16, జూన్ 2018, శనివారం

Malemalayanur





  శ్రీ అంగాలమ్మ పరమేశ్వరి ఆలయం, మేల్మలయనూర్ 

                                

                                                                                               



భారత దేశంలో ప్రజలకు ఆధ్యాత్మిక భావాలు అధికం. దైవశక్తి మీద భక్తి, విశ్వాసం మెండు. ఈ కారణంగానే ప్రతి గ్రామంలో ఒకటి కన్నాఎక్కువ ఆలయాలు కనపడతాయి. శివుడు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, హనుమంతుడు ఆదిగా గల దేవతలు అక్కడ కొలువై ఉంటారు. వీరే కాక గ్రామానికొక దేవత ఉండడం కూడా మనం చూడవచ్చును. 
గ్రామ దేవతగా వివిధ నామాలతో పిలుచుకునే ఈమె ఆదిశక్తికి ప్రతిరూపం. గ్రామస్థులను సకల కష్టాల నుండి కాపాడే దేవత.వారు ఆమెకు నిత్య పూజలతో పాటు పర్వదినాలలో ప్రత్యేక పూజలు, సంవత్సరంలో ఒక రోజు కొలుపులు, నివేదనలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరుపుతారు. 











ఎర్నిమాంబ, పుంతలో మల్లమ్మ, ఎర్ర పోచమ్మ, ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకొంటూ ఉత్సవాలు జరుపుకొంటుంటారు భక్తులు. కాలక్రమంలో భక్తులకు లభించిన దివ్యానుభూతుల కారణంగా కొన్ని క్షేత్రాలు విశేష ప్రాబల్యం లోనికి వస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి శ్రీ అంగాలమ్మ పరమేశ్వరి కొలువైన మేల్మలయనూర్. పంచభూత క్షేత్రాలలో అగ్ని క్షేత్రమైన తిరువణ్ణామలై (అరుణాచలం) కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న మేల్మలయనూర్లో అమ్మవారు కొలువు అవడం గురించి ఎన్నో గాధలు వినిపిస్తుంటాయి.














భర్త మాట కాదని, తండ్రి పిలవకున్నా యజ్ఞానికి వెళ్లి అవమానం పాలైనది అమ్మవారు. యాగ గుండంలో ప్రవేశించి శరీరాన్ని వదిలేసింది.
దక్షయజ్ఞంలో ఆత్మహుతి చేసుకొన్న దాక్షాయణి శరీరాన్నిభుజం మీద వేసుకొని లోకాలలో పిచ్చివానిగా తిరుగుతున్నాడు  కైలాసవాసుడు. ఆయనను తిరిగి మాములుగా చేయడానికి  శ్రీ మహావిష్ణువు సతీ దేవి శరీరాన్ని సుదర్శన చక్రంతో ఖండించడం గురించి మనందరికీ తెలుసు. అప్పుడు అమ్మవారి కుడి చెయ్యి పడిన ప్రదేశం ఇదేనని చెబుతారు. తదనంతర కాలంలో సృష్టి కర్త బ్రహ్మదేవుడు ఆనతి మేరకు దేవశిల్పి విశ్వకర్మ అప్సరస తిలోత్తమను సృష్టించాడట. ఆమెను చూసిన బ్రహ్మ వలపు మాయలో పడిపోయాడట ! బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అంటారు కదా ! దిక్కు తోచని తిలోత్తమ పార్వతీ దేవిని శరణు కోరిందట. అమ్మవారి ఆదేశం మేరకు రుద్రుడు విధాత అయిదో శిరస్సును వెయ్యిసార్లు ఖండించడానికి యత్నించి చివరికి కృతకృత్యుడయ్యాడట. అయిదో శిరస్సు పోవడంతో బ్రహ్మను అలుముకున్న మోహాంధకారాలు తొలగిపోయి ఆది దంపతులకు క్షమాపణలు చెప్పాడట. కానీ భర్తకు జరిగిన అవమానానికి ఆగ్రహించిన వాణీ పరమేశ్వరుని సర్వం మరచిపోయి భిక్షగాడిగా లోకాలలో సంచరించమని, పార్వతీదేవిని అందవిహీనంగా మారి పొమ్మని శపించినదట. ఆదిభిక్షువు బ్రహ్మ సహస్ర కపాలాలను హారంగా ధరించి కైలాసాన్ని వీడాడట. అమ్మవారు శ్రీ హరిని తరుణోపాయం కోరిందట. ఆయన ఆమెను తిరువణ్ణామలై లోని బ్రహ్మతీర్థంలో స్నానమాడితే సరస్వతి శాపము    తొలగిపోతుందని, పిమ్మట మేల్మలయనూర్ వెళ్లి అక్కడ స్థిర నివాసము ఏర్పాటు చేసుకోమని తెలిపారట. అక్కడికి బిచ్చగాని రూపంలో వచ్చే మహేశ్వరునికి బిక్షం పెట్టమని, దానితో ఆయనకు కూడా శాపవిమోచనం కలుగుతుందని చెప్పారట.











అమ్మవారు అదేవిధంగా తిరువణ్ణామలై చేరుకొని తీర్థంలో స్నానమాచరించి, అరుణాచలేశ్వరుని సేవించుకొని శాప ప్రభావాన్నితొలిగించుకొన్నారు. అక్కడ నుండి బయలుదేరి మేల్మలయనూర్ చేరుకొన్నారట. అక్కడ మత్స్యకారులకు సహాయము అందించారు. వారిని అనుగ్రహించడంతో వారు ఆమెను దేవీ రూపంగా గుర్తించారు. అంతా కలిసి ఆమెకొక ఆలయం నిర్మించి పూజలు చేయసాగరట. నేటికీ వారి వంశం వారే ఇక్కడ పూజారులు. 
శ్రీ మన్నారాయణను వాక్కు ఫలితంగా కైలాసనాధుడుదేశదిమ్మరిగా తిరుగుతూ చివరకు మేల్మలయనూర్ చేరుకొన్నారు.  అమ్మవారి చేతి నుండి కబళం తీసుకోవడంతో ఆయనను పట్టుకొన్న బ్రహ్మ హత్యా దోషం తొలగిపోయింది. అలా ఆదిదంపతులు తిరిగి మేల్మలయనూర్లో ఒక్కటి అయ్యారు అన్నది స్థల గాధ. 













పెద్ద పుట్టలో పంచ పడగల నాగ దేవత రూపంలో అమ్మవారు ఉండేవారట. తరువాత ప్రస్తుత మూలవిరాట్టును ప్రతిష్టించారు. పుట్ట ప్రాంగణంలోనే ఉంటుంది. అమ్మవారిని భక్తులు సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ రూపంలో, అన్నపూర్ణగా ఆరాధిస్తారు. ముఖ్యంగా సంతానం కొరకు, గ్రహ పీడల, ఆరోగ్యం కోసం ఎక్కువగా వస్తుంటారు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కొట్టించుకోవడం లాంటి సంతానానికి సంబందించిన ముచ్చట్లను అధికంగా చేస్తుంటారు. 
ప్రతి నిత్యం వేలాది భక్తులు అమ్మవారి దర్శనార్ధం తరలి వస్తుంటారు. మంగళ, గురు, శుక్రవారాలలో మహిళా భక్తులు ఎక్కువ వస్తుంటారు. నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి నెలా ఒక ఉత్సవం జరుపుతుంటారు. పదమూడు రోజుల పాటు జరిగే మాఘమాసం ఉత్సవాలు లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. అమావాస్యకి, పౌర్ణమికి ప్రత్యేక పూజలు జరుపుతారు.
భక్తులు సమర్పించుకున్న కానుకలతో సువిశాల ప్రాంగణంలో చక్కని ఆలయం ఏర్పడినది.
యాత్రీకుల కొరకు తగిన వసతులు ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. 
































ముఖ్యంగా స్త్రీలు అత్యంత భక్తి శ్రద్దలతో పొంగలి వండి నివేదన చేసుకొంటుంటారు. ఈ ప్రాంతాలలో ఎవరింట  వివాహం జరిగినా నవదంపతులను  అమ్మవారి దర్శనానికి తీసుకొని వచ్చి వారి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో గడపాలని కోరుకొంటారు.
ప్రధాన ఆలయానికి సమీపంలో శయనభంగిమలో ఉన్న పెరియ అమ్మన్ విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది.
ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల దాకా నిరంతరాయంగా భక్తుల సౌకర్యార్ధం ఆలయం తెరచి ఉంటుంది. దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిత్యాన్నదానం జరుగుతోంది. 
తలచినంతనే సకల పాపాలను తొలగించి, ఇహపర సుఖాలను అంతిమంగా ముక్తిని ప్రసాదించే దివ్యక్షేత్రం తిరువణ్ణామలై నుండి సులభంగా మేల్మలయనూర్ రోడ్డు మార్గంలో చేరుకోవచ్చును. అరగంట కొక బస్సు లభిస్తుంది.  ఉండటానికి అన్ని రకాల వసతులు తిరువణ్ణామలై లో లభిస్తాయి. 
నమః శివాయ !!!!      























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...