17, జూన్ 2018, ఆదివారం

Mellacheruvu


 శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయం, మేళ్లచెరువు


ఇదొక అద్భుత ఆలయం. అంటే తమిళనాడులో మాదిరి శిల్పకళ కనపడుతుంది అని కాదు. నెలకొన్న విశేషాల మూలంగా ! ఇలాంటి ఆలయ సందర్శనా భాగ్యం అరుదుగా లభిస్తుంది. 
తొలిసారి నేను పదిహేను సంవత్సరాల క్రిందట దర్శించుకొన్నాను. దురదృష్టవశాత్తు ఆ రోజు నా దగ్గర కెమెరా లేకపోయింది. ఉండి ఉంటే అప్పటి ఆలయ స్వరూపం నేడు కనిపిస్తున్న అభివృద్ధి అందరికీ చూపించగలిగే వాడిని. 
ఆలయ విషయం పక్కన పెడితే శివతత్వాన్ని సంపూర్ణంగా ప్రదర్శించే స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక అద్భుత అనుభవం. 

 












కొన్ని వందల  సంవత్సరాల క్రిందట ఇదంతా దట్టమైన అటవీ ప్రాంతం. చక్కని పచ్చిక బయళ్లతో నిండి ఉండేదట. అందువలన చుట్టుపక్కల ఉన్న పల్లెల లోని పశువుల కాపరులు తమ గోవులను మేతకు ఇక్కడికి తీసుకొని వచ్చేవారట. వాటిల్లో ఒక ఆవు ప్రతి రోజు వెళ్లి సమీపంలోని గుండ్రని శిల  మీద పొదుగు నుండి పాలను ధారగా వదిలేదట. అది ఒక అద్భుతంగా భావించిన పశువుల కాపరులు తమ గ్రామాధికారులకు తెలియచేశారట. వారు వచ్చి త్రవ్వి చూడగా శివలింగం బయల్పడినదిట. వారు భక్తి ప్రపత్తులతో చిన్న ఆలయం నిర్మించి నిత్యం పూజించుకోసాగారట. విషయం తెలిసిన ప్రాంత పాలకుడు వచ్చి స్వామిని దర్శించుకొని పెద్ద ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ నిమిత్తం ధనము, భూమిని సమర్పించుకున్నారని ఆలయంలో లభించిన శాసనాలు తెలుపుతున్నాయి. 












గర్భాలయంలో పానువట్టం మీద ఉపస్థితులైన శ్రీ శంభులింగేశ్వర స్వామి లింగరూపం అరుదైనది. మిగిలిన ఆలయాలకు భిన్నంగా శ్వేతవర్ణంలో ఉండే ఈ లింగం కైలాసవాసుని నివాసమైన హిమగిరులను తలపిస్తుంది. లింగం వెనుక కనపడే జడ ఆదిదంపతుల అసలు రూపమైన అర్ధనారీతత్వానికి నిదర్శనం. లింగం పైభాగాన చిన్న రంధ్రం ఉంటుంది. అది నిరంతరం జలంతో నిండి ఉంటుంది. ఇది గంగను శిరస్సున ధరించిన గంగాధరుని ప్రతిరూపం. ఈ జలాన్నే భక్తులకు తీర్థంగా ఇస్తారు. మరో విశేషమేమిటంటే శ్రీ శంభులింగేశ్వర లింగం పుష్కరానికి ఒక అంగుళం చొప్పున పెరుగుతోంది అని దానికి నిదర్శనంగా లింగం ముందు భాగంలో ఉన్న వృత్తాలను చూపిస్తారు. క్రిందది చిన్నగా ఉండగా అన్నిటి కన్నా పైనున్నది పెద్దగా ఉంటుంది. ఇన్ని విశేషాలున్న లింగం మరే క్షేత్రంలోనూ కనపడదు. 
అభిషేకానంతరం చందాన, కుంకుమ విభూతి లేపనాలతో అలంకరించిన శ్రీ శంభు లింగేశ్వర స్వామి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. 













అమ్మవారు శ్రీ ఇష్టకామేశ్వరీ దేవి ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. ప్రాంగణంలో నవగ్రహ మండపం, నాగ ప్రతిష్టలు ఉంటాయి. ఆలయ ప్రాంగణ వాయువ్య భాగంలో నూతనంగా రాహు కేతువుల సన్నిధులను ఏర్పాటు చేసారు. రాహుకేతువులు పూజలకు ప్రసిద్ధి ఈ క్షేత్రం.
పునః నిర్మించిన రాజగోపురం, ఆస్థాన మండపాలు శోభాయమానంగా కనపడతాయి. నిత్యం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి ఉండే ఈ ఆలయంలో నిత్యం నియమంగా అభిషేకాలు, అలంకరణ, అర్చన, ఆరగింపులు జరుపుతారు. 










మేళ్లచెరువు శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో అన్ని పర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు. వినాయక చవితి, నవరాత్రులు, ఉగాది తరువాత గొప్పగా జరిగేది శివరాత్రి ఉత్సవాలు. అయిదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. ఈ అయిదు రోజులలో ఎన్నో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. పురాణ ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎడ్ల పందాలు ఆడంబరంగా ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద పెద్ద ప్రభలను కట్టుకొని వస్తారు. ప్రభల వెలుగులతో రాత్రిళ్ళు పట్టపగళ్ళుగా మారిపోతాయి అంటే ఎంత ఘనంగా ప్రభలను కడతారో ఊహించవచ్చును.
 అనేక విశేషాల శ్రీ శంభులింగేశ్వర స్వామి శ్రీ ఇష్టకామేశ్వరీ దేవితో కలిసి కొలువైన మేళ్లచెరువు గ్రామం విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో వచ్చే కోదాడ పట్టణానికి దగ్గరలో ఉన్నది. సులభంగా చేరుకోవచ్చును.

నమః శివాయ !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...