Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal


                                         అరుదైన ఆలయం 





 శ్రీ గురుభ్యోనమః 

శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 
అందరికి నమస్కారం 
గొప్ప చెప్పుకోవడం కాదు కానీ నేను నా ఆలయ సందర్శన ప్రయాణం లో నేటికి సుమారుగా మూడు వేలకు పైగా దేవాలయాలను దర్శించుకోగలిగాను. 
వీటిల్లో చిత్రమైన ఆలయాలు అంటే దుర్యోధన, శకుని కూడా పూజలు అందుకొనే క్షేత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేక విశేష అస్సలు భక్తాదరణ లేని నిత్య పూజలకు కూడా దాతల దయ మీద ఆధారపడవలసిన  ఒక ఆలయాన్ని ఈ మధ్య నంద్యాల లో దర్శించడం జరిగింది.
ఏ ఊరు వెళ్లినా మార్నిన్గ్  వాక్ మాత్రం మానను.
ఆ రోజు కూడా నడుచుకుంటూ  చామ కాలువ వైపుకు వెళ్ళాను. ఇంతకు ముందు నంద్యాల వెళ్లిన సందర్భాలలో స్థానికంగా ఉన్న నవ నంది క్షేత్రాలను సందర్శించుకునే అవకాశం లభించింది. అదే విధంగా అహోబిళం, గుండ్ల బ్రహ్మేశ్వరం, ఓంకారం, పాణ్యం, కాల్వ బుగ్గ క్షేత్రాలను దర్శించుకొన్నాను.
నడుస్తూ వెళుతున్న నన్ను ఒక బోర్డు ఆకర్షించింది. రాసిన విషయం ఆకర్షించినది. త్రిమూర్తుల, త్రిశక్తుల దేవాలయం, శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి  దేవస్థానం. బీజాక్షరంలో.  చిత్రంగా ప్రత్యేకంగా  అనిపించింది. ఆకర్షించింది. 
















స్నానం చేసిన తరువాత ఆలయానికి వెళ్ళాను. ప్రధాన రహదారి పక్కనే ఒక చెట్టు క్రింద ఉంటుందీ ఆలయం. ప్రధాన ద్వారం నుండి లోపలి అడుగు పెడితే ఎదురుగా రాతి ధ్వజస్థంభం. దాని మీద శ్రీ గణపతి శిల్పం. రాయలసీమలో అధికశాతం ఆలయాలలో రాతి ధ్వజస్థంభం లేదా దీప స్థంభం ఉంటుంది. కొన్ని చోట్ల రాతి స్థంభం మరియు ధ్వజస్థంభం రెండూ ఉంటాయి. 
ఇక్కడి రాతి ధ్వజం మీద నలువైపులా శ్రీ నరసింహ స్వామి విగ్రహాలను సుందరంగా చెక్కారు. ముఖ మండపంలో మనకి ఎడమ పక్కన మరో చిన్న రాతి మండపం క్రింద పరమేశ్వరుడు లింగ రూపంలో ఎదురుగా నందీశ్వరుడు పక్కన చిన్న గద్దె మీద శ్రీ మంగళ గౌరి దేవి కనిపిస్తారు. ఆ వెనుక నవ గ్రహ మండపం శ్రీ ఆంజనేయస్వామి దర్శనమిస్తారు. 














కుడివైపున పీఠం మీద శ్రీ సీతా లక్ష్మణ  ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుడు స్థానిక భంగిమలో కొలువై ఉంటారు. ప్రత్యేకమైన సంగతి ఏమిటంటే వారి ఎదురుగా శ్రీ త్యాగరాజ  స్వామి గానం చేస్తున్న భంగిమలో ఉపస్థితులై ఉండటం. ఎన్నో రామ మందిరాలను సందర్శించిన నేను ఎక్కడా ఇలాంటిది చూడలేదు. చాలా బాగుంది. చెక్కించినవారి మరియు చెక్కిన వారి ఆలోచన అభినందనలు తెలుపుకొన్నాను. 



గర్భాలయం ద్వారానికి ఇరుపక్కల శ్రీ వినాయకుడు మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు. ద్వారస్తంభాలకు ద్వారపాలకులను పైన శ్రీ గజలక్ష్మి ఆ పైన ఆలయ దేవతల రూపాలను కూడా అమర్చారు. 











గర్భాలయంలో మొత్తంగా అయిదు విగ్రహాలు ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం మరియు  త్రిమూర్తులు, త్రిశక్తుల దేవాలయంగా బోర్డు మీద పేర్కొన్నట్లుగా గర్భాలయంలో వారందరి మూర్తులు దర్శనమిస్తాయి. 
అన్నింటికన్నా వెనుక గోడలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మూల మూర్తి, మధ్యలో ఏక రూపంలో త్రిమూర్తులు. విశేషం ఏమిటంటే ఈ ఏక మూర్తిలో మధ్యలో విధాత బ్రహ్మ దేవుడు ఆయనకీ కుడి పక్కన లోక రక్షకుడు శ్రీ మహావిష్ణువు, ఎడమ పక్కన లయకారుడు మహేశ్వరుడు ఉంటారు. ఈ మూడు శిరస్సులకు ఒకటే శరీరం. అదీ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. 
ఏక శిలా త్రిమూర్తి రూపానికి ఎదురుగా చిన్న విగ్రహరూపాలలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ పార్వతీ దేవి ఇరువైపులా కొలువై ఉండగా మధ్యలో వీణాధారిగా సకల విద్యల తల్లి శ్రీ సరస్వతీ దేవి ఉపస్థితురాలై దర్శనం ఇస్తారు. 





















యాభై  సంవత్సరాల క్రిందట ఇలాంటి ప్రత్యేక రూపాలతో ఆలయం నిర్మించాలన్న తలంపు కీర్తి శేషులు శ్రీ ముత్యాలపాటి నరసింహులు గారికి ఎందుకు వచ్చిందో !
అప్పట్లో ఈ ప్రాంతంలో పేరుగాంచిన నాదస్వర విడవాసులు, నాదబ్రహ్మ ఆలిండియా రేడియో ఆర్టిస్టు శ్రీ ముత్యాలపాటి నరసింహులు గారు. వారికి శ్రీ అహోబిల శ్రీ నారసింహ స్వామి పట్ల గల అచంచల భక్తి  ఒక శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయాన్ని నిర్మించడానికి ప్రేరేపించింది. వివిధ ఆలోచనలు, అనేక ప్రేరణలు చివరికి నరసింహులు గారు ఇలాంటి ఒక ప్రత్యేక ఆలయాన్ని నిర్మించేలా చేశాయి. 
వారు తమ నాదస్వర విద్యలో గొప్ప పేరు సంపాదించారు. ఎన్నో బిరుదులూ, సన్మానాలు పొందారు. చివరికి తాను ఆరాధించిన స్వామిలో కలిసిపోయారు. 
ప్రస్తుతం వారి సతీమణి శ్రీమతి బాలనాగమ్మ గారు ఆలయ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కానీ నిధుల కొరతతో అవి అంత సజావుగా సాగడం లేదు. అర్చకులు లేని ఆలయానికి అన్నీ నాగమ్మ గారే !
వెళ్లి వారికి ఆలయం మరియు నిర్మించిన భర్త గురించి తెలిపి, ఆర్ధిక సహాయం కోరడం  ఇవే ఆమె నిత్యకృత్యాలు. 
ఆలయాన్ని సందర్శించుకొని, ఆమె చెప్పిన విశేషాలను మనసులో పెట్టుకొని తోచిన పైకాన్ని ఇచ్చి భారమైన మనస్సుతో వెలుపలికి వచ్చాను. 
నా ఈ పోస్ట్ చూసిన వారు , చదివిన వారు ఆలయ నిర్వహణకు  తమకు తోచిన ఆర్ధిక సహాయం శ్రీ బాలనాగమ్మ గారి ని సంప్రదించి పంపగలరని చేతులు జోడించి వేడుకొంటున్నాను. ఆమె నెంబర్  : 9959803074. 
మీరిచ్చే ప్రతి రూపాయి ఒక హిందూ ఆలయ నిర్వహణకు, భావి తరాలకు అందించడానికి దోహదపడుతుంది అని ఆ పరమేశ్వర సాక్షిగా చెప్పగలను. 

ఓం నమో నరసింహాయ నమః !!!!





 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Irukalala Parameswari Temple, Nellore