శ్రీ స్థల శయన పెరుమాళ్ క్షేత్రం , మహాబలిపురం
మహాబలిపురం ఒక ప్రత్యేక చరిత్ర కలిగిన సముద్ర తీర నగరం. క్రీస్తుపూర్వం నాలుగు అయిదు శతాబ్దాల కాలంలోనే అనేక విదేశాలతో వ్యాపార లావాదేవీలు జరిగేవని ఇక్కడ లభించిన ఆ కాలం నాటి నాణాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
పల్లవ రాజుల కాలంలో పంచపాండవ రథాలు(ఏక శిల్ప నిర్మాణాలు), సముద్ర తీర ఆలయాలు, శ్రీ స్థల శయన పెరుమాళ్ ఆలయం, శ్రీ భూవరాహ స్వామి ఆలయం ఇలా చాలా ఉన్నాయి. పల్లవులు గుహాలయాలకు ఆద్యులుగా నిలుస్తారు. వారు నిర్మించిన అనేక గుహాలయాలలో సమీపంలోని సాలువకుప్పం లో ఉన్న టైగర్ కేవ్ ఒకటి.
పాశ్చాత్య యాత్రికుడు, వ్యాపారి అయిన "మార్కో పోలో" మహాబలిపురాన్ని ల్యాండ్ అఫ్ సెవెన్ పగోడాస్ " అని వర్ణించాడు తన యాత్రా విశేషాల గ్రంధంలో. ప్రస్తుతం వాటిల్లో చాల వరకు సముద్రంలో మునిగి పోయాయి.
ప్రస్తుతం మహాబలిపురంలోని నిర్మాణాలు మొత్తం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి.
మహాబలిపురం లేదా మామల్ల పురం
ఈ పేర్ల వెనుక రెండు గాధలు వినపడతాయి. హిరణ్య కశ్యపుని కుమారుడైన బలిచక్రవర్తి పాలించిన ప్రాంతంగా "మహాబలిపురం" అన్న పేరు వచ్చినట్లుగా ఒక కధనం తెలుపుతుంది. రెండో కధనం ప్రకారం పల్లవ రాజైన ఒకటవ నరసింహ వర్మన్ పేరు మీదగా "మామల్ల పురం" అన్న పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. చరిత్రకారులు లభించిన శాసనాలను, పురాతన గ్రంధాలను పరిశీలించిన తరువాత మామల్ల పురం అన్న పేరును నిర్ధారించారు.
ఆళ్వారులలో ఒకరైన "తిరుమంగై ఆళ్వార్" కాలం ఎనిమిదో శతాబ్దం. ఈయన రాసిన గ్రంధంలో సముద్ర తీరాన పెద్ద పర్వతం ఉండేదని , దేశ విదేశ నౌకలు నిరంతరం రాకపోకలు సాగించేవని ఉన్నది. సముద్ర వ్యాపారాల కారణంగా మామల్ల పురం అత్యంత ధనిక ప్రాంతంగా వర్ధిల్లుతోంది అని ఆళ్వార్ తన గ్రంధంలో పేర్కొన్నారు. ఆళ్వార్లు పాశురాలలో క్షేత్రాన్ని "తిరుక్కాడల్ మలై " అని సంబోధించారు. అనగా సముద్ర తీరాన పర్వతం మీద ఉన్న ప్రదేశం అని అర్ధం. కాలక్రమంలో పర్వతం సముద్రంలో కలిసి పోయింది అని తెలుస్తోంది. చాలా వరకు గతకాలపు నిర్మాణాలు కడలిలో కలిసిపోయాయి. ప్రస్తుతం మిగిలిన వాటిని పరిరక్షించడానికి భావి తరాల వారికి అందించడానికి కావలసిన చర్యలు చేపడుతున్నారు అధికారులు.
పల్లవ రాజుల తరువాత చోళ, విజయనగర రాజులు మహాబలిపురం అభివృద్ధికి విశేష కృషి చేసినట్లుగా తెలుస్తోంది.
శ్రీ స్థల శయన పెరుమాళ్ ఆలయ పురాణ గాధ
మామల్ల పురంలో ఉన్న రెండు వైష్ణవ ఆలయాలు కూడా అత్యంత పురాతనమైనవి. వాటిల్లో ఒకటి
దివ్య దేశమైన శ్రీ స్థల శయన పెరుమాళ్ ది కాగా రెండవది శ్రీ భూవరాహ మూర్తిది. ఈ ఆలయం ఒకరకంగా సమీపంలోని మరో దివ్య దేశం అయిన"తిరు విదాండాయి"లో కొలువైన శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ తో ముడిపడి ఉండటం విశేషం.
గతంలో ఇక్కడ "పుండరీకుడు" అనే విష్ణు భక్తుడు నివసించేవారట.ఆయన నిరంతరం హరి నామస్మరణ చేస్తూ దేవదేవుని సేవలో గడిపేవారట. విష్ణువు అలంకార ప్రియుడు కదా ! ఆయనను నిండైన సుందర అలంకరణలో నిత్యం చూసుకోవాలన్న ఆశతో పుండరీకుడు ఒక వనాన్ని, మడుగును ఏర్పాటు చేసుకున్నారట. కొంతకాలానికి కొలను అంతా అనేక వర్ణాల కలువ పూలు వికసించాయట.
వాటి సౌందర్యం చూసిన పుండరీకుడు ఇవి వైకుంఠ వాసుని సుందర మేనిని అలంకరించ తగినవి రాతి విగ్రహం మీద కాదు అని నిర్ణయించుకొన్నారట. డానికి ఆయన ఎంచుకొన్న మార్గం సముద్రాన్ని తోడటం. సాగరమే తాను వైకుంఠానికి చేరడానికి అడ్డం అనుకున్నాడు ఆయన. ఉదయాన్నే సముద్ర తీరానికి వెళ్లి తన చేతులతో సాగర జలాలను తీసుకొని దూరానికి విసిరేవారట. చూసిన వారి పిచ్చివాడని అన్నా లెక్క చేయలేదట.
పుండరీకుని లక్ష్యం ఒకటే వైకుంఠాన్ని చేరాలి చేతులతో కలువలు అలంకరించాలి. దానిలోని సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించలేదు. తన ప్రయత్నం ప్రారంభించారు. రోజులు గడుస్తున్నాయి. పుండరీకుడు ప్రయత్నం ఆపలేదు. సముద్రపు నీరు తగ్గలేదు.
ఒకరోజున నీటిని తోడుతున్న పుండరీకుని వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చారట. అతని వివరాలను చేస్తున్న పని గురించి అడిగారట. వినయంగా జవాబులిచ్చిన పండరీకుడు ఆయనను మీరు ఎవరు అని అడిగారట.
దానికి ఆయన బాటసారిని ఆకలి వేస్తుంటే ఇటు వచ్చాను అని బదులిచ్చారట.
అతిధి పైగా బ్రాహ్మణుడు. పుండరీకుడు మీరు నా పని చేస్తూ ఉండండి. నేను మీకు భోజనం తెస్తాను అని వెళ్లారట.
కొంతసేపటి తరువాత భోజనం తీసుకొని వచ్చిన పుండరీకుడు ఆశ్చర్యపోయాడట. కారణం సముద్రపు ఒడ్డున ఇసుకలో సజ్జలోని కలువ పూలను ధరించి పాలకడలిలో మాదిరి శయనించిన శ్రీమన్నారాయణుడు కనపడ్డారట. బ్రాహ్మణుడు లేడు.
ఆనంద పరవశుడైన భక్త పుండరీకుడు స్తోత్రాలతో స్వామిని స్తుతించి ఇక్కడే శాశ్వితంగా స్థిర నివాసం ఏర్పరచుకోమని అర్ధించారట.
అతనికి ముక్తిని ప్రసాదించి కోరిక మన్నించి స్థిరపడిపోయారట పన్నగ శయనుడు.
భుజంగశయనుడైన శ్రీహరి నేల మీద శయనించి దర్శనమిచ్చిన కారణాన స్వామిని "శ్రీ స్థల శయన పెరుమాళ్" అని పిలుస్తారు. మూలవిరాట్టు పాదాల వద్ద పుండరీకుడు ముకుళిత హస్తాలతో నిలబడి ఉంటారు.
ప్రత్యేక సన్నిధిలో కొలువుతీరి దర్శనమిస్తారు. తాయారు "శ్రీ నీల మంగై తాయారు".
ఉపాలయాలలో శ్రీ ఆండాళ్ మరియు శ్రీ రామచంద్ర మూర్తి కొలువై ఉంటారు.
పల్లవులు కట్టించిన ఆలయాన్ని సముద్రుడు కబళించాడని చెబుతారు. ప్రస్తుత ఆలయాన్ని విజయనగర రాజులు కట్టించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.
పన్నిద్దరు శ్రీ వైష్ణవ గాయక భక్తులైన ఆళ్వారులలో తొలి ముగ్గురు ఆళ్వార్లను కలిపి "ముదల్ ఆళ్వార్" అని అంటారు. వారు పొయిగై ఆళ్వార్, భూతత్తి ఆళ్వార్ మరియు పేయి ఆళ్వార్. వీరిలో మధ్యవారైన భూతత్తి ఆళ్వార్ ప్రకటితమైనది ఈ క్షేత్రం లోనే !
ఆయన మరియు తిరుమంగై ఆళ్వార్ కలిసి శ్రీ స్థల శయన పెరుమాళ్ ని కీర్తిస్తూ ఇరవై ఏడు పాశురాలను గానం చేశారు. అలా ఈ క్షేత్రం నాట ఎనిమిది దివ్య తిరుపతులలో శాశ్విత స్థానం సముపార్జించుకొన్నది.
శ్రీ భూవరాహ మూర్తి ఆలయం
గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవ రాజు నిత్యం దగ్గర లోని మరో దివ్య దేశమైన తిరువిదాందై లో కొలువైన శ్రీ నిత్యకళ్యాణ పెరుమాళ్ ( శ్రీ వరాహ మూర్తి) ని నిత్యం సేవించుకొని పేదలకు అన్నదానం చేసేవారట. ఎన్నో సంవత్సరాల పాటు రాజు నియమం తప్పకుండా స్వామి మరియు అన్నదాన సేవ చేశారట. ఆయన భక్తికి భక్తవత్సలుడు ఆయనను పరీక్షింప నెంచారట.
ఒకనాడు ఇరువురు వృద్ధ బ్రాహ్మణ దంపతులు సరిగ్గా రాజు తిరు విదాందై బయలుదేరుతున్న సమయంలో వచ్చారట. రాజు వారికీ నమస్కరించి ఏమి కావాలని ప్రశ్నించారట. ఈ వయస్సులో ఎంతో దూరం నుండి నడిచి రావడం వలన అలసి ఆకలితో భాధపడుతున్నామన్నారట వారు.
మహారాజు వారికి తగిన ఉపచారాలు , అతిధి మర్యాదలు చేసి స్వయంగా తన స్వహస్తాలతో భక్తి భావంతో అన్నం వడ్డించారట.
అతని సేవాభావనకు సంతసించిన వృద్ధ దంపతులు నిజరూపాలలో దర్శనమిచ్చారట. వారే శ్రీ భూవరాహ మూర్తి శ్రీ మహాలక్ష్మి. మహారాజు తన అదృష్టానికి సంతసించి వారిని అక్కడే కొలువు తీరమని అర్ధించారట.
ఆలా శ్రీ భూవరాహ మూర్తి ఇక్కడ స్థిరపడ్డారు అని తెలుస్తోంది. మహాబలిపురం లైట్ హౌస్ దగ్గర ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. చిన్నది కూడా.
తిరు విదాందై కి ఇక్కడకి ఉన్న ప్రధాన వత్యాసం ఏమిటంటే అక్కడ వారి ఎడమ పక్కన ఒడిలో కొలువై ఉంటారు. ఇక్కడ కుడి పక్కన తొడపై ఉపస్థితగా శ్రీ మహాలక్ష్మి దర్శనమిస్తారు.
ఎన్నో విశేష సుందర నిర్మాణాలకు, ఆహ్లాద పరచే సముద్ర తీరానికి నిలయమైన మహాబలిపురం చేరుకోడానికి చెన్నై నగరం నుండి చక్కని రవాణా సౌకర్యం కలదు. స్థానికంగా ఉండటానికి వివిధ రకాల వసతి సౌకర్యాలు లభిస్తాయి.
Best Indian Astrologer Pandit Sairam ji will assist you in handling all the matters deterring you.
రిప్లయితొలగించండిBest Astrologer in New York
Pandit Bhairav Ji is very famous Indian Astrologer in New York.
రిప్లయితొలగించండిGet your love back