Sri malleshwara swami Temple, Namburu, Guntur District
నాగబంధ రక్షణలో ఆలయం
మన రాష్ట్రం ఎన్నో విశేష పురాతన దేవాలయాలు గ్రామగ్రామాన కనపడతాయి. చూస్తూ వెళితే తెలియదు వాటి గొప్పదనం. ఒకసారి సందర్శిస్తే తప్ప గ్రామం లో ఉన్న ఆలయం ఎంతటి ప్రత్యేకతను సంతరించు కొన్నది అన్నది తెలియదు.
గ్రామ ప్రాంతాలలో ఉన్న పురాతన ఆలయాలు మనకి తెలియని చారిత్రక, క్షేత్ర మరియు ఆలయ విశేషాలను తెలియచేస్తాయి.
మనవైన ఆలయాల సందర్శన మనోల్లాసాన్ని కలిగిస్తుంది.
ఈ క్రమంలో ఒక ప్రత్యేకమైన ఆలయ విశేషాలను తెలుసుకొందాము.
ప్రస్తుత గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాలోని అనేక ఆలయాలలో అధికశాతం చాళుక్య రాజుల కాలంలో నిర్మించినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. అనంతరకాలంలో అంటే పద్దెనిమిదో శతాబ్దంలో అమరావతిని రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పునః నిర్మాణం చేయడం లేదా కొన్ని నూతన ఆలయాలను కట్టించడం జరిగినట్లుగా చరిత్ర చెబుతోంది.
నంబూరు గ్రామంలో ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం జిల్లాలోనే నెలకొని ఉన్న పురాతన ఆలయాలలో ఒకటి గా ప్రసిద్ధి. ఆలయ నైరుతిలో శిధిల ఆలయాలను పునఃనిర్మించే క్రమంలో లభించిన శిల్పాలు ఉంటాయి. అవి వడ్ల సంవత్సరాల ఆలయ చరిత్రకు సజీవ మౌన సాక్ష్యాలు.
కారణం ఆలయంలో కనిపించే నాగ బంధం. అత్యంత అరుదుగా మాత్రమే నాగ బంధం ఆలయాలలో కనిపిస్తుంది. తెలిసినంతలో పిడుగురాళ్ల కు సమీపంలో ఉన్న మోర్జంపాడు గ్రామంలో ఉన్న శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయ గోడ మీద కనిపిస్తుంది.
గిద్దలూరుకు సమీపంలోని మోక్షగుండం గ్రామంలో చిన్న గుట్ట మీద ఉన్న శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో కనిపిస్తుంది.
ఏకారణం చేత నాగ బంధం వేస్తారు అన్నదానికి స్పష్టమైన సమాధానం లభించడం లేదు. అందుబాటులో ఉన్న లేక ప్రచారంలో ఉన్న కధల ఆధారంగా ఆలయానికి, గ్రామానికి రక్షగా, సర్ప, అంటువ్యాధి భయం లేకుండా ఉండటానికి వేస్తారు. గుప్త నిధులకు రక్షణగా కూడా నాగ బంధం ఉంటుంది అని కూడా విశ్వసిస్తారు.
రాజగోపురం లాంటి భారీ నిర్మాణాలు లేకుండా కనిపించే ఈ ఆలయ ఈశాన్యంలో సుందర కల్యాణ మండపం, పక్కనే నవగ్రహ మండపం కనిపిస్తాయి.ప్రస్తుతం కనిపిస్తున్న ముఖమండపం, అమ్మవారి సన్నిధి మరియు ఇతర నిర్మాణాలు అన్నీ గ్రామస్థులు గ్రామ ఆలయ విశిష్టత గుర్తించి స్వయంగా పూనుకొని విరాళాలు సేకరించి నిర్మించినవి కావడం విశేషం. అభినందించవలసిన విషయం.
ఈ ఆలయ ప్రాంగణంలో ఒకే ఒక ఉపాలయం ఉంటుంది.
శ్రీ రత్న గర్భ గణపతి
ప్రథమపూజ్యుడు వినాయకుడు. ఏ శుభకార్యమైన గణపతి పూజతో ఆరంభించడం, నిర్విఘ్నంగా కార్యక్రమం జరగాలని ప్రార్ధించడం హిందూ సంప్రదాయం.
కళలకు, శాస్త్రాలకు, విద్యకు, బుద్ధికి, జ్ఞానానికి అధిపతిగా ఆరాధిస్తారు. గణపతి ప్రస్తాపన గణేష , మౌద్గల , బ్రహ్మ మరియు బ్రహ్మాండ పురాణాలలో విస్తారంగా కనిపిస్తుంది. గణపతి ప్రస్థాపన లేని పురాణం ఏదీ లేదు.
ప్రతి ఆలయంలోనూ శ్రీ వినాయక సన్నిధి కనిపిస్తుంది.
ప్రధాన ఆలయంతో పాటు నిర్మించినట్లుగా చెబుతున్న శ్రీ రత్న గర్భ గణపతి ఆలయం కొంత మేర శిధిలం కావడంతో, ఆలయ పునః నిర్మాణ సమయంలో ఈ నూతన సన్నిధి ఏర్పాటు చేశారు.
ఉత్తర దిశగా ఉండే ఈ సన్నిధిలో ప్రత్యేక రూపంలో ఉత్తర దిశగా ఉపస్థితులై దర్శనమిస్తారు గణనాధుడు.
మిగిలిన ఆలయాలలో కనిపించే విఘ్నేశ్వరుని రూపానికి రత్న గర్భ గణపతి రూపానికి వ్యత్యాసం స్పష్టంగా కనపడుతుంది. నగిషీలు, ఆభరణాలు, ఆయుధాలు లేకుండా ద్విభుజాలతో దర్శనమిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వక్రతుండుని తొండం కుడి వైపుకి తిరిగి ఉంటుంది.తమిళనాడులో కుడివైపు తిరిగిన తొండంతో ఉన్న పిళ్ళయార్ ను "వెట్రి వినాయకుడు" అని పిలుస్తారు. ఈయన అత్యంత భక్తసులభుడు. వరదాయకునిగా పేర్కొంటారు.
గణపతి నవరాత్రులను ఘనంగా చేస్తారు ఈ ఆలయంలో.
ఆలయ విశేషాలు
నూతనంగా పునః నిర్మించిన ముఖమండపం పైన ఆది దంపతులు వారి కుమారులైన శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తో కలిసి సుందర విగ్రహరూపాలలో కనిపిస్తారు. వారి వాహనాలైన నంది, సింహం, మూషికం మరియు మయూరం వారి పక్కన ఉండటం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ముఖమండపంలో నందీశ్వరుడు మాత్రమే ఉపస్థితులై తదేకధ్యానంతో గర్భాలయం లోని లింగరాజును చూస్తుంటారు.
శ్రీ భ్రమరాంబ అమ్మవారు ప్రత్యేక సన్నిధిలో దక్షిణా ముఖంగా చతుర్భుజాలతో, వరద అభయ హస్తాలతో ఉపస్థితురాలై దర్శనమిస్తారు. అమ్మవారి సన్నిధి ముఖద్వారం వద్ద పంచలోహముతో నిర్మించిన తొడుగుపైన అష్టాదశపీఠ పాలికల రూపాలను సుందరంగా తీర్చిదిద్దారు.
మొదట ఆలయంలో అమ్మవారి సన్నిధి లేదు. అయిదు దశాబ్దాల క్రిందట అమ్మవారిని ప్రతిష్టించారని తెలుస్తోంది.
అమ్మవారు వరదాయిని. ముఖ్యంగా సంతానప్రదాయనిగా చెబుతారు. శ్రీ దుర్గా నవరాత్రులు వైభవంగా జరుగుతాయి.
గర్భాలయంలో పంచలోహ మండపంలో చందన , విభూతి, కుంకుమ మరియు పుష్ప అలంకరణలో నాగాభరణ ధారులై శ్రీ మల్లేశ్వర పెద్ద లింగరూపంలో ప్రత్యేకమైన బ్రహ్మ సూత్రం ధరించి భక్తసులభునిగా అనుగ్రహం ప్రసాదిస్తారు. గర్భాలయ ద్వారానికి అమర్చిన పంచలోహ అలంకరణ పైన ద్వాదశ జ్యోతిర్లింగాలను రమణీయంగా మలిచారు.
చిన్న రాధ మండపంలో ఉత్సవమూర్తులు ఉపస్థితులై ఉంటారు.
సర్ప దోష పూజలకు, రాహుకేతు పూజలకు శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి ప్రసిద్ధి.
ఆలయ పూజలు మరియు ఉత్సవాలు
నిత్యం నియమంగా నాలుగు పూజలు జరిగే ఈ ఆలయం ఉదయం ఆరు నుండి పదకొండు వరకు, తిరిగి సాయంత్ర అయిదు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి ఉంటుంది.
కార్తీక మాస పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గ్రామంలో ఉత్సవం నిర్వహిస్తారు. హిందూపర్వదినాలలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి పూజలు చేయించుకొంటారు.
శతాబ్దాల నుండి నాగ బంధ పర్యవేక్షణలో ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం నెలకొని ఉన్న నంబూరు గుంటూరు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో విజయవాడ వెళ్లే జాతీయ రహదారి మీద ఉంటుంది. బస్సులు, ఆటోలు లభిస్తాయి.
వసతి, భోజన సదుపాయాలు గుంటూరు పట్టణంలో అందుబాటు ధరలలో లభిస్తాయి.
మన రాష్ట్రంలో గ్రామగ్రామానా ఉన్న పురాతన ఆలయాలను సందర్శిద్దాము. మన ఆలయాల పురోభివృద్ధికి మన వంతు కృషి చేద్దాము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి