అప్ప కుడుత్తాన్ పెరుమాళ్ ఆలయం, కొయిలాడి
బ్రహ్మండ పురాణంలో ఆది రంగంగా ప్రస్ధాపించబడిన దివ్య దేశం తిరుప్పర్ నగర్. స్ధానిక వ్వవహరిక నామం కొయిలాడి.
శ్రీ రంగంలో కన్నా ముందుగానే వైకుంఠ వాసుడు ఇక్కడ కొలువు తీరారన్న పురాణ గాథ ఆధారంగా ఆది రంగం అన్న పేరు వచ్చింది.
పెరియ పెరుమాళ్ శ్రీ రంగ నాథుడు కొలువైన శ్రీ రంగంతో ఆరంభమైన శ్రీ వైష్ణవ దివ్య దేశాల వరుసలో ఆరో స్థానంలో ఉన్నది తిరుప్పర్ నగర్.
కావేరి నది తీరప్రాంతం. పచ్చదనానికి ప్రసిద్ధి. తమిళ నాడు అన్నపూర్ణ గా పేరొందిన ప్రాంతం ఇది.
మార్గానికి ఇరుప్రక్కల రెండు పాయలుగా చీలి కావేరి, కొల్లిడాం గా పిలవబడుతున్న నదీమతల్లి.
యాత్రీకులను విస్మయపరిచే ప్రకృతి సోయగం కనపడుతుంది ఇక్కడ.
తొలి తరం పాండ్య రాజులతో ముడిపడి ఉన్న "అప్ప కుడుత్తాన్ పెరుమాళ్" ఆలయ పురాణ గాథ కూడా తొలి యుగం నాటిదిగా తెలుస్తోంది.
పురాణ గాథ
హస్తినాపురాన్ని పాలించిన కురు వంశం తో సంబంధ బాంధవ్యాలు గల పురు వంశంలో జన్మించారు " ఉపరిచర వాసు" గా పిలవబడిన పాండ్య రాజు.
దేవేంద్రునితో గల సన్నిహిత స్నేహంతో దానవులతో జరిగిన యుద్దంలో దేవతల తరుఫున పోరాడి విజయం సాధించాడు పాండ్య రాజు. అతని సహాయానికి ఆనందించిన ఇంద్రుడు గగన మార్గంలో విహరించడానికి అనువైన విమానాన్ని కానుకగా ఇచ్చారట. దానిలో ఉపరితలం మీద విహరించే వానిగా ఉపరిచర వాసు అన్న పేరు పొందాడు పాండ్య రాజు.
ఈయన ప్రస్తావన మహాభారతంలో ఉన్నది.
ఒకసారి వేటకు వెళ్ళిన పాండ్య రాజు అనుకోకుండా ఒక బ్రాహ్మణుని మరణానికి కారణం అయ్యారట. దాని మూలాన సంక్రమించిన బ్రహ్మహత్యా దోషం తొలగించుకోవడానికి లయకారుని అనుగ్రహం కొరకు హిమాలయాలలో తీవ్రమైన తపస్సు చేసారట పాండ్య రాజు. సంతసించి ప్రత్యక్షమైన సదాశివుడు మోక్షప్రదాత శ్రీ హరి అని తెల్పి రాజును ఇంద్ర భవన క్షేత్రం లో తపమాచరించమని తెలిపారట.
ఇంద్ర భవన క్షేత్ర ప్రాధాన్యత
ఒకసారి దేవేంద్రుడు ఐరావతం మీద ఉపస్ధితులై గగనసీమలలో విహరిస్తున్నారట. అదే సమయంలో ఎదురుగా వస్తున్న దూర్వాస మహమునిని గమనించలేదట. ముక్కోపి అయిన మహర్షి అహంకారంతో తనను అవమానించాడు ఇంద్రుడు అని భావించారట. అతి త్వరలో దేవేంద్రుడు తన స్వర్గాధిపత్యాన్ని కోల్పోయి, అరణ్యాలలో నివసించాలని అని శపించి వెళ్లి పోయారట. కొంత కాలానికి అసురులతో జరిగిన యుద్దంలో పరాజయం పొందిన దేవతలు భూలోకం వచ్చారు. విధాత బ్రహ్మ దేవుని సలహ మేరకు ఈ ప్రాంతానికి చేరుకొని వైకుంఠ వాసుని అనుగ్రహం కొరకు తపస్సు ఆరంభించారట. నిత్యపూజల నిమిత్తం ఒక కోనేరు నిరమించారు. అదే ఆలయంలో ఉన్న ఇంద్ర పుష్కరిణి.
దేవతల తపస్సుకు సంతసించిన శ్రీ హరి, క్షీరసాగర మధనానికి తెర తీసారు. దేవతలకు కూర్మరూపంలోను, మోహిని గాను సహకరించి అమృతం, స్వర్గాధిపత్యం లభింపచేసారు.
ఇంద్రాది దేవతలు తపస్సు చేసి శ్రీ మన్నారాయణుని ప్రసన్నం చేసుకొన్న స్థలంగా " ఇంద్ర భవన క్షేత్రం " అన్న పేరొచ్చినదట.
నారాయణ అనుగ్రహం కొరకు శ్రీ మహాలక్ష్మి కూడా కొంతకాలం ఇక్కడ తపస్సు చేసారట. ఈ కారణంగా " తిరుప్పర్ నగర్ " అన్న పేరు వచ్చిందట. కాలక్రమంలో చివరకు " కొయిలాడి " గా పిలువబడుతున్నది.
బ్రహ్మండ పురాణంలో ఇంద్ర భవన క్షేత్రం ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. వైకుంఠ వాసుడు శ్రీ రంగం కన్నా ముందు నుండి ఇక్కడ కొలువు తీరి ఉన్నారని అంటారు.
ఇంద్ర భవన క్షేత్రం గురించి మహేశ్వరుడు సవిరంగా తెలిపిన విషయాలను శ్రద్ధగా విన్న ఉపరిచర వాసుకి ఈ క్షేత్ర మహత్యం అవగతమైనదిట.
పరిపూర్ణ భక్తి వశ్వాసాలతో నిష్టగా గరుడవాహనుని ధ్యానించసాగారట పాండ్య రాజు. నిత్యం వేలాది మంది బ్రాహ్మణులకు అప్పాలతో, పాయసం తో అన్నదానం చేసేవారట.
ఒకనాడు మధ్యహన్న భోజనానికి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రాజు వద్దకు ఒక వృద్ద బ్రాహ్మణుడు వచ్చారట. రాజు సాదరంగా ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసారట. బ్రాహ్మణుడు "రాజా! నేను చాలా దూరం నుండి వస్తున్నాను. చాలా ఆకలిగా ఉన్నది. భోజనం పెట్టు" అన్నారట. దానికి రాజు " అయ్యా! బ్రాహ్మణోత్తములు నదికి స్నానానికి వెళ్ళారు. రాగానే వారితో పాటు మీకు కూడా భోజనం పెడతాము " అన్నారట. దానికి ఆయన "నేను ముసలి వాడిని. ఈ క్షుద్బాధ భరించలేకున్నాను. ఆకలితో నేను మరణిస్తే ఆ పాపం నీకు అంటుతుంది" అన్నారట.
ఇప్పటికే తెలియక చేసిన పాపం తో చుట్టుకొన్న బ్రాహ్మణ హత్యా దోషం నుండి బయట పడటానికి ఇంత చేస్తున్నాను. మరల ఇంకొకటా అని భయపడిన పాండ్య రాజు వృద్ద బ్రాహ్మణనికి భోజనం పెట్టమని ఆదేశించారట.
వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆయన వేలాది మంది బ్రాహ్మణుల కొరకు వండిన ఆహారాన్ని పూర్తిగా ఆరగించి ఇంకా తెమ్నన్నారట. ఏమి చేయాలో పాలుపోని రాజు ఆయనను కొద్ది సేపు అప్పాలు ఆరగిస్తూ ఉండమని, ఈ లోపల మరల భోజనాన్ని సిద్దం చేయిస్తానని కోరారట.
అంగీకరించిన బ్రాహ్మణుడు రాజు చూపిన పర్ణశాల లోనికి అప్పాల పాత్రతో వెళ్ళారట. ఈ లోపల నదికి వెళ్ళిన మిగిలిన బ్రాహ్మణులు కూడా వచ్చారట. విషయం తెలుసుకొన్న అందరూ పర్ణశాల వెలుపల గుమికూడారట. అదే సమయంలో సమీపంలో తపస్సు చేసుకుంటున్న మార్కండేయ మహర్షి అక్కడిక వచ్చారట. రాజు ఆయనకు విషయం అంతా వివరించి ఆయనతో కలిసి భోజనం సిద్దం అయ్యింది అని తెలపడానికి లోనికి వెళ్ళిన వారికి అక్కడ పాన్పు పైన అప్పాలను ఆరగిస్తూ శేషశయనుడు దర్శనమిచ్చారట.
అమిత ఆనందంతో వారు స్వామిని స్తోత్రపాఠాలతో ప్రార్దించారట. ఆయన సంతుష్టుడై ఉపరిచర వాసు బ్రహ్మ హత్యా దోషం నుండి విముక్తి, మార్కండేయ మహర్షి కి యమపాశం నుండి తప్పించుకొనే మార్గం తెలిపి వారి కోరిక మేరకు అక్కడే కొలువుతీరారట.
అప్పాలను ఆరగించిన స్వామిని "అప్పకుడుత్తాన్ పెరుమాళ్" అని పిలవసాగారు.
ఆలయ విశేషాలు
తొలి ఆలయాన్ని పాండ్య రాజులు నిర్మించారని తెలుస్తోంది. అనంతరకాలంలో చోళ, విజయనగర, నాయక, మరాఠా రాజవంశాల వారు ఆలయ అభివృద్ధి నిమిత్తం అనేక కైంకర్యాలను సమర్పించుకొన్నారని శాసనాల ద్వారా తెలుస్తోంది.
పడమర ముఖంగా ఉన్న ఆలయానిక మూడు అంతస్థుల రాజగోపురం ప్రధాన ప్రవేశ ద్వారం మీద నిర్మించబడినది.
అంత విశేష నిర్మాణాలు లేని ఈ ఆలయంలో గర్భాలయంలో శ్రీ అప్పకుడుత్తాన్ పెరుమాళ్ శయన భంగిమలో దర్శనమిస్తారు. ఉపాలయాలు శ్రీ భూదేవి తాయారు, శ్రీ కోమలవల్లీ తాయారు, శ్రీ విష్వక్సేన, శ్రీ ఆంజనేయస్వామి కొలువై ఉంటారు.
ప్రధాన అర్చనా మూర్తి తల వద్ద ఒక వెండి పాత్ర ఉంటుంది. ఉపరిచర వాసు ఈ పాత్ర లోనే స్వామికి అప్పాలు అందించారని చెబుతారు. దీనిని అక్షయ పాత్ర క్రింద పరిగణిస్తారు.
స్వామి వారి శిరస్సు వద్ద మోకాళ్ళ మీద కూర్చొని ఉన్న మార్కండేయ మహర్షి కనిపిస్తారు.
ఆలయ పూజలు మరియు ఉత్సవాలు
పవిత్ర కావేరి తీరం లోని పంచరంగ క్షేత్తాలైన శ్రీరంగపట్టణం, శ్రీరంగం, వటరంగం, సిర్కాళి, శ్రీ సారంగపాణి ఆలయం, కుంభకోణం తోపాటు కొయిలాడి ఒకటి.
ఉదయం ఆరు గంటల నుండి మధ్యహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉండే ఆలయంలో నియమంగా నాలుగు పూజలు నిర్వహించారు.
కైశిక ద్వాదశి, ధనుర్మాస పూజలు, అష్టమి, ఏకాదశి రోజులలో ప్రత్యేక పూజలు జరుపుతారు. వైకుంఠ ఏకాదశి విశేషంగా జరుపుతారు.
ఫాల్గుణ మాసంలో పది రోజుల బ్రహ్మోత్సవాలు రంగ రగ వైభవంగా నిర్వహించెదరు. రథోత్సవం ప్రత్యేకం.
ఇలా ఎన్నో విశేషాల నిలయమైన కొయిలాడి శ్రీరంగం నుండి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది. వసతి సౌకర్యాలు లభించవు. తిరుచునాపల్లి లో అన్ని సౌకర్యాలు అందుబాటు ధరలలో లభిస్తాయి.
ఓం నమో నారాయణాయ!!!!.
Best Indian astrologer Pandit Sairam will assist you in handling all the matters deterring you.
రిప్లయితొలగించండిAstrologer in California