5, మార్చి 2025, బుధవారం

Sri MUktheshwara swami Temple, Kollipara

                                కోవెలల నిలయం కొల్లిపర 



మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఒకటి రెండు పురాతన ఆలయాలు కనిపిస్తాయి. అన్నీ కూడా వెయ్యి సంవత్సరాల చరిత్రకు సజీవ సాక్షులుగా నిలుస్తున్నాయి. 
ముఖ్యంగా కృష్ణాతీరం విశేష ఆలయాలకు ప్రసిద్ధి. గుంటూరు మరియు కృష్ణా జిల్లాలలో అనేకానేక చరిత్ర ప్రసిద్ధికెక్కిన దేవాలయాలు నెలకొని ఉన్నాయి. 
అలాంటి ఒక చిన్న ఊరు కొల్లిపర. 
గుంటూరు జిల్లాలో ఉన్న కొల్లిపరకు అనేక వందల సంవత్సరాల చరిత్ర ఉండటం చెప్పుకోవలసిన విషయం. ఆ చరిత్రకు నిదర్శనం గ్రామంలో ఉన్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి మరియు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయాలు. 
ఈ రెండు ఆలయాలు గ్రామ ప్రధాన రహదారి మీద  దగ్గర దగ్గరగానే కనిపిస్తాయి. 







శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి ఆలయం 

శ్రీమన్నారాయణుడు లోకసంరక్షణార్ధం ధరించిన అనేకానేక అవతారాలలో జనార్ధన రూపం ఒకటి
మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అందులోనూ మనరాష్ట్రంలో మరియు కర్ణాటకలో ఎక్కువగా శ్రీ జనార్దనస్వామి ఆలయాలు కనపడతాయి. 
కేరళ లోని వర్కల ప్రసిద్ధికెక్కిన శ్రీ జనార్ధన స్వామి ఆలయం. అలానే  ఉడిపి జిల్లాలో కూడా ప్రసిద్ధి చెందిన శ్రీ జనార్ధన స్వామి ఆలయం ఎర్మల్ గ్రామంలోఉన్నది . 
మన రాష్ట్రంలో పవిత్ర గోదావరి తీరంలో పౌరాణిక చారిత్రక ప్రసిద్ధి చెందిన నవ జనార్ధన ఆలయాలు కనిపిస్తాయి. 
ఎక్కడ శ్రీ జనార్దనస్వామి కొలువై ఉంటారో ఆ క్షేత్ర పౌరాణిక గాథ త్రిలోక సంచారి, బ్రహ్మ మానస పుత్రుడు, నిరంతర నారాయణ నామస్మరణ చేసే నారద మార్షితో ముడి పడి ఉంటడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పద్దెనిమిది శ్రీ జనార్ధన స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు అని తెలుస్తోంది.  
కొల్లిపర లో కొలువు తీరిన శ్రీ జనార్ధన స్వామి కూడా నారద మహర్షి ప్రతిష్ట అని తెలుపుతోంది ఆలయ గాథ.  
తొలియుగంలో నారద ప్రతిష్ఠిత శ్రీ జనార్ధన స్వామి కి అందుబాటులో ఉన్న గాధల ప్రకారం  కలియుగంలో చాళుక్య రాజులు ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఆ రోజులలో ఈ ఊరిని జనార్ధన మిట్ట అని పిలిచేవారట. 
పదహారవ శతాబ్ద కాలంలో విజయనగర పాలకులైన శ్రీ సదాశివ రాయలు ఈ ప్రాంతానికి వచ్చారట. విజయనగర పాలకులు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేవారు. శిధిలావస్థలో ఉన్న శ్రీ జనార్దనస్వామి ఆలయాన్ని నిర్మించారని శాసనాలు తెలుపుతున్నాయి.  ఆలయ నిర్వహణ నిమిత్తం అనేక కైకార్యాలను, భూములను బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆలయ నిర్వహణ వారికీ అప్పగించారట. ఆ కాలంలో వేద పాఠశాలలతో వేదవిద్యకు ప్రసిద్ధి కెక్కిన  గ్రామాన్ని సదాశివ పురం గా పిలిచేవారట. 
కాలక్రమంలో ఇసుక గుట్టలతో నిండిన ప్రాంతంగా "కొప్పర్ర" గా పిల్లవాడి చివరకు "కొల్లిపర" గా మారింది అంటారు. 
తూర్పు ముఖంగా ఉండే ఈ ఆలయానికి ఎత్తైన రాజగోపురం ఉంటుంది. ఉపాలయాలు లేని చిన్న ప్రాంగణంలో దక్షిణ ముఖంగా శ్రీ అంజనేయస్వామి ఒక సన్నిధిలో ప్రధాన గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి కొలువై ఉంటారు. 
అమ్మవార్ల ప్రతిష్ట అనంతర కాలంలో జరిగినట్లుగా తెలుస్తోంది. 
ఇరుదేవేరులతో సుందర పుష్ప స్వర్ణ ఆభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించి నేత్రపర్వంగా శ్రీ జనార్ధన స్వామి దర్శనమిస్తారు. 
శ్రీ వైష్ణవ ఆగమాలు ప్రకారం నిర్ణయించిన పూజలు ప్రాతినిధ్యం నిర్వహిస్తారు. హిందూ పర్వదినాలలో, ధనుర్మాసంలో, వైశాఖ మాసంలో, శ్రీ కృష జన్మాష్టమి, శ్రీ రామనవమి, వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుపుతారు. 
ముఖ్యంగా ఆలయ ఉత్సవాల సంధర్బంగా జరిగే శ్రీవారి కళ్యామహోత్సవాల సమయంలో సుముహర్త సమయానికి ఆలయం మీద రెండు గరుడ పక్షులు ప్రదక్షిణాలు చేస్తాయి. ఇలాంటి విశేషం ఒంగోలుకు సమీపంలోని చదలవాడ గ్రామంలోని శ్రీ రఘునాయక స్వామి ఆలయంలో కూడా కనపడుతుంది. 
శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి ఆలయం పరిహార క్షేత్రం. వివిధ కారణాల వలన వివాహం కానీ అవివాహితులు, సంతానం లేని దంపతులు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఇక్కడ స్వామి వారి కళ్యాణం చేస్తే అన్నీ కల్యాణప్రదంగా శుభంగా జరుగుతాయన్నది తరతరాల విశ్వాసం. 

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం 











 శ్రీ జనార్ధన స్వామి ఆలయానికి సమీపంలో తూర్పు ముఖంగా విశాల ప్రాంగణంలో అనేక దేవీదేవతల సన్నిధులతో అలరారుతుంటుందీ ఆలయం. 
శ్రీ ముక్తేశ్వర స్వామి వారు స్వయంభూ లింగం అని చెబుతారు. 
ప్రస్తుతం ఉన్న ఆలయానికి కలియుగంలో తొలిరూపాన్ని ఇచ్చింది చాళుక్య రాజులకాలంలో అని శాసనాధారాలు తెలుపుతున్నాయి. అనంతరం అనేక మంది రాజవంశాలవారు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసారని తెలుస్తోంది. 
ముఖ్యంగా కాకతీయుల కాలంలో ఈ ఆలయ శోభ గొప్పగా ఉండేదట. 
కాకతీయులు శివారాధకులు. వారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోజులలో ఇక్కడ వీరశైవం బాగా ప్రాచుర్యంలో ఉండేదట. ఆ రోజులలో పెద్ద సంఖ్యలో శివారాధకులు పవిత్ర కృష్ణా తీరానికి తరలి వచ్చారట. అందుకే ఈ ప్రాంతంలోని ప్రతి శివాలయంలో శ్రీ కాలభైరవ మరియు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఉపాలయం కనపడతాయి. 
తూర్పున ఉన్న ఎత్తైన రాజగోపురాన్ని స్వామివారి భక్తులైన కీర్తి శేషులు శ్రీ ముక్కామల కనకరాయ శర్మ పాకయాజి వంద సంవత్సరాల క్రిందట నిర్మించారు. 
ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఎదురుగా ఎత్తైన ధ్వజస్థంభం, బలిపీఠాలు కనిపిస్తాయి. కనిపించే ఆస్థానమండపం నూతన నిర్మాణం. మండపం పైన స్వయంగా అభిషేకం చేసుకొంటున్న సుందర గంగాధరుని విగ్రహాన్ని  నిలిపారు. ప్రాంగణమంతా దేవతావృక్షాలైన మారేడు, అశ్వద్ధ, వేప, ఉసిరి, జమ్మి చెట్లతో పచ్చదనం పరుచుకొని ఉంటుంది. 
ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం, ఆ వెనుక శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి, నాగ ప్రతిష్టలు, పుట్ట కనిపిస్తాయి. 
గతంలో అన్ని శివాలయాలలో నాగప్రతిష్ఠలు జరిగేవి అన్న విషయాన్ని ప్రాంగణంలో కనిపించే శిల్పాలు స్పష్టం చేస్తాయి. నేటికీ ఈ ఆలయం రాహుకేతు, సర్పదోష మరియు నవగ్రహ పూజలకు ప్రసిద్ధి. అదేవిధంగా ప్రతి మాసశివరాత్రి నాడు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, రుద్ర మరియు చండీ హోమాలు భక్తుల కొరకు ఆర్జిత సేవగా జరుపుతారు. 
ఆస్థాన మండపానికి అనుసంధానంగా ఉన్న ముఖమండపం లో ధర్మానికి ప్రతీక, నిరంతర శివసేవలో నిమగ్నమై ఉండే నందీశ్వరుడు ఉపస్థితులై ఉంటారు. ఇక్కడ మూడు సన్నిధులు కనపడతాయి. కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ముఖమండపం నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. స్వయంగా ప్రతాపరుద్రుడు శ్రీ ముక్తేశ్వర స్వామిని సేవించుకొన్నారని కూడా చెబుతారు.  












దక్షిణం వైపున ఉన్న సన్నిధిలో ప్రధమ పూజ్యుడు శ్రీ వినాయకుడు ఉపస్థితులై దర్శనం ఇస్తారు. ఉత్తరం వైపున ఉన్న సన్నిధిలో జగన్మాత శ్రీ పార్వతీదేవి చతుర్భుజాలతో స్థానక భంగిమలో నేత్రపర్వమైన అలంకరణలో భక్తులను కాచే వరదాయనిగా కొలువై ఉంటారు. 
మధ్యలో ఉన్న ప్రధాన గర్భాలయంలో కొద్దిగా ఉత్తరం వైపుకు వాలి ఉండే ఎత్తైన పానువట్టం  మీద చందన , విభూతి,కుంకుమ లేపనలతో పాటు వర్ణమయ పుష్ప అలంకరణలో శ్రీ ముక్తేశ్వర స్వామి లింగరూపంలో నయనానందకరంగా దర్శనాన్ని అనుగ్రహిస్తారు. 
శైవాగమనాల ప్రకారం నిర్దేశించిన నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు, నివేదనలు జరుగుతాయి. వైశాఖ , కార్తీక మాస పూజలు విశేషంగా నిర్వహిస్తారు. 
మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. 
ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్ర అయిదు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఆలయం తెరిచి ఉంటుంది. 

శ్రీ వీరభద్ర స్వామి ఆలయం 












శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిశలో శ్రీ వీరభద్రస్వామి సన్నిధి కనిపిస్తుంది. ఇక్కడే ఈశాన్యంలో కల్యాణ మండపం కూడా నిర్మించబడినది. 
శ్రీ వీరభద్రస్వామి ఆలయ నిర్మాణం సుమారు మూడు శతాబ్దాల క్రిందట జరిగినట్లుగా తెలియవస్తోంది. ఆలయం విడిగా ధ్వజస్థంభం, ముఖమండపం అంతరాలయం కలిగి ఉంటుంది. 
శ్రీ వీరభద్రస్వామి భక్తసులభుడు. భక్తులు ఎవరైతే జాతకరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో , నరదృష్టి, నరఘోష సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్వామిని నియమంగా సేవించుకొంటే సమస్యలు త్వరితగతిన దూరం అవుతాయన్నది తరతరాల విశ్వాసం. 
శ్రీ భద్రకాళీ శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణం కూడా విశేషంగా జరుపుతారు. 
ముఖమండపంలో నందీశ్వరుడు, శ్రీ వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. గర్భాలయంలో స్థానక భంగిమలో అష్ట్భజాలతో శాంతి గంభీర రూపంలో కొలువై ఉంటారు. అదే గర్భాలయంలో శ్రీ భద్రకాళీ అమ్మవారు దక్షిణ ముఖంగా భక్తాభీష్ట వరదాయనిగా ఉపస్థితురాలై దర్శనమిస్తారు. 
కొల్లిపరలో శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానం, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత శ్రీ గోపయ్య స్వమి ఆలయం, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం కూడా ఉన్నాయి. అత్యంత సమీప గ్రామాలైన తూములూరు, చిలుమూరు, చివలూరు లలో కూడా పురాతన విష్ణు మరియు శివాలయాలు ఉన్నాయి. 
ఇన్ని విశేషాల కొల్లిపర విజయవాడకు, గుంటూరు కు కూడా ముప్ఫై అయిదు కిలోమీటర్లు, తెనాలికి ఇరవై  కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు సౌకర్యం లభిస్తుంది. కానీ స్వంతవాహనంలో వెళ్లడం వలన దగ్గిరలో ఉన్న గ్రామాలలోని ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. 
వసతి సౌకర్యం లేదు. భోజనసదుపాయాలు లభిస్తాయి. 
మన రాష్ట్రంలో గ్రామగ్రామాన ఉన్న పురాతన ఆలయాలను సందర్శిద్దాము. మన ఆలయాల గుర్తింపుకు పాటుపడదాము. మనవైన విశేష ఆలయాల ఖ్యాతి ప్రపంచవ్యాప్తం చేద్దాము. 

నమః శివాయ !!!! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bhudevi sridevi Sameta sri Venkateswara swamy Temple, Anantavaram, Guntur district

                      కొండలలో నెలకొన్న కోనేటి రాయడు - 3 గతంలో మనం పావన కృష్ణవేణీ తీరంలో దేవదేవుడు కలియుగవరదుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన రె...