కొండలలో నెలకొన్న కోనేటి రాయడు - 3
గతంలో మనం పావన కృష్ణవేణీ తీరంలో దేవదేవుడు కలియుగవరదుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన రెండు గుహాలయాల గురించి తెలుసుకున్నాము.
పుణ్య తీర్థ స్థలమైన కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో మరో దివ్య క్షేత్రంలో శ్రీవారు తన పూర్తి దివ్యమంగళ రూపంలోనే కాకుండా ఉభయ తాయారులతో కలిసి కొలువైన మూడవ గుహాలయం విశేషాలు తెలుసుకొందాము.
క్షేత్ర గాథ
శ్రీమన్నారాయణుడు కృష్ణాతీరంలో విహరిస్తూ తొలుత జూపూడి లో ఉన్న శ్రీగిరి మీద తరువాత వైకుంఠపురంలో క్రౌంచగిరి మీద తన అర్చారూపాలలో స్వయంవ్యక్థగా కొలువు తీరారు. అలా విహరిస్తూ స్వామి కర్లపూడి పర్వతం వద్దకు వెళ్ళినప్పుడు ఆ పర్వతకుడు స్వామికి సవినయంగా పాదాభివందనం చేసి కీర్తించి "స్వామీ తమరు నా శిఖరం మీద నివసించాలన్నకోరిక బలంగా ఉన్నది కానీ నేను తమరి స్థిరనివాసానికి తగిన శక్తిమంతుని కాను. సమీపంలోని "అనంతాద్రి" అనంతుని వరం పొందిన వాడు. ఆయన మీరు స్థిరనివాసం ఏర్పరుచుకోడానికి తగిన పర్వతరాజు" అని వినయంగా తెలిపారట.
సంతసించిన శ్రీనివాసుడు అతనిని ఆశీర్వదించి అనంతగిరి వద్దకు వెళ్లి పర్వత ఈశాన్య భాగంలో గల కొండ గుహలో స్వయంవ్యక్థగా అవతరించారు అన్నది స్థూలంగా క్షేత్రగాథ.
ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకులు అందరూ స్వామివారిని సేవించుకొని కైంకర్యాలు సమర్పించుకొన్నారని తెలుస్తోంది.
క్షేత్ర విశేషాలు
ఎత్తైన అనంతాద్రి ఈశాన్య భాగంలో ఉంటుంది ఆలయం. పర్వత పైభాగానికి చేరుకోడానికి సోపానమార్గం, రహదారి కూడా ఏర్పాటు చేశారు.
పర్వత పాదాల వద్ద శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి, శ్రీ పోతులూరి వీరబ్రహేంద్ర స్వామి ఆలయం ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో దూరప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యం కొరకు ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది.
దశాబ్దాలకాలం క్రిందట ఈ దేవస్ధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆధ్వర్యంలోనికి తీసుకొనబడినది. అప్పటి నుండి చక్కటి అభివృద్ధి కనపడుతోంది.
ప్రస్తుతం పురాతన మెట్ల మార్గాన్ని పునఃనిర్మిస్తున్నారు.
మెట్ల మార్గం పక్కన గోడ మీద బ్రహ్మకడిగిన దివ్య పాదాలను, ఆకాశరాజ పుత్రిక పద్మావతితో శ్రీవారి కల్యాణ చిత్రాలను మనోహరంగా చిత్రించారు.
ఆలయ ప్రాంగణం విశాలంగా భక్తులు దర్శనానికి వరుసలో నిలబడటానికి, సేదతీరడానికి వీలుగా పెద్ద షెడ్డు నిర్మించడం జరిగింది.
శ్రీవారు కొలువైన గుహకు అనుసంధానంగా నూతనంగా ఒక ముఖ మండపం నిర్మించారు. గుహాలయం లోనికి ప్రవేశించడానికి ఒక ద్వారం, దర్శనానంతరం తొక్కిసలాట లేకుండా వెలుపలికి రావడానికి మరో ద్వారం ఏర్పాటు చేశారు. ప్రవేశద్వారానికి ఇరుపక్కలా ద్వారపాలకులైన జయవిజయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు.
గుహ ఆదిశేషుని పడగల మాదిరి వంపు తిరిగి స్వామివారికి ఛత్రం పడుతున్నట్లుగా ఉంటుంది. అక్కడే శ్రీహరి ని కీర్తిస్తూ పాశురాలను గానం చేసిన పన్నిద్దరు ఆళ్వార్ల విగ్రహాలను చూడవచ్చును.
వైకుంఠపురం, జూపూడి ఆలయాలలో స్వామి వారి నేత్రాలు, శంఖుచక్రాలు మరియు తిరునామం మాత్రమే దర్శనం చేసుకొనే అవకాశం మాత్రమే లభిస్తుంది. కానీ ఇక్కడ శ్రీవారి దివ్యమంగళ రూపం సంపూర్ణంగా దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుంది. స్వామి పర్వత గుహలో వెల్లికిలా సేదతీరుతున్న భంగిమలో కనిపిస్తారు. పక్కనే దేవేరులు శ్రీదేవి మరియు భూదేవి కూడా అదే భంగిమలో కొలువై ఉంటారు.
పక్కనే స్వామివారికి ప్రీతికరమైన "తిరుప్పావై" రచించిన శ్రీ గోదాదేవి (శ్రీ ఆండాళ్)సుందర విగ్రహ రూపంలో దర్శనమిస్తారు.
గమనించవలసిన విషయం ఏమిటంటే వైకుంఠపురం, జూపూడి మరియు అనంతవరం గుహాలయాలలో శ్రీవారు మీసాలతో దర్శనమివ్వడం !
గుహాలయానికి ఎదురుగా అరుదైన "చిట్టి కేసరి" వృక్షం ఉంటుంది. ఉసిరి కుటుంబానికి చెందిన ఈ వృక్షం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నదని ఆయుర్వేదశాస్త్రం తెలుపుతోంది.
ప్రాంగణంలో ఉన్న చిట్టి కేసరి వృక్షాన్ని భక్తులు పూజిస్తారు. సంతానాన్ని ప్రసాదించే సంతాన లక్ష్మీగా విశ్వసిస్తారు. వృక్షానికి పూజచేసి ఊయల కడితే సంతానం లేనివారికి తొందరలోనే సత్సంతానం కలుగుతుంది అన్నది తరతరాల నమ్మకం.
పూజలు - ఉత్సవాలు
ప్రతి నిత్యం నిర్ణయించిన ప్రకారం పూజలు జరిగే ఈ క్షేత్రంలో శని మరియు ఆదివారాలలో భక్తుల సంఖ్య విశేషంగా ఉంటుంది.
ముఖ్యంగా శనివారాలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. శ్రీ వారిని శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు, శ్రీ సంతాన వేంకటేశ్వరుడు మరియు భక్తాభయ ప్రదాత గా కీర్తిస్తూ ఉంటారు. భక్తులు తమ మనోభీష్టలను విన్నవించుకోడానికి అదే విధంగా తమ కోర్కెలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ముడుపులు చెల్లించుకోడానికి వస్తుంటారు.
కళ్యాణం కుదిరిన వారు స్వామివారిని వివాహా పత్రిక తో ఆహ్వానించడానికి వస్తారు. సంతానాన్ని పొందినవారు బిడ్డలను శ్రీవారికి చూపించి ఆశీర్వాదం పొందేందుకు వస్తారు.
అన్ని హిందూపర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు. శ్రీవైష్ణవ ఆగమ విధానంలో నిర్ణయించిన ముఖ్య రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.
శ్రీ దేవి మరియు భూదేవి సమేతంగా శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన అనంత వరం లో ఫాల్గుణ మాసంలో మహాశివరాత్రి నుండి ఉగాది వరకు విశేష పర్వదినాలుగా నిర్ణయించి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని సందర్శించుకొని పంటలు బాగా పండినందుకు కృతజ్ఞతగా పొంగలి నివేదన చేస్తారు. వాహనపూజలకు ప్రసిద్ధి ఈ క్షేత్రం.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుతారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఆలయాభివృద్ది శీఘ్రగతిన జరుగుతోంది. కొద్దీ కాలంలోనే ఈ క్షేత్రం గొప్పదనం రాష్ట్రమంతా గుర్తిస్తుంది అన్న భరోసా కనపడుతోంది.
చక్కని పల్లె పరిసరాలు. పచ్చని వాతావరణం. ప్రశాంత ప్రకృతి. ఇలాంటి ఆహ్లాదకర ప్రదేశంలో చరాచర సృష్టికర్త సన్నిధిలో గడపడం నిజంగా మరువలేని జీవితకాల అనుభూతిని ప్రసాదిస్తుంది.
అనంతవరం ఊరిలో మరో రెండు విశేష పురాతన ఆలయాలు ఉన్నాయి.
అనంతాద్రికి దిగువన చిన్న గుట్ట మీద శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి దేవాలయం నిర్మించబడినది. సుందర దేవాలయం.
శివాలయం లేని ఊరు మనరాష్ట్రంలో కనిపించదు. అనంతవరంలో కూడా పురాతన శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయం ఉన్నది. ఆలయాన్ని చూడగానే తెలుస్తుంది ఎంత పురాతనమైనదో!
కొన్ని నూతన నిర్మాణాలు జరిగినప్పటికీ పురాతన నిర్మాణశైలి స్పష్టంగా కనపడుతుంది.
కొత్తగా వినిపిస్తున్న జన్మ నక్షత్ర ఆలయం జాబితాలో ఈ శివాలయం మృగశిర రెండవ పాదంలో జన్మించిన వారు దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలుస్తోంది.
ఇన్ని విశేషాలకు నిలయమైన అనంతవరం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఉన్నది. గుంటూరు, అమరావతి(పంచారామక్షేత్రం), అమరావతి(రాజధాని), విజయవాడ నుండి రహదారి మార్గంలో సులభంగా చేరుకోవచ్చును. విజయవాడ నుండి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.