3, మే 2022, మంగళవారం

Sri Nithya Kalyana Perumal Temple Divyadesm

      శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం, తిరువిదాందై 

నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో   అధికశాతం శ్రీ మహా విష్ణువుతన నిజరూపంలో, శ్రీరామునిగా, శ్రీ కృష్ణునిగా, అనంత శయనునిగా, నారసింహునిగా, త్రివిక్రమునిగా దర్శనమిస్తారు. అంటే ఉపస్థిత, స్థానక మరియు శయన భంగిమలలో. 
కానీ శ్రీ వరాహ మూర్తిగా దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం తిరువిదాందై. మన రాష్ట్రంతో సహా తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో కొన్ని చోట్ల శ్రీ వరాహస్వామి ఆలయాలు ఉన్నాయి. 
ఉత్తర భారత దేశంలో కూడా కొన్ని వరాహ స్వామి ఆలయాలు కనపడతాయి. 
అత్యంత అరుదైన శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయ విశేషాలు తెలుసుకొందాము. 

ఆలయ నామ విశేషాలు 

తాయారు శ్రీ మహా లక్ష్మీ దేవి శ్రీ ప్రసన్న నారసింహుని కుడి లేదా ఎడమ తొడపైన ఉపస్థితురాలై ఉండటం సహజంగా శ్రీ లక్ష్మి నారసింహుని ఆలయాలలో చూస్తుంటాము. ఈ క్షేత్రంలో శ్రీ వరాహ స్వామి అమ్మవారిని తన ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకొని దర్శన మిస్తారు. 
తిరు అనేది తమిళంలో గౌరవ పదం. "శ్రీ" అన్నదానితో సమానం. "ఎడ ఎంతాయి" అంగ ఎడమ పక్కన అని అర్ధం. శ్రీమతిని ఎడమ తొడ మీద ఉంచుకొన్న స్వామి కొలువైన స్థలంగా "తిరు విడ వేన్ తాయి" అని పిలిచేవారట. కాలక్రమంలో "తిరువిదాందై" లేదా "తిరు విదాం డాయి" గా మారింది అంటారు. కళ్యాణ క్షేత్రం అవ్వడం వలన "శ్రీ పురి" అని కూడా పిలుస్తారు. 
మహాబలిపురంలో ఉన్న శ్రీ భూవరాహ స్వామి ఆలయంలో అమ్మవారు స్వామి కుడి తొడ మీద ఉపస్థితులై ఉంటారు. అందువలన ఆ క్షేత్రాన్ని "తిరు వల వెన్ తాయి" అంటారు. 

ఆలయ పురాణ గాధ 

శ్రీ మన్నారాయణుని పరమ భక్తుడైన ప్రహ్లాదుని మనుమడైన  బలి చక్రవర్తి ఈ  ప్రాంతాన్ని పాలించారట. ఆయనకు భూమిని తన కోరల మీద నిలుపుకొని ఉన్న శ్రీ భూ వరాహ స్వామి రూపాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక కలిగినదట. 
శ్రీ పురి లోని వరాహ తీర్థం చేరుకొని తదేక దీక్షతో తపస్సు ఆరంభించారట బలి. భక్త జన పక్షపాతి అయిన శ్రీ హరి భూవరాహ మూర్తి రూపంలో బలికి దర్శనం ఇవ్వడమే కాకుండా  అతని కోరిక మేరకు ఇక్కడ స్థిరపడినారట. 
కాలక్రమంలో శ్రీవారు భూదేవితో కలిసి ఉన్న ప్రదేశంగా శ్రీపురి ఒక ముని వాటికగా మార్పు చెందినదిట. 

శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ 

శ్రీపురిలో వెలిసిన శ్రీ భూ సమేత వరాహ స్వామి గురించి విన్న "కల్వ మహర్షి" తన మూడువందల అరవై మంది కుమార్తెలతో సహా ఇక్కడికి తరలి వచ్చారట. 
మిగిలిన మునిపుంగముల ద్వారా క్షేత్ర గాధను తెలుసుకొని తాను కూడా ఇక్కడే ఉండదలచారట. 
నిత్యం స్వామిని నియమ నిష్టలతో సేవించుకొంటూ తపస్సు చేసుకొనేవారట కల్వ మహర్షి. 
కాలం తన గతిన తాను నడవసాగింది. కల్వ మహర్షి కుమార్తెలు యుక్తవయస్సుకు వచ్చారట. వారికి తగిన వరుల కోసం అన్వేషణ ప్రారంభించారట మహర్షి. 
ఒకనాడు యాత్రీకుడను అని అంటూ ఒక సుందర యువకుడు శ్రీపురి కి వచ్చాడట. అక్కడి వారు అతను ఉండటానికి తగిన ఏర్పాట్లు చేశారట. వరాన్వేషణలో ఉన్న కల్వ ముని యువకుని వివరాలను తెలుసుకొని యోగ్యుడు అని తలంచి తన కుమార్తెలలో ఒకరిని కళ్యాణం చేసుకోమని కోరారట. 
కానీ అప్పటికే సుందర యవ్వనుని పట్ల ఆరాధనా భావం ఏర్పరచుకొన్న మూడువందల అరవై మంది కన్యలు అతనినే వివాహం చేసుకొంటాము అని పట్టుబట్టారట. చేసేది లేక మహర్షి యువకుని అభిప్రాయం అడిగారట.కన్యలకు అభ్యంతరం లేకపోతే తనకు సమ్మతమే అన్నాడట. 
మిగిలిన ఋషులు కూడా ఇది ధర్మ సమ్మతము అని తెలపడంతో కల్వ మహర్షి తన కుమార్తెలను రోజుకు ఒకరిని ఆ యువకునికి ఇచ్చి కళ్యాణం చేశారట. మూడువందల అరవై రోజులు పూర్తి అయ్యేసరికి కల్వమహర్షి కుమార్తెలు అందరూ ఆ యువకుని భార్యలు అయ్యారట. 
అందరికన్నా చిన్నది అయిన కన్యతో కళ్యాణం పూర్తి అయిన తరువాత యువకుడు తన నిజరూపంలో దర్శనమిచ్చారట. అతను మరెవరో కాదు శ్రీ భూవరాహ స్వామి !
అక్కడి మునులందరూ స్వామిని స్తోత్రపాఠాలతో కీర్తించారు. కల్వ మహర్షికి ఆయన కుమార్తెలకు పట్టరాని ఆనందం కలిగిందట. 
స్వామి అందరినీ ఆశీర్వదించి మూలవిరాట్టులో కలిసిపోయారట. కన్యలు ఒక్క పెద్ద కుమార్తె తప్ప మిగిలిన వారు అందరూ ఒకరిగా మారి   అమ్మవారిలో ఐక్యం అయ్యారట. అందుకనే అమ్మవారిని "అఖిల వల్లీ తాయారు" అని పిలుస్తారు. అలా రోజుకొక కళ్యాణం చేసుకొన్న కళ్యాణ స్వరూపుని శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ అని పిలవసాగారు. కల్వ మహర్షి పెద్ద కుమార్తె "కమల వల్లి తాయారు"గా పిలవబడుతూ ప్రత్యేక సన్నిధిలో కొలువై తీరి ఉంటారు. 

ఆలయ విశేషాలు 

సుందర సాగర తీరాన పచ్చని తోటలతో మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే పరిసరాల మధ్య సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంటుంది తిరు విదాందాయి ఆలయం. సుమారు ఏడో శతాబ్దంలో పల్లవులు కట్టించిన ఆలయాన్ని పదకొండవ శతాబ్ద కాలంలో చోళరాజుల పునః నిర్మించారు. 
స్వాగత ద్వారం దాటినా తరువాత వస్తుంది ఆలయ పుష్కరణి వరాహ తీర్థం. దీనిలో స్నానమాచరించిన వారి సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ప్రస్తుతం పరిస్థితుల ప్రభావం వలన పాదాలు శుభ్రం చేసుకొని నీటిని శిరస్సున జల్లుకొంటున్నారు. 
పడమర ముఖంగా నిర్మించిన చిన్న ఆలయంలో అంజనా సుతుడు ముకుళిత హస్తాలతో స్వామివారికి అభిముఖంగా స్థానక భంగిమలో దర్శనమిస్తారు. 
ప్రధాన ఆలయ వెలుప ఉన్న మండపం స్థంభాలపైన దశావతారామరియు భాగవత ఘట్టాలను సుందరంగా మలిచారు. 
రాజగోపురం ఉండని ప్రధాన ద్వారం నుండి లోపలి ప్రవేశిస్తే నేరుగా గర్భాలయానికి వెళ్లే మార్గం ఉంటుంది. అక్కడే ధ్వజస్థంభం, బలి పీఠాలు  మరియు వినతా సుతుని సన్నిధి ఉంటాయి. 
సుమారు పది అడుగుల ఏకశిలా రూపంగా, ఎడమ తొడపైన ఉన్న  అమ్మవారిని చూస్తున్నట్లుగా కనపడే శ్రీ భూవరాహ మూర్తి రూపం గంభీరంగా ఉంటుంది. కుడి కాలిని భూమి మీద ఉంచి, ఎడమ పాదాన్ని ఆదిశేషువు పడగల మీద ఉంచి రమణీయ పుష్ప అలంకరణలో ఉత్తర దిశగా చూస్తున్న స్వామి శాంత గంభీర రూపం నేత్ర పర్వంగా ఉంటుంది.  భూముని మోసే కోరలు స్వామి వదనంలో ప్రస్ఫుటంగా కనపడతాయి. 
వరాహ, విష్ణు ఆదిగా గల పురాణాలలో పేర్కొన్న తిరువిదాందాయి ఆలయ ప్రస్తుత స్థితిలో ఉండటానికి పల్లవ, చోళ , విజయనగర మరియు నాయక రాజులు సమర్పించుకొన్న కైకర్యాలు మరియు నిర్మాణాలు అని అనేక శాసనాలు విశదపరుస్తున్నాయి. 

కల్యాణ రూపునకు నిత్యం కళ్యాణమే 

సంవత్సర కాలమంతా కల్యాణాలు చేసుకొన్న శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ కు ప్రతి రోజు కళ్యాణ అలంకరణ చేస్తారు. నేత్రపర్వంగా ఉండే ఆ అలంకరణ భక్తుల హృదయాలలో స్వామి రూపాన్ని శాస్వితంగా ముద్రిస్తుంది. 
ఆలయ పరిసరాలలో ఎన్నో పూల దుకాణాలు కనపడతాయి. 
పెద్ద వయస్సు వారు కానీ, మధ్య వయస్కులు కానీ, నవదంపతులు కానీ తిరువిదాందాయి ఆలయం సందర్శించుకొంటే వారికి ఆ రోజు మరో మారు కళ్యాణం జరిగినట్లే !
భక్తులు తీసుకు వచ్చిన పూల దండలను స్వామికి తాకించి భార్యాభర్తల చేత ఆ దండలను మార్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో   ఉన్నంత సేపు దండలు తీయరాదు అన్న అలిఖిత నియమం ప్రకారం పూల దండాలు ధరించిన దంపతులు పెళ్లినాటి తలంపులతో సిగ్గుపడుతూ\సంచరిస్తుంటారు. 
ప్రతి నిత్యం ఎందరో నూతన దంపతులు స్వామి దర్శనార్ధం తరలి వస్తుంటారు. 
ఆళ్వార్లలో ఒకరైన తిరుమంగై ఆళ్వార్ శ్రీ భూవరాహ (నిత్య కళ్యాణ)పెరుమాళ్ ని కీర్తిస్తూ పదమూడు పాశురాలను గానం చేశారు. 

ఆలయ ఉత్సవాలు 

ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు తిరిగి సాయంత్రం మూడు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తుల సౌకర్యార్ధం ఆలయం తెరచి ఉంటుంది. 
ఆలయంలో నిత్య , వార, పక్ష మరియు మాస ఉత్సవాలను ఆగమాల ప్రకారం జరుపుతారు. చైత్ర మాసంలో ఆలయ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వర్తిస్తారు. 
వైకుంఠ ఏకాదశి, వరాహ జయంతి, శ్రీ రామ నవమి, జన్మాష్టమి, హనుమజ్జయంతి ఇలా అన్ని హిందూ పర్వదినాలను సంప్రాదయపూర్వకంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో పాశుర గానం జరుగుతుంది. 
నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా దర్శనమిచ్చే తిరు విదాం దాయి చెన్నైమహా నగరం లోని కేలంబాక్కం  సమీపంలో "కోవళం" దగ్గర  ఉంటుందీ. ఆలయం దాకా నేరుగా చేరేందుకు చక్కని రహదారి కలదు. 

ఓం నమో నారాయణయః !!!! 
 

2 కామెంట్‌లు:

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...