శ్రీ గర్భరక్ష అంబిక ఆలయం
కైలాస నాధునికి పుడమిలో ఎన్నో ఆలయాలు నెలకొని ఉన్నాయి. వాటిల్లో ఒకే అంశం మీద పరమశివునికి ఉన్న ఆలయాలు మరే దేవతామూర్తికి లేకపోవడం విశేషం.
పంచ సభలు, పంచ భూత స్థలాలు, సప్త విదంగ స్థలాలు, సప్త స్థానాలు, సప్త మాంగై క్షేత్రాలు, ఆధార స్థలాలు, తిరుఓట్టం ఆలయాలు(కన్యాకుమారి దగ్గర), అష్ట వీరట్ట క్షేత్రాలు, పడాల్ పెట్ర స్థలాలు. తేవర వైప్పు స్థలాలు, పంచారామాలు ఇలా ఎన్నో కలవు, వీటిలో అధిక భాగం తమిళనాడులో ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఈ కోవ లోనివే తంజావూర్ చుట్టుపక్కల నెలకొని ఉన్న పంచారణ్య క్షేత్రాలు. .గతంలో ఒక్కో ప్రాంతం ఒక్కో రకమైన అటవీ ప్రాంతంగా ప్రసిద్ధి చెందినవి. అలా లయకారుడు కొలువైన ప్రాతంలోని అరణ్యాన్ని బట్టి అక్కడి చెట్ల పేరుతో ఆ క్షేత్రాన్ని అక్కడ వెలసిన స్వామిని పిలవసాగారు.
ఆ విధిగా ఏర్పడినవే ఈ పంచరణ్య క్షేత్రాలు. ఇవి వరుసగా 1. శ్రీ గర్భరక్షా అంబిక దేవాలయం, తిరుకరుగవూర్ 2. ఆవలివనల్లూరు సచ్చినాథర్ ఆలయం,తిరువారూర్ 3. హరిద్వారమంగళం పడాలేశ్వర ఆలయం, తిరువారూర్ 4. శ్రీ ఆపత్ సహాయేశ్వర ఆలయం, ఆలంగుడి 5. శ్రీ విల్వారణ్యేశ్వర ఆలయం,తిరుకొల్లంపుదూర్.
ఈ అయిదు ఆలయాలు నయనారులు గానం చేసిన తేవారాల వలన పడాల్ పెట్ర స్థలాలలో శాశ్విత స్థానం పొందాయి. శివారాధకులకు అత్యంత పవిత్రమైనవి ఈ క్షేత్రాలు. ఇవన్నీ తంజావూరు నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఒకదాని తరువాత ఒకటిగా నెలకొని ఉన్నాయి.
శ్రీ ఆపత్ సహాయేశ్వర స్వామి ఆలయం, ఆలంగుడి కుంభకోణం చుట్టుపక్కల ఉన్న నవగ్రహ క్షేత్రాలలో గురు క్షేత్రం.
శ్రీ గర్భరక్షా అంబిక దేవాలయం, తిరుకరుగవూర్
కావేరి నది నుండి ఏర్పడిన ఒక నీటి పాయను "వెన్నారు" అని పిలుస్తారు. దాని నుండి తీరంలో నివసించే ప్రజల మరియు వ్యవసాయ అవసరాల నిమిత్తం ఏర్పరచిన మరో కాలువ పేరు "వెట్టారు". ఈ నీటి పాయ దక్షిణ తీరంలో ఉంటుంది శ్రీ ముల్లవనై నాథర్ సమేత శ్రీ గర్భరక్షా అంబిక కొలువైన ఆలయం.
తిరుకరుగవూర్ అంటే "కరు" అనగా గర్భం, "క" అంటే రక్షించే ఊర్ అనగా ఊరు. గర్భాన్ని రక్షించే దేవి కొలువైన క్షేత్రంగా ఈ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో తిరుకలవూర్, మల్లెవనం, గర్భపురి, మాధవీపురం ఇత్యాది నామాలతో పిలవడేది అని శాసనాధారాల మరియు పురాతన గ్రంధాల ఆధారంగా తెలియవస్తోంది.
పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా మల్లె తీగలతో, మొక్కలతో ఉండేదట. అందువలన ముల్లై వనం (మల్లె వనం) అని పిలిచేవారట.
ఒకప్పుడు ముని వాటికగా పేర్కొన్న ఈ క్షేత్రంలో గౌతమ, గార్గేయ మహర్షులు అనేక సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేయడమే కాకుండా తమ శిష్యులకు విద్యాబోధన, మార్గదర్శకత్వం చేశారని స్థల పురాణం తెలుపుతోంది.
శ్రీ ముల్లై వననాథర్
మహర్షుల తపస్సుకు సంతసించిన ఈశ్వరుడు ఈ పవిత్ర ప్రదేశంలో వాల్మీకంలో అవతరించారనేది పురాణ గాథ. అందువలన స్వామివారికి ఎలాంటి అభిషేకాలు ఉండవు. పుష్పార్చన మరియు "పునుగు సత్తం" పేరిట పునుగు తైలం లింగంపైనా పులుముతారు. ఈ పునుగు సత్తం కి ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయని అంటారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు మరియు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారు ఎందరో పునుగు సత్తం కొరకు వస్తుంటారు. ఆలయం వారు దూరప్రాంతాల వారికి పోస్ట్ ద్వారాకూడా పంపుతారు.
మహర్షులు మల్లె తీగల మధ్య పుట్ట రూపంలో ఉన్న స్వామి వారిని వెలికితీశారట. ఈ కారణంగా నేటికీ లింగం పైన మల్లె తీగల గుర్తులు ఉండటాన్ని చూడవచ్చును. హారతి సమయంలో అర్చకులు క్షేత్రగాధ వివరిస్తూ వీటిని చూపిస్తారు. ఆలయ వృక్షం అయిన మల్లె తీగ గర్భాలయానికి వెలుపల ఉత్తరం పక్కన శ్రీ చెండికేశ్వర సన్నిధి వద్ద కనిపిస్తుంది.
నయనారులలో ప్రముఖులైన సంబందార్,సుందరార్ మరియు అప్పార్ శ్రీ ములై వననాథర్ ని కీర్తిస్తూ తేవర గానం చేశారు.
తమిళనాడు ఓని శైవ క్షేత్రాల సందర్శనంలో ఒక అలిఖిత నియమం అమలులో ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న తరువాతనే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అని.
పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు. ఈ కారణంగానేమో ఇక్కడ అమ్మవారి ప్రభావం అధికం.
శ్రీ గర్భ రక్ష అంబిక
మునివాటిక అయిన ఈ క్షేత్రంలో మహర్షులకు సకల సదుపాయాలను ఒక బ్రాహ్మణ దంపతులు చూసేవారట. వారు ఎంత భక్తి శ్రద్దలతో మునులను సేవిస్తున్నా , ఆదిదంపతులు ఆరాధిస్తున్నా సంతానం లేకపోవడం బాధించేదట. మహర్షులు దంపతులను పూర్తి విశ్వాసంతో మండల కాలం అమ్మవారిని సేవించమని సలహా ఇచ్చారట.
ఆ విధంగా\చేసిన దంపతులకు అమ్మవారు స్వయంగా నేతి పాత్ర ఇచ్చి మండల కాలం వారిని సేవించామన్నారట. నలభై రోజుల తరువాత బ్రాహ్మణుని భార్య గర్భం దాల్చిందట. కానీ వారి పూర్వజన్మ కర్మఫలం మూలంగా మరికొన్ని కష్టాలు వారిని వెంటాడాయట. అవన్నీ అమ్మవారి కృపతో తొలగిపోయాయట. సరిగ్గా ఆమెకు నెలలు నిండి ప్రసవ సమయంలో భర్త దూర ప్రాంతానికి వెళ్లారట. అలసటతో నిద్రిస్తున్న ఆమెకు ప్రసవవేదన ఆరంభమైనదట. బాధ తట్టుకోలేక ఆమె శ్రీ గర్భ రక్ష అంబికను ప్రార్ధించినదట. అమ్మవారు సాక్షత్కరించి ఆమె గర్భంపైన ఆముదం రాయడంతో సుఖ ప్రసవం జరిగినదట.
నేటికీ ఆలయంలో అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించిన ప్రత్యేక నేతిని, ఆముదాన్ని సంతానం లేనివారికి, సుఖప్రసవం కొరకు ఇస్తారు. ప్రతి నిత్యం అనేక మంది సంతానాన్ని కోరుకుంటూ అమ్మవారికి పూజలు చేయించుకొని నేతిని, ఆముదాన్ని తీసుకొనివెళుతుంటారు. దూర ప్రాంతాలవారికి నిర్ణయించిన పైకం చెల్లిస్తే పోస్ట్ ద్వారా పంపుతారు.
అలా శ్రీ గర్భ రక్ష అంబిక పేరు మీద పిలవబడుతోంది.
బ్రాహ్మణ దంపతుల కష్టాలు అక్కడితో ఆగలేదు. పిల్లవాడికి కడుపు నిండా పాలు ఇవ్వలేక పోయిందట ఆ తల్లి. మరోసారి అమ్మవారు వారి మీద తన దయను చూపించిందట. ఇంద్ర లోకం నుండి కామధేనువు ను రప్పించి, ధేనువు పాలతో బిడ్డ కడుపు నింపిందట. ఆలయం వెలుపల ఉన్న "క్షీర పుష్కరణి" కామధేనువు పాలతో ఏర్పడినదిగా చెబుతారు. క్షీర పుష్కరణి, వెట్టారునది కాకుండా శ్రీ బ్రహ్మ తీర్థం, సత్య తీర్థం కూడా ఆలయంలో కనిపిస్తారు. ఆలయ కార్యక్రమాలకు వీటి జలాన్నే ఉపయోగిస్తారు.
ఆలయ విశేషాలు
తూర్పు ముఖంగా ఉండే ఆలయానికి రెండు ప్రాకారాలు ఉన్నాయి. తొలి ప్రాకారానికి తూర్పున అయిదు అంతస్థుల రాజగోపురం మరియు దక్షిణాన మరో చిన్న గోపురం ఉంటాయి. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ, పక్కనే కొబ్బరి చెట్లు. చాలా ఆహ్లాదకర వాతావరణం కనపడుతుంది.
చరిత్రకారుల ప్రకారం శివ గాయక భక్తులైన నయనారులు సుమారు ఏడో శతాబ్దానికి చెందినవారు అని తెలుస్తోంది.
ఆ ప్రకారం శ్రీ గర్భ రక్ష అంబికా సమేత శ్రీ ముల్లై వననాథర్ అంతకన్నా ముందు నుంచే ఉన్నది అన్నది స్పష్టం అవుతుంది. ప్రస్తుత ఆలయం చోళ రాజుల కాలంలో వివిధ సమయాలలో నిర్మించినట్లు ఆలయ ప్రాంగణంలో ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి.
శ్రీ గర్భ రక్ష అంబికా సమేత శ్రీ ముల్లై వననాథర్ ఆలయం అనేక విశేషాలకు నిలయం గా పేర్కొనాలి.
ప్రధమ పూజ్యుడు, ఆది దంపతుల ముద్దు బిడ్డడు శ్రీ వినాయకుడు. తమిళనాట ప్రతి ఆలయం లోనూ రెండుకు మించి శ్రీ గణపతి సన్నిధులు కనపడతాయి.అవన్నీ ప్రతిష్ఠిత మూర్తులే! !
ఇక్కడ కూడా రెండు సన్నిధులు మూషిక వాహనునివి కనిపిస్తాయి. శ్రీ కర్పగ వినాయకుడు స్వయం భూ అని చెబుతారు.ఆలయ నైరుతిదిశలో దిక్పాలకుడు మరియు మన గత కర్మలను, మన పూర్వీకుల కర్మలకు తగిన ఫలితాన్ని చూపే నైరుతి సన్నిధి ఉంటుంది. పక్కనే శ్రీ నైరుతి వినాయక సన్నిధి కూడా కనపడతుంది. వీరిరువురినీ పూజిస్తే మన పూర్వీకులతో పాటు మన కర్మ ఫలం తొలగిపోతుంది అన్నది స్థానిక విశ్వాసం.
దేవసేనాని,పార్వతీపరమేశ్వరుల ద్వితీయ కుమారుడు శ్రీ కుమారస్వామి.సహజంగా తల్లి తండ్రుల మధ్య కుమారుడు కూర్చున్న విధానాన్నిశ్రీ సోమస్కంద దర్శనం అని పిలుస్తారు.
అలాంటిది ఎక్కువగా శివాలయాల లోని ఉత్సవమూర్తుల ద్వారా లభ్యమవుతుంది.
తిరుకగవూర్ లో మాత్రం శ్రీ ముల్లై వననాథర్ మరియు శ్రీ గర్భ రక్ష అంబిక సన్నిధుల మధ్య శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం ఉండటం విశేషం.తమిళనాడులో మరెక్కడా ఇలాంటి విశేషం కనపడదు.
ప్రతి శివాలయంలో నవగ్రహ మండపం తప్పనిసరిగా ఉంటుంది.మండపంలో నవగ్రహాలు వివిధ దిక్కులకు తిరిగి కొలువై ఉంటారు. కొన్నిచోట్ల వాహనం మరియు దంపత సమేతంగా నవగ్రహాలు దర్శనమిస్తారు. కానీ ఈ క్షేత్రంలో ఎనిమిది గ్రహాలూ మధ్యలో ఉన్న శ్రీ సూర్య నారాయణస్వామి వైపుకు తిరిగి ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇలాంటి నవగ్రహ మండపం మరెక్కడా కనిపించదు. ఆదివారాల్లో ఇక్కడ నవగ్రహ పూజ చేయించుకొంటే సకల శుభాలు జీవితాలలో లభిస్తాయని అంటారు.
ఆరు మరియు ఏడవ శతాబ్దాలకు చెందిన అరవై మూడు మంది శివ గాయక భక్తులను నయనారులు అని పిలుస్తారు. వీరిలో ప్రథమస్థానంలో ఉన్నవారు శ్రీ అప్పార్ , శ్రీ సంబందార్ మరియు శ్రీ సుందరార్.వీరందరూ గానం చేసిన తేవారాల గ్రంధాన్ని"తిరుమూరై"అని పిలుస్తారు. వీరి సన్నిధులు ప్రతి ఆలయంలో కనపడతాయి. ప్రత్యేక రోజులలో ఒకొక్క నయనార్ కి విశేష పూజలు ముఖ్యంగా వారి జయంతి, పుణ్య తిధి లలో ఇవి నిర్వహిస్తారు.
చిత్రంగా అరవై మూడు మంది నయనారులలో లేని శ్రీ మాణిక్యవాచకార్ ని ప్రథమస్థానంలో ఉన్న ముగ్గురితో కలిపి వారిని"నలువర్"అని పిలుస్తారు. కారణం శ్రీ వైష్ణవ క్షేత్రాలలో ధనుర్మాసంలో ఆండాళ్ రచించిన"తిరుప్పావై"గానం జరుగుతుంది. అదే విధంగా అవే రోజులలో తమిళనాడు లోని శివ క్షేత్రాలలో శ్రీ మాణిక్యవాచగర్ రచించిన"తిరువెంబావై"గానం చేస్తారు.తిరువెంబావైని స్వయంగా విని శ్రీ చిదంబర నటరాజస్వామి తమ ఆమోద ముద్ర వేశారని అంటారు.శ్రీ మాణిక్య వాచకార్ తిరువెంబావై ని తిరువణ్ణామలై లో రచించారు. వీరి సన్నిధి గిరి ప్రదక్షిణ మార్గంలో శ్రీ ఆది అణ్ణామలై ఆలయానికి దగ్గరలో ఉంటుంది.
తిరుకగవూర్ లో ప్రత్యేకంగా నయనారులతో పాటు నలువర్, మరో ప్రముఖుడైన శ్రీ చక్కిలార్ నయనార్ సన్నిధులు ఉండటం విశేషం. వీరితోపాటు శ్రీ కర్పగ వినాయక, శ్రీ నటరాజ, శ్రీ సోమస్కంద మూర్తి, శ్రీ బ్రహ్మ,శ్రీ దుర్గ, శ్రీ చెండికేశ్వర, శ్రీ అర్ధనారీశ్వర, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ సంతాన నంచియారి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ ఆర్ముగం ఉపాలయాలలో ఉపస్థితులై దర్శనమిస్తారు.
దక్షిణ పక్కన వసంత మండపం మరియు ఉద్యానవనం కనిపిస్తాయి.
రెండవ ప్రాకారంలో ఆది దంపతుల ఆలయాలు పక్కపక్కనే ఉంటాయి. స్వామి వారికి ఎదురుగా శ్రీ నందీశ్వరుడు, బలిపీఠం, నటరాజ మండపం మరియు యజ్ఞశాల కూడా సమీపంలో కనపడతాయి.
అమ్మవారు శ్రీ గర్భ రక్ష అంబిక ప్రత్యేక సన్నిధిలో నిలువెత్తు రూపంలో స్థానక భంగిమలో భక్తులను అనుగ్రహిస్తారు. నయన మనోహరమైన అలంకరణలో దేవి రూపం అద్భుతంగా ఉండటమే కాదు భక్తుల మదిలో నెలకొని ఉన్న ఆర్తిని, నిరాశ నిష్స్ప్రుహలను తొలగిస్తుంది.
అమ్మవారి వద్ద నిమ్మకాయల దొప్పలలో నేటి దీపాలను వెలిగిస్తే సరైన సమయంలో వివాహం జరుగుతుంది అన్నది స్థానిక విశ్వాసం.
అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజల తరువాత భక్తులకు ఇచ్చే నేతిని నలభై ఎనిమిది రోజుల పాటు రాత్రి పూత సంతానం లేని దంపతులు స్వీకరిస్తే తప్పక సంతానం కలుగుతుంది అన్నది ఎందరో దంపతుల స్వానుభవం. గర్భ సమయంలో తలెత్తి ఇబ్బందులను తొలగించి సుఖప్రసవం జరగడానికి ఆలయంలో ప్రత్యేక ఆముదం ఇస్తారు. దానిని గర్భం మీద నియమంగా రాస్తే గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సుఖ ప్రసవం అవుతుంది.
శ్రీ ముల్లై వననాథర్ కి అలిమిన పునుగు తైలాన్ని స్వీకరిస్తే ఎలాంటి ఆరోగ్యసమస్యలు అయినా తొలగిపోతాయని చెబుతారు.
ఈ మూడింటిని నిర్ధారించిన సొమ్ము కడితే కావలసిన వారి పేరు మీద పూజ చేసి అందిస్తారు. వెళ్లలేనివారు డబ్బు పంపితే పోస్టు ద్వారా కూడా పంపుతారు.
వివాహం జరిగిన తరువాత లేక గర్భం దాల్చి సంతానాన్ని పొందిన తరువాత భక్తులు దర్శనానికి బంధు సమేతంగా తరలి వచ్చి అభిషేక, అర్చన, అలంకరణ, వస్త్ర సమర్పణ లేక తులాభారం లాంటి వాటిని సమర్పించుకుంటారు.
సంతానం పొందిన వారు ఒక ప్రత్యేకమైన సేవ చేస్తారు. పుట్టిన బిడ్డను ఆలయంలో నిర్ణయించిన పైకం చెల్లించి బంగారు ఊయలలో ఉంచి అమ్మవారి సన్నిధి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. "తంగ తొట్టి ప్రార్ధన" అని పిలుస్తారు. పిల్లల పుట్టు వెంట్రుకలను సమర్పిస్తారు. చెవులు కుట్టించే ఏర్పాటు కూడా ఆలయంలో కలదు.
ఆలయంలో చాలా చోళ రాజుల శాసనాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా పదవ శతాబ్దం నుండి పద మూడవ శతాబ్దం వరకు వారు ఆలయానికి సమర్పించిన కైంకర్యాల వివరాలు తెలుపుతాయి.
ఆలయ ఉత్సవాలు
ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో నియమంగా నాలుగు పూజలు జరుగుతాయి.
నెలకొక ఉత్సవం జరుపుతారు. వీటిల్లో వైశాఖ మాసంలో చేసే ఉత్సవం ముఖ్యమైనది. ప్రతి నెల త్రయోదశి ప్రదోషం, అమావాస్య, పౌర్ణమికి, మాస శివరాత్రికి ప్రత్యేక పూజలు చేస్తారు.
మహా శివ రాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు పక్క రాష్ట్రాల నుండి కూడా తరలివస్తారు .
వినాయక చవితి, స్కందషష్ఠి, నయనారుల ఆరాధన, ఫాల్గుణి ఉత్తరాయణం, కార్తీక మాస పూజలు లాంటి వాటితో పాటు ఆషాడ మాస పూజలు, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
పంచ అరణ్య క్షేత్రాలలో మొదటిగా దర్శించవలసినది శ్రీ గర్భ రక్ష అంబికా సమేత శ్రీ ముల్లై వననాథర్ కొలువైన తిరుకరుగవూర్. ఆ తరువాత వరుసగా ఆలంగూడి, అవలివనల్లూరు, హరిద్వార మంగళం, తిరుకొల్లంపుదూర్ సందర్శించుకోవాలి.
తిరుకరుగవూర్ లో ఎలాంటి వసతి సౌకర్యాలు లభించవు. దేవస్థానం తరుఫున అన్నదానం జరుగుతుంది. తగిన వసతి సౌకర్యాలు తంజావూరు లేదా కుంభకోణం లో లభిస్తాయి.
ఈ విశేష క్షేత్రం తంజావూరు నుండి కుంభకోణం వెళ్లే దారిలో ఉంటుంది. చక్కని ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయి. ఒకే రోజులో పంచ అరణ్య క్షేత్రాలను సందర్శించుకోవాలంటే ప్రెవేటు వాహనాన్ని మాట్లాడుకొని వెళ్లడం ఉత్తమం.
నమః శివాయ !!!!
(కావలసిన చిత్రాలను అందించిన మిత్రులకు కృతఙ్ఞతలు )
. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి