Lord Venkateswara Swamy Temple, Vaikuntapuram

                        కొండలలో కొలువైన కోనేటి రాయడు 


కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడు అనేకానేక క్షేత్రాలలో కొన్నింటిలో స్వయంవ్యక్థగా మిగిలిన క్షేత్రాలలో ప్రతిష్ఠిత మూర్తిగా  కొలువు తీరి కొలిచిన వారికి కొంగు బంగారం గా దర్శనంగా ప్రసాదిస్తున్నారు. శ్రీ శ్రీనివాసుడు స్వయంవ్యక్థగా వెలిసిన క్షేత్రాలన్నీ కొండల మీద ఉండటం ప్రత్యేకం !
శ్రీవారు అనేక పుణ్యతీర్ధ క్షేత్రాలలో ముఖ్యంగా పావన కృష్ణాతీరంలో శ్రీ వెంకటేశ్వరునిగానే కాకుండా తన అవతార రూపాలైన  శ్రీ లక్ష్మీనరసింహునిగా, శ్రీ రామునిగా, శ్రీ కృష్ణునిగా  కూడా కొలువై పూజలందుకొంటున్నారు. 





శ్రీవారి దర్శనంలో బ్రహ్మకడిగిన పాదాలతో పాటు దివ్యమైన సుదర్శన చక్రం, పాంచజన్య శంఖం మరియు తిరునామాలకు విశేష ప్రాధాన్యత ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే !
స్వామివారి దివ్యమంగళ రూపం కాకుండా చక్రం, శంఖం మరియు తిరునామాలతో మాత్రమే దర్శించుకొనే ఆలయాలు గుంటూరు జిల్లా కృష్ణాతీరంలో ఉన్నాయి. 
ఎన్నో శతాబ్దాల క్రిందటివిగా పేర్కొనే ఆ క్షేత్రాల గురించి ఒక దాని తరువాత ఒకటిగా తెలుసుకొందాము. అనీ దర్శనీయ క్షేత్రాలే !

కృష్ణవేణి నది 

మనదేశంలోనిఅనేకానేక నదులలో మూడవ అతిపెద్ద నదిగా ప్రాముఖ్యం కలిగినది కృష్ణానది. 
మహారాష్ట్రలో జన్మించి 1300 కిలోమీటర్ల ప్రవాహమార్గంలో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ, కోట్లాది మంది దాహార్తిని తీరుస్తూ కృష్ణవేణమ్మ మన రాష్ట్రంలో కృష్ణాజిల్లా హంసలదీవి వద్ద సాగరునితో సంగమిస్తుంది. 
నదీమతల్లి ప్రవాహమార్గంలో లెక్కలేనన్ని దివ్య తీర్థ పుణ్య క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా నల్గొండ, కృష్ణా మరియు గుంటూరు జిల్లాలలో ఎన్నో పురాతన మరియు నూతన ఆలయాలు వెలిసి ఉన్నాయి. 
కృష్ణవేణీ మహత్యం ఆధారంగా కృష్ణా నది శ్రీమన్నారాయణుని పాదపద్మాల నుండి ఉద్భవించినది అని తెలియవస్తోంది. అందువలన వాత్సల్యభావనతో స్వామి ప్రత్యేక అర్చారూపంలో కొలువైనారేమో ! అనిపిస్తుంది. 







 వైకుంఠ పురం 

శ్రీవారు ప్రత్యేక రూపంలో స్వయంవ్యక్తగా కొలువైన క్షేత్రాలలో ఒకటి పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ అమరేశ్వర స్వామి కొలువైన అమరావతికి సమీపంలో ఉన్న వైకుంఠపురం. 
స్వామివారు భూలోకంలో కృష్ణాతీరంలో విహరిస్తూ "క్రౌంచగిరి" మీద తొలి యుగంలో స్థిరపడ్డారని ఆలయ చరిత్ర తెలుపుతోంది. ఇక్కడ కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. 
అప్పట్లో ఈ ప్రాంతమంతా "ఐరావతి" అని పిలిచే నేటి అమరావతి ప్రభువుల పాలనలో ఉండేదట.  
సమీప  లంక గ్రామం అయిన రాపూరు ఒక బ్రాహ్మణ అగ్రహారం. ఆ రోజులలో అతి పెద్ద సంపద గోవులే! పాలేరుల చేత తమ గో మందలను ఈ కొండ మీదకు మేత  నిమిత్తం తోలేవారట. 
మనం ఎన్నో ఆలయ పౌరాణిక గాధలలో విన్న మాదిరి మంద లోని ఒక ఆవు రోజూ పలు ఇవ్వడం లేదట. విషయాన్ని స్వయంగా తెలుసుకొందామని గ్రామ పెద్దలు,ఆవుల మందకు యజమానులైన కండ్లకొలను పెద రామన్న , చిన్న రామన్న కొండ మీదకి వెళ్లారట. నేడు స్వామివారు దర్శనమిచ్చే గుహ పైన  వారికి ఒక మెరుపు లాగా కనిపించిందట. ఎండ తీవ్రతకు అలా అనిపించి ఉండవచ్చును అని అనుకొన్న అన్నదమ్ములు గ్రామానికి వెళ్లిపోయారట. నాటి రాత్రి స్వామి చిన్న రామన్న కు స్వప్న దర్శనం ఇచ్చి తాను కొండ మీద గుహలో ఉన్నాను, ఒక ఆలయం నిర్మించామని చెప్పారట. 








మరునాడు కొండను తొలుస్తూ గుహ లోనికి వెళ్లగా రాతి మీద స్వామి వారి దివ్యమంగళ రూపం కనిపించిందట. సుమారు ఒక అడుగు మాత్రమే ఉన్న రూపంలో చిన్న కళ్ళు, నుదిటిన తిరునామం, రెండు చేతులలో శంఖు చక్రాలు, నాశిక , మీసాలు, చిన్న నోరు మరియు ఛాతి భాగం మాత్రమే ఉన్నాయట. 
తమ భాగ్యానికి సంతసించిన గ్రామస్థులు గుహ పైన చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు ఆరంభించారట. చిన్న రామన్నకు స్వామివారి రూపాన్ని పెద్దదిగా చేసి చూడాలి అన్న ఆశ కలిగిందట. శిల్పి వచ్చి వక్షస్థలం మీద ఉలిని తాకించగానే రక్తం వచ్చినదట. 
భయపడిపోయిన రామన్నకు స్వామి గాయం అయిన చోట శుద్ధమైన గంధాన్ని ఉంచమని చెప్పారట. నాటి నుండి నేటి వరకు స్వామివారి వక్షస్థలం మీద ప్రతి నిత్యం గంధాన్ని ఉంచుతారు.ఉదయం పాలాభిషేకం అనంతరం మంచి గంధపు ముద్దను శ్రీవారి వక్షస్థలం మీద అద్దుతారు  మరునాడు అదే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
అలా ప్రారంభమైన స్వామివారి సేవలు కొండవీటి రెడ్డిరాజుల కాలంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకొన్నాయట. ప్రస్తుతం ఉన్న ముఖ మండపం వారి కాలంలోనే నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. తరువాత అమరావతి పాలకుడు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కాలంలో మరింత గా ఆలయం అభివృద్ధి చెందినది అని చెబుతారు. 
సమీపంలోని హరిశ్చంద్రపురం ఒక బ్రాహ్మణుల ఇంట శ్రీ అలువేలుమంగ అమ్మవారి విగ్రహం ఉన్నది అని అశరీరవాణి చెప్పిన మీదట, తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. 

ఆలయ విశేషాలు 

 వైకుంఠ  పురంలో ఎగువ మరియు దిగువ సన్నిధులు ఉంటాయి. 
ఎగువ సన్నిధి స్వామివారు స్వయంవ్యక్తగా కొలువు తీరినది. దిగువ సన్నిధి అనంతరకాలంలో నిర్మించినది. 

ఎగువ సన్నిధి 

క్రౌంచ గిరి మీద చిన్న కొండగుహలో శ్రీవారు కొలువు తీరిన ఆలయం. 
సహజంగా శ్రీ నారసింహాస్వామి కొండగుహలలో కొలువు తీరి దర్శనం అనుగ్రహిస్తుంటారు. కానీ కృష్ణాతీరంలో కనపడే మూడు ఆలయాలలో వైకుంఠనాధుడు గుహలలో వ్యక్తమైనారు. 
క్రౌంచగిరి మీదకు చేరుకోడానికి సోపాన మార్గం ఏనాడో నిర్మించారు. ప్రస్తుతం రహదారి మార్గం కూడా నిర్మాణంలో ఉన్నది. 
మెట్ల మార్గంలో పైకి వెళ్లే దారిలో దశావతార మండపం, ఎగువన శ్రీ హనుమంతుడు మరియు శ్రీ  గరుత్మంతుడు సన్నిధులు కనపడతాయి. 
కొండ మీదకి చేరుకోగానే ఎదురుగా ఎత్తైన ధ్వజస్థంభం, అమ్మవారి సన్నిధి, రెడ్డిరాజులు నిర్మించిన ముఖమండపం కనిపిస్తాయి. ముఖమండపం నుండి గర్భాలయానికి ప్రదక్షిణ చేయడానికి వీలు లేనందున గుహపైన నిర్మించిన విమాన గోపురం వెనుక నుండి కొండ మీదగా ప్రత్యేకంగా ప్రదక్షిణా పధాన్ని ఏర్పాటు చేశారు. 
ప్రదక్షిణ పూర్తి చేసుకొని క్రిందికి వచ్చి ముఖమండపం లోనికి ప్రవేశిస్తే అక్కడ ఆళ్వార్ సన్నిధి, పెద్ద రోలు మరియు పొత్రం కనిపిస్తాయి. మన వేదనలను తొలగించే రోలులో కొబ్బరి వేసి పొత్రంతో రుబ్బి, ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వలన మన ఇహలోక బాధలు తొలగిపోతాయన్నది తరతరాల భక్తుల నమ్మకంగా చెబుతారు. 
ముఖమండపాన్ని అనుసంధానంగా గర్భగుహ చేరుకోడానికి చిన్న మార్గం ఉంటుంది. అర్చకస్వామితో పాటు ఆరుమంది భక్తులు మాత్రమే ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళగలరు. 
గుహలో శ్రీవారు ఎత్తైన పీఠం మీద సుందర అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. 
ముందు చెప్పినట్లుగా స్వామి వారి రూపం ఒక అడుగుకన్నా చిన్నగా వక్షస్థలం, హస్తాలలో శంఖుచక్రాలు,నుదిటిన తిరునామం,భక్తుల పాపాలను కాల్చివేసే నేత్రాలు, నాసిక,మీసం అంతే !
వక్షస్థలం మీద ఏనాడో ఉలి గేటుకు అయిన గాయం మీద పెట్టిన గంధం. అదే భక్తులకు ప్రసాదం. వ్యాధులను నివారించే అద్భుతశక్తి ఈ గంధానికి ఉన్నదని విశ్వసిస్తారు భక్తులు. 
నిత్యం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు తెరిచి ఉంటుంది. సాయంత్రం పూత ఎలాంటి పూజలు జరగవు. సాయం సంధ్యాసమయం నుండి దేవతలు, మహర్షులు శ్రీవారిని సేవించుకోడానికి వస్తారని చెబుతారు. 
నిత్యపూజలతో పాటు, అభిషేకాలు, అర్చనలు, ఆరగింపులు మరియు పర్వదినాలలో విశేష పూజలు, శ్రీవారి కళ్యాణమహోత్సవం, ఆలయ బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి దర్శనం, ధనుర్మాస పూజలు, గోదా కళ్యాణం అన్నీ ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. 

దిగువ సన్నిధి 










పర్వత పాదాల వద్ద విశాల ప్రాంగణంలో ఉండే ఈ ఆలయాన్ని అమరావతి పాలకులైన శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు సుమారు మూడువందల సంవత్సరాల క్రిందట నిర్మించారని శాసనాధారాలు తెలుపుతున్నాయి. నేటి గుంటూరు, కృష్ణా జిల్లాలలో , కృష్ణాతీరంలో అనేక ఆలయాలు శ్రీ వేంకటాద్రి నాయుడు గారి నేతృత్వంలో నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. 
ఎగువ సన్నిధికి వెళ్ళడానికి వృద్దులు, స్త్రీలు, పిల్లలు, దేవాంగులు ఇబ్బందులు పడుతున్నందున రాజా వారు దిగువ సన్నిధి నిర్మించినట్లుగా తెలుస్తోంది. 
తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయానికి మూడంతస్థుల రాజగోపురం నిర్మించబడినది. దక్షిణం వైపున కూడా ఒక గోపురం ఉంటుంది. 
ఎత్తైన ధ్వజస్థంభం వద్ద శ్రీ గరుత్మంతుని సన్నిధి కనపడుతుంది. 
ముఖమండపానికి అనుసంధానంగా మూడు సన్నిధులు కనిపిస్తాయి. ముఖమండపంలో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి విగ్రహం ముకుళిత హస్తాలతో ఉంటుంది. వీరి వంశం వారే ఆలయానికి నేటికీ ధర్మకర్తలుగా వ్యహరిస్తున్నారు. 
గర్భాలయంలో నిలువెత్తురూపంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు దివ్యమంగళ అలంకరణలో నయనమనోహరంగా దర్శనమిస్తారు. ఇరుపక్కలా ఉన్న సన్నిధులలో దేవేరులు కొలువై ఉంటారు.
ఎగువ సన్నిధిలో జరిగే అన్ని పూజలు, ఉత్సవాలు దిగువ సన్నిధిలో కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు. 
మరో రెండు విశేషాలు ఈ క్షేత్రంలో కనపడతాయి. 
ఒకటి పర్వతానికి ఎనిమిది దిక్కులా క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధులు కనపడతాయి. కాకపోతే ఈ ఆలయాలకు ఒక వరుసలో వెళ్లడం కుదరదు. ప్రస్తుతం ఈ అష్ట ఆంజనేయ సన్నిధులకు వెళ్ళడానికి మార్గం వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
మరో విశేషం అన్నాచెల్లెళ్ల గుహ . 
దిగువ సన్నిధికి సమీపంలో కొండ మీద ఒక గుహ కనపడుతుంది. అన్నాచెల్లెళ్ల గుహ అని పిలుస్తారు. దేవదేవుని అనుగ్రహం మరియు ఆయన స్వయంవ్యక్థగా కొలువైన క్షేత్ర మహత్యాన్ని తెలిపే ఒక గాథ ఒకటి వినపడుతుంది. 

అన్నాచెల్లెళ్ల గుహ 



కృష్ణాతీరంలో ఒక గ్రామంలో ఒక దంపతులకు జన్మించిన అన్నాచెల్లెళ్లు చిన్నతనంలో విడిపోయారట. వేరువేరు ప్రాంతాలలో  వేరువేరు తల్లితండ్రుల వద్ద పెరిగారట
యుక్తవయస్సుకు వచ్చిన తరువాత అసలు విషయం తెలియని పెంపుడు తల్లితండ్రులు అన్నీ బాగున్నాయి అని వీరిరువురికీ వివాహం చేశారట. 
వివాహ సమయంలో ఆకాశవాణి అసలు విషయాన్ని వెల్లడించిందట. నిర్ఘాంతపోయిన పెద్దలు పండితులను సంప్రదించారట. జ్యోతిష్కులు, పండితులు విషయాన్ని అన్ని విధాలుగా విచారించి ఒక నిర్ణయాన్ని వెలిబుచ్చారు. 
జరిగిపోయినదానిని సరిదిద్దలేము. కానీ దోషపరిహారం ఉన్నది అని తెలిపారట. ఆ ప్రకారం వారికీ నల్ల బట్టలు తొడిగి, పాదాలకు బంధం వేసి కృష్ణానదీ తీరంలోని పుణ్య తీర్ధ క్షేత్రాలలో స్నానం  కొలువైన పరమాత్మను సేవించాలి. ఎక్కడ పాదాలకు వేసిన బంధం దానంతట విడిపోతుందో, ఎక్కడ వారి నల్ల వస్త్రాలు తెల్లగా మారుతాయో అక్కడ వారికి తెలియకచేసిన తప్పు తొలగి పోయినట్లు అని చెప్పి పంపారట. 
అన్నాచెల్లెళ్లు తమకు కలిగిన దురవస్థను చింతిస్తూ భారం భగవంతుని మీద వేసి నెమ్మదిగా ఒక్కో క్షేత్రం సందర్శించుకొంటూ చివరికి వైకుంఠ పురం చేరుకొన్నారట. ఇక్కడి ఉత్తరవాహినిలో స్నానం చేయగానే వారి బంధం విడిపోవడమే కాకుండా నల్లబట్టలు తెల్లగా మారిపోయినాయట. 
ఆలయం లోనికి ప్రవేశించగానే వారు శ్రీవారిలో ఐక్యం అయ్యారట. 
కొండ మీద ఉన్న గుహలో అన్నాచెల్లెళ్ల విగ్రహాలను నేటికీ చూడవచ్చును. కానీ గుహను చేరుకోవడం కష్టతరమైన పని. 
వైకుంఠ పురం విజయవాడ, గుంటూరు, అమరావతి (పంచారామక్షేత్రం) నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. బస్సు సౌకర్యం కూడా లభిస్తుంది. వసతి సౌకర్యాలు గుంటూరు, విజయవాడ లేదా అమరావతి లో లభిస్తాయి. 
గ్రామంలో కొండ దిగువన "భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం" ఉంటుంది. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సందర్శించవలసిన క్షేత్రం. వేదాలను, అష్టాదశ పురాణాలను మానవాళికి అందించిన ఆది గురువు శ్రీ వేదవ్యాస అర్చనామూర్తి నయనమనోహరంగా ఉంటుంది. 



 
 వైకుంఠ పురం దిగువ సన్నిధి వద్ద ఉన్న ఆశ్రమంలో చక్కని భోజనం లభిస్తుంది. తుళ్లూరు కు చెందిన శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. 




నమో వెంకటేశాయ !!11  

 
 


 
 

 

 

 
 

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore