31, మే 2022, మంగళవారం

Gundicha Mandir, Puri

                      మూర్తి లేని మందిరం --- గుండీచా


బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం మరియు పూరీ మన భారత దేశానికి నాలుగు దిశలలో నెలకొని ఉన్న దివ్య ధామాలు. ఈ నాలుగు క్షేత్రాల సందర్శనాన్ని " చార్ ధాం " యాత్ర అంటారు. స్వయం పరమాత్మ నడయాడిన ఈ పవిత్ర స్థలాలు యుగాల క్రిందటి పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి. హిందువులు జీవితంలో ఒకసారి అయినా ఈ క్షేత్రాలను సందర్శించాలని అభిలషిస్తారు. ఈ నాలుగు క్షేత్రాల ప్రాధాన్యత, ప్రత్యేకతలను విడివిడిగానే చూడాలి. 
అన్నింటి లోనికి పూరీ క్షేత్రం పూర్తిగా భిన్నమైనది. శ్రీ జగన్నాథ సంస్కృతి సంప్రదాయాలకు కేంద్ర బిందువు అయిన పూరీ క్షేత్రం ఎన్నో విశేషాల సమాహారం. ఋగ్వేదంలో శ్రీ జగన్నాథ క్షేత్ర ప్రస్థానం వివరంగ ఉన్నది. బ్రహ్మ పురాణం, పద్మ పురాణం కూడా నీలాచల క్షేత్ర ప్రాధాన్యత ను తెలుపుతున్నాయి. 
సుందర సాగర తీరంలో ఉన్న ఈ క్షేత్రం లోని ఆలయం, మూలవిరాట్టుల రూపాలు, వారికి చేసే పూజలు, అలంకరణ, సేవలు, నివేదనలు, యాత్రలు అన్నీ ప్రత్యేకమైనవే! మరెక్కడా కనపడనవే! 
అగ్రజుడు శ్రీ బలరాముడు, చెల్లెలు శ్రీ సుభద్రలతో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణ భగవానుడు శ్రీ జగన్నాథునిగా కొలువైన ఏకైక క్షేత్రం పూరీ. 
పూరీ క్షేత్రం లో దర్శనమిచ్చే విగ్రహలు రాతివి కావు. దారు శిల్పాలు. అలా అవి స్ధిరంగా, ఎల్లప్పుడూ ఉండేవి కావు. అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరం పాత విగ్రహలను తొలగించి నూతన విగ్రహములను నెలకొల్పుతారు. 
శతాబ్దాల క్రిందట నిర్ణయించిన విధానంలో తగిన వృక్షాలను గుర్తించి వాటిని మూర్తులుగా మలుస్తారు. 
నిర్ణయించిన విధానంలో కొత్త మూర్తులలో పాత వాటిలోని "బ్రహ్మ పదార్థం" ని మార్చే ప్రక్రయను  కనులకు గంతులు కట్టుకొన్న ప్రధాన పూజారి నిర్వర్తిస్తారు. వారికి కూడా ఈ బ్రహ్మ పదార్దం ఏమిటో తెలియక పోవడం  ఆశ్ఛర్యకరం. ఈ విగ్రహాల మార్పిడిని " నవ కళేబర ఉత్సవం( యాత్ర)" అంటారు
ఇంతకన్నా ఆశ్చర్యకర వివరం ఏమిటంటే పూరీ ఆలయంలో ప్రత్యేకమైన శ్మశాన వాటిక ఉండటం. బ్రహ్మ పదార్థాన్ని తీసివేసిన విగ్రహములను ఇక్కడ భూస్ధాపితం చేస్తారు. దీనిని " కోయిల్ వైకుంఠం " అంటారు. 
మరో విశేషం ఏమిటంటే పాత విగ్రహలతో పాటు రధాలకు అమర్చిన విగ్రహములను కూడా భూస్ధాపితం చేస్తారు. దీనిని " పాతాళి క్రియ" అంటారు. 
అన్నా చెల్లెలు కొలువైన పూరీ క్షేత్రం లో మూలవిరాట్టు లకు ఎన్నో అలంకరణ లను చేస్తారు. 
నాగార్జున బేష, వామనబేష, నారసింహ బేష, సోనా బేష ఇలా ఎన్నో రకాల అలంకరణ లను చేస్తారు. 
మూలవిరాట్టు లకు చేసే నివేదనలు కూడా మనం ఇండ్లలో ఆరగించే పప్పు, కూరలు లను ప్రత్యేక విధానంలో వండి నివేదన చేస్తారు. నివేదించిన పదార్థాలను ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న " ఆనంద బజార్ " లో భక్తులకు విక్రయిస్తారు. కులాలకు అతీతంగా అందరూ వాటిని అక్కటే భుజిస్తారు. " సర్వం జగన్నాథం" అంటారు అందుకే! 
ఒడియా ప్రజలు  జగన్నాథుని తమ కుటుంబ పెద్ద క్రింద స్థిర స్ధానం ఇచ్చారు అనిపిస్తుంది వారు ఆయనను సేవించుకొనే విధానం పరిశీలిస్తే! 
సోదరి సోదరులకు రోజుకొక, నెలకొక ఉత్సవం లేక పర్వదినం పేరిట రకరకాల వేషధారణ లను చేస్తారు. సోనా బేష, నాగార్జున బేష, నారసింహ బేష, వామన బేష ఇలా ఎన్నో! 
పూరీ క్షేత్రం లో నెలకొని ఉన్న అనేక విశేషాలలో అతి ముఖ్యమైనది, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ, ఆకర్షణ కలిగినది శ్రీ జగన్నాథ రధ యాత్ర. 
మూలవిరాట్టులే తరలి వెళ్ళే ఈ యాత్ర గురించిన సమాచారం స్కాంద, బ్రహ్మ, పద్మ పురాణాలలో వివరించబడింది. కాని లభిస్తున్న ఆధారాల ప్రకారం ఈ యాత్ర పన్నెండవ శతాబ్దం నుండి నిర్వహిస్తున్నట్లు తెలియ వస్తోంది. 
మిగిలిన ఆలయాలలో రథోత్సవం అంటే పాత రధానికి మరమ్మత్తులు చేసి, రంగులు వేసి అందంగా అలంకరించి ఉత్సవ మూర్తు లను మాడ లేదా నగర వీధులలో ఊరేగిస్తారు. 
కానీ పూరీలో ప్రతి సంవత్సరం ఏనాడో నిర్ణయించిన విధానంలో కలపకు కావలసిన వృక్షాలను అన్వేషిస్తారు. వాటి తోనే మూడు రధాలను నియనిష్టలతో అక్షయ తృతీయ నాడు ఆరంభిస్తారు.  
మూలవిరాట్టల నూతన విగ్రహ లకు కావలసిన దారువు కొరకు, రథాల తయారీకి కావలసిన కలపను వేల సంవత్సరాల క్రిందట నిర్ణయించిన పద్ధతలతో సేకరిస్తారు. ఈ వృక్షాల కొరకు ప్రత్యేక పూజలు చేసి నయాగడ్ అడవులలో అన్వషించి సేకరిస్తారు. ఒడిషా లో ఎన్నో  అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వాటిని కాదనీ నయాగడ్ అడవుల నుండి సేకరించడానికు ఒక ప్రత్యేక కారణం  ఉన్నది. 
శ్రీ జగన్నాథ స్వామి పూరీలో కొలువ తీరడానికి ముందు ఈ అడవులలో, మహనదీ తీరంలో శ్రీ నీల మాధవుడు అన్న పేరుతో స్ధానిక సవరల పూజలు అందుకొనే వారట. అనంతరం పూరీ క్షేత్రం లో స్ధిర పడ్డారు అని స్ధానిక గాధలు వినిపిస్తాయి. నేటికీ నయాగడ్ పట్టణానికి సమీపంలోని " కొంటి" అనే గ్రామంలో పురాతనమైన శీ నీల మాధవ ఆలయం కలదు. ఇదే అసలైన జగన్నాథ మూల పీఠం ఆని అంటారు. 
శ్రీ జగన్నాథ ప్రభువు నందిఘోష్ లో, శ్రీ బలభద్ర స్వామి తాళధ్వజ లో, శ్రీ సుభద్ర దేవి దర్పదళన లో ఉపస్థితులై  శ్రీ క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి ఆషాడమాస శుక్లపక్ష ద్వితీయ (విదియ) నాడు బయలుదేరుతారు. రధాలను లాగడానికి లక్షల భక్తులు ముందుకు వస్తారు. 
రథయాత్ర కు ముందు పూరీ క్షేత్రం లో మరో రెండు యాత్రలు జరుగుతాయి. ఈ మూడు యాత్రల మధ్య సంబంధం ఉండటం చెప్పుకోవలసిన విషయం. 

చందన యాత్ర

జగములను ఏలే జగన్నాథుని కి వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించడానికి ఉద్దేశించినదే చందన యాత్ర. దీనిని రెండు భాగములుగా నిర్వహిస్తారు. బాహర(వెలుపల) యాత్ర, బిత్తర ( లోపల) యాత్ర. బాహర యాత్ర లో భాగంగా అక్షయ తృతీయ నుండి జగన్నాథ ప్రభువు పరివారంతో కలిసి ఇరవై ఒక్క రోజుల పాటు సాయం సంధ్యా సమయంలో "మహేంద్ర పుష్కరిణి"లో జలవిహరం చేస్తారు. 
ఇరవై రెండో రోజు నుంచి బిత్తర యాత్రలో భాగంగా ఆలయం లోపల మూలవిరాట్టు లకు చందన లేపనం, పుష్పాలంకరణ ఇత్యాది సేవలు జరుపుతారు. 

స్నాన యాత్ర

జేష్ట మాస పౌర్ణమి శ్రీ జగన్నాథ స్వామి జన్మ దినం. పుట్టిన రోజు సందర్భంగా సంవత్సరంలో మొదటి సారి విగ్రహములను రత్న వేదిక నుండి ఆలయ వెలుపల ఉండే " స్నాన బేది " వద్దకు తీసుకొని వస్తారు. వేద మంత్రాలు, మేళతాళాల మధ్య, క్రింద విచ్చేసిన వేలాది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు స్నాన యాత్ర. 
దీనిలో భాగంగా ప్రాంగణం లోని స్వర్ణ బావి నుండి నూట ఎనిమిది బంగారు కళశాలతో నీరు తెచ్చి స్వామివార్లకు జలాభిషేకం చేస్తారు. స్వర్ణ బావి నీటిని ఈ స్నాన యాత్ర కు మాత్రమే  వినియోగిస్తారట. 
మండు వేసవిలో వేడి గాలుల లో సాయం సమయంలో నౌకా విహరం, స్నానం పేరిట అన్ని బిందెల నీటిలో నానడం వలన అర్చామూర్తులకు అనుకోని అనారోగ్యం కలుగుతుంది. 
వెంటనే వారిని ప్రత్యేక మందిరానికి తీసుకొని వెళ్ళి రాజ వైద్యుల ఆద్వర్యంలో పూర్తిగా పథ్యపు ఆహరం అయిన పాలు, పండ్లు, మూలికలను మాత్రమే నివేదన చేస్తారు. ప్రధాన మూర్తులు చికిత్స పొందుతున్న కారణంగా పదిహేను రోజుల పాటు వారి దర్శనం భక్తులకు లభించదు. "అనగా లేక అనవసర కాలం" గా పిలిచే ఈ రోజుల లో స్ధానిక భక్తులు పూరీ క్షేత్రానికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మ గిరిలో కొలువైన " శ్రీ అలర్నాధ స్వామి" ని దర్శించుకుంటారు. అది జగన్నాథ దర్శనంతో సమానమని అంటారు. 
జలాభిషేకం వలన, అనారోగ్యం తో పాటు దేహ శోభను వర్ణాలను కోల్పోయిన దారు రూపాలను ప్రకృతి వర్ణాలతో తీర్చిదిద్దుతారు. 
పదహరవ రోజున పూర్తి ఆరోగ్యం తో నూతన శోభతో వెలిగి పోతున్న మూర్తులను తిరిగి రత్న వేదిక మీద ఉప స్థితులను చేస్తారు. నేత్రోత్సవం లేదా నవయవ్వనోత్సవం సందర్భంగా లభించే దేవదేవుని పునః దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. 
నాటికి నూతన రధాల నిర్మాణం పూర్తి అవుతుంది. రధ యాత్ర సన్నాహాలు ఊపందుకొంటాయి. 
ఆషాడ మాస శుక్ల పక్ష విదియ నాడు ఆరంభమయ్యే శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్రల రధ యాత్ర దశమి నాడు ముగుస్తుంది. అనగా మొత్తం తొమ్మిది రోజులు. రాకపోకలకు పట్టే రెండు రోజులను తీసివేస్తే స్వామివారు ఏడు రోజుల పాటు " గుండీచా మందిరం" లో ఉంటారు. 

ఎవరీ గుండీచా... 

సాగర తీరాన నీలాచల శిఖరాన వైకుంఠ వాసుని ఆదేశాల మేరకు శ్రీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించి నది ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన అర్దాంగే గుండీచా దేవి. శ్రీ జగన్నాథుని పట్ల అచంచల భక్తి విశ్వాసాలు ఆమె సొంతం. ఆలయ నిర్మాణం, విగ్రహ తయారీ లలో తనదైన పాత్ర పోషించినదట. ఆలయ పూజలు, ఉత్సవాలు, యాత్రల వెనుక కూడా గుండీచా దేవి పాత్ర గణనీయమైనది అని పూరీ క్షేత్రానికి సంబంధించిన గాధలు తెలుపుతున్నాయి. 
భక్తురాలైన గుండీచా దేవి కోరిక మేరకు పురుషోత్తముడు ఈ మందిరాన్ని ఒక వారం రోజుల పాటు తన తాత్కాలిక విడిదిగా చేసుకుంటున్నారు అని క్షేత్ర గాధలు పేర్కొంటున్నాయి. గుండీచా దేవి నిర్మించడం వలన ఆమె పేరు తోనే పిలుస్తున్నారు. 
ఒడియా భాషలో గుండి అనగా మశూచి అని అర్దమట. ప్రాణాంతక వ్యాధి నుండి కాపాడిన దేవతగా ఆ పేరుతో పిలుస్తున్నారట. 
కొన్న గాధలు గుండీచా ను శ్రీ కృష్ణ భగవానుని పినతల్లి గా ఉదహరిస్తాయి. 
కానీ శ్రీ క్షేత్రానికి, గుండీచా మందిరానికి మధ్యలో "అర్దాసినీ దేవి మరియు శ్రీ కపాల మోచన మహదేవుడు" కొలువైన " మౌసిమా( పిన తల్లి) మందిరం " ఉంటుంది. వీరిరువురూ పూరీ క్షేత్రానికి రక్షకులు. తిరుగు యాత్ర సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి మౌసిమా మందిరం వద్ద ఆగుతారు. ఆమె ఆప్యాయంగా అందించే "పొడ పిట" అనే తీపి వంటకాన్ని ప్రీతిగా స్వీకరిస్తారు. 

గుండీచా మందిరం

వేణుగోపాల బృందావనంగా పిలవబడే ప్రధాన నిర్మాణం వివిధ జాతుల పుష్పాల మొక్కలను క్రమబద్ధంగా పెంచిన ప్రాంగణం మధ్యలో ఉంటుంది. కళింగ నిర్మాణ పద్దతిలో, దేవుళా శైలిలో ఇసుక రాయితో నిర్మించబడినది. చక్కని శిల్పాలతో నిండిన సభ, నాట్య, భోగ మరియు గర్బాలయాలు వరుసలో ఉంటాయి. ప్రాంగణానికి తూర్పు, పడమరలలో ఉన్న ప్రవేశ,  నిష్క్రమణ ద్వారా లన కలుపుతూ ఎత్తైన దుర్బేధ్యమైన ప్రహరి గోడ నిర్మించబడినది.
ఇరు పక్కలా సింహ రూపాలతో, గోపురం మాదిరి కనపడే స్వాగత శిఖరం తో ఉండే పడమర ద్వారం ప్రధాన ప్రవేశ మార్గం. దీని నుండి పరమాత్ముడు సోదరి, సోదరులతో కలిసి గుండీచా మందిరం లోనికి ప్రవేశిస్తారు. తిరిగి తూర్పు వాకిలి నుండి శ్రీ క్షేత్రానికి వెళతారు. 
సంవత్సరంలో ఈవారం రోజులు తప్పించి గుండీచా మందిరం లోని రత్న వేదిక పైన ఏలాంటి మూర్తులు ఉండవు. ఖాళీగా ఉంటుంది. 
జగత్పాలకుని రాక సందర్భంగా పాడ్యమి నాడు గుండీచా మందిరాన్ని శుభ్రం చేసి పుష్పమాలలతో, విద్యుత్ దీపాలతో రమణీయంగా అలంకరిస్తారు. 
అసలు ఈ సంప్రదాయాన్ని ఆరంభించినది గౌడీయవైష్ణవ స్ధాపకులైన శ్రీ చైతన్య మహ ప్రభువులు అంటారు. నేటికి గౌడీయవైష్ణవులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 
నిరంతరం శ్రీ జగన్నాథ నామస్మరణ చేసే శ్రీ చైతన్య మహా ప్రభువులు ఒక పాడ్యమి నాడు శ్రీ క్షేత్రం లోనికి వెళ్లి అదృశ్యులైనారట. తన ఆరాధ్య దైవం లో ఐక్యం అయ్యారని విశ్వసిస్తారు. 
విదియ నాటి రాత్రికి గుండీచా మందిరం చేరిన లోక సంరక్షకుడు  చెల్లి, అన్నతో కలిసి రధాలలోనే నిద్రిస్తారు. 
తదియ నాడు మేళతాళాలతో, వేద మంత్రాల మధ్య లోకేశుని సాదరంగా గుండీచా మందిరం లోనికి తీసికొని వెళ్లి రత్న వేదిక మీద ఉప స్థితులను చేస్తారు. 
గుండీచా మందిరం లో కొలువు తీరిన అన్నా చెల్లెల దర్శనాన్ని "అడప దర్శనం" అంటారు. ఈ దర్శనం జన్మ జన్మల పాపాన్ని, పాప కర్మను తొలగిస్తుంది అన్న నమ్మకంతో వేలాది మంది భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. 
వారం రోజుల పాటు గుండీచా మందిరం నూతన శోభను సంతరించుకుంటుంది. శ్రీ జగన్నాథుని దర్శనార్థం విచ్చేసే భక్తుల సందడితో కళకళలాడిపోతుంది. మూలవరులకు నివేదించే నైవేద్యాలను కూడా ఇక్కడే సంప్రదాయబద్దంగా తయారు చేస్తారు. 
హేర పంచమి, రాసలీల, సంధ్యా దర్శనం, చందన లేపనం లాంటి ప్రత్యేక కార్యక్రమాలతో పాటు నిత్య పూజలు, అలంకారాలు ఘనంగా నిర్వహిస్తారు. 
అలా ఏడు రోజుల పాటు గుండీచా మందిరం లో సేద తీరిన సోదరి సోదరులు దశమి నాడు స్వస్ధానానికి తిరుగు ప్రయాణం అవుతారు. 
నవమి నాడు పడమర ద్వారం వద్ద ఉన్న మూడు రధాలను త్రిప్పి తూర్పు ద్వారం వద్ద నిలుపుతారు. 
తిరుగు యాత్ర ను బహుదా (బావడా) యాత్ర అని పిలుస్తారు. బావడా యాత్ర లో కూడా లక్షలాది మంది భక్తులు భక్తి వశ్వాసాలతో పాల్గొంటారు. 
శ్రీ క్షేత్రం చేరిన శ్రీ జగన్నాథ, శ్రీ బలభద్ర, శ్రీ సుభద్రా దేవులు ఏకాదశి నాడు రెండు వందల కిలోల పైచిలుకు స్వర్ణాభరణాలంకరణలో భక్తులకు " సోనా బేష " దర్శనం అనుగ్రహిస్తారు. 
శతాబ్దాలుగా క్రమం తప్పకుండా నిర్ణయించిన రీతి రివాజులను అనుసరిస్తూ లక్షలాది మంది భక్తజనుల మధ్య ఘనంగా జరుగుతుంది శ్రీ జగన్నాథ రధ యాత్ర. 
జై జగన్నాథ!!!! 





1 కామెంట్‌:

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...