Sri Rameshwara Swamy Temple, Saipuram, Uyyuru mandal, Krishna District
శ్రీ లక్షీ నరసింహ స్వామి ఆలయం, సాయి పురం
మన హిందూ సంప్రదాయం జీవ నదిలా ప్రవహించడానికి ప్రధాన కారణం దేవాలయాలు. నేటికీ నిరాకారుడైన దేవదేవుని ప్రజలు పట్ల భక్తి విశ్వాసాలు, హిందూ సంప్రదాయం, ధర్మం పట్ల గౌరవం కలిగి ఉండటానికి ముఖ్య కారణం దేవాలయాలే !
కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేవాలయ వ్యవస్థ మరియు సంప్రదాయం చిన్న చిన్న పల్లెలు, గ్రామాల నుండి ఆరంభమై కొనసాగుతూ వస్తోంది.
అందుకే మన గ్రామాలలో ఇప్పటికి కూడా చక్కని పురాతన ఆలయాలు కనపడుతున్నాయి.
అలాంటి ఒక చిన్న గ్రామం కృష్ణా జిల్లా లోని "సాయి (సాయ)పురం".
క్షేత్ర గాథ
ఈ సాయి పురం గతంలో "శ్రీ లక్ష్మీ నరసింహ పురం" గా పిలవబడిన ఒక బ్రాహ్మణ అగ్రహారం. శాసనాలలో ఆ పేరే కనపడుతుంది.
వేద పాఠశాలలు, గురుకులాలకు నిలయం. నిత్యం యజ్ఞయాగాదులు నిర్వహిస్తుండేవారు.
ప్రస్తుతం కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి గ్రామంలో.
గ్రామంలో రెండు పురాతన ఆలయాలు నెలకొని ఉన్నాయి.
శ్రీ రామేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నది.
ఈ రెండు ఆలయాలు ఏనాటి నుండి ఉన్నాయన్న దానికి స్ఫష్టమైన ఆధారాలు కనపడవు.
తెలిసినంతవరకూ చాళుక్య రాజుల కాలంలో తొలి ఆలయాలు నిర్మించ బడినట్లుగా చెబుతారు.
అనంతరం అనేక రాజ వంశాల వారు గ్రామ, ఆలయ అభివృద్ధికి ఇతోధికంగా కైంకర్యాలు సమర్పించుకున్నారు అని శాసనాధారాలు తెలుపుతున్నాయి.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉన్న "నంది రాయి శిలాశాసనం" ప్రకారం ప్రస్తుత ఆలయాల నిర్మాణం విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న కొండపల్లి ని రాజధానిగా చేసుకొని పాలించిన ఒడిషా గజపతుల కాలంలో జరిగినట్లుగా తెలియవస్తోంది. వారు శ్రీ జగన్నాథ భక్తులు. శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు. ఎన్నో శ్రీమహావిష్ణు ఆలయాలను నిర్మించారు.
బ్రహ్మి లిపిలో ఉన్న ఈ శాసనం క్రీస్తు శకం 1585 వ సంవత్సరం నవంబరు నెలలో కొండపల్లి నగర రాజాధిరాజు అనంత ప్రభువు మరియు ఆయన సోదరి తిమ్మంబ వేయించారు.
నాలుగు పలకలుగా ఉండే ఈ శాసనంలో ఒక పక్కన శ్రీ నరసింహ స్తోత్రం, రెండవ పక్క క్షేత్ర విశేషాలు, మూడవ పక్కన వారు బ్రాహ్మణులకు ఇచ్చిన భూదానాల వివరాలు ఉంటాయి. నాలుగవ పక్కన ఆలయ మరియు గ్రామా నిర్వహణలో దానగ్రహీతలు నిర్వహించవలసిన బాధ్యతల గురించి పేర్కొనడం జరిగింది.
నంది ధర్మానికి ప్రతీక. ఈ శాసనం పైన నందీశ్వర విగ్రహాన్ని చెక్కడం వలన దానం తీసుకొన్న వారు ధర్మం తప్పకుండా అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అన్న సందేశం, ఆజ్ఞ కనపడతాయి.
ఈ క్షేత్రం ఎంతటి విశిష్టమైనది మరియు పురాతనమైనది అన్న విషయం ఈ శాసనం ద్వారా తెలుసుకోవచ్చును.
పద్దెనిమోడో శతాబ్ద కాలంలో నూజివీడు జమిందారులు ఆలయ నిర్వహణ చేపట్టారు. వారి ఆధ్వర్యంలోనే ప్రస్తుతం కనపడుతున్న ముఖ మండపం నిర్మించబడినది అని ఇక్కడ ఉన్న శాసనం తెలుపుతోంది. వీరు కూడా శ్రీ వైష్ణవాన్ని అనుసరించేవారు. అనేక ఆలయాలను పునరుద్ధరించారు. నూతన దేవాలయాల నిర్మాణం చేశారు. ఆగిరిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వ్యాఘ్ర నరసింహ ఆలయాన్ని పునః నిర్మించినది వీరి కాలంలోనే!
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విశేషాలు
తూర్పు ముఖంగా ఉండే ఈ ఆలయానికి అంతస్థుల రాజగోపురం నూతనంగా నిర్మించారు. గోపురానికి ఇరుపక్కలా శ్రీ గణపతి మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు.
గోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఈశాన్యంలో శ్రీవారి కల్యాణ మండపం కనిపిస్తుంది.
కృష్ణాతీరం లోని అనేక ఆలయాలలో ఈశాన్య దిశ లో మండపాన్ని నిర్మించడం ఒక సంప్రదాయం గా కనిపిస్తుంది.
మండప సమీపంలోనే "నంది రాయి శిలాశాసనం కనపడుతుంది.
ఎత్తైన ధ్వజస్థంభం వద్ద ఉన్న సన్నిధిలో వినతాసుతుడు నిత్యసూరి అయిన శ్రీ గరుత్మంతుడు
శ్రీవారి సేవకు సదాసిద్ధం అన్నట్లుగా ముకుళిత హస్తాలతో వినమ్రంగా కొలువై ఉంటారు.
ప్రదక్షిణా పధంలో మిగిలిన ఆలయాలకు భిన్నంగా గర్భాలయ వెలుపలి భాగంలో కొన్ని మూర్తులు ఉంచారు. సహజంగా విష్ణు ఆలయాలలో శ్రీ మహావిష్ణువు, శ్రీ గదాధరుడు, శ్రీ నరసింహ, శ్రీ బ్రహ్మ దేవుడు, శ్రీ విష్ణుదుర్గ, శ్రీ విష్ణు గణపతి కనపడతారు.
కానీ ఇక్కడ దక్షిణం వైపున దేవఋషులు శ్రీ హరి గాయక భక్తులైన శ్రీ నారద తుంబుర విగ్రహాలు ఉంటాయి. లోకకంటకుడైన హిరణ్యకశపుడు మరణించిన సందర్భంలో దేవతలు పుష్ప వర్షం కురిపించారు. యక్షులు, కిన్నెరలు, గంధర్వులు ఆనందంతో ఆది పాడారు. శ్రీ నరసింహుని కీర్తించారు. దానిని దృష్టిలో పెట్టుకొని శ్రీ నారద తుంబురాలను ఉంచారేమో అనిపిస్తుంది.
గర్భాలయ వెనుక భాగాన నమస్కార భంగిమలో బాలుడైన ప్రహ్లాదుడు కనపడతాడు. శ్రీస్వామివారు ప్రహ్లాద వరద నారసింహుడు కదా !
ఉత్తరం వైపున శ్రీమన్నారాయణుని అవతారం, ఆది వైద్యుడు అయిన శ్రీ ధన్వంతరి స్వామి మరియు శ్రీ దాసాంజనేయ స్వామి మూర్తులు కనిపిస్తాయి.
శ్రీ నరసింహుడు భక్తుల అపమృత్యు భయాన్ని, అనారోగ్య వ్యాధులను హరించేవాడిగా ప్రసిద్ధి. శ్రీ ఆంజనేయుడు భూతప్రేత పిశాచ పీడలను హరించేవాడు. అపర శ్రీరామ భక్తుడు.
భక్తివిశ్వాసాలతో స్వామిని శరణు కోరితే ఎలాంటి అనారోగ్య సమస్యలు అయిన తొలగిపోతాయి అన్న ఉద్దేశ్యంతో వెరీ రూపాలను ఉంచారేమో !
కానీ ఇలాంటి మూర్తులను మరే ఇతర ఆలయంలో చూడము.
ఆలయ విమాన గోపుర నలుదిక్కులా శ్రీ లక్ష్మీ నారాయణునితో పాటు శ్రీహరి లోకసంరక్షణార్ధం ధరించిన దశావతార సుందర రూపాలతో అలంకరించారు.
ముఖమండపంలోనే ప్రాంగణంలో ఉన్న ఏకైక ఉపాలయం కనపడుతుంది. వైష్ణవ ఆలయాలలో శ్రీ ఆంజనేయుని సన్నిధి తప్పనిసరి.మరీ ముఖ్యంగా శ్రీ నరసింహ ఆలయాలలో వాయునందను నికి సముచిత స్థానం కనపడుతుంది.
దక్షిణాముఖంగా ఉండే ఈ సన్నిధిలో అంజనాసుతుడు, రామదూత శ్రీ దాసాంజనేయుడు నమస్కార భంగిమలో దర్శనమిస్తారు.
దక్షిణాముఖ హనుమంతుడు అపమృత్యుభయాన్ని, భూతప్రేత పీడలను, గ్రహ దోషాలను నివారించేవానిగా ప్రసిద్ధి.
ముఖ మండపానికి అనుసంధానంగా ఉండే చిన్న అర్ధమండపంలో శ్రీ రాజ్యలక్ష్మీ ఉపస్థిత భంగిమలో కొలువై ఉంటారు. ఇవన్నీ అనంతర ప్రతిష్టలు.
గర్భాలయంలో ఎత్తైన పీఠం మీద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనమిస్తారు.
శ్రీ మూర్తి విశేషాలు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యుగాల క్రిందట ఇక్కడ స్వయంవ్యక్తగా వెలిశారని చెబుతారు.
మూలవిరాట్టు ఎత్తైన పీఠం మీద వామాంకం పైన శ్రీ లక్ష్మీ తాయారును కూర్చోబెట్టుకొని ప్రసన్న వదనంతో దర్శనం అనుగ్రహిస్తారు.
మిగిలిన శ్రీ నరసింహ ఆలయాలలోని మూర్తికి ఈ మూర్తికి కొన్ని వత్యాసాలు కనపడతాయి.
ఇతర నరసింహ మూర్తుల మాదిరి విరాట్ రూపంలో ఉండరు స్వామి. చిన్న విగ్రహ రూపంలో రమ్యమైన అలంకరణలో మీసాలతో సౌమ్య గంభీరంగా కనపడతారు.సహజంగా మిగిలిన ఆలయాలలో వామాంకం మీద ఉపస్థితురాలైన తాయారు రూపం చిన్నదిగా కనిపిస్తుంది. సాయి పురం లో అమ్మవారు స్వామి వారికి సమానమైన ఎత్తులో ఉంటారు.
శ్రీ కల్యాణ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ నుదిటిపైన చిన్న శివలింగం ఉండటం మరే ఆలయంలో కనపడని మరియు చూడని విశేషం.
సాయి పురం ఒక పరిహార క్షేత్రం. ముఖ్యంగా కల్యాణ క్షేత్రం గా అభివర్ణిస్తారు.
స్వామివారిని కల్యాణ మూర్తి అని పిలుస్తారు. జాతక లేదా గ్రహ ప్రభావంతో వివాహం కానీ యువతీ యువకులు ఎవరైనా నెలలో ఏరోజు అయినా శ్రీ స్వామి వారి కళ్యాణం జరిపిస్తే మండలం లోపల అనుకూలమైన వ్యక్తితో వివాహం తప్పని సరిగా జరుగుతుంది అని చెబుతారు.
ఆలయ పూజలు మరియు ఉత్సవాలు
నిత్యం నిర్ణయించిన పూజలను శాస్త్రప్రకారం జరుపుతారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు.
శ్రీ నరసింహ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ రామనవమి, శ్రీ హనుమజ్జయంతి రోజులలో పెద్ద సంఖ్యలో భక్తులు జిల్లా నలుమూలల నుండి తరలి వస్తారు. ధనుర్మాస పూజలు, తిరుప్పావై గానం, భోగినాడు శ్రీ గోదా కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. చైత్ర మాసంలో ఆలయ ఉత్సవాలు కూడా రంగరంగ వైభవంగా జరుగుతాయి.
శ్రీ రామేశ్వర స్వామి ఆలయం
శివాయ విష్ణు రూపాయ .. శివ రూపాయ విష్ణవే !
శ్రీ లక్ష్మీ నరసింహుడు శిరస్సున లింగం ధరించి కొలువైన సాయి పురం లో పక్కనే ఉన్న మరో ఆలయంలో లింగరాజు శ్రీ రామేశ్వర స్వామి పేరుతొ కొలువై దర్శనమిస్తారు.
రావణ సంహారం తరువాత బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకోడానికి శ్రీ రామచంద్ర మూర్తి రామేశ్వరం నుండి అనేక పవిత్ర తీర్ద క్షేత్రాలలో శివ లింగ ప్రతిష్టాపన చేసారని పురాణాలూ తెలుపుతున్నాయి.
కాలక్రమంలో అనేక మంది పాలక వంశాలవారు శ్రీ రామేశ్వర స్వామి వారిని సేవించారు. ఆలయ నిర్మాణం, నిర్వహణకు తమ వంతు కైకార్యాలను సమ్పర్పించుకొన్నారని క్షేత్ర గాధలు ద్వారా అవగతమౌతుంది.
ప్రస్తుత ఆలయ నిర్మాణం చాళుక్య రాజుల కాలం లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంతో పాటు జరిగినట్లుగా చెబుతారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉన్న నంది రాయి శాసనం ప్రకారం గజపతి రాజులు ఆలయ పునః నిర్మాణం చేసారు. పద్దెనిమిదో శతాబ్ద కాలంలో నూజివీడు జమిందారులు ఆలయాన్ని మరో మారు మరమత్తులు చేసి కొన్ని నూతన నిర్మాణాలు చేశారు.
ప్రస్తుతం భక్తులు మరియు గ్రామస్థులు ఊరి ఆలయాల అభివృద్ధికి నడుం బిగించి భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు.
పరిశుభ్ర వాతావరణంలో దేవతా వృక్షాలైన రావి, మారేడు, మామిడి, ఉసిరి తో పచ్చని ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయానికి ఎలాంటి రాజగోపురం ఉండదు. సువిశాల ప్రాంగణంలో ధ్వజస్థంభం, నాగ ప్రతిష్టలు మరియు నవగ్రహ మండపం కాకుండా రెండు ఉపాలయాలు, మూడు సన్నిధులతో ప్రధాన దేవాలయం ఉంటాయి.
దక్షిణం వైపున ఉన్న ఉపాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి, ఉత్తరం వైపున ఉన్న దానిలో శ్రీ అనఘా దేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తారు.
పురాతన ముఖ మండపంలో ధ్వజస్థంభం వద్ద రుద్రంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయుడు, నాగ శిల్పం కనపడతాయి. నందీశ్వరుడు మండప మధ్య భాగంలో ఉపస్థితుడై గర్భాలయంలోని శ్రీ రామేశ్వర స్వామిని తదేక దీక్షతో వీక్షిస్తుంటారు.
గర్భాలయానికి కుడి వైపున ఉన్న సన్నిధిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి స్థానక భంగిమలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో విశేషంగా శ్రీ భద్రకాళీ వీరభద్రుల కళ్యాణం జరుపుతారు.
ఎడమపక్కన సన్నిధిలో శ్రీ పార్వతీ అమ్మవారు సుందర అలంకరణలో అభీష్టవరదాయనిగా, ప్రసన్న వదనంతో అభయం ప్రసాదిస్తారు.
ప్రధాన గర్భాలయంలో శ్రీ రామేశ్వర స్వామి చిన్న పానవట్టం మీద బ్రహ్మ సూత్రం ధరించిన పెద్ద లింగ రూపంలో కొలువై ఉంటారు. లింగం వెనుక ఉన్న పీఠం పైన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామేశ్వర స్వామి ఉత్సవ మూర్తులు దర్శనమిస్తాయి.
ముఖ మండపానికి గర్భాలయానికి మధ్యలో ఉన్న అర్ధ మండపంలో మరో నంది, శ్రీ వినాయకుడు దర్శనమిస్తారు.
ఆలయ పూజలు మరియు ఉత్సవాలు
శివాగమం ప్రకారం నిర్ణయించిన అభిషేకాలు, అర్చనలు, అలంకరణ మరియు ఆరగింపులు జరుగుతాయి. వైశాఖమాసం మరియు కార్తీక మాసాలలో విశేష అభిషేకాలు భక్తుల సౌలభ్యం కొరకు నిర్వహిస్తారు.
మహా శివరాత్రి పర్వదినాన గ్రామంలో ఉత్సవం ఏర్పాటు చేస్తారు. చైత్ర మాసంలో ఆలయ ఉత్సవాలను ఘనంగా జరుపుతారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మాదిరి శ్రీ రామేశ్వర స్వామి ఆలయం కూడా పరిహార క్షేత్రం. అవివాహితులు మరియు సంతానం లేని వారి కొరకు సర్పదోష నివారణ హోమాలు, ఆశ్లేష బలి పూజలు, రాహుకేతు జపాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. భక్తులు దూర ప్రాంతాల నుండి కూడా వస్తుంటారు.
అవధూత శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి
క్షేత్ర మహత్యం మరియు గాథ తెలుసుకొని దత్తపీఠాధిపతి అవధూత శ్రీ స్వామిజీ స్వయంగా వచ్చి సాయి పురం లోని శ్రీ లక్ష్మీ నరసింహ మరియు శ్రీ రామేశ్వర స్వామి ఆలయాలలో పూజలు నిర్వహించారు.
అంతే కాకుండా దూర ప్రాంతాల నుండి హోమాలు, కళ్యాణం చేయించుకోడానికి వచ్చే భక్తుల సౌలభ్యం కొరకు తమ పీఠం తరుఫున వసతి మరియు భోజన సౌకర్యం ఏర్పాటు చేసారు. దత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడే వసతి గృహం ఆలయాల పక్కనే ఉంటుంది.
ఇన్ని విశేషాల నిలయమైన సాయి పురం కృష్ణా జిల్లాలో ఉయ్యురు పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చక్కని రహదారి మార్గంలో ఆలయాలను చేరుకోవచ్చును.
మనగ్రామాలలో ఉన్న పురాతన విశేష ఆలయాలను సందర్శించడం మన కనీస బాధ్యత. ఆ ఆలయ విశిష్టతను ప్రపంచానికి తెలియ పరచడం మనందరి కర్తవ్యం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి