మనోహరం మళంపుళ ఆనకట్ట
నేను కేరళ రాష్ట్రం లోని చాలా జిల్లాలలోని దర్శనీయ స్థలాలను సందర్శించాను. అస్సలు చూడని జిల్లాలు పాలక్కాడ్, కాసర్గోడ్ మరియు వేనాడ్. ఈ జూన్ మొదటి వారంలో నేను ఆఫీసు పని మీద త్రిసూర్ వెళ్లాల్సివచ్చింది. నా మిత్రులు శ్రీ ఏకా ప్రసాదు, శ్రీ దాసరి ప్రసాదు కూడా నాతొ వచ్చారు. వారిద్దరి ప్రయాణం క్షేత్ర దర్శనం కోసమే ! త్రిసూరులో శ్రీ వడక్కు నాథర్, తిరువంబాడి శ్రీ కృష్ణ ఆలయాలను దర్శించుకొని, గురువాయూర్ వెళ్ళాము. గురువాయూరప్పన్ ను సేవించుకొన్నాము. పని పూర్తి అయిన తరువాత రెండో రోజు సాయంత్రం పాలక్కాడ్ చేరుకున్నాము.
నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఊరిలో ఉన్న శ్రీ కలపాతి విశ్వనాథ ఆలయం, టిప్పు సుల్తాన్ కోట కాకుండా డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న సైలెంట్ వ్యాలీ పార్క్ మాత్రమే చూడదగినవి. అలానే మాకున్న సమయం ఒక రోజు మాత్రమే ! అది కూడా ఆదివారం కావడాన ! ఆదివారం రాత్రికి కోయంబత్తూర్ చేరుకోవాలి. సోమవారం అక్కడ నేను ఒక సమావేశంలో పాల్గొనాలి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఉన్నసమయం పన్నెండు గంటలు అంతే. అందువలన దూరంగా ఉన్న సైలెంట్ వ్యాలీని తీసేసాము.
పాలక్కాడ్ జంక్షన్ వద్ద కొత్తగా పెట్టిన న్యూ నమస్కారం లాడ్జి కి వెళ్ళాము. అక్కడ మేనేజర్ "అస్లం"మాతో ఇంగ్లీషులో మాట్లాడి రూమ్ చూపించారు. ఒకరోజు ఉండటానికి సరిపోతుంది. శుభ్రంగా బాగానే ఉన్నది. అతనికి నా ఆధార్ కార్డు ఇచ్చి మేము తెలుగులో మాట్లాడు కొంటున్నాము. అప్పటి దాకా ఆంగ్లంలో మాట్లాడిన అస్లం హఠాత్తుగా "మీరు ఆంధ్రా నుండి వచ్చారా ?" అన్నాడు తెలుగులో.
మేము ఆశ్చర్యపోయాము. వారి స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాట! అర్ధ శతాబ్దం క్రిందట వారి తండ్రి రైల్వేలో ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారట. ఇంట్లో తెలుగే మాట్లాడు కొంటారట.ఆనందం వేసింది. అతను మాకు కొన్ని ఆలయాల గురించిన సమాచారం ఇస్తూ మళంపుళ ఆనకట్ట గురించి చెప్పారు. పాలక్కాడ్ నుండి పది కిలోమీటర్ల దూరమే ! బస్సులు కూడా విరివిగా లభిస్తాయి జంక్షన్ స్టేషన్ నుంచి !
కానీ టైం తక్కువగా ఉండటం వలన అతనే ఒక తెలిసిన ఆటో మాట్లాడి పెట్టాడు. విశ్వనాధ ఆలయం, టిప్పు సుల్తాన్ కోట చూపించి మళంపుళ దగ్గర వదిలేస్తాడు. మూడు వందలు. ఓకె అనుకొన్నాము.
ఉదయాన్నే ఏడు గంటలకు బయలుదేరి కలపాతి శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం చేరుకున్నాము.ఋతుపవనాలు వారం క్రిందటే కేరళలో ప్రవేశించాయి. కానీ ఇప్పుడు వర్షం లేదు.మబ్బు ఎండా, వేడి, చల్లదనం కానీ వాతావరణం నెలకొని ఉన్నది.
శ్రీ కలపాతి విశ్వనాధ స్వామి ఆలయం
నీలా నది ఒడ్డున ఉండే ఈ ఆలయం పాలక్కాడ్ పట్టణానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. పదిహేనో శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం గురించి ఆంగ్లేయులు పూర్తి సమాచారాన్ని సేకరించి గ్రంధస్థం చేసినట్లుగా తెలుస్తోంది.
శ్రీ వెంకటనారాయణ అయ్యర్ దంపతులు వారణాశి నుండి తీసుకొని వచ్చిన లింగాన్ని అప్పటి పాలక్కాడ్ పాలకుడు "ఇట్టి కొంబి అచ్చన్" ఇక్కడ ప్రతిష్టించి, చుట్టుపక్కల గ్రామాలను ఆలయ నిర్వహణ నిమిత్తం రాసి ఇచ్చారట ! ఈ సమాచారాన్ని ధ్వజస్థంభం దగ్గర ఉన్న శిలాశాసనం తెలుపుతుంది.మళయాళ దేశంలో ఉన్నా తమిళ ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు జరుగుతాయి. పూజారులు కూడా తమిళులే !స్థానికులకు ఈ ఆలయం వారణాసితో సమానం. నీలా నది ఒడ్డున గతించిన పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు.
మహాశివరాత్రి రధోత్సవం కేరళ రాష్ట్రంలో మరెక్కడా అంత వైభవంగా జరగదట. లక్షలాది మంది భక్తులు వస్తారట. గణపతి, షణ్ముఖుని, శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ కాశీ విశ్వనాధ స్వామిని దర్శించుకొని రెండో గమ్యం అయిన టిప్పు సుల్తాన్ కోటకు బయలుదేరాము. (ఈ ఆలయ పూర్తి వివరాలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి. )
టిప్పుసుల్తాన్ కోట
పేరుకే ఇది టిప్పు సుల్తాన్ కోట ! ఆయన కట్టించ లేదు. ఒక్కసారి మాత్రమే వచ్చారట. స్థానిక పాలకుడు "పాళియత్ అచ్చన్" జొమారిన్ రాజులకు సామంతుడు. వారు బలహీనపడుతున్న సమయంలో ఇతను తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకొన్నాడట. ధిక్కారాన్ని సహించని జొమారిన్ చక్రవర్తి పాలక్కాడ్ మీద దండయాత్ర ప్రకటించాడట. చక్రవర్తి సైన్యం ముందు నిలబడలేనని తెలుసుకొన్న అచ్చన్ మైసూరు పాలకుడైన "హైదర్ ఆలీ"(టిప్పు సుల్తాన్ తండ్రి)ని సహాయం అర్ధించాడట. ఎప్పటి నుండో ఈ ప్రాంతం మీద కన్నేసి ఉన్న హైదర్ ఆలి వెంటనే తన సేనలను పాలక్కాడ్ పంపారట. యుద్ధంలో గెలిచిన తరువాత హైదర్ ఆలి 1766వ సంవత్సరంలో ఒక కోటను నిర్మింప తలిచాడట. కానీ నిరంతరం ఆంగ్లేయులతో పోరాడాల్సిన పరిస్థితులు ఉండటం వలన వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన పాలక్కాడును కాపాడటానికి తాత్కాలికంగా ఈ కోటను నిర్మించాడట. పెద్ద కోటను నిర్మించడానికి తెప్పించిన రాళ్లను చూపించాడు అక్కడి గైడు.చాలా కాలం జరిగిన పోరాటాల తరువాత 1790వ సంవత్సరంలో కోట పూర్తిగా ఆంగ్లేయుల పరం అయ్యింది.
ప్రస్తుతం పురావస్తు శాఖవారి అధీనంలో ఉన్న కోట చుట్టూ పటిష్టమైన, ఎత్తైన గోడలు, నాలుగు మూలాల బురుజులు, చుట్టూ రక్షణ నిమిత్తం తవ్విన లోతైన కందకం. లోపల ఉన్న పురాతన గృహాలను పటిష్ట పరచి జిల్లా కేంద్ర చెఱసాలగా మార్చారు.కందకంపక్కన చక్కని ఉద్యానవనాన్ని, పిల్లలు ఆడుకోటానికి కావలసిన వస్తువులను అమర్చారు. ప్రవేశ ద్వారం గుండా లోపలి ప్రవేశిస్తే తొలుత అంజనా సుతుని ఆలయం కనిపిస్తుంది. నిత్యం ఎందరో భక్తులు వస్తుంటారు. (ఈ కోట పూర్తి వివరాలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి)
పార్కు, కోట పైభాగం, బురుజులు ఎక్కాము.నేటికీ చెక్కు చెదరని నాణ్యత గల నాటి నిర్మాణాలు అబ్బురపరిచాయి. కోట లోనికి ప్రవేశం ఉచితం. ఫోటోలు తీసుకోవచ్చును. మూసివేసిన తినుబండారాల మరియు ఆట వస్తువుల దుకాణాలు ఇక్కడికి సందర్శకులు ఎక్కువగానే వస్తుంటారన్న విషయాన్ని తెలిపాయి.
మా తదుపరి గమ్యం మళంపుళ ఆనకట్ట. అరగంటలో చేరిపోయాము.
మళంపుళ ఆనకట్ట
దూరానికి ఎత్తుగా ఠీవిగా కనపడుతోంది ఆనకట్ట. ప్రవేశద్వారం వద్ద నుండి ఆనకట్ట దాక చక్కని ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. వెలుపల, హోటళ్లు, తినుబండారాలు అమ్మే బళ్ళు, టీ దుకాణాలు చాలానే ఉన్నాయి. స్నేక్ పార్కు, రాక్ గార్డెన్, ఫాంటసీ పార్క్, సిఱువాణి ఆనకట్ట, ఆర్ట్ గ్యాలరీ, ఆక్వేరియం, బోటింగ్, రోప్ వే లాంటివి చాలా ఈ ప్రాంతంలో ఉన్నాయి అన్నది అక్కడ ఉన్న బోర్డులు చూసిన తరువాత అర్ధమయ్యింది.
ముందుగా స్నేక్ పార్క్ చూడాలని నిర్ణయించుకొన్నాము. మనిషికి ఇరవై రూపాయలు. వృధా కాదు. కింగ్ కోబ్రా దాకా ఎన్నో రకాల పాములను చూడవచ్చును, ఎన్నో కొత్త విషయాలను సర్పాల గురించి తెలుసుకోవచ్చును. తరువాత రోప్ వే ఎక్కి పార్క్ మొత్తం గగన వీక్షణం చేసాము. చక్కగా నిర్వహిస్తున్నారు.
మనిషికి పాతిక రూపాయల టికెట్టు కొనుక్కొని లోపలి ప్రవేశించాము. నలుదిక్కులా చక్కగా క్రమపద్ధతిలో పెంచిన మొక్కలు. కొన్ని పూలతో, మరికొన్ని రంగురంగుల ఆకులతో తమ సోయగాన్ని ప్రకటిస్తున్నాయి. గతంలో పిల్లల కోసం చిన్న రైలు నడిపేవారేమో ప్రస్తుతం పాడై పోయింది. పార్క్ లో ఉన్న ఆకర్షణలు ఎటుపక్క ఉన్నాయి అన్న వివరాలతో కూడిన సూచికలు అక్కడక్కడా అమర్చారు. మేము ముందు రోప్ వే లో కూర్చొని చూసినదాని ప్రకారం యక్షిణీ బొమ్మ, జపాన్ గార్డెన్స్, బోట్ రైడ్, వాటర్ ఫౌంటైన్, హంగింగ్ బ్రిడ్జ్ ఇలా అన్నీ చూసుకొంటూ ఆనకట్ట పైభాగానికి మెట్ల మార్గంలో చేరుకున్నాము.
సుమారు రెండు కిలోమీటర్ల పొడవు నాలుగు వందల అడుగుల ఎత్తుతో ఉండే ఈ ఆనకట్టను, కేరళలో రెండవ అతి పెద్ద నది అయిన భరత్ పుళ కు ఉపనది అయిన "మళం పుళ" మీద 1955వ సంవత్సరంలో ప్రారంభించారు. నది పేరే ఆనకట్టకు పెట్టారు. దీని వలన సుమారు యాభై వేల ఎకరాలకు సాగునీరు, పాలక్కాడ్ పట్టణంతో పాటు అనేక ప్రాంతాలకు త్రాగునీరు లభిస్తుంది. అప్పట్లో పాలక్కాడు మద్రాసు రాష్ట్రం క్రింద ఉండేదట.
ఆనకట్ట కు ఒక వైపున నీరు, దూరంగా మేఘాల దుప్పటి కప్పుకొన్న పచ్చని పర్వతాలు, మరో వైపున చక్కని ఉద్యానవనం. కన్నులకు గొప్ప ప్రకృతి విందు. మనస్సుకు ఆహ్లాదం. చాలా మనోహరంగా ఉన్నది దృశ్యం. కెమెరాలకు పని చెప్పాము.మా మాదిరి అక్కడికి వచ్చిన అందరూ చేస్తున్నది అదే !
నీటి మీదగా సాగుతూ చల్లగా తగిలే గాలి, కనుల ముందు పరవశింపచేసే దృశ్యాలు. అప్పటి దాకా నడక వలన కలిగిన అలసట ఎటుపోయిందో ? కదల బుద్ది కాలేదు. అలా చూస్తుండి పోయాము కొంతసేపు. కాలం మన చేతుల్లో లేదు కదా ! మధ్యాహన్నం రెండు గంటలు. క్రిందకి దిగి నడుచుకొంటూ పార్క్ వెలుపలికి వచ్చాము. ఎదురుగా ఉన్న హోటల్లో టిఫిన్ తిని, బస్సు ఎక్కి పాలక్కాడ్ కు బయలుదేరాము.
కుటుంబాలతో కేరళ విహార యాత్రకు వెళ్లే వారందరికీ నాది ఒక సలహా ! కొల్లం, కొచ్చిన్, గురువాయూర్, తిరువనంతపురం, మున్నారు ఇవే కాదు కేరళ అంటే ! పాలక్కాడ్ లాంటివి కూడా ఎన్నో ఆకర్షించే ఆకర్షణలు కలిగి వున్నాయి.వాటిని కూడా మీ జాబితాలో కలుపుకోండి. మనోహరమైన ఆనందాన్ని సొంతం చేసుకోండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి