27, జూన్ 2018, బుధవారం

Sri Kalapathy vishwanatha Temple, Palakkad


       శ్రీ కలపతి విశ్వనాథ స్వామి ఆలయం, పాలక్కాడ్ 



                             పాలక్కాడ్ పరమేశ్వరుడు 


పాలక్కాడ్ పట్టణం లోనే ఉన్న ఈ ఆలయం విశేష చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. అంతే కాదు చుట్టుపక్కల ఉన్న ఆలయాల నిర్మాణాలకు  నాంది పలికించింనది  కూడా  ఈ ఆలయమే ! చరిత్ర దానికది తయారు కాదు. కొందరి చేత సృష్టించబడుతుంది. 



















అలా  సృష్టించింది శ్రీ వెంకటనారాయణ అయ్యర్, శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్ దంపతులు. శివభక్తులైన ఈ దంపతులు వారణాసి వెళ్లి శ్రీ విశ్వేశ్వర స్వామిని, శ్రీ విశాలాక్షి అమ్మవార్లను దర్శించుకొని, తమ గ్రామంలో కూడా ఇలాంటి కైలాస పతి ఆలయం ఉండాలని నిర్ధారించుకున్నారు. తిరుగు ప్రయాణంలో కొన్ని శివలింగాలను, అమ్మవారి విగ్రహాలను తమ వెంట తెచ్చారు. 
వీరి స్వగ్రామం పాలక్కాడ్ కు  పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లెన్ గోడ్. ఇక్కడ ఒక అద్భుత శ్రీ మహావిష్ణువు ఆలయం ఉన్నది. ఈ దంపతులు పాలక్కాడ్ పాలకుడైన "ఇత్తికంబి అచ్చన్" వద్దకు వెళ్లి పట్టణం పక్కగా ప్రవహించే పవిత్ర నీలా నది ఒడ్డున గంగాధరుని, అమ్మవారిని ప్రతిష్టించమని అర్ధించారు. కొంత ధనం విరాళంగా కూడా ఇచ్చారు. దైవభక్తి పరాయణుడైన రాజు ఆలయం నిర్మించడమే కాకుండా భూరి భూదానం ఆలయ నిర్వహణ నిమిత్తం సమర్పించుకున్నాడు. దంపతులు ఇచ్చిన ధనంతో ఒక నిధిని ఏర్పాటు చేసి దానితో ప్రధాన ఉత్సవాలను నిర్వహించమని శాసనం చేసాడు. ఈ శాసనాన్ని ఆలయ ధ్వజస్థంభం వద్ద చూడవచ్చును. 





















ఈ ఉదంతం జరిగింది పదిహేనో శతాబ్దంలో అన్నది చరిత్రకారుల అంచనా ! ఎందుకంటే పై శాసనకాలం 1424 వ సంవత్సరం. ఈ ఆలయం గురించిన సమగ్ర సమాచారం ఆంగ్ల చరిత్రకారుడు రాబర్ట్ సెవెల్ 1882వ సంవత్సరంలో రాసిన పుస్తకంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పుస్తకంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని ఎన్నో పురాతన ఆలయాల వివరాలున్నాయి అని అంటారు. 
శ్రీ వెంకటనారాయణ దంపతులు తమతో తెచ్చిన మిగిలిన మూడు లింగాలను కొల్లెన్ గోడ్, కొడువయూర్ మరియు పొక్కున్ని అనే గ్రామాలలో ప్రతిష్టించారు. కారణమేమిటో తెలియదు కానీ ఈ నాలుగు లింగాలు నాటి సంఘం లోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర అనే నాలుగు కులాలకు ప్రతీకలుగా పరిగణిస్తారు. పాలక్కాడ్ లో ఉన్నది వైశ్య లింగం. దానికి తగినట్లే స్థానిక వ్యాపార వర్గాల వారు స్వామిని పూజించి కానీ ఏ కార్యక్రమం ఆరంభించక పోవడం గమనించదగిన అంశం.












అదలా ఉంచితే పాలక్కాడ్ శ్రీ విశ్వనాథ స్వామి ఆలయానికి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి పేరు దగ్గర నుండి కొన్ని పోలికలుండటం విశేషం. ముక్తి క్షేత్రమైన వారణాసిలో గంగా తీరంలో స్వామి కొలువు దీరారు.ఇక్కడ కాశీ నుండి తెచ్చిన లింగాన్ని నీలా నది ఒడ్డున ప్రతిష్టించారు. అక్కడా ఇక్కడా గతించిన పితృ దేవతలకు సద్గతులు కలగాలని అస్థి నిమజ్జనం, పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకాలు, అర్చనలు, ఆరాధనలు నియమంగా నిర్వహిస్తారు.  
మైసూరు పాలకుడైన టిప్పు సుల్తాన్ ఈ ప్రాంతం మీద దండయాత్ర చేసిన సమయంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయ తలపెట్టాడట. కానీ స్థానిక ప్రజల ప్రతిఘటనతో ఆగిపోయాడట.
పాలక్కాడ్ తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం, చాలాకాలం తమిళనాడులో భాగంగా ఉండటం వలన గతం నుండి ఇక్కడ తమిళుల ఆచారవ్యవహారాల ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఈ ఊరిలోని చాలా ఆలయాలలో తమిళ ఆగమాల ప్రకారం పూజా విధులు నిర్వర్తిస్తారు. శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో కూడా అంతే ! మగవారు చొక్కా విప్పనక్కర లేదు.






















ఆలయం చుట్టూ బ్రాహ్మణ అగ్రహారాలుంటాయి.  రహదారి నుండి క్రిందకి విశాలమైన ప్రాంగణంలో కేరళ మరియు ద్రావిడ నిర్మాణంలో ఉంటుందీ ఆలయం. తూర్పు ద్వారం వద్ద శ్రీ క్షిప్ర ప్రసాద మహా  గణపతికి ఒక ప్రత్యేక ఆలయం నిర్మించబడినది. తొలి పూజ ఆయనకే !
ధ్వజస్థంభం, బలిపీఠాలు నంది (జ్ఞాన నందీశ్వరుడు అని పిలుస్తారు)పీఠం శాసనం దాటి మండపం గుండా లోనికి వెళితే శ్రీ వినాయక, శ్రీ షణ్ముఖ మరియు శ్రీ విశాలాక్షీ అమ్మవార్లు  విడివిడిగా తమ తమ సన్నిధులలో కొలువై ఉంటారు. గర్భాలయంలో శ్రీ కాశీ విశ్వనాధ స్వామి లింగ రూపంలో చందాన, కుంకుమ, విభూది లేపనాలతో, రమణీయ పుష్పాలంకరణలో నయనమనోహరంగా దర్శనమిస్తారు.
నియమంగా రోజుకి మూడు పూజలు జరుగుతాయి. ప్రదక్షిణాపధంలో అశ్వద్ధ వృక్షం, చుట్టూ నాగ ప్రతిష్ఠలు కనపడతాయి. ఈ ఆలయ వృక్షం అశ్వద్ధమే ! ఈ క్షేత్రం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. సంతానం లేని దంపతులు, నాగ దోషంతో వివాహం కానీ యువతీ యువకులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అవసరమైన వారు నాగప్రతిష్ఠలు చేస్తారు.
ఉదయం ఐదున్నర గంటలకు తెరిచే ఆలయం తిరిగి మధ్యహన్నం  పన్నెండు గంటలకు మూసివేస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల దాకా తెరచి ఉంటుంది. అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు. మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా అయిదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఆఖరి రోజున జరిగే రధోత్సవం కేరళలోని మరే ఆలయంలోనూ అంత గొప్పగా జరగదు. లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు.
చూడవలసిన ఉత్సవం. పాలక్కాడ్ పట్టణ చుట్టుపక్కల, జిల్లాలో ఎన్నో విశేష ఆలయాలు ఉన్నాయి.

నమః శివాయ !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...