30, మే 2022, సోమవారం

Adhi Tiruvarangam Temple

               శ్రీ రంగ నాథుడు కొలువైన  ఆది తిరువరంగం 


పవిత్ర పాలరు (దక్షిణ పెన్న) నదీ తీరం ఎన్నో విశేష ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి కెక్కినది. నదికి ఉత్తరం మరియు దక్షిణ తీరాలలో శివ, విష్ణు, దేవి, గణేష మరియు సుబ్రమణ్య ఆలయాలు చాలా నెలకొని ఉన్నాయి. అన్నీ కూడా పది శతాబ్దాలకు పూర్వం నిర్మించబడినవి కావడం అన్నిటి పురాణ గాధలు కూడా అనేక పురాతన గ్రంధాలలో పేర్కొని ఉండటం ఇంకా చెప్పుకోదగిన విషయం. 









అలాంటి అనేకానేక ఆలయాల్లో తమిళనాడు  కాళ్లకురిచ్చి జిల్లాలో శ్రీ రంగనాధ స్వామి కొలువైన ఆది తిరువరంగం ఒకటి. కృతయుగం నాటి సంఘటనలతో ముడిపడి ఉన్న ఈ ఆలయం శ్రీ వైష్ణవ దివ్యదేశాల జాబితాలో లేకున్నా కావేరి నది తీరంలో కొలువైన శ్రీ రంగం కన్నా ముందు నుండి ఉన్నది అని అంటారు. 
చిత్రమైన విషయం ఏమిటంటే పాశుర గానాలు చేసి మొత్తం నూట ఎనిమిది దివ్య తిరుపతులను వెలుగు లోనికి తెచ్చిన పన్నిద్దరు ఆళ్వారులలో తిరుమంగై  ఆళ్వారు ఇక్కడ శ్రీ వైకుంఠ వాసుని దర్శనం పొందినట్లుగా తెలుస్తోంది. ఆయన తన పాశురాలలో ఆది తిరువరంగం గురించి ప్రస్థాపించినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా మహా బలి చక్రవర్తికి  ఈ క్షేత్రంలో త్రివిక్రముని సాక్షాత్కారం లభించినట్లుగా ఆలయ గాధ తెలుపుతోంది. 
ఆదితిరువరంగం గురించి స్కాంద పురాణంలోని ఉత్తర కాండలో "ఉత్తర రంగ మహత్యం " పేరిట ఉన్నట్లుగా చెబుతారు. 
ఈ క్షేత్రం శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం ఎత్తిన అవతారాలలో మొదటిదైన మత్సావతారం తో ముడిపడి ఉన్నది. 










ఆలయ పురాణ గాధ 

 సోముఖుడు అనే దానవుడు సృష్టికర్త బ్రహ్మ దేవుని వద్ద నుండి వేదాలను అపహరించుకొని పోయి సముద్ర గర్భంలో దాక్కున్నాడట. వేదాలు లేకపోవడంతో సృష్టి కార్యం నిలిచిపోయినదట. దిక్కుతోచని విధాత దేవతలు, మహర్షులను తీసుకొని వైకుంఠం వెళ్లి అనంత శయనుని ఆశ్రయించారట. జరిగిన విషయాన్ని అర్ధం చేసుకొన్న లక్ష్మీపతి వారికి అభయం ఇచ్చి తాను మత్స్య రూపం దాల్చి కడలి ప్రవేశం చేశారట. భీకర సమరం తరువాత అసురుని అంతం చేసి విజయవంతంగా వేదాలను తీసుకొని సాగర గర్భం నుండి వెలుపలికి వచ్చారట. ఆయనకు దేవతలు, మహామునులు బ్రహ్మతో కలిసి స్వాగతం పలికి స్తోత్ర పాఠాలు చేశారట. 
లోకరక్షకుడు సృష్టికర్తకు పాలరు నది ఒడ్డున మరోసారి వేదసారం భోధించారట. కమలాసనుడు, దేవతలు, మునులు స్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని ఈ పవిత్ర క్షేత్రంలో కొలువు తీరమని అర్ధించారట. శ్రీ మన్నారాయణుని ఆదేశం మేరకు దేవశిల్పి విశ్వకర్మ అద్భుతమైన శ్రీ రంగనాధ స్వామి విగ్రహాన్ని తయారు చేశారట. 
దానిని చతుర్ముఖుడు, దేవతలు ఇక్కడ ప్రతిష్టించారని అంటారు. 
స్వామికి తొలి ఆలయం కూడా దేవతల సారధ్యంలో విశ్వకర్మ నిర్మించాడని తెలుస్తోంది. 

శ్రుతకీర్తి ఉదంతం 

చాలా కాలం తరువాత ఈ ప్రాంతం శ్రుతకీర్తి అనే రాజు పాలన క్రిందకి వచ్చినదట. సువిశాల సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించేవాడట. అన్నీ ఉన్న రాజ దంపతులకు సంతానం లేదన్న చింత మాత్రం వేధించేదట. బ్రహ్మ మానస పుత్రుడు,త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఒకనాడు శ్రుతకీర్తి ఆస్థానానికి వచ్చారట. సముచిత స్వాగత సత్కార్యాలు, అర్ఘ్యపాద్యాలు సమర్పించుకున్న రాజదంపతులు మహర్షికి తమ వేదనను తెల్పుకొన్నారట. 
ఆయన వారిని ఆది తిరువరంగం లో కొలువైన శ్రీ రంగనాధ స్వామిని మండలం రోజులు సేవించమని తరుణోపాయం తెలిపారట. 
రాజు రాణి మంది మార్బలంతో ఇక్కడికి చేరుకొని నిత్యం పాలరు నదిలో స్నానమాచరించి నియమ నిష్టలతో స్వామివారిని పూజించారట. సంతసించిన స్వామి వారి మనోభీష్టం నెరవేరేలా ఆశీర్వదించారట. కొంతకాలంలోనే వారికి ఒకరి తరువాత ఒకరుగా నలుగురు బిడ్డలు జన్మించారట. 
ఆనందంతో శ్రుతకీర్తి మహారాజు ఆలయానికి ఎన్నో కైకార్యాలను సమర్పించుకోవడమే కాకుండా ఆజన్మాంతం శ్రీ రంగనాథుని సేవించుకొన్నారట. 







చంద్రుని శాప ఉపశమనం 

వెన్నెల రేడు అయిన చంద్రుడు దక్ష ప్రజాపతి ఇరవై ఏడు మంది కుమార్తెలను వివాహం చేసుకున్నారట. అతను వారందరి లోనికి రోహిణి పట్ల కొంత అధిక ప్రేమ చూపడంతో మిగిలిన వారు తట్టుకోలేక తండ్రికి పిర్యాదు చేశారట. కోపంతో వెనుక ముందు చూడని దక్షుడు అల్లుని క్షీణించి నశించి పొమ్మని శపించాడట. 
అనుకోని ఉపద్రవానికి  ఇరవై ఏడు మంది తారకాలు, చంద్రుడు హతాశులై పోయారట. అప్పుడు నారద మహర్షి భూలోకం లోని ఆది తిరువరంగంలో కొలువైన శ్రీ రంగనాధ స్వామిని సేవించుకొంటే శాప భారం నుండి విముక్తి కలుగుతుంది అని సలహా ఇచ్చారట. 
మహర్షి సలహా మేరకు భూలోకం వచ్చిన చంద్రుడు స్వామి వారి ఆలయంలో ఒక పుష్కరణి ఏర్పాటు చేసుకొని ఏకాగ్రతతో నారాయణ మంత్ర జపంలో నిమగ్నమై పోయారట. అతని దీక్షకు సంతసించిన శ్రీహరి దర్శనమిచ్చి ప్రజాపతి ఇచ్చిన శాపాన్ని తొలగించడం ఎవరి వల్లా కాదు. కానీ దాని నుండి ఉపశమనం కలిగించవచ్చును అని చంద్రుని కైలాసనాధుని శిరస్సుని అలంకరించమన్నారట. సర్వేశ్వరుని శిరస్సున ఉన్నందున చంద్రుడు పదిహేను రోజులు క్షీణించడం, పదిహేను వృద్ధి చెందసాగాడు. అలా చంద్ర కళలు ఏర్పడ్డాయి. వాటితోపాటు అమావాస్య, పౌర్ణమి కూడా. అలా శశాంకుని ధరించడం వలన పరమేశ్వరుడు శశిధరునిగా పేరొందారు.  

ఆలయ విశేషాలు 

పాలరు నది దక్షిణ తీరంలో  నిర్మించబడిన ఈ ఆలయం సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో తూర్పు ముఖంగా ఉంటుంది. ప్రవేశ ద్వారానికి రాజగోపురం ఉండదు కానీ అనుసంధానంగా నలుదిక్కులా విస్తరించి ఉన్న పాతిక అడుగుల ఎత్తైన ప్రహరీ గోడ ఉంటుంది. కోట బురుజును తలపిస్తుంది. 
ప్రధాన ద్వారం పైన సుందరమైన శ్రీ రంగనాథుని శిల్పాన్ని మలచి ఉంచారు. రెండు ప్రాకారాలు గల ఈ ఆలయంలో తొలి ప్రాకారంలో చంద్ర పుష్కరణి,నాలుగు స్తంభాల మండపం, శ్రీ విష్ణు పాదం మరియు పాత కాలపు ధాన్యపు గాదె ఉంటాయి. ఆలయ వృక్షం పున్నాగ పూల వృక్షం కూడా ఈ ప్రాకారంలో కనపడుతుంది. 

ధాన్యపు గాదె 

ఇటికలు సున్నంతో నిర్మించబడిన ఈ ఎత్తైన ధాన్యాగారం గతంలో భక్తులు ఆలయ నిర్వహణకు, ప్రసాదాల తయారీకి, యాత్రీకుల భోజనాదుల కొరకు ఇచ్చే ధాన్యంతో నిండి ఉండేదట. ప్రతి రైతు పంట నూర్చగానే తన వంతు భాగంగా కొంత ధాన్యాన్ని స్వామికి సమర్పించుకొనేవారట.  ప్రస్తుతం గతకాలపు వైభవంగా కనపడుతుంది. ఇలాంటి గాదెలు శ్రీరంగం, శ్రీ జంబుకేశ్వరం మరియు పాపనాశనం (తిరునెల్వేలి జిల్లా)ఆలయాలలో నేటికీ కనపడతాయి.  







శ్రీ రంగనాధ స్వామి 

రెండో ప్రాకారానికి దారి తీసే ద్వారం పైన మూడు అంతస్థుల గోపురాన్ని నిర్మించారు. మణి  మండపం, ముఖమండపం మరియు అర్థ మండపం దాటినా తరువాత గర్భాలయం వస్తుంది. 
సుమారు తొమ్మిది అడుగుల మూలికా శిలలతో నిర్మించబడిన శ్రీ రంగనాథ స్వామి మూలవిరాట్టు ఆదిశేషుని పడగల క్రింద శయనించిన భంగిమలో నేత్ర పర్వంగా దర్శనమిస్తుంది. స్వామి వారి తలా క్రింద ధాన్యాన్ని కొలిచేందుకు పూర్వం ఉపయోగించిన  సోల ఉంటుంది. పాదాల వద్ద గరుత్మంతుడు ఎగరడానికి సిద్ధంగా ఉన్న భంగిమలో ఉంటారు. శిరస్సు వద్ద శ్రీ దేవి తాయారు, పాద సేవలో శ్రీ భూదేవి తాయారు కనపడతారు.
స్వామి వారికి అభిషేకాలు ఉండవు. అలంకరణ మాత్రమే చేస్తారు. అభిషేకాలు శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామి ఉత్సవిగ్రహాలకు నిర్వహిస్తారు.  
పక్కనే ఉన్న మరో తూర్పు ముఖ సన్నిధిలో అమ్మవారి శ్రీ రంగనాయకి స్థానిక భంగిమలో శాంతమూర్తిగా భక్తులను అనుగ్రహిస్తారు. 
ఉపాలయాలలో శ్రీ రామ, శ్రీ ఆంజనేయ, శ్రీ కృష్ణ, శ్రీ వరదరాజ పెరుమాళ్, శ్రీ విష్వక్సేనుడు కొలువై ఉంటారు. 
బ్రహ్మ దేవునికి శ్రీహరి వేదాంతసారం బోధించిన స్థలంగా ప్రసిద్ధికెక్కిన ఆది తిరువరంగంలో  తమ  బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించుకోడానికి తల్లితండ్రులు ఎక్కువగా వస్తుంటారు. అదే విధంగా సంతానం లేని దంపతులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి పూజలు జరిపించుకొంటుంటారు. 
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనం లభించే ఈ ఆలయంలో నియమంగా ప్రతి నిత్యం ఆరు సేవలు జరుపుతారు. ప్రతి నెల విశేష పూజలు ఉంటాయి. అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక ఉత్సవాలు ఏర్పాటు చేస్తారు. 
అష్టమి, నవమి, ఏకాదశి రోజులలో, ధనుర్మాసంలో పాశుర గానం జరుగుతుంది. 
చైత్ర మాసంలో జరిగే ఆలయ బ్రహ్మోత్సవాలలో రథయాత్ర ప్రత్యేకమైనది. వేలాదిగా భక్తులు తమిళనాడు నుండే కాక కర్ణాటక, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా తరలి వస్తారు. 
కాళ్లకురిచ్చి జిల్లాలోని దర్శనీయస్థలాల జాబితాలో ముందు వరుసలో ఉండే ఆది తిరువారంగం క్షేత్రాన్ని విల్లుపురం, తిరుక్కోవిలూర్ మరియు తిరువణ్ణామలై (అరుణాచలం) నుండి రోడ్డు మార్గంలో మానలూర్పేట మీదగా సులభంగా చేరుకోవచ్చును. బస్సులు లభిస్తాయి. వసతి సౌకర్యాలు మాత్రం ఉండవు. 

ఓం నమో నారాయణాయ !!!!   


1 కామెంట్‌:

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...