Sri Agastheeshwara swami Temple, Kaza, Guntur district
కమనీయ కోవెలల క్షేత్రం - కాజ
మన గ్రామాలు చక్కని ఆప్యాయతలకు, పచ్చని పొలాలకు, స్వచ్ఛమైన గాలికి మాత్రమే కాదు కమనీయ కోవెలలకు కూడా కేంద్రాలు.
తరచి చూస్తే మన రాష్ట్రం లోని ప్రతి గ్రామాన రెండు ఆలయాలు తప్పకకుండా కనపడతాయి. కనీసం శ్రీ రామభజన మందిరం లేక శ్రీ కృష్ణ గీతామందిరం అన్నా ఉంటాయి. కొన్ని చోట్ల గ్రామ దేవతల ఆలయాలు కూడా కనిపిస్తాయి.
గ్రామగ్రామాన విగ్రహ లేదా లింగ ప్రతిష్టాపన, ఆలయాల నిర్మాణం, నిర్వహణ ఈ నాటివి కావు. ఎన్నో శతాబ్దాలుగా వారసత్వంగా మరియు అనువంశికంగా వస్తోంది. ఆలయ నిర్వహణ బాధ్యత గ్రామస్థులందరిది. సమిష్టిగా ఆలయాభివృద్దికి, ఆలయ ఉత్సవాలకు గ్రామ ప్రజలందరూ ముందడుగు వేస్తారు.
ఈ కారణంగానే వందల సంవత్సరాల నిర్మించిన ఆలయాలు చాలా గ్రామాలలో నేటికీ నిత్య పూజలతో శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి.
రెండు వేల సంవత్సరాల క్రిందట ప్రతిష్ఠి జరిగింది. తరాలు మారినా తరగని భక్తి విశ్వాసాలతో గ్రామస్థులు దేదీప్యమానంగా దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్న గ్రామం కాజ.
గుంటూరు నుండి విజయవాడ వెళ్లే ప్రధాన జాతీయ రహదారి మీద ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కి సమీపంలో ఉండే కాజ ఎంతో విశేష చరిత్ర కలిగిన గ్రామం గా తెలుస్తోంది.
గతంలో "క్రౌంజ మహేంద్రపురం"గా శాసనాలలో పిలవబడిన కాజ లో రెండు విశేష పురాతన ఆలయాలు నెలకొని ఉన్నాయి.
శ్రీ నారాయణ తీర్ధ ట్రస్ట్
పదిహేడవ శతాబ్దంలో "గోవిందశాస్త్రి" అనే బాలుడు జన్మించినది కాజా లోనే !
ఆ బాలుడే గొప్ప కవి, గాయకుడూ, నాట్య విశారదునిగానే కాకుండా అనేక మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మరియు భగవంతుని చేరే మార్గం బోధించిన గొప్ప యతి.
ఆ బాలుడే గొప్ప కవి, గాయకుడూ, నాట్య విశారదునిగానే కాకుండా అనేక మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మరియు భగవంతుని చేరే మార్గం బోధించిన గొప్ప యతి.
చిన్నతనం నుండి భగవంతుని పట్ల అవాజ్య భక్తిభావాలను కలిగి ఉంది, భాగవత, భారత గ్రంధాలను పఠిస్తుండేవారు. శ్రీ స్వామి శివానంద తీర్ధ శిష్యరికంలో "శ్రీ నారాయణ తీర్ధ" అన్న దీక్షానామం స్వీకరించిన గోవిందశాస్త్రి అనంతరకాలంలో ఎన్నో కావ్యాలను, యక్షగానాలు రచించారు.
వాటిలో భాగవతం లోని దశమ స్కంధం ఆధారంగా వీరు రచించిన "శ్రీ కృష్ణ లీలా తరంగిణి" అత్యంత గొప్ప కావ్యంగా ప్రసిద్ధి చెందినది. ఒక కావ్యానికి ఉండవలసిన అన్ని లక్షణాలతో పాటు నాట్యానికి సరిపోయే విధంగా ఉండటంతో నృత్యరీతులను రూపొందించి కూచిపూడి నృత్యంలో యక్షగానాన్ని ప్రత్యేక భాగంగా మార్చింది కూచిపూడి నాట్యానికి ఆద్యుడైన శ్రీ సిద్ధేంద్ర యోగి. వీరు శ్రీ నారాయణ తీర్ధ శిష్యులు.
ఇష్టదైవ దర్శనాన్ని పొందిన శ్రీ నారాయణ తీర్థుల సమాధి తమిళనాడు లోని "తిరువయ్యారు" లో ఉన్నది. ప్రముఖ కర్ణాటక గాయకభక్తులైన శ్రీ త్యాగరాజ స్వామి వారు వీరి కావ్యాలు చదివి ప్రేరణ పొందారని అంటారు. శ్రీ త్యాగయ్య గారి ఆరాధనోత్సవాలు నిర్వహించేది కూడా తిరువయ్యారు లోనే కావడం ప్రత్యేకం.
శ్రీ నారాయణ తీర్ధ జన్మించిన కాజ గ్రామంలో ప్రస్తుతం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన రచనలకు తగిన ప్రాచుర్యం తేవడానికి కృషి చేస్తున్నారు.
శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం
ఆదిదంపతుల కల్యాణ సందర్బంగా ఉత్తర భాగం అధిక జనసందోహంతో నిండి పోవడంతో, పరమేశ్వరుడు శ్రీ అగస్త్య మహర్షిని పిలిచి శిష్యప్రశిష్యులతో కలిసి దక్షిణ భాగానికి వెళ్ళమని ఆదేశించారట.
అదే సమయంలో మేరు పర్వతం కన్నా గొప్పవాడిని అనిపించుకోడానికి విపరీతంగా పెరిగిన వింధ్య పర్వతరాజు సూర్య చంద్రుల గమనానికి ఆటంకంగా మారారట. వింధ్యుడు అగస్త్య మహర్షి శిష్యుడు.
ఎక్కడి నుండి అయినా శివపార్వతుల వివాహాన్ని వీక్షించే వరం పొంది అగస్త్యుడు దక్షిణ భాగానికి బయలుదేరారు. శిరస్సు వంచి తనకు ప్రణామం చేసిన వింధ్యుని అదే విధంగా ఉండమని ఆజ్ఞాపించారు. ఆవిధంగా సూర్యచంద్రుల గమనం సజావుగా సాగడానికి సులువైనది.
దక్షిణాపధంలో తానూ బస చేసిన ప్రతి ప్రదేశంలో నిత్య పూజల నిమిత్తం ఒక శివలింగాన్ని ప్రతిష్టించేవారట. మహర్షి ప్రతిష్టించిన శివ లింగాలన్నీ శ్రీ అగస్తేశ్వర స్వామి గా పిలవబడుతూ మన తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో నిత్య పూజలు అందుకొంటున్నాయి.
కృష్ణాతీరంలో మహాముని 108 లింగాలను ప్రతిష్టించారట. 107 లింగాల ప్రతిష్ట తరువాత ఆయన కాజ గ్రామానికి వచ్చారట. ఆ రోజులలో బ్రాహ్మణ అగ్రహారం అయిన కాజ విచ్చేసిన శ్రీ అగస్త్యలు ఈ ప్రదేశం, గ్రామంలో గొప్ప స్పందన కలిగి ప్రత్యేకమైన లింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయం చేసుకున్నారట.
ఆ విధంగా ఆయన ప్రతిష్టించిన శ్రీ అగస్తేశ్వర స్వామి నేటికీ పూజలు అందుకొంటున్నారు.
శ్రీ అగస్తేశ్వర లింగ ప్రత్యేకత
మిగిలిన శివ లింగాలకు భిన్నంగా భక్తుల సకల మనోభీష్టాలు నెరవేరాలన్న ఉద్దేశ్యంతో శ్రీ అగస్త్య మహర్షి కాజా గ్రామంలో లింగాన్ని ప్రతిష్టించారు.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 27 జన్మ నక్షత్రాలు అశ్వని నుండి రేవతి వరకు. మనందరం ఏదో ఒక నక్షత్ర పాదంలో జన్మించి ఉంటాము. మహర్షి ఇరవై ఏడు జన్మ నక్షత్రాలకు సూచనగా ఇరవై ఏడు అంగుళాల ఎత్తైన పానువట్టాన్ని ఎంచుకొన్నారు.
శివ అనే పదానికి అర్ధం "శుభం" అని చెబుతారు. లింగం అనగా "ఆకారం". నిరాకరమైన పరబ్రహ్మ రూపం శివలింగం. త్రిమూర్తి తత్త్వం ఇమిడి ఉంటుంది అని తెలుపుతాయి పురాణాలు.
భూమి ని తాకే పీఠ భాగం సృష్టికర్త బ్రహ్మకు ప్రతిరూపం. పానవట్టం శ్రీ మహావిష్ణువు. లోక రక్షకుడు.
పైనున్న లింగం లయకారకుడైన పరమేశ్వరుడు. అభిషేక ద్రవ్యాలు ప్రవహించే మార్గం మహా శక్తి అని అంటారు. దీని అర్ధం ఒక్క శివలింగాన్ని పూజిస్తే త్రిమూర్తులను మరియు లోకపావని త్రిశక్తి స్వరూపిణి అయిన దేవదేవిని పూజించిన ఫలం దక్కుతుంది.
మహర్షి ఇరవై ఏడు ని ఎంచుకోడానికి కారణం మనుష్యులందరూ ఎవరు ఈ లింగాన్ని పూజించినా ఒకే విధమైన ఫలం లభించాలి అని.
పానవట్టానికి పైన ఇరవై నాలుగు అంగుళాల లింగాన్ని ప్రతిష్టించారు. ఇరవై నాలుగు పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రంలోని అక్షరాల సంఖ్య. పూజించేవారు గాయత్రీ మంత్రాన్ని జపించినా జపించక పోయినా కూడా మంత్రం ఫలం లభించేందుకు ఇలాంటి లింగాన్ని ఎంచుకొన్నారు మహర్షి.
కాజ గ్రామంలో శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్టించిన శ్రీ అగస్తేశ్వర స్వామి వారిని పూజిస్తే విశిష్ట ఫలాన్ని పొందుతారు. ఆలయ పురాణ గాథ కూడా ఇదే విషయాన్ని తెలుపుతుంది. శ్రీ అగస్తేశ్వర స్వామి వారిని దర్శించినా, అభిషేకం చేసినా నూట ఎనిమిది లింగాలను దర్శించి అబిషేకం చేసిన ఫలం లభిస్తుంది అని.
అంతటి విశేష లింగాన్ని కాజ గ్రామంలో మహర్షి ప్రతిష్టించారు.
ఆలయ విశేషాలు
తూర్పు ముఖంగా ఉండే ఈ ఆలయం విశాల ప్రాంగణంలో రమణీయ వర్ణ శిల్పాలతో నూతనంగా నిర్మించిన మండపం, విమానగోపురం తో నయనమనోహరంగా దర్శనమిస్తుంది. గతంలో విమాన గోపురం లేదు. ఈ మధ్యకాలంలోనే సర్వాంగసుందరంగా విమానగోపురాన్ని నిర్మించుకున్నారు.
ఆలయం ఇంత విశేషంగా ఉండటానికి సంబంధించిన కృషి మరియు గొప్పదనం గ్రామస్థులదే ! వారంతా అభినందనీయులు.
ముఖమండపానికి వెలుపల ఎత్తైన ధ్వజస్థంభం , పక్కన వట వృక్షం క్రింద నాగ ప్రతిష్టలు, శ్రీ దక్షిణామూర్తి దర్శనమిస్తారు. ముఖమండపంలో పెద్ద నందీశ్వరుడు ఉపస్థితులై ఉంటారు.
ఈ నందీశ్వరుని ప్రత్యేకత ఏమిటంటే కుడి కాలు పైకి ఎత్తి ఉంటారు. తమిళనాడులో ఇలా ఉన్న నంది విగ్రహం కాదు సజీవ రూపం అన్న విశ్వాసం ఉన్నది. తిరువణ్ణామలై, మదురై, కంచి లాంటి పుణ్యక్షేత్రాలలో కుడి కాలు ఎత్తిన నందీశ్వరుడు దర్శనమిస్తారు.
ప్రదక్షిణాపధంలో దక్షిణం వైపున గతంలో నిర్మించిన ఆలయాలలోని శిధిల భిన్న దేవీదేవతా శిల్పాలు కనిపిస్తాయి.
తొలి యుగంలో శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్టించిన లింగానికి అనేక కాలాలలో ఎందరో ఆలయాన్ని నిర్మించారు. కానీ కాలగతిలో అవన్నీ శిధిలమైనాయి. ప్రస్తుత ఆలయం సుమారు పదో శతాబ్దకాలంలో చాళుక్య రాజుల పాలనా కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. కాకతీయ రుద్రమదేవ మహారాజు, కొండవీటి పాలకుడైన రాజా అనవేమారెడ్డి , చాళుక్య రాజైన రాజేంద్ర చోడుడు, విజయనగర పాలకుడైన శ్రీకృష్ణదేవరాయలు, కొండపల్లిని పాలించిన గజపతి రాజులు, ఇలా ఎందరో పాలకులు శ్రీ అగస్తేశ్వర స్వామిని దర్శించుకొని, ఆలయ నిర్వహణకు భూములు, ధనం, పశువులు సమర్పించుకున్నారు అని శాసనాధారాలు తే;తెలియచేస్తున్నాయి.
ముఖమండపాన్ని విజయనగర పాలకులైన శ్రీ కృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరుసు నిర్మించినట్లుగా ముఖ మండప పైభాగాన ఉన్న విజయనగర రాజ చిహ్నం అయిన వరాహం మరియు కత్తి కనపడతాయి.
నూతనంగా నిర్మించిన విమానగోపురం పైన శ్రీ దక్షిణామూర్తి, శ్రీ లింగోద్భవ మూర్తి, శ్రీ శివకల్యాణ ఇతర దేవీదేవతలు శిల్పాలు కనపడతాయి.
ఉత్తరం పక్కన నూతనంగా పునఃప్రతిష్టించిన నవగ్రహ మండపం ఉంటుంది.
ఈ ఆలయంలో కనపడే విశేషాలతో మొదటిది ఏమిటంటే తూర్పు ముఖంగా ఉన్న ఆలయం లోనికి దక్షిణ ద్వారం నుండి వెళ్ళాలి. తూర్పు వైపున ద్వారం ఉండదు. శ్రీ అగస్త్య మహర్షి ప్రాంగణం లోనికి తూర్పు నుండి వచ్చి దక్షిణంగా వెలుపలికి వెళ్లారట. ఆ కారణంగా తూర్పు ప్రవేశం నిషిద్ధం. దక్షిణ ద్వారం వద్ద ఆలయ చరిత్ర తెలిపే రాతి ఫలకం ఉంచారు.
ప్రస్తుతం మన రాష్ట్రంలోని అనేక ఆలయాలలో ఆలయ చరిత్ర మరియు వివరాలను పెడుతున్నారు. అభినందించవలసిన విషయం.
ముఖమండపంలో మరో నందీశ్వరుడు ఉపస్థితులై ఉంటారు. మొత్తం మూడు సన్నిధులు కనపడతాయి. దక్షిణం వైపున ఉన్న సన్నిధిలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి స్థానక భంగిమలో చక్కని అలంకరణలో ప్రశాంత వదనంతో దర్శనమిస్తారు.
ఉత్తరం వైపున ఉన్న సన్నిధిలో శ్రీ గంగా పార్వతీ దేవి చతుర్భుజాలతో, వరద అభయహస్తాలతో, ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు. అమ్మలగన్న అమ్మ పేరు మరో ప్రత్యేకం ఈ ఆలయంలో. సహజంగా నదీతీరాలలో ఉండే శివాలయాలను గంగా పార్వతీ సమేత మహేశ్వరుడు అని పిలుస్తారు. కానీ ఆలయంలో గంగాదేవి ఉండరు. దీని అర్ధం ఏమిటంటే పక్కన ప్రవహించే జీవనది గంగ. జలం జీవం. నీరు ఎక్కడైనా గంగాస్వరూపం. ఆ అర్ధంలో అలా పిలుస్తారు. కానీ ఇక్కడ సమీపంలో నది లేదు. గంగాధరుని శిరస్సున ఉండే గంగను, అర్ధభాగం అయిన పార్వతి ని కలిపి ఏకరూపంలో ఏక నామంతో పిలవడం లోకపావని అమ్మకు, సమస్తప్రాణులకు జీవం జల స్వరూపం అయిన గంగాదేవికి ఇచ్చిన గౌరవంగా భావించాలి.
మధ్యలో ఉన్న గర్భాలయ ద్వారం వద్ద శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య మరియు శ్రీ ధర్మశాస్త (శ్రీ అయ్యప్ప) దర్శనమిస్తారు.
గర్భాలయంలో ముందు తెలిపినట్లుగా పానవట్టం మీద బ్రహ్మసూత్రం ధరించి, చందన, విభూతి, కుంకుమ లేపన మరియు పుష్ప అలంకారంలో నేత్రానందంగా దర్శనం అనుగ్రహిస్తారు శ్రీ అగస్తేశ్వర స్వామి.
కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకొంటున్న శ్రీ అగస్తేశ్వర స్వామి దర్శన మాత్రాన భక్తుల కోర్కెలు వానిగా ప్రసిద్ధి.
ఆలయ పూజలు మరియు ఉత్సవాలు
నిత్యం నిర్ణయించిన పూజలు జరిగే శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెలా ఒక ప్రత్యేక పూజ అనగా అన్నాభిషేకం లాంటివి జరుపుతారు.
కార్తీక మాస పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ ఆలయంలో రుద్ర హోమం మరియు పావనమైన మానససరోవరం, గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృషవేణి జలాలతో స్వామివారికి రుద్రాభిషేకం జరుపుతారు.
రుద్రహోమం మరియు రుద్రాభిషేకం వలన గ్రామం, దేశం, ప్రజలు సమస్తసిరిసంపదలతో, ఆరోగ్యంతో ఉంటారన్నది తరతరాలుగా వస్తున్న విశ్వాసం. పురాణాలలో పేర్కొన్న విషయం.
పౌర్ణమికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి.
శ్రీ సిద్ది వినాయక ఆలయం
శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం వెనుక ఉంటుంది శ్రీ సిద్ది వినాయక మందిరం. ఎన్నో శతాబ్దాలుగా పూజలు అందుకొంటున్న శ్రీ గణపతికి గ్రామస్థులు నూతన ఆలయాన్ని నిర్మించారు.
వినాయక చవితి తో సహా అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. ఏరువాక పున్నమి ఈ ఆలయంలో నిర్వహించే అతి పెద్ద ఉత్సవం.
శ్రీ కోదండ రామాలయం
శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో పడమర దిశగా ఉంటుందీ ఆలయం. కాజ గ్రామ విశేషాలను తెలిపే శాసనాలు అధిక భాగం శ్రీ కోదండ రామాలయంలోని లభించాయని చెబుతారు.
శాసనాల ఆధారంగా చూస్తే ఈ ఆలయం క్రీస్తు పూర్వం శాతవాహన రాజుల కాలం నుండి ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత ఇక్ష్వాకులు, ఆనంద గోత్రీకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, రెడ్డి రాజులు, ఒడిషా గజపతుల, విజయనగర పాలకులు కూడా ఈ ప్రాంత ఆలయాల అభివృద్ధికి ఇతోధికంగా కృషిచేశారని తెలుస్తోంది.
ఈ రెండు వేల సంవత్సరాల ఆలయం కాలక్రమంలో ఎన్నో మార్పులు చెందినది. తొలుత గర్భాలయం మాత్రమే ఉండేది. విజయనగర మహామంత్రి తిమ్మరుసు అర్ధమండపాన్ని నిర్మించారు. వారి కాలంలోనే శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి కూడా ఏర్పడినది అని తెలియ వస్తోంది.
మొట్టమొదట శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం గా ఉండేదట. స్థానిక పాలకుడు శ్రీ రామ భక్తుడు కావడాన గర్భాలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి వారిని ప్రతిష్టించారట. తొలి రోజులలో పూజలు అందుకున్న శ్రీ చెన్నకేశవ స్వామి అర్ధమండపములో దర్శనమిస్తారు.
విశాల ప్రాంగణంలో వర్ణమయ అలంకరణలో శ్రీ మహావిష్ణువు, శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ వేణుగోపాల స్వామి రూపాలతో పాటు వాగ్గేయకారులైన శ్రీ అన్నమయ్య, శ్రీ పురందర దాసు, విగ్రహాలను ముఖ మండపం పైన ఏర్పాటు చేసారు. ప్రస్తుత ఆలయ నిర్మాణం అంతా గ్రామస్థుల కృషి.
ప్రాంగణంలో వాయువ్యం భాగంలో విజయనగర రాజులు నిర్మించిన సుందర కల్యాణ మండపం ఉంటుంది. గర్భాలయ వెలుపలి గోడలలో కనిపించే శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర మరియు శ్రీ గదాధరుని శిల్పాలు ఆలయం చాలా పురాతనమైనది అని నిర్ధారిస్తాయి.
నూతనంగా నిర్మించిన విమాన గోపురం పైన ఉత్తరాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మన్నారాయణుడు, శ్రీ హరి, మరియు సృష్టికర్త బ్రహ్మ దేవుడు కనపడతారు. తూర్పు వైపున శ్రీ లక్ష్మీ నరసింహ, శ్రీ యోగ నరసింహ, శ్రీ మహావిష్ణువు ఉండగా దక్షిణాన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి, శ్రీ ఆది వరాహ స్వామి, శ్రీ దక్షిణామూర్తి కనిపించడం ఇక్కడ మాత్రమే కనిపించే విశేషం.
శ్రీ హయగ్రీవుడు వైష్ణవ సంప్రదాయం ప్రకారం జ్ఞాన ప్రదాత. శైవ సంప్రదాయం ప్రకారం శ్రీ దక్షిణామూర్తి కూడా జ్ఞానప్రదాత. ఇరువురినీ దక్షిణ దిశగా ఉంచడం వలన శివకేశవులు అభేదం అని చెప్పినట్లుగా ఉన్నది.
శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి
ప్రాంగణంలో ఉన్న ఒకే ఒక ఉపాలయం ఉత్తర దిశగా ఉంటుంది. రామబంటు కూడా ఉత్తరాన్ని చూస్తుంటారు. ఈ విధంగా కొలువు తీరిన అంజనాసుతుడు భక్తసులభుడు అని చెబుతారు.
ముఖ్యంగా గ్రహ దోషాలతో వివాహం కానివారు, సంతానం లేనివారు, జీవితంలో స్థిరపడలేక పోతున్నవారు ఈ స్వామిని పూజిస్తే సమస్యలు తొలగిపోతాయన్నది తరతరాల విశ్వాసం.
సింధూరవర్ణశోభితునిగా వాయునందనుడు ప్రసన్న రూపంలో శ్రీ అభయాంజనేయునిగా దర్శనమిస్తారు.
ఎత్తైన ధ్వజస్థంభం వద్ద శ్రీ దాసాంజనేయుడు స్వామివారి సేవకు సిద్ధం అన్నట్లుగా నమస్కార భంగిమలో కనపడతారు. ముఖమండపం పైన విజయనగర రాజ చిహ్నం అయిన వరాహం మరియు ఖడ్గం కనపడతాయి. ఇంకా సుదర్శన చక్రం, శ్రీ కూర్మం, శ్రీ మత్స్యనారాయణ రూపాలను కూడా పైకప్పున చూడవచ్చును.
గర్భాలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేతంగా శ్రీ కోదండ రామస్వామి రమణీయ పుష్ప అలంకరణలో పట్టు వస్త్రాలు ధరించి, స్వర్ణాభరణాల సుందర అలంకరణలో రమణీయంగా స్థానక భంగిమలో దర్శనం ప్రసాదిస్తారు.
నియమంగా నిత్య పూజలు జరిగే ఈ ఆలయం శ్రీ సత్యనారాయణ స్వామి పూజలకు ప్రసిద్ధి. ముఖ్యంగా పౌర్ణమి నాడు పెద్ద సంఖ్యలో వ్రతాలు జరుగుతాయి.
ధనుర్మాస పూజలు, శ్రీ రామనవమి, శ్రీ హనుమజ్జయంతి, శ్రీ నరసింహ జయంతి, ఉగాది ఘనంగా నిర్వహిస్తారు.
రెండువేల సంవత్సరాల విశేష పురాతన ఆలయాలు కలిగి ఉండి కూడా సామాన్య గ్రామంలా ఉండే కాజ విజయవాడ నుండి గుంటూరు వెళ్ళేటప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ప్రధాన రహదారి మీద ఉంటుంది.
వసతి, భోజన సదుపాయాలు విజయవాడ లేదా గుంటూరు పట్టణాలలో అందుబాటు ధరలలో లభిస్తాయి.
మన రాష్ట్రం గ్రామగ్రామాన ఉన్న ఆలయాలను అవకాశం ఉన్నంత వరకు దర్శించుకొందాము. అపురూప ఆలయాలను ప్రపంచానికి పరిచయం చేద్దాము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి