Sri Venkateswara swamy Temple, Jupudi, NTR district

                     కొండలలో కొలువైన కోనేటి రాయడు -2




ఆంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వరుడు. 
స్వామివారు కృష్ణానదీ తీరంలో స్వయంవ్యక్థగా కొన్ని పవన ప్రదేశాలలో కొలువు తీరి  ఉన్నారని క్రిందటి వ్యాసంలో చదువుకొన్నాము కదా !
ఈసారి రెండవ క్షేత్రమైన జూపూడి క్షేత్రం గురించి తెలుసుకొందాము. 









క్షేత్రగాధ 

పావన కృష్ణానదికి ఉత్తరతీరంలో ఉన్న ఈ పల్లెలో స్వామి కొలువైన గాధ సుమారు మూడు దశాబ్దాల క్రిందటిదిగా తెలుస్తోంది. 
గ్రామానికి  చెందిన బాలురు రోజూ నదీతీరంలో ఆదుకుంటుండేవారట. ప్రతిరోజూ ఒక బాలుడు వచ్చి వారితో కలిసి ఆడేవాడట. ఆ బాలుడు ఆ ఊరి వాడు కాదు. ఎక్కడి నుండి వస్తున్నాడో తెలియదు. కానీ అతను ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ఆటలో గెలిచేదట. 
అందువలన బాలురు అతనిని తమ పక్షం అంటే తమ పక్షం అని వాదించుకొనేవారట. అతను మాత్రం తనంతట తానుగా ఒక పక్షాన్ని ఎంచుకొనేవాడట. 
జట్లు లోని పెద్ద పిల్లలకు ఎవరీ బాలుడు ? ఎక్కడ నుండి వస్తున్నాడు ? అన్న విషయం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నారట. ఒకనాటి సాయంత్రం ఆట ముగిసిన తరువాత రహస్యంగా అతనిని వెంబడించారట. అతడు నెమ్మదిగా నడుచుకొంటూ సమీపంలో ఉన్న కొండ మీదకు వెళ్ళాడట. వీరు చూస్తూ ఉండగానే ఒక బండ వెనక్కి వెళ్లి పోయాడట. 
వారు ఊరి లోనికి వెళ్లి పెద్దవాళ్లకు చెప్పారట. మరునాటి ఉదయం అందరూ కలిసి వచ్చి ఎంత వెదికినా బాలుని ఆనవాళ్లు తెలియలేదట. 
ఆ రోజు రాత్రి శ్రీవారు అమరావతి పాలకుడైన శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి కి స్వప్న దర్శనం ఇచ్చి తాను శ్రీగిరి పైన కొండ గుహలో ఉన్నానని, వచ్చి దర్శించుకొని ఆలయం నిర్మించమని తెలిపారట. 
 మరుసటి రోజున రాజుగారు సమస్త పరివారంతో వచ్చి కొండ అంతా గాలించినా స్వామివారి రూపం కనపడలేదట. ఏమీ పాలుపోని రాజుగారు అక్కడే శ్రీనివాసునికి పూజలు చేసి ఆయన దర్శనం ప్రసాదించమని ప్రార్ధించారట. 
అప్పుడు ఆ బాలుడు రాజుగారి ముందు ప్రత్యక్షమై తనలో రమ్మన్నారట. అతి వెనుక వెళ్లగా చిన్న గుహలోకి వెళ్లి అదృశ్యమైనాడట. గుహలో చూడగా రాతి మీద తిరునామం, శంఖు చక్రాల రూపంలో  దేదీప్యమానంగా వెలుగుతూ స్వామివారు దర్శనమిచ్చారట. 
శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు తన అదృష్టానికి పొంగిపోయి ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ నిమిత్తం కొంత భూమిని కూడా ఇచ్చారట. 






శ్రీ రాజా వాసిరెడ్డి వెంకట్రాది నాయుడు 

వీరు 1783- 1816 వ సంవత్సరం వరకు పంచారామ క్షేత్రమైన అమరావతిని రాజధానిగా చేసుకొని నైజం నవాబులు, ఆంగ్లేయులకు సామంతునిగా పాలించారు. 
కవిపండిత పక్షపాతి. ప్రజలను చక్కగా పాలించిన పాలకుడు. తన యేలుబడిలో ఉన్న నాలుగు వందల పైచిలుకు గ్రామాలలోనే కాకుండా అనేక క్షేత్రాలలో యాత్రీకుల సౌకర్యార్ధం ధర్మ సత్రాలను నిర్మించారు. 
ఈయన తన రాజ్యంలో సుమారు వందకు పైగా నూతన ఆలయాల నిర్మాణం లేదా పునః నిర్మాణం చేసారని, నిర్వహణకు ధన భూ వసతులను సమర్పించుకొన్నారని తెలుస్తోంది. 






ఆలయ విశేషాలు 

కృష్ణానది ఉత్తర తీరంలో శ్రీగిరిగా పిలిచే చిన్న పర్వతం మీద ఈ ఆలయం నిర్మించబడినది. పర్వతం పైకి వెళ్ళడానికి సోపానమార్గం ఉన్నది. పైకి దూరానికి ఆలయ విమాన గోపురం , ధ్వజస్థంభం కనిపిస్తాయి. 
ఇక్కడ కూడా శ్రీవారు కొలువు తీరిన గుహ పైన విమానగోపురం నిర్మించబడినది. ధ్వజస్థంభం వద్ద శ్రీ దాసాంజనేయస్వామి వినమ్రంగా నమస్కారభంగిమలో దర్శనమిస్తారు. ధ్వజస్థంభం వెనుక స్వామివారి రూపానికి నిదర్శనంగా తిరునామం, శంఖుచక్రాలను పెద్ద బోర్డు రూపంలో ఉంచారు.  
ఆలయానికి ఉన్న ప్రధాన ద్వారం పడమర ముఖంగా ఉంటుంది. లోనికి వెళితే ముఖమండపం లాంటి గది లో స్వామివారు దివ్యరూపం, ఆళ్వారులు, ద్వారపాలకులు కనిపిస్తారు. చిత్రమైన విషయం ఏమిటంటే ద్వారపాలకులు వెలుపల కాకుండా లోపల అదీ గర్భగుహ వైపుకు తిరిగి ఉండటం. 
ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. సన్నటి గుహ. ఒక మనిషి మాత్రమే నిలబడటానికి అవకాశం ఉన్నది. అర్చకస్వామి కూడా నిలబడే పూజాదులు నిర్వహించాలి. ఈ గుహలో దక్షిణాముఖంగా రాతి మీద శంఖుచక్రాలు మధ్యలో తిరునామం, క్రింద శరీరభాగాన్ని పోలిన ఉబ్బెత్తుగా ఉన్న భాగం మాత్రమే కనిపిస్తాయి. 
శ్రీవారి రూపం అపరిమితమైన ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుంది. 
నిత్య పూజలతో పాటు పర్వదినాలలో, ఆలయ ఉత్సవాలలో, ధనుర్మాస పూజలలో, వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
అర్చకస్వామివారి కుటుంబం గత నాలుగు తరాలుగా స్వామివారి సేవలో తరిస్తోంది అంటే ఆలయం విశేషం ఇంతకన్నా మనకి ఏమి కావాలి !









శ్రీ గంగా భవానీ సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం 

శ్రీగిరి వెనుక ఉన్న మరో చిన్న పర్వతం మీద శ్రీ గంగా భవానీ సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం నిర్మించబడినది. 
రాజా వారు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తున్న సమయంలో గ్రామస్థులు తమకొక ఈశ్వరాలయం కూడా కావాలి అని కోరారట. వారి అభీష్టాన్ని మన్నించి ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 
కొండ పైకి వెళ్ళడానికి మెట్లమార్గం ఉన్నది. పైన ఎలాంటి విశేష నిర్మాణాలు లేని  సాదాసీదా ఆలయం. తూర్పు ముఖంగా ఉంటుంది. ఎత్తైన ధ్వజస్థంభం దూరానికి ఆలయ ఉనికిని తెలియచేస్తుంది. ద్వారానికి ఇరుపక్కలా శ్రీ గణపతి, సర్ప రూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారపాలకుల మాదిరి ఉపస్థితులై దర్శనమిస్తారు. 
గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ భీమేశ్వర స్వామి వారు చక్కని దర్శనాన్ని అనుగ్రహిస్తారు. 
ఈ ఆలయంలో కూడా నిత్యపూజలు, కార్తీకమాస పూజలు, మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 








చుట్టూ పచ్చని పొలాలు, స్వచ్ఛమైన వాతావరణం లో ఉన్న ఈ ఆలయాల సందర్శన భక్తులకు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 
కాకపోతే ఆలయం సందర్సించాలి అంటే ఉదయం తొమ్మిది లోపల వెళ్లడం ఉత్తమం. 
కలియుగవరదుడు స్వయంవ్యక్తగా కొలువు తీరిన జూపూడి గ్రామం విజయవాడ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ఇ మార్గంలో బ్రహీంపట్నం దాటిన తరువాత ప్రధానరహదారి నుండి కొద్దిగా లోపలికి ఉంటుంది. 




బస్సు సౌకర్యం దరిదాపుగా లేనందువలన స్వంతవాహనంలో వెళ్లడం ఉత్తమం. సమీపంలోనే చారిత్రక ప్రసిద్ధి చెందిన కొండపల్లి కోట ఉంటుంది.సందర్శించడం అభిలషణీయం. కొండపల్లి ప్రపంచ ప్రసిద్ధి పొందిన బొమ్మల తయారీ గ్రామం. 

నమో వెంకటేశాయ !!!!

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore