31, మే 2022, మంగళవారం

Sri Narasimha

                    శ్రీ ఉగ్ర నారసింహ ఆలయం. మద్దూరు 


భారతావనిలో అనేక శ్రీ మహావిష్ణు అవతారాల ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో అధికశాతం శ్రీ రామచంద్ర మూర్తివి కాగా రెండో స్థానంలో శ్రీ కృష్ణ ఆలయాలు కనపడతాయి. తరవాత స్థానాలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ శేషశయన అనంత పద్మనాభుడు, శ్రీ రంగనాధుడు క్షేత్రాలలో కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు. 
కానీ ఖచ్చితంగా మూడో స్థానం మాత్రం శ్రీమన్నారాయణుని నాలుగో అవతారమైన శ్రీ నారసింహ స్వామి వారి ఆలయాలదే !
నారసింహుడు అపమృత్యు భయాన్ని తొలగించేవానిగా ప్రసిద్ధి. అభయ ప్రదాత, భూతప్రేత పిశాచ పీడల నుండి కాపాడే వానిగా, అధైర్యాన్ని అణచివేసి ధైర్యాన్ని అందించే వానిగా స్వామి రూపాన్ని ప్రార్ధిస్తారు భక్తులు. దక్షిణాదిన నృసింహ ఉపాసన, ఆరాధన అధికంగా చెప్పవచ్చును. 
అతి తెలివితో అసాధ్యం అని తలచిన కోరికలను పొంది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్న దానవుడైన హిరణ్య కశ్యపుని బారి నుండి సమస్త సృష్టిని సంరక్షించడానికి సగం మానవ సగం మృగరాజ రూపంలో అవతరించారు శ్రీ హరి. తన భక్తుడైన ప్రహ్లాదుని మాటలను ఋజువు చేస్తూ సాయంసంధ్యా సమయంలో స్థంభం నుండి ఉద్భవించారు. 
భీకర రూపంతో అసురుని అంతం చేసిన తరువాత ఆగ్రహం చల్లారక అనేక ప్రదేశాలను తిరిగారట స్వామి. ఆలా ఆయన సంచరించినవి  ముప్పై అయిదు ప్రదేశాలు అని అక్కడ  ఆలయాలను నిర్మించినట్లుగా తెలుస్తోంది. యోగ నారసింహునిగా, ఉగ్రనారసింహునిగా, శ్రీ లక్ష్మీ నరసింహునిగా, శ్రీ ప్రహ్లాద వరద నారసింహునిగా స్వామి ఆయా క్షేత్రాలలో దర్శనమిస్తారు
సహజంగా నృసింహుని నివాసాలు గుహలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడుల లోని ప్రముఖ నరసింహ ఆలయాలు అన్నీ గుహాలలోనే ఉంటాయి. 
వీటికి భిన్నంగా మానవ నిర్మిత సుందర ఆలయాలలో ప్రతిష్ఠిత మూర్తిగా శ్రీ నృసింహుడు కొలువు తీరిన క్షేత్రాలు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో కనిపిస్తాయి. హొయసల మరియు విజయనగర రాజులు నిర్మించిన ఈ ఆలయాలు అనేకం నేడు ప్రముఖ దర్శనీయ క్షేత్రాలుగా పేరొందాయి. అలాంటి వాటిల్లో శ్రీ ఉగ్రనారసింహ స్వామి కొలువు తీరిన మద్దూరు ఒకటి. 

క్షేత్ర నామం 

మహాభారత కాలం నాటి గాధతో ముడిపడి ఉన్న ఈ క్షేత్రాన్ని తొలుత "అర్జున పురి" అని పిలిచేవారట. శాసనాలలో కూడా అదే పేరు కనపడుతుంది. కానీ పదహారో శతాబ్దంలో ఇక్కడ ఫిరంగులకు కావలసిన మందుగుండు తయారీ కేంద్రాన్ని స్థాపించారట. మందుగుండు తయారుచేసే ప్రదేశంగా ఇది "మద్దూరు" అని పిలవబడసాగింది. గతంలో కదంబ మహర్షి ఆశ్రమం ఉండటం వలన దీనిని కదంబ క్షేత్రంగా పురాణాలలో పేర్కొన్నారు. 










క్షేత్ర గాధ 

కురుక్షేత్ర సంగ్రామ సమయం సమీపిస్తోంది. కౌరవ పాండవ పక్షాలు యుద్దానికి సిద్దపడుతూ ఎవరి ఏర్పాట్లు వారు చేసుకొంటున్నారు. అలాంటి ఉద్విగ్వభరిత వాతావరణంలో పాండవ పక్ష ప్రధాన వీరుడు అయిన అర్జనుడు చింతాక్రాంతుడయ్యాడు. 
గమనించిన శ్రీ కృష్ణుడు అతనిని తీసుకొని ఈ ప్రాంతాలకు వచ్చి ఏమైనది అని ప్రశ్నించారు.  అర్జనుడు "రాజ్యం కోసం అయినవారితో జరగనున్న పోరు నాలో ఏదో తెలియని ఆందోళన కలిగిస్తోంది. ధైర్యం తగ్గిపోతున్నది. నేను తిరిగి పూర్వపు వీర విజయనునిగా మారాలంటే శత్రుభయంకరమై భక్తుల పాలిట అభయ ప్రసాది అయిన నీ ఉగ్రనారసింహ రూప సందర్శన కలిగించు" అని ప్రార్ధించారు. 
 ఆ సమయంలో అతను ఉన్న పరిస్థితిలో తన రూపాన్ని చూసి తట్టుకోలేడని తలంచిన వాసుదేవుడు. విధాతను తన ఉగ్ర నారసింహ శిలా రూపాన్ని అర్జనునికి చూపించమని కోరారు. బ్రహ్మ దేవుడు దేవశిల్పి విశ్వకర్మ చేత ఆ రూపాన్ని చేయించి పార్థునికి చూపించారు. నేత్రపర్వంగా ఉన్న ఆ రూపాన్ని దర్శించుకొని, పూజించిన పాండవ మధ్యమునిలో యుద్ధం పట్ల నెలకొన్న సంశయాలు, భీతిభయాలు, ఆందోళన తొలగిపోయాయి. 
కురుక్షేత్ర యుద్ధంలో విజయలక్ష్మి పాండవులనే వరించింది. 
అర్జనునికి శ్రీ కృష్ణుడు తన ఉగ్రనారసింహ అర్చారూపాన్ని చూపించిన విషయం తెలుసుకొన్న కదంబ మహర్షి తాను కూడా ఆ రూపాన్ని వీక్షించాలి అన్న కోరికతో ఇక్కడికి వచ్చి వైకుంఠ వాసుని గురించి తపస్సు చేశారట. ఒక నాటి రాత్రి శ్రీహరి ఆయనకు స్వప్న సాక్షాత్కారం ప్రసాదించి దాపుల ఉన్న పుట్టలో తన ఉగ్రనారసింహ రూపం ఉన్నాడని తెలిపారట. 
మహర్షి పుట్టను తొలగించి స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని చూసి తరించారట. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారట. ఈ కారణంగా ఈ ప్రదేశాన్ని "కదంబ క్షేత్రం" అని పిలిచేవారట. 

ఆలయ విశేషాలు 

దక్షిణ భారత దేశంలోని ముఖ్యమైన నదులలో ఒకటి కావేరి. అనేక ఉపనదులు కావేరినదిలో కలుస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది "శింష నది". 
శింష నదీతీరంలో మద్దూర్ లో వెలసిన శ్రీ ఉగ్ర నారసింహ ఆలయాన్నితొలుత ఎవరు నిర్మించారోతెలియదు . కానీ  హొయసల రాజులు శిధిలావస్థలో ఆలయాన్ని పునః నిర్మించారని తెలుస్తోంది. అనంతర కాలంలో విజయనగర రాజులు మరికొన్ని నిర్మాణాలను చేసి ఆలయ నిర్వహణకు కావలసిన కైంకర్యాలను సమర్పించుకొన్నట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. 
ఆలయం రెండు ప్రాకారాలతో తూర్పు ముఖంగా అయిదు అంతస్థుల రాజగోపురంతో ఉంటుంది. హొయసల నిర్మాణం అంటే అద్భుత శిల్పాలకు నిలయాలుగా ప్రసిద్ధి. అదే విధంగా విజయనగర నిర్మాణ శైలి కూడా  ప్రఖ్యాతి.  కానీ ఆ రెండూ కూడా కనిపించవు. చాలా సాదాసీదాగా ఉన్న ఆలయంలో ప్రధాన అర్చామూర్తి, ఉపాలయాలలోని దేవీదేవతలు ప్రత్యేకంగా దర్శనమిస్తారు. 
ప్రధాన ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తే మండపం, ధ్వజస్థంభం కనిపిస్తాయి. 
ముఖమండపం నుండి గర్భాలయం చేరుకుంటే ఏడు అడుగుల ఎత్తైన శిలా రూపంలో శ్రీ ఉగ్ర నారసింహ స్వామి ఉపస్థిత భంగిమలో కనిపిస్తారు. 
 ఒడిలో హిరణ్య కశ్యపుని ఉంచుకొని త ఆరు హస్తాలలో ముందు రెండు చేతులతో అసురుని పొట్ట చీల్చి పేగులను దండలుగా  మెడలో అలంకరించు కొంటుంటారు. మిగిలిన నాలుగు చేతులలో మధ్య వాటితో పాశం, అంకుశం, వెనక చేతులలో శంఖం, చక్రం ధరించి ఉంటారు. కనులు విప్పార్చి, నాలుక బయటికి పెట్టి కోరలు కనపడేలా నోరు తెరిచి ఉగ్రత్వం మూర్తీభవించిన ఇలాంటి సంపూర్ణ విలక్షణ ఉగ్ర రూప నారసింహుని మరెక్కడా చూడలేము. 
మూలవిరాట్టు పాదాలకు ఇరు పక్కలా  చేతులు జోడించి గరుత్మండు, ప్రహ్లాదుడు ఉంటారు. 
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే స్వామివారు నుదిటిన నేత్రంతో త్రినేత్రునిగా దర్శనమివ్వడం. చెంగల్పట్టు సమీపంలోని సింగాపేరుమాళ్ కోవెలలో మూలవిరాట్టు కూడా త్రినేత్రాలతో ఉంటారు. చాలా అరుదైన విషయంగా పేర్కొనాలి. 











ఉపాలయాలు 

ప్రాంగణంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. శ్రీవారి దేవేరులైన భూదేవి శ్రీదేవి ఇక్కడ విడివిడిగా శ్రీ సౌమ్య నాయకి మరియు నరసింహ నాయకి అన్న పేర్లతో పూజలు అందుకొంటుంటారు. సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర మూర్తి మరో ఉపాలయంలో స్థానిక భంగిమలో కనపడతారు. ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామివారి పాదాల వద్ద ఉండే హనుమంతుడు అమ్మవారి పాదాల వద్ద ఉండటం. ఇలా కొలువైన ఆంజనేయుని అరుదుగా మాత్రమే చూస్తాము. 
యశోదాదేవి ఒడిలో శయనించి స్థానాన్ని గ్రోలుతున్నఅరుదైన భంగిమలో  బాలకృషుడు మరో ఉపాలయంలో ఉంటారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు ఇక్కడ శ్రీ శ్రీనివాసదేవర పేరుతొ అభయ హస్తంతో భక్తులను అనుగ్రహిస్తుంటారు. 
పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ప్రఖ్యాతుడైన శ్రీ నమ్మాళ్వార్, శ్రీ వైష్ణవ గురువైన శ్రీ రామానుజాచార్యులు కూడా ఉపాలయాల్లో ఉంటారు. 
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో నియమంగా రోజుకు ఆరు పూజలు జరుగుతాయి. స్వాతి నక్షత్రం రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, శ్రీ రామ నవమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఇతర హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుపుతారు. 
నృసింహ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 
స్వామికి తిరుమంజనం చేయించిన వివిధ ద్రవాలతో స్నానం చేస్తే సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది అన్నది తరతరాల నమ్మకం. ఎందరో బిడ్డలు లేని దంపతులు ముందుగా తిరుమంజన సేవను జరిపించుకోడానికి వస్తుంటారు. 

శ్రీ వరద రాజ పెరుమాళ్ ఆలయం 

ఈ ప్రాంతాన్ని పాలించే హొయసల రాజు విష్ణువర్ధనుని తల్లి చూపును కోల్పోయిందిట. ఎన్నో వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయిందట. అప్పుడు ఇక్కడే స్వామి సేవలో ఉన్న శ్రీ వైష్ణవ ఆచార్యులు శ్రీ రామానుజుల వారి వద్దకు వెళ్లిన రాజు తన తల్లికి తరుణోపాయం తెలుపమని అర్ధించారట. ఆయన ఆమెను కాంచీపురంలో కొలువైన శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో నలభై ఎనిమిది రోజులు ప్రదక్షిణాలు చేస్తే దృష్టి వస్తుంది అని చెప్పారట. 
వృద్ధురాలు, చూపు లేదు అంత దూరం ప్రయాణించలేదు. ఎలా అని తలంచిన రాజు తిరిగి ఆచార్యుల సలహా కోరారట. 
ఆయన చెప్పిన ప్రకారం కంచి నుండి నేర్పరులైన శిల్పులను రప్పించి శ్రీ వరద రాజ పెరుమాళ్ ఆలయ నమూనా ప్రకారం శీఘ్రగతిన ఆలయం నిర్మింపచేశారట. అందులో పన్నెండు అడుగుల శ్రీ వరద రాజ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారట. 
ఆచార్యులు చెప్పిన ప్రకారం రాజమాత ప్రదక్షిణాలు చేసి చూపును పొందినదట. అందువలన స్వామిని శ్రీ కన్ను వరద రాజ స్వామి అని పిలుస్తారు. 
శ్రీ ఉగ్ర నరసింహ ఆలయం వెనక ఉండే ఈ చిన్న ఆలయంలోని మూలవిరాట్టు విగ్రహం నేత్రపర్వంగా ఉంటుంది. 
మద్దూర్ లోని మరో రెండు ముఖ్య ఆలయాలు శ్రీ విద్యనాథేశ్వర స్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వార్లు కొలువైనవి. 
మద్దూర్ కి సమీపంలోనే కొక్కెర బెల్లూరు అనే వలస పక్షుల రక్షణ కేంద్రం కూడా ఉన్నది. 
క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన జైన మందిరం ఒకటి మద్దూర్ లో ఉండటం గతంలో ఇక్కడ జైన మతం అవలంభించారని తెలుస్తోంది . 
ఇన్ని విశేషాలకు నిలయమైన మద్దూర్ మైసూరు మరియు బెంగళూరు నుండి నేరుగా చేరుకోడానికి తగిన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. వసతి సౌకర్యాలు తగుమాత్రంగా లభిస్తాయి. 












నమో నారసింహాయ నమః !!!!



 






 

1 కామెంట్‌:

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...