శ్రీ రంగనాథ స్వామి ఆలయం, తిరునీరుమలై
ప్రాచీన గ్రంథాలు, పురాణాలు, క్షేత్ర గాథల ఆధారంగా పరిపూర్ణ విశ్వాసముతో తనను ధ్యానించే నిజ భక్తుల మనోభీష్టాలను నెరవేర్చడానికి శ్రీ హరి వివిధ రూపాలలో పుడమి లో అవతరించారు. అన్ని పరమాత్మ పాదస్పర్శ సోకిన ప్రదేశాలే! భక్తులు నమ్మిన రూపంలో దర్శనము అనుగ్రహించడం వలన స్వామివారిని నేడు మనం శయన, స్ధానక, ఉపస్థిత రూపాలలో చూడగలుగుతున్నాము. రకరకాల నామధేయాలతో స్మరించుకో కలుగు తున్నాము. ఇలాంటివి ప్రపంచంలో కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి. ఆళ్వార్ల లాంటి గాయక భక్తులు తమ గానంతో వీటిని మరింత వ్యాప్తి లోనికి తెచ్చారు. అసలు దేవాలయం అంటేనే దైవము కొలువైన ప్రదేశం. అలాంటి ప్రదేశాన్ని సందర్శించిన సందర్భంలో మనస్సు సర్వాంతర్యామి తో లయం చెంది బీజాక్షరాలతో నిండిన కవిత్వం వెలువడుతుంది. అదే సత్యంగా నిలుస్తుంది. ఆ నిలిచిన సత్యమే దివ్య దేశాలు. ప్రతి యొక్క దివ్య దేశం తన వైన ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. నేటి చెన్నై పట్టణం లోని పల్లవరానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునీరుమలై ఒక విశేష క్షేత్రం. నామం వెనుక విశేషంబ్రహ్మండ పురాణం తిరునీరుమలై క్షేత్రం గురించి సవివరంగా తెలుపుతుంది. ఆళ్వారుల కాలంలో "తోయాద్రి" అని పిలిచే వారట. తోయం అనగా నీరు. ఆద్రి అంటే పర్వతం. నీటి మధ్యనున్న పర్వతం. కాలక్రమేణ వాడుక బాష అయిన తమిళంలో "తిరునీరుమలై" గా పిలవబడుతోంది తిరుమంగై ఆళ్వార్ తోయాద్రి మీద ఉన్న స్వామి దర్శనం కొరకు వచ్చారట. వర్షాకాలం. ఏక ధారగా కురుస్తున్న వర్షాలు. వాన నీటితో కొండ చుట్టూ ఉన్న చెరువు పూర్తిగా నిండిపోయిందట. ఆలయానికి చేరుకోడానికి ఆ రోజుల్లో ఉన్న ఒకే ఒక మార్గం మూసుకు పోయింది. స్వామిని దర్శించు కోకుండా తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఆళ్వార్. అలా వర్షాలు తగ్గినదాకా అంటే సుమారు మూడు నెలల పాటు ఇక్కడ ఉండిపోయారట ఆళ్వార్ . నాడు ఆయన ఉండిన ప్రాంతాన్ని "తిరుమంగై ఆళ్వార్ పురము" అని పిలుస్తున్నారు. స్ధల పురాణంస్వయం శ్రీ మన్నారాయణ మూర్తి స్వయం వ్యక్త గా ప్రకటిత మైన క్షేత్రాలు ఎనిమిది. అవి శ్రీ రంగం, శ్రీ ముషినం, వేంకటాచలం, నైమిశారణ్యం, పుష్కరం, నర నారాయణ క్షేత్రం, తిరుసాలగ్రామం. తోయాద్రి కూడా ఈ వరుసలో చోటు చేసుకోవలసిన క్షేత్రం అని అంటారు. కాని తిరునెల్వేలి జిల్లా లో మరో తోయాద్రి ఉన్నట్లు తెలుస్తోంది. అదే మరో స్వయంవ్యక్త క్షేత్రం అని కొందరు అంటారు. వివాదాన్ని అవతల పెట్టి చూస్తే తిరునీరుమలై ఒక దివ్య దేశంగానే కాకుండా తనవైన కొన్ని ప్రత్యేకతలు కలిగివున్నట్లు తెలుస్తుంది. ఒక దివ్య దేశంలో పరమాత్మ వివిధ భంగిమలలో కొలువు తీరి దర్శనము ఇవ్వడం ఒక్క తిరునీరుమలై లోనే కనపడుతుంది. పర్వతం క్రింద మీద కలిపి మొత్తం నాలుగు సన్నిధులు ఉంటాయి. పర్వత పాదముల వద్ద ఉన్న ప్రధాన ఆలయం లో శ్రీ నీరవన్నన్ స్వామి స్దానక భంగిమ లో కనిపిస్తారు. కొండ మీద శ్రీ రంగనాథ స్వామి శయన భంగిమలో, శ్రీ నారసింహ స్వామి ఉపస్థితులుగా, శ్రీ త్రివిక్రమ స్వామి నడుస్తున్నట్లుగా దర్శనం ఇస్తారు. ఇలాంటి ప్రత్యేక విశేష దర్శనాలు మరెక్కడా లభించవు. శ్రీ రంగనాథ స్వామి స్వయం వ్యక్త గా కొలువు తీరిన గాధ సవివరంగా తెలియదు. త్రేతా యగారంభంలో స్వామి ఇక్కడ మూడు రూపాలలో స్థిరపడ్డారు అని తెలుస్తోంది. శ్రీ మద్రామాయణం రచించిన వాల్మీకి మహర్షి క్షేత్ర సందర్శనలో భాగంగా తోయాద్రి వచ్చారట. క్షీర పుష్కరిణిలో స్నానమాచరించి ధ్యానంలో ఉండగా శ్రీ రామ చంద్ర మూర్తి సాక్షాత్కరించారట. మహర్షి స్వామిని పలు విధాలుగా స్తుతించి, భక్తులను కాపాడటానికి ఇక్కడ కొలువు తీరమని కోరారట. దశరధ నందనుడు సమ్మతించి శ్రీ నీరవన్నన్ పెరుమాళ్ గా దర్శనం ప్రసాదిస్తున్నారు. ప్రధాన దైవంగా శ్రీ నీరవన్నన్ పెరుమాళ్ అయినప్పటికీ ముఖ్యమైన పూజలు అన్నీ కొండ మీద ఉన్న శ్రీ రంగనాధ స్వామికే జరుపుతారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి రూపంగా కనపడతారు శ్రీ నీరవన్నన్ పెరుమాళ్. వరద, కటి హస్తాలతో నిండైన రమణీయ అలంకరణలో నేత్రపర్వంగా దర్శనం ఇస్తారు. ఈయనను "స్థలాధిపతి" అని పిలుస్తారు. ఉపాలయాలలో శ్రీ రామ, శ్రీ ఆంజనేయ మరియు పన్నిద్దరు ఆళ్వారుల దర్శనం ఇస్తారు.. శ్రీ ఆండాళ్ కి ప్రత్యేక సన్నిధి కలదు. అమ్మవారు శ్రీ అణిమామలర్ మాంగై తాయారు విడిగా కొలువు తీరి దర్శనమిస్తారు. శ్రీ రంగనాథ స్వామి సన్నిధి కొండ మీదకు చేరుకోవడానికి సోపాన మార్గం కలదు. గర్భాలయంలో ఆదిశేషుని పడగల ఛాయలో శయన భంగమలో సుందర పుష్పాలంకరణ లో దక్షిణ ముఖంగా కొలువై దర్శనం ప్రసాదిస్తారు శ్రీ రంగనాథ స్వామి. విడిగా సన్నిధి లో శ్రీ రంగనాయకి తాయారు ఉంటారు. ప్రదక్షణా పధంలో తూర్పు ముఖంగా శ్రీ నారసింహ, శ్రీ త్రివిక్రమ స్వామి కొలువై ఉంటారు. ఈ రెండూ కూడా ప్రత్యేక మందిరాలలో కాకుండా ఆలయ గోడలలో ఏర్పాటు చేసిన అరలలో ఉంటాయి. నిత్య పూజలు నియమంగా జరుపుతారు. తిరునీరుమలై ఆలయంలో సంవత్సరానికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. శ్రీ నీరవన్నన్ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణమాసంలో, శ్రీ రంగనాథస్వామి వారి బ్రహ్మోత్సవాలు చైత్ర మాసంలోనూ జరుపుతారు. శ్రీ అణిమామలర్ మాంగై తాయారు, శ్రీ రంగ నాయకి తాయారు జన్మదినాలలో ప్రత్యేక ఉత్సవాలను ఏర్పాటు చేస్తారు. వైకుంఠ ఏకాదశి, శ్రీ రామ నవమి, తొలి ఏకాదశి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, ధనుర్మాస పూజలు, అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు. ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సౌకర్యార్ధం ఆలయం తెరిచి ఉంటుంది. శిఖరాగ్రం నుండి చూస్తే శ్రీ నీరవన్నన్ పెరుమాళ్ ఆలయం, క్షీర పుష్కరిణి, తరిగి పోతున్నప్రశాంత పల్లె వాతావరణం కనపడతాయి. పల్లవ, చోళ విజయనగర రాజులు ఆలయాభివృద్దికి విశేష కృషి చేశారు అని శాసనాలు తెలుపుతాయి. రెండు ఆలయాలలో ఆకట్టుకునే శిల్పకళ కానరాదు. ఆలయం సాదాసీదాగా ఉంటుంది. ముదల్ ఆళ్వారుల లో ఒకరైన భూతత్తి ఆళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్ కలిసి శ్రీ నీరవన్నన్ పెరుమాళ్ ని, శ్రీ రంగనాథ స్వామిని కీర్తిస్తూ ఇరవై పాశురాలు గానం చేశారు.ఆ కారణంగా తిరునీరుమలై తొండై మండలం లోని శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. జై శ్రీ మన్నారాయణ!!!! |
Best Indian Astrologer Pandith Sairam ji will assist you in handling all the matters deterring you.
రిప్లయితొలగించండిAstrologer in Canada
Pandit Bhairav Ji is very famous Indian Astrologer in New York.
రిప్లయితొలగించండిAstrologer in California