పాలక్కాడ్ కోట
టిప్పు సుల్తాను కట్టని టిప్పు కోట
= ఇలపావులూరి వెంకటేశ్వర్లు
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నేటికీ పాత కాలం నాటి శిధిల భవనాల మరియు నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిల్లో అధిక శాతం మట్టి నిర్మాణాలు. కానీ ఆ రోజుల్లో రక్షణ నిమిత్తం కొండ రాళ్లతో నిర్మించిన కోటలు కీలక ప్రాంతాలలో కనపడతాయి.
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నేటికీ పాత కాలం నాటి శిధిల భవనాల మరియు నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిల్లో అధిక శాతం మట్టి నిర్మాణాలు. కానీ ఆ రోజుల్లో రక్షణ నిమిత్తం కొండ రాళ్లతో నిర్మించిన కోటలు కీలక ప్రాంతాలలో కనపడతాయి.
మన రాష్ట్రం లోని గండికోట, కొండవీడు మరియు కొండపల్లి కోటలు ఆ కోవలోకి వస్తాయి. అలాంటి కీలక ప్రాంతంలో నాడు నిర్మించిన మరో కోట గురించి తెలుసుకొని ఈ మధ్యనే సందర్శించాము. అదే అప్పట్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు మైసూరు ప్రాంతాలకు ప్రవేశ ద్వారంగా పేర్కొన్న పాలక్కాడ్ లో మైసూరు సుల్తాను నిర్మించిన కోట. త్రిసూరులో పని ముగించుకొని కోయంబత్తూర్ వెళుతూ కొంత సమయం పాలక్కాడ్ నగరంలో ఉండటం జరిగింది.
మైసూరు పాలకుడు హైదర్ ఆలీ తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఎన్నో యుద్దాలు చేసాడని చరిత్ర చెబుతోంది. చాలా కాలం నేటి కేరళ లోని ఈ ప్రాంతాలు అతని ఏలుబడి లోనికి రాలేదు. అనుకోకుండా దగ్గరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతాన్ని తన అధీనం లోనికి తెచ్చుకొన్నాడు.
మైసూరు పాలకుడు హైదర్ ఆలీ తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఎన్నో యుద్దాలు చేసాడని చరిత్ర చెబుతోంది. చాలా కాలం నేటి కేరళ లోని ఈ ప్రాంతాలు అతని ఏలుబడి లోనికి రాలేదు. అనుకోకుండా దగ్గరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతాన్ని తన అధీనం లోనికి తెచ్చుకొన్నాడు.
హైదరాలీ రాకకు పూర్వమే ఇక్కడ ఒక నిర్మాణం ఉండేదట. కానీ అది అంత పటిష్టమైనది కాదు. తరచు సంభవించే యుద్దాల కారణంగా ఇది మరింత బలహీన పడిపోయిందట. అందువలన ఇక్కడ పటిష్టమైన రక్షణ నిర్మాణాన్ని నిర్మించాలన్న సంకల్పానికి వచ్చాడు హైదర్ ఆలీ.
ప్రస్తుతం కనిపిస్తున్న నిర్మాణాన్ని హైదరాలీ 1766వ సంవత్సరంలో నిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి.
అప్పట్లో జొమారిన్ పాలకులకు పాలక్కాడును పాలించే పాళియత్ అచ్చన్ సామంత రాజుగా ఉండేవాడు. జొమారిన్ సామ్రాజ్యం పతనావస్థకు చేరుకున్న సమయంలో స్వతంత్రాన్ని ప్రకటించుకొన్నాడు. అతనిని లొంగదీసుకోడానికి జొమారిన్ సైన్యం బయలుదేరింది. దానిని ఎదుర్కొలేనని తెలుసుకొన్న పాళియత్ మైసూరు పాలకుడు హైదరాలీని సహాయం అర్ధించాడు. అవకాశం కొరకు ఎదురు చూస్తున్నహైదరాలీ ససైన్యంగా వచ్చి పాళియత్ కు సహాయపడ్డాడు.
దానికి ప్రతిఫలంగా అతనికి స్థావరం నిర్మించుకోడానికి అనుమతిని ఇచ్చాడు పాళియత్.
కొత్తగా నిర్మించడానికి ప్రణాళికలను తయారు చేస్తూనే పాత దానిని పటిష్టపరిచాడట హైదర్ !
అలా అతను నిర్మించినదే నేడు మనం చూసేది. ఈ కోట 1790వ సంవత్సరం దాకా మైసూరు మరియు ఆంగ్లేయుల మధ్య చేతులు మారుతూ వచ్చింది. చివరికి ఆంగ్లేయులు ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనం లోనికి తీసుకున్నారు.
విశాల ప్రాంగణానికి నలుదిక్కులా ఎత్తైన పటిష్టమైన గోడలు ప్రతి మలుపు దగ్గరా పహారా కాయడానికి అనువుగా బురుజులు నిర్మించబడ్డాయి. చుట్టూ లోతైన కందకం త్రవ్వారు. ప్రవేశ ద్వారం వద్ద నిర్మాణ విశేషాలను తెలిపే బోర్డు పెట్టారు. ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న కోట లోనికి ప్రవేశించగానే తొలుత కనిపించేది పనసుత హనుమంతుడు. నిత్యం వందల మంది దర్శించుకొంటుంటారు.మంగళ మరియు శనివారాలలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
హైదర్ ఆలీ నిర్మించినా స్థానికంగా టిప్పు సుల్తాన్ కోట అని పిలుస్తారు. చిత్రమైన విషయం ఏమిటంటే టిప్పు సుల్తాన్ చాలా కొద్దీ సార్లే పాలక్కాడు ను సందర్శించడం జరిగింది అన్నది చరిత్రకారుల మాట. కోట నిర్మాణంతో అతనికి ఎలాంటి సంబంధం లేదని అంటారు. శాసనాలు కూడా అదే విషయాన్ని తెలుపుతున్నాయి.
చాలా కాలం ఇక్కడ వారాంతపు సంత జరిగేదట.ఆ కారణంగా "కోట సంత స్థలం" అని పిలవ బడుతోంది. ప్రస్తుతం రాజకీయ పక్షాల ఉపన్యాసాలకు, వివిధ ఉత్సవాలకు వేదికగా ఉపయోగపడుతోంది.
రెండున్నర శతాబ్దాల తరువాత కూడా చెక్కుచెదరక మరియు ఆకర్షణీయంగా ఉన్న పాలక్కాడు కోట జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చారిత్రక నిర్మాణాల పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పని సరిగా సందర్శించవలసినది పాలక్కాడు కోట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి