11, మార్చి 2024, సోమవారం

Pata Shivalayam, Vijayawada

 

           శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయం 

                                    ( విజయవాడ పాత శివాలయం )


పావన కృష్ణానది మహారాష్ట్రలో ఉద్భవించినది మొదలు ఆంధ్రప్రదేశ్ లో సాగర సంగమం చేసే వరకు ప్రవాహ మార్గాన్ని సస్యశ్యామలం చేయడమే కాకుండా తన తీరాలను ఆధ్యాత్మిక క్షేత్రాలుగా రూపొందించుకొన్నది. 
ఈ కారణంగా కృష్ణా తీరాలలో హిందూ ఆలయాలే కాదు బౌద్ధుల మరియు జైనుల నివాస ఆనవాళ్లు కూడా పెక్కు చోట్ల కనిపిస్తాయి. 
ముఖ్యంగా హిందూ దేవాలయాలు లెక్కకు మిక్కిలిగా నెలకొని ఉండటం చూడవచ్చును. వివిధ దేవీదేవతలు స్థిరవాసాలైన ఈ ఆలయాలలో ఒకటి విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రి పైన కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి. 














శ్రీ మల్లేశ్వర స్వామి సమేతంగా సమస్త శివ పరివారం కొలువైన ఈ క్షేత్ర పురాణ గాథ తొలి యుగం నాటిదిగా తెలుస్తోంది. ద్వాపర యుగంలో పాండవ మధ్యముడైన అర్జునునికి కైలాసనాధుడైన పరమశివునికి యుద్ధం జరిగిన స్థలం ఇదేనని ఆ కారణంగా విజయవాటిక అన్న పేరు వచ్చింది అంటారు. అనంతర కాలంలో విజయవాడ గా మారింది అని చెబుతారు. కిరాతక రూపంలో ఉన్న మహేశ్వరునితో పోరు సల్పిఅర్జనుడు  "విజయ" నామం పొందిన ప్రదేశం ఇదే అని పురాణాలు పేర్కొంటున్నాయి. పరమేశ్వరుని నుండి పాశుపతాస్త్రం పొందిన అర్జనుడు ఇంద్ర కీలాద్రి పర్వత పాదాల వద్ద శ్రీ విజయేశ్వర స్వామిని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా శ్రీ బ్రహ్మాస్త్రా దేవి సన్నిధి ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  
తెలుగు రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం అమ్మల గన్న అమ్మ శ్రీ కనక దుర్గమ్మ ! ప్రతి నిత్యం వేలాదిగా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు దర్శనానికి వస్తుంటారు. పర్వదినాలలో, నవ రాత్రులలో, భవాని దీక్షల సమయంలో ఆ సంఖ్య లక్షలలో ఉంటుంది. 
వ్యాపారానికి, విద్యలకు ప్రసిద్ధికెక్కిన విజయవాడ నగరంలో మరెన్నో పురాతన ఆలయాలు కలవు. ఇంద్రకీలాద్రి పర్వత పాదాల వద్ద ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వాటిల్లో ఒకటి. 
విజయవాడ ఒన్ టౌన్ లో ఉన్న ఈ  పురాతన ఆలయం పాత శివాలయంగా ప్రసిద్ధి. పర్వత పాదాల వద్ద ఉండటం , పాండవ మధ్యముని పూజలు అందుకోవడంతో గతంలో "పాద శివాలయం" అని పిలిచేవారట. కాలక్రమంలో పాత శివాలయం గా పిలవబడుతోంది. కొన్ని వందల సంవత్సరాల పురాతన చరిత్ర మరియు పౌరాణిక పాశస్త్యం కలిగిన దేవాలయాన్ని పాత శివాలయం అని పిలవడం సమంజసమే అనిపిస్తుంది. 
విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయం శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవాలయం. 









పురాణ గాథ 

ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో కృష్ణాతీరంలో శ్రీ కనక దుర్గాదేవి సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లను సేవించుకొన్నారని తెలుస్తోంది. వారు కొంత కాలం ఇక్కడే నివసించారని ఆ సమయంలో పాండవాగ్రజుడు శ్రీ ధర్మరాజు పర్వత పాదాల వద్ద ఒక శివలింగాన్ని ప్రతిష్టించారట. అదే నేటి పాత శివాలయం. 
అనంతరకాలంలో అర్జనుడు ఇంద్రకీలాద్రి వద్ద తపస్సుచేసి పరమేష్ఠి నుండి పాశుపతాస్త్రం పొందారన్నది వేరే కథ. ఇక్కడ తపసు చేసిన సమయంలో పార్ధుడు నిత్యం ధర్మరాజ ప్రతిష్ఠిత శ్రీ మల్లేశ్వర స్వామిని నిత్యం పూజించేవారట. 
ఈ వివరాలన్నీ అనేక మంది పెద్దలు రచించిన క్షేత్ర గాథలలో కనిపిస్తాయి. 








ఆలయ ప్రత్యేకతలు  

పాత శివాలయ సందర్శన ఒక పుణ్య తీర్థ క్షేత్రాల సందర్శనతో సమానం అని పిలవాలి. కారణం ఏమిటంటే ఎన్నో ఉపాలయాల సమాహారం ఈ క్షేత్రం. ప్రతి ఉపాలయానికి ఒక ప్రత్యేకత కలిగి ఉండటం విశేషం. 
శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు. 
శ్రీ గణపతి, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ షణ్ముఖుడు, శ్రీ ధర్మశాస్త, శ్రీ భూదేవి శ్రీదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ లక్ష్మీనరసింహుడు, శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడు, శ్రీ ఆంజనేయుడు, శ్రీ రామా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ చండికేశ్వరుడు, శ్రీ షిర్డీ సాయిబాబా, శ్రీ కేతేశ్వర మహారాజ్ ఆదిగాగల దేవీదేవతలు వివిధ సన్నిధులలో దర్శనమిస్తారు. 
చాలా తక్కువగా కనిపించే మరో కొన్ని విశేషాలు విజయవాడ పాత శివాలయంలో కనిపిస్తాయి. 
శివ లింగాలలో అతి పవిత్రమైనది, ఇష్టకామ్యాలను నెరవేర్చింది బ్రహ్మ సూత్రం ఉన్న లింగం అని పెద్దలు సెలవిచ్చారు. బ్రహ్మ సూత్రం ఉన్న లింగాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. పాత శివాలయంలో ప్రధాన గర్భాలయంలో కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామి వారి తో సహా శ్రీ చంద్రమౌలీశ్వర స్వామి, శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామిగా వివిధ నామ లింగాల రూపాలలో సర్వేశ్వరుడు దర్శనమిస్తారు. విశేషం ఏమిటంటే ఈ అయిదు లింగాలు వివిధ బ్రహ్మ సూత్రాలు కలిగి ఉండటం. అనేక శివలింగాలు నెలకొని ఉన్న ప్రముఖ దేవాలయాలలో కూడా ఇలాంటి లింగాలు కనిపించవు. మరో ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మృత్యుంజయేశ్వర లింగానికి భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసుకొనే అవకాశం లభిస్తుంది. 














ఎవరైనా జాతక రీత్యా కుజ దోష ప్రభావం కలిగి ఉంటే నివారణార్ధం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
ఆలయ ప్రాంగణంలో శ్రీ ధర్మశాస్త సన్నిధి పక్కన అశ్వద్ధ వృక్షం ఉంటుంది. అక్కడ నాగ ప్రతిష్టలు కనపడతాయి. 
శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి సన్నిధిలో ఒక పక్కన గణపతి మరో పక్కన అమ్మవారు ఉపస్థితులై ఉంటారు.  ఇదికూడా మరెక్కడా కనిపించని విశేషమే !
శ్రీ భ్రమరాంబా దేవి విడిగా ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. చతుర్భుజాలతో, ఉపస్థిత భంగిమలో ప్రసన్నవదనగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్యుల వారు అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రాన్ని స్థాపించారు. అమ్మవారికి ఒక పక్కన శ్రీ మహాలక్ష్మి మరో పక్కన శ్రీ సరస్వతి దేవి కొలువై దర్శనమివ్వడం అరుదుగా కనిపించే విశేషం. ఆలయ ఆగ్నేయ మూల ఉన్న శ్రీ కాత్యాయని ఇష్ట కామేశ్వరి దేవి సన్నిధి వద్ద నేతి దీపం వెలిగించి, దానిని చేతిలో ఉంచుకొని అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణాలు చేస్తే గుణవంతుడు, కోరుకొన్నవాడు భర్తగా లభిస్తారన్నది తరతరాల విశ్వాసం. 
శ్రీ రామేశ్వర స్వామి లింగాన్ని రామేశ్వరం నుండి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి లింగాన్ని వారణాశి నుండి   తీసికొనివచ్చి ప్రతిష్టించినట్లు తెలుస్తుంది. 

ఆలయ విశేషాలు 

తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి స్థూపాకారంలో నిర్మించిన నాలుగు అంతస్థుల రాజ గోపురం సుందరంగా   కనిపిస్తుంది. ప్రత్యేకమైన శిల్పకళ కనపడదు. 
ప్రస్తుత ఆలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దం (808 నుండి 847 సంవత్సరాల మధ్యకాలంలో) లో రాష్ట్రకూట రాజులు నిర్మించినట్లు శాసనాధారాలు తెలుపుతున్నాయి. ఆ తరువాత ఎన్నో రాజవంశాలు, పాలకులు ఆలయాభివృద్దికి తమవంతు కృషి చేసినట్లుగా క్షేత్ర గాథ ద్వారా తెలియవస్తోంది. 
రాజగోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా బలి పీఠం ధ్వజస్థంభం కనిపిస్తాయి. గతంలో ధ్వజస్థంభం పునః ప్రతిష్టాసమయంలో త్రవ్వకాలు జరపగా శ్రీ కాలభైరవ విగ్రహం లభించినది. శ్రీ కాలభైరవుని అక్కడే ప్రతిష్టించారు. 
చిన్న ప్రాంగణంలో కిక్కిరిసినట్లు ఉంటాయి ఉపాలయాలు. అక్కడే అనేకమంది బ్రాహ్మణులు జపాలు చేస్తూ కనిపిస్తారు. భక్తులు తమ జాతకరీత్యా ఏర్పడిన గ్రహ దోషానికి ఇక్కడ జపాలు, దానాలు మరియు శాంతులు జరిపించుకొంటుంటారు. ప్రతి నిత్యం ముఖ్యంగా సోమవారాలలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ప్రదక్షిణాపధంలో వరుసగా ఉపాలయాలు వస్తాయి. ఈ ఆలయానికి ఉన్న మరో విశేషం ఏమిటంటే ఉత్తర ద్వారం కలిగి ఉండటం. అనగా ప్రతినిత్యం ఉత్తర ద్వార దర్శనం లభిస్తుంది. ఆ ద్వారం పక్కనే కొద్దిగా లోపలి ఆలయంలో లభించిన శాసనాలు ఉంటాయి. 
ఆంధ్రప్రదేశ్ లో అతి తక్కువగా కనిపించే శ్రీ చెండికేశ్వర స్వామి సన్నిధి ఇక్కడ గోముఖి వద్ద ఉంటుంది. పక్కనే నాగ శిల్పాలు, పంచలోహ ఓంకారం మరియు త్రిశూలం ఉంటాయి. ఇవన్నీ వివిధ కాలాలలో నిర్మించడం వలన ఒకవరుసలో ఉన్నా కూడా ఒక క్రమపద్ధతి కనపడదు. కిక్కిరిసినట్లుగా ఉంటుంది.  అయినా ఇందరు దేవీదేవతలు ఒకే ప్రాంగణంలో దర్శించుకొని భాగ్యం ముందు ఇవన్నీ కూడా పట్టించుకోవలసిన అవసరం ఈ మాత్రం లేదు. అక్కడ లభ్యమయ్యే ప్రశాంతతను, ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదించడమే మనం చేయవలసినది. 

ఆలయ ఉత్సవాలు 

భక్తుల దర్శనార్ధం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఆలయంలో నియమంగా అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు మరియు ఆరగింపులు జరుగుతాయి. 
పౌర్ణమికి, అమావాస్యకు, మాస శివరాత్రికి, త్రయోదశికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
కార్తీక మాస పూజలు, శివరాత్రి, నవ రాత్రులు, గణపతి నవ రాత్రులు, శ్రీ నృసింహ జయంతి, సుబ్రహ్మణ్య షష్ఠి, శ్రీ రామనవమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా విశేష పూజలు చేయించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఉగాది సందర్బంగా వేలాది మంది స్థానిక భక్తులు వస్తుంటారు. 




భవానీ మరియు శ్రీ అయ్యప్ప దీక్షా సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 
ప్రతి నిత్యం వేదమంత్రాలతో శోభిల్లే ఆలయంలో మాఘ మాసంలో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. చైత్ర మాసంలో వసంత నవ రాత్రులు ఘనంగా చేస్తారు. 
నిత్య ఉత్సవ క్షేత్రమైన విజయవాడ పాత (పాద) శివాలయ సందర్శన భక్తులలో ఆధ్యాత్మిక అనుభూతులను నింపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

నమః శివాయ !!!!



 


 




































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...