Sri Kasi Visweswara swamy Temple, China Kakani, Guntur district
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, చిన కాకాని
మన హిందూ సంస్కృతి ఎల్లలు లేనిది.
ప్రపంచంలో తొలి నాగరికత మనదే ! బాష, విద్యావిధానం, న్యాయ విచారణ లాంటివి ఎన్నో శతాబ్దాలుగా మన భారత దేశంలో అమలులో ఉన్నాయని తెలుస్తోంది.
వీటన్నింటికీ ఆధారం మన వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులు.
వేదాల ప్రాతిపదికన మన ఆలయ నిర్మాణాలు, దేవతార్చన విధివిధానాలు ఏర్పడినవి.
సామాన్య మానవునికి కూడా సులభంగా హిందూ సంస్కృతి చేరడానికి అత్యంత స్ఫష్టమైన సులభమైన మార్గం ఆలయాలు.
అందుకనే మన దేశంలో కొన్ని లక్షల ఆలయాలు కనపడతాయి. ప్రతి గ్రామంలో పురాతన ఆలయాలు నేటికీ కనపడుతున్నాయి.
ముఖ్యంగా కలియుగంలో పాలకులు గ్రామగ్రామాన ప్రజలకు కావలసిన జీవన అవసరాలతో పాటు ఆలయాలను కూడా చేర్చారు. నిర్మించారు. గమనిస్తే మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో విశేషమైన శివ మరియు విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. విశేషం అనడానికి కారణం ప్రతి ఆలయంలో ఒక ప్రత్యేకత కనిపించడమే !
ఆలయ నిర్మాణం, విమాన గోపురం, శిల్పాలు, క్షేత్ర గాధ, అర్చా మూర్తులు ఇలా ఏదో ఒక ప్రత్యేకత నిశ్చయంగా కనిపిస్తుంది. అదే విధంగా మనం ఎక్కడెక్కడికో వెళ్లి, సమయం,డబ్బు ఖర్చు పెట్టుకొని చేయించుకునే పూజలు మన ఆలయాలలో ఎక్కువ శ్రమ లేకుండా చేయించుకొనే అవకాశం లభిస్తుంది.
మన రాష్ట్రంలో ప్రవహించే పావన జీవ నదుల తీరాలు ఎన్నో గొప్ప తీర్ధ పుణ్య క్షేత్రాలకు కేంద్రాలు. ముఖ్యంగా శాతవాహనులు,కాకతీయులు, చాళుక్యులు, రెడ్డిరాజులు, విజయనగర రాళులు పాలించిన ఈ ప్రాంతంలో ఎన్నో దివ్య ధామాలు దర్శనమిస్తాయి.
గుంటూరు నుండి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో మంగళగిరికి అతి సమీపంలో ఉన్న చిన కాకాని గ్రామంలో రెండు ఆలయాలు ఉన్నాయి.
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం
గ్రామంలో ఉన్న రెండు ఆలయాలలో పురాతనమైనది.
ఆలయ నిర్మాణ శైలి, ప్రాంగణంలో కనిపించే పురాతన విగ్రహాలు,సన్నిధులు మరియు అర్చామూర్తులను చూస్తే సుమారు పదవ శతాబ్ద ముందు కాలంలో లో నిర్మించినబడినట్లుగా తెలుస్తుంది.
బహుశా ఈ ప్రాంతం లో అనేక ఆలయాలను నిర్మించిన చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని కూడా నిర్మించారని భావించవచ్చును.
గ్రామానికి ఒక పక్కన విశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయానికి నూతనంగా స్వాగత ద్వారం నిర్మించారు.
రాజగోపురం లాంటి పెద్ద నిర్మాణాలు కనిపించవు.
ఎత్తైన ధ్వజస్థంభం వద్ద శ్రీ వినాయక స్వామి ఉపస్థితులై కనిపిస్తారు. పక్కన ఒక నాగప్రతిష్ఠ కనిపిస్తుంది. ఒక్కటే కాదు ఆలయ ఆవరణంలో ఎన్నో నాగప్రతిష్ఠలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ఆశ్లేష బలిపూజ, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్ర అభిషేకం విశేషంగా జరుగుతాయి అని తెలిసింది.
ఆలయం వెలుపల ఎలాంటి ఉపాలయాలు ఉండవు. విశేష శిల్పాలు కనిపించవు. సాదాసీదాగా ఉంటుంది.
నూతనంగా నిర్మించిన ముఖమండపానికి అనుసంధానంగా మాత్రం మూడు సన్నిధులు కనిపిస్తాయి. ముఖమండపంలో నందీశ్వరుడు స్వామి వారి సేవకు సిద్ధం అన్నట్లుగా ఉపస్థితులై, తదేక దృష్టితో గర్భాలయంలో కొలువైన లింగరాజును వీక్షిస్తుంటారు.
ఈ విధమైన దేవాలయ నిర్మాణం ఈ ప్రాంతంలో దరిదాపుగా అన్ని గ్రామాలలో, పట్టణాలలో కనిపించడం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం. అనేక ఆలయాలలో ఈశాన్య భాగంలో కల్యాణ మండపం కనిపిస్తుంది. ఆ కల్యాణ మండపం మాత్రం ఈ ఆలయంలో ఉండదు.
అన్ని శివాలయాలలో కనిపించే నవగ్రహ మండపం ఈ ఆలయంలో కూడా ఉన్నది.
నవగ్రహ పూజలు, ముఖ్యంగా రాహుకేతు పరిహార పూజలు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి. ఒక విధంగా చెప్పలి అంటే శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నాగదోష మరియు రాహుకేతు దోష పరిహార స్థలం.
గర్భాలయానికి దక్షిణం వైపున ఉన్న సన్నిధిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి కొలువై దర్శనమిస్తారు.
కాకతీయులు శైవాన్ని అనుసరించేవారు. వారు ఈ ప్రాంతాన్ని తమ యేలుబడి లోనికి తెచ్చుకొన్నప్పుడు ఎందరో వీరశైవ లింగాయతులు కృష్ణాతీరానికి వలస వచ్చారు. వారు ఇక్కడి ప్రజలకు వీరశైవ సిద్ధాంతాలను ప్రబోధించారు.
శివాలయాలలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ కాలభైరవ స్వామి సన్నిధులను ఏర్పాటు చేశారు. అందువలనే మన తెలుగు రాష్ట్రాల లోని అనేక శివాలయాలలో వీరి సన్నిధులు కనపడతాయి. కాలక్రమంలో అది ఒక సంప్రదాయంగా మారి అనంతరకాలంలో అంటే వంద సంవత్సరాల క్రిందట నిర్మించిన ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయాలలో వీరి సన్నిధులు కనపడుతున్నాయి.
ఈ ఆలయంలో జరిగే అనేక ఉత్సవాలలో ఒకటి శ్రీ భద్రకాళీ శ్రీ వీరభద్రుల కల్యాణ మహోత్సవం.
ఉత్తరం వైపున ఉన్న సన్నిధిలో శ్రీ అన్నపూర్ణాదేవి స్థానక భంగిమలో కుడి చేతిలో భోజనం వడ్డించడానికి సిద్ధంగా ఉన్నట్లు గరిటె ధరించి దర్శనమిస్తారు. అమ్మవారు సుందర పుష్ప అలంకరణలో భక్తులను కాపాడే వరదాయనిగా కనిపిస్తారు.
దసరా నవరాత్రి మహోత్సవాలు పెద్ద ఎత్తున జరుపుతారు.
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి
మధ్యలో ఉన్న గర్భాలయానికి , ముఖ మండపానికి మధ్యలో చిన్న అర్ధ మండపం ఉంటుంది. ఇక్కడ ఉత్సవమూర్తులు, గర్భాలయానికి ఇరుపక్కలా శ్రీ గణపతి మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉపస్థితులై ఉంటారు.
గర్భాలయంలో కొద్దిగా ఎత్తు తక్కువ పానవట్టం మీద చందన విభూతి మరియు కుంకుమ లేపనాలతో బ్రహ్మ సూత్రం ధరించి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి లింగ రూపంలో నయన మనోహరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తారు.
అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం చూస్తే బ్రహ్మ సూత్ర లింగ ప్రతిష్టాపన చాళుక్య రాజుల కాలంలో ఆరంభమైనట్లుగా తెలుస్తుంది. అంతకు ముందు శాతవాహన కాలంలో కూడా కొన్ని ఆలయాలలో బ్రహ్మ సూత్రం ఉన్న లింగాలను ప్రతిష్టించారని తెలుస్తోంది.
రాష్ట్రకూటులు, కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు అన్నింటిలో బ్రహ్మ సూత్రం ఉన్న పరమేశ్వర లింగాలే కనిపిస్తాయి. కానీ ప్రత్యేకత ఏమిటంటే ఈ రెండు లింగాల మీద ఉండే బ్రహ సూత్రం ఒకే విధంగా ఉండకపోవడం !
రెడ్డిరాజులు, విజయనగర రాజులు ఎక్కువగా ఆలయ గోపురాల నిర్మాణం పట్ల అధిక శ్రద్ధ చూపారు. అందుకే వీరి కాలంలో ఎత్తైన రాజగోపురాలు, కోట బురుజులు వంటి గోడలు, వెయ్యి కాళ్ళ మండపాల నిర్మాణాలు ఎక్కువగా జరిగాయి.
సర్పరాజు పూజలు అందుకొనే లింగరాజు
చిన కాకాని గ్రామంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఒక అరుదైన విశేషం ప్రతినిత్యం దర్శమిస్తుంది అని చెబుతారు.
సహజంగా శివాలయాలలో నాగ పుట్ట ఉంటుంది. కానీ పొలాల మధ్య ఉన్న ఈ ఆలయంలో మాత్రం ఉండదు. కానీ కొన్ని దశాబ్దాలుగా ప్రతి నిత్యం ఆలయం మూసివేసిన తరువాత ఒక దివ్య సర్పం గర్భాలయం లోనికి వచ్చి లింగాన్ని అర్చిస్తుంది అని చెబుతారు. ఉదయాన ఆలయ ద్వారాలు తెరిచే సమయంలో తలుపుల మీద శబ్దం చేస్తారు. ఆ ధ్వనికి సర్పం వెళ్లి పోతుంది. అప్పుడు ఆలయాన్ని తెరిచి పూజాదులను ఆరంభిస్తారు అర్చకులు.
శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య పూజలతో పాటు అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుపుతారు. శ్రావణ మరియు కార్తీక మాసంలో విశేష అభిషేకాలు, పూజలు చేస్తారు. మహా శివరాత్రికి పెద్ద ఉత్సవం జరుగుతుంది గ్రామంలో!
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం
చిన కాకాని గ్రామంలోని రెండవ ఆలయం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిది.
గ్రామంలో శ్రీమహావిష్ణువు ఆలయం కూడా ఉండాలి అన్న సత్సంకల్పంతో గ్రామస్థులు కలిసికట్టుగా వంద సంవత్సరాల క్రిందట ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారని తెలుస్తోంది.
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో ఉంటుందీ చిన్న ఆలయం. రాజ మరియు విమాన గోపురాలు ఉండవు. ఉపాలయాలు లేవు.
ఎత్తైన ధ్వజస్థంభం వద్ద ఉన్న చిన్న సన్నిధిలో శ్రీ దాసాంజనేయస్వామి వారి రూపాలు రెండు, వెనుక శ్రీ గరుత్మంతుని మూర్తి ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇద్దరు నిత్య సూరి( నిరంతరం శ్రీహరి సేవలో ఉండేవారు) విగ్రహాలు ఉంచడంలో పరమార్ధం తెలియరాలేదు.
చిన్న ముఖ మండపం. గర్భాలయంలో శ్రీ రుక్మిణీ మరియు శ్రీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి సుందర పుష్ప అలంకరణలో,పట్టు వస్త్రాలు,బంగారు ఆభరణాలు ధరించి నేత్రానందంగా దర్శనం అనుగ్రహిస్తారు.
నిత్య పూజలు జరిగే ఈ ఆలయంలో ఉగాది, జన్మాష్టమి, శ్రీ రామ నవమి, ధనుర్మాస పూజలు ఘనంగా చేస్తారు.
చిన కాకాని విజయవాడ నుండి గుంటూరు వెళ్లే జాతీయ రహదారి మీద మంగళగిరికి సుమారు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వంత వాహనంలో ఆలయం దాక చేరుకోవచ్చును. బస్సులో అయితే రహదారి మీద దిగి వెళ్ళాలి.
వసతి సౌకర్యాలు విజయవాడ లేక గుంటూరు పట్టణాలలో అందుబాటు ధరలలో లభిస్తాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి