కుడి పక్కన బలదేవుడు,  సాత్యకి, రుక్మిణీ దేవి, ఎడమ పక్కన కుమారుడైన ప్రద్యుమ్నుడు, మనుమడు అనిరుద్ధుడూ కొలువు తీరి ఉంటారు. ఇలా పత్ని, సోదర, పుత్ర పౌత్ర సమేతంగా శ్రీ కృష్ణుడు కొలువైన ఒకే ఒక్క క్షేత్రం తిరు వల్లి కేణి. 
ఈ ఆలయం లోని మరో విశేషం ఉత్సవమూర్తి.  శ్రీవారి వదనం మీద బాణాల తాలూకు గాయాల గుర్తులు కనపడతాయి. అవి కురుక్షేత్ర యుద్ధంలో పార్థుడి సారధిగా ఉన్నప్పుడు భీష్ముడు విడిచిన శరాల మూలంగా ఏర్పడినట్లుగా చెబుతారు. 
క్షేత్ర తాయారు శ్రీ వేదవల్లి విడిగా సన్నిధిలో కొలువు తీరి దర్శనమిస్తారు. ప్రతి శుక్రవారం విశేష పూజలు చేస్తారు. అమ్మవారిని సాయంత్రం ఆలయం లోపలే పల్లకీలో ఊరేగిస్తారు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తారు. 

శ్రీ వరదరాజ స్వామి సన్నిధి 

 గజరాజు గజేంద్రుని మొసలి బారి నుండి కాపాడిన స్వామి.  ప్రసిద్ధి చెందిన కాంచీపురం (అత్తిగిరి)లో కొలువు తీరిన స్వామి. రోమ మహర్షి వైకుంఠ వాసుని గజేంద్రవరదునిగా దర్శించాలి అన్న ధ్యేయంతో బృందారణ్యంలో తపమాచరించారు. సంతుష్టులైన శ్రీ గరుడవాహనుడు సాక్షాత్కారం అనుగ్రహించి ఇక్కడే కొలువు తీరారు. మూలవిరాట్టు వినతాసుతుని పైన ఉపస్థితులై దర్శనమిస్తారు. 
ప్రతి నెలా హస్తా నక్షత్రం రోజున స్వామి వారికి విశేష పూజలు చేస్తారు. వైశాఖమాసంలో పది రోజుల పాటు శ్రీ వరద రాజ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 

శ్రీ అళగియ సింగ పెరుమాళ్ సన్నిధి 

ప్రధాన ఆలయం లోనికి తూర్పు ద్వారం ద్వారా ప్రవేశిస్తే నేరుగా శ్రీ వెంకట కృష్ణ సన్నిధికి చేరుకొనవచ్చును. అదే పడమర ద్వారం నుండి లోనికి ప్రవేశిస్తే ఎదురుగా శ్రీ యోగ నారసింహుడు దర్శనమిస్తారు. 
అత్రి మహర్షి మోక్షాన్ని కోరుకొంటూ శ్రీమన్నారాయణుని గూర్చి బృందారణ్యంలో తపస్సు చేశారు. పన్నగశయనుడు నారసింహుని రూపంలో సాక్షాత్కరించి శాశ్వత వైకుంఠవాసాన్ని అనుగ్రహించి తాను ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 
స్వాతి నక్షత్రం రోజున స్వామికి అభిషేకం, విశేష పూజలు చేస్తారు. మాఘ మాసంలో మూడు రోజుల "దవన ఉత్సవం", తెప్పోత్సవం, వైశాఖ మాసంలో స్వామివారి జన్మదినాన్ని, చైత్ర మాసంలో ఆలయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 
ఆరోగ్యాన్ని అందించేవానిగా, అపమృత్యు భయాన్ని తొలగించేవానిగా శ్రీ యోగ నారసింహుడు ప్రసిద్ధి. 

శ్రీ రామచంద్ర సన్నిధి 

శ్రీ వెంకట కృష్ణ సన్నిధికి వెళ్లే వరుస క్రమంలో శ్రీ సీత లక్ష్మణ,భారత, శత్రుఘ్న సమేతముగా శ్రీ రామ చంద్ర మూర్తి దర్శనమిస్తారు. వారికి ఎదురుగా అటు పక్కగా నమస్కార భంగిమలో రామబంటు ఉంటారు. దశరధ నందనులు నలుగురూ ఒకే చోట కొలువు తీరిన అతి తక్కువ ఆలయాలలో ఇది ఒకటి. 
మధుమాన మహర్షి జనకరాజ పుత్రితో సహా నలుగురు అన్నదమ్ములను ఒకేసారి కన్నులారా కాంచాలన్న కోరికతో ఈ తులసీ వనంలో తపస్సు చేశారు. ఆయన మనోభీష్టాన్ని నెరవేరుస్తూ స్వామి ఇక్కడే కొలువయ్యారన్నది ఆలయ గాధ. శ్రీరామ నవమిని పది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్బంగా స్వామి వారి  మాడ వీధులలో ఉత్సవర్ల ఊరేగింపుని చేస్తారు. గరుడ కూడా నిర్వహిస్తారు. 
హనుమంతుని జయంతిని అంగరంగ వైభవంగా జరుపుతారు. ట్రిప్లికేన్ లో శ్రీ పార్ధసారధి స్వామి ఆలయ చుట్టుపక్కల అనేక అంజనాపుత్రుని మందిరాలు ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. 

శ్రీ రంగనాథుని సన్నిధి 

కావేరీ తీరాన స్వయంవ్యక్తగా కొలువు తీరిన శ్రీ రంగనాధుడు తిరు అల్లి కేణి  పుష్కరణి సమీపాన నివాసం ఏర్పరుచుకోడానికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది.  ప్రణయ కలహంలో అలిగి  భూలోకానికి వచ్చినది శ్రీ మహాలక్ష్మి. పసిపాపగా మారి తులసీ వనంలో శ్రీ భృగు మహర్షికి లభించినది. ఆయన ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచి  చేశారు. ఆమెను శ్రీమహా విష్ణువుకు ఇచ్చి వివాహం చేసి లోక సంరక్షకుని అల్లునిగా పొందాలని ఆశించారు. ఆ 
ఆకాంక్షతో తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకొని తన కుమార్తెతో కళ్యాణం చేశారు. ఆయన కోరిక మేరకు శ్రీవారు ఇక్కడే స్థిరపడ్డారు. ఈ సన్నిధి శ్రీ వెంకట కృష్ణుని సన్నిధి అంత పురాతనమైనదిగాపేర్కొంటారు. శ్రీ రాముని సన్నిధి  ఉంటుంది. 
ఆదిశేషువు మీద శయన భంగిమలో పాదాల చెంత  శ్రీదేవి ,భూదేవి తాయారులు,  నుండి ఉద్భవించిన కమలంలో విధాత ఉపస్థితులై ఉంటారు. ఇక్కడే శ్రీ నృసింహ మరియు శ్రీ వరాహ స్వామి వార్లు కూడా దర్శనమిస్తారు. 
శ్రీ వరాహ జయంతి,  శ్రీ రంగనాధ కళ్యాణం, ఆలయ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. 

శ్రీ గోదా దేవి సన్నిధి 

పన్నిద్దరు శ్రీ వైష్ణవ గాయక భక్తులైన ఆళ్వారులలో ఒకే ఒక స్త్రీ. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన "తిరుప్పావై " గానం చేసినది ఈమె . భూదేవి అంశగా పేర్కొంటారు. శ్రీ రంగనాథుని పరిణయమాడిన ధన్యురాలు. ఆమె గోదా దేవి (ఆండాళ్ళు). గోదా సన్నిధి లేకుండా విష్ణు ఆలయాలుఉండవు . మరీ ముఖ్యంగా దివ్య దేశాలు. 
ఆషాడ మాసంలో పది రోజుల ఆది పూరం ఉత్సవాలను ఘనంగా చేస్తారు. మార్గశిర మాసంలో " నీరట్ట ఉత్సవం" పేరిట నిర్వహిస్తారు. ఆఖరి రోజున శ్రీ గోదా కళ్యాణం జరుపుతారు. ధనుర్మాసంలో ఉదయాన్నే తిరుప్పావై గానం చేస్తారు.  అమ్మవారి జన్మ నక్షత్రము నాడు విశేష పూజలు జరుపుతారు. 

ఆలయ చరిత్ర 

ప్రస్తుత ఆలయం ఏడో శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించినట్లుగా ఆధారాలు తెలియజేస్తున్నాయి. అనంతర కాలంలో పాండ్య, హొయసల, చోళ, విజయ నగర మరియు నాయక రాజులు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేశారని ఆలయంలో ఉన్నశిలాశాసనాలు ద్వారా తెలుస్తోంది.ముఖ్యంగా విజయ నగర పాలకులు రాజగోపురంతో సహా ఎన్నో సుందర మండపాలను నిర్మించారు. చక్కని శిల్పాలు కనిపిస్తాయి. 
 ఎందరో భక్తులు కూడా తమ వంతు కైంకర్యాలను ఆలయానికి అందించారని శాసనాలు తెలుపుతున్నాయి. 

దివ్యదేశం 

పన్నెండు మంది శ్రీ వైష్ణవ ఆళ్వారులలో మొదటి వారైన ముగ్గురిలో ఒకరైన పెయాళ్వార్ తో పాటు తదుపరి వారైనా తిరుమలై సై ఆళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్ ముగ్గురూ  శ్రీ  పార్ధసారధి స్వామిని  కీర్తిస్తూ పన్నెండు పాశురాలను గానం చేశారు. శ్రీ వైష్ణవ దివ్య దేశంగా శాశ్వత గౌరవం దక్కేలా చేశారు. 
ఇన్ని విశేషాల సమాహారం అయిన శ్రీ పార్ధసారధి ఆలయం ఉదయం  గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట  తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది  భక్తుల సౌకర్యార్ధం  ఉంటుంది. 
నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా సంవత్సరమంతా ఉత్సవాలతో అలరారే శ్రీ పార్ధసారధి కోవెల  చెన్నై మహానగరంలో ట్రిప్లికేన్ ప్రాంతంలో ఉన్నది. నగరం లోని అన్ని  నుండి సులభంగా చేరుకోవచ్చును. 

ఓం నమో నారాయణాయ !!!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...