14, జులై 2023, శుక్రవారం

Temple of Krishna River Bed, Guntur District

                                త్రిలింగ క్షేత్ర శివాలయాలు 


మానవుని జీవనగమనం ప్రశాంతంగా, ఒడిదుడుకులు లేకుండా సాగడానికి కావలసినవి పంచ భూతాలు. 

అవి నేల, నీరు, నిప్పు, నింగి, గాలి. ఇవి ఏవి లేకపోయినా జీవనం అతలాకుతలం అవుతుంది. అందుకే ఇవి పరమేశ్వరునితో సమానం.మనకు ఎన్నో జీవ నదులు ఉన్నాయి. వేల  కిలోమీటర్ల ప్రవాహ గమనంలో లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ, కోట్లాది మంది దాహార్తిని తీరుస్తూ సాగే నదుల గొప్పదనాన్ని ఎంతని  పొగడగలం ?

ముఖ్యంగా మన ఆంధ్రరాష్ట్రానికి జలదేవతలు కృష్ణ, గోదావరి నదులు.
ఎక్కడో మహారాష్ట్రలోని పడమటి కనుమలలో జన్మించిన కృష్ణవేణి సుమారు పదునాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రవహించి సాగరంతో సంగమిస్తుంది. ప్రవాహ క్రమంలో ఎన్నో ఉపనదులను తనలో కలుపుకొంటూ సాగుతుంది. ప్రాంతాలను సస్యశ్యామలం చేయడమే కాకుండా ఆధ్యాత్మికత తన ప్రవాహ మార్గంలో వర్ధిల్లేలా చేసింది. 
పావన కృష్ణా తీరాలు అనేక దేవాలయాలకు నిలయాలు.శతాబ్దాల క్రిందటనే కాక కొత్తగా నిర్మించిన అనేక ఆలయాలు,ఆశ్రమాలతో గొప్ప ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరుస్తుంటాయి.శ్రీశైలం, అలంపురం లాంటి శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు ఈ నదీమ తల్లి ఒడ్డునే వెలిశాయి. ముఖ్యంగా శ్రీ కనకదుర్గా దేవి కొలువు తీరిన ఇంద్రకీలాద్రి ఉన్నవిజయవాడ నుండి నది సముద్రుని కలిసే సంగం దాకా దక్షిణ, ఉత్తర తీరాలలో గ్రామగ్రామాన చక్కని పురాతన దేవాలయాలు నిర్మించబడినాయి. చాలా మందికి కనీసం స్థానిక ప్రజలకు కూడా వాటి పురాణ గాధలు, చారిత్రక విశేషాలు తెలియక పోవడం శోచనీయం. 
అలా గుంటూరు జిల్లాలో కృష్ణవేణీ నదీతీరంలో నెలకొల్పబడిన త్రిలింగ దేశ శివాలయాల గురించి తెలుసుకొందాము. 




అగస్థ్య మహర్షి   

ఆదిదంపతుల కళ్యాణ సందర్బంగా శివాజ్ఞ మేరకు లక్షలాది శిష్యప్రశిష్యులతో దక్షిణాదికి తరలి వచ్చారు అగస్థ్య మహర్షి. మనకు భాషను, వ్యాకరణం అందించినది వీరే ! ఎట్టి పరిస్థితులలో శివ పూజ మానని శివభక్తులు. తామెక్కడ విడిది చేస్తే అక్కడ ఒక శివలింగాన్ని నిత్య పూజల నిమిత్తం 
ప్రతిష్ట చేసుకొనేవారట. 
అందుకే తమిళనాడులో, మన రాష్ట్రంలోని పెక్కు ప్రాంతాలలో  కొలువైన కైలాసనాధుని "శ్రీ అగస్థీశ్వర స్వామి"అని పిలుస్తారు. అంటే ఆ క్షేత్రాలన్నీ మహర్షి సంచరించిన పవిత్ర ప్రదేశాలు. శివలింగాలు ఆయన ప్రతిష్టితాలుగా అర్ధం చేసుకోవాలి. 
అలాంటి అనేక లింగాలలో గుంటూరు జిల్లా దుగ్గిరాల పరిసర ప్రాంతాలలో ఉన్న నాలుగు క్షేత్రాల విశిష్టత మరింత గొప్పగా ఉన్నది. 
నందివెలుగు,కొలకలూరు, ఈమని మరియు దుగ్గిరాల ఈ నాలుగు గ్రామాలలో శ్రీ అగస్థ్య ప్రతిష్ఠిత లింగాలు ఉన్నాయి. వీటిని త్రిలింగ క్షేత్రం అంటారు. వీటిని సందర్శించిన తరువాత విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం పైన కొలువు తీరిన శ్రీ కనకదుర్గా దేవిని దర్శించుకోవాలంటారు. 
అసలు ఏమిటి త్రిలింగ క్షేత్రం అంటే ?

 త్రిలింగ క్షేత్రం 

తమ పర్యటనలో శ్రీ అగస్థ్య మహర్షి కృష్ణా తీరంలో విడిది చేసినప్పుడు ఈ ప్రాంత విశిష్టతను, రాబోయే కాలంలో ఇక్కడ జరగబోయే విశేషాలను గుర్తించి శివలింగాలను ప్రతిష్టించారు అన్నది మూల సంఘటన గా చెప్పబడుతోంది. 
అప్పట్లో ఇదంతా ఒకటే ప్రదేశం గా ఉండేది. మహర్షి సతీ సమేతంగా నాలుగు దిక్కులలో నాలుగు శివలింగాలను ప్రతిష్టించారు. తూర్పున నేడు ఈమని గ్రామం లో సూర్య కళ వెదజల్లే శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్థీశ్వర స్వామి వారిని, పడమర నేడు కొలకలూరు గా పిలవబడుతున్న ప్రదేశంలో ప్రతిష్టించబడిన  శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్థీశ్వర స్వామి చంద్రకళలతో ప్రకాశించే వానిగా ప్రసిద్ధి. దక్షిణాన  అగ్ని కళలను ధరించిన శ్రీ దుర్గా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామిని ప్రతిష్టించారు. నేడు ఈ ప్రాంతాన్ని"నంది వెలుగు"గా పిలుస్తున్నారు. ఉత్తరాన దుగ్గిరాలలో  శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం కలదు. ఈ స్వామి కూడా అగస్థ్య మహర్షి ప్రతిష్టగా చెబుతారు. 
ఈ నాలుగు ఆలయాలను కలిపి త్రిలింగ క్షేత్ర "మహా పాశుపత బంధం" అంటారు. ఇది శరము ఎక్కు పెట్టిన ధనుస్సు ఆకారంలో ఉంటుంది. తూర్పు, పడమర మరియు దక్షిణ దిశలలో నెలకొన్ని ఉన్న లింగాలలో సూర్య, చంద్ర,అగ్ని కళల నుండి వెలువడే తోజోమయమైన కాంతి పుంజాలు దుగ్గిరాల శ్రీ నాగేశ్వర స్వామి వారి వద్ద ఏకీకృతమై మరింత శక్తివంతమై కృష్ణా నదికి ఉత్తర తీరాన ఇంద్రకీలాద్రి పైన కొలువైన అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మను చేరుకొంటాయని చెబుతారు. 
ఇన్నికళల శక్తిని నింపుకున్న ఇంద్ర కీలాద్రి విజయ కేంద్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ చేసే ధ్యానం, తపస్సు, మంత్ర పఠనం శీఘ్ర ఫలితాలను మనోభీష్టాలను నెరవేరుస్తాయి అన్నది మహర్షుల వాక్యం.భక్తుల విశ్వాసం. 
ఈ విషయం తెలిసినందునే  పాండవ మధ్యముడు అర్జనుడు పరమేశ్వరుని నుండి పాశుపతాస్త్రం పొందటానికి ఇంద్రకీలాద్రిని ఎంచుకొన్నది. శివానుగ్రహంతో మనోభీష్టాన్ని నెరవేర్చుకొన్నాడు. 
ఈ విషయాన్ని నిర్ధారించేలా ఇంద్రకీలాద్రి పర్వత పాదాల వద్ద ఆయన పేరు మీద శ్రీ విజయేశ్వర  స్వామి ఆలయం నిర్మించబడినది. ఎన్నో ప్రత్యేకతలు, విశేషాల నిలయం ఈ ఆలయం. 
కాలగమనంలో లోపాముద్రా సమేత అగస్థ్య మహర్షి ప్రతిష్టించిన లింగాలు కనుమరుగయ్యాయి. 
తిరిగి అవి కలియుగంలో వెలుగు చూశాయి. స్థానిక ప్రభువులు, ధనవంతులు, సామాన్య భక్తులు ఆలయాల అభివృద్ధికి తమ వంతు కైకర్యాలు, సేవలు చేశారని తెలుస్తోంది.  









ఈమని శ్రీ అగస్తీశ్వర స్వామి (సూర్య కళ )

పచ్చని పొలాల మధ్య ఉన్న ఊరి మధ్యలో చక్కని ప్రశాంత పల్లె వాతావరణంలో నెలకొని ఉంటుంది.  
ఎదురు బొదురుగా శివాలయం మరియు శ్రీ రామాలయం ఉంటాయి. 
శ్రీ గంగా స్వయంవర పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం పశ్చిమ దిశగాను, శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి ఆలయం తూర్పు దిశగాను నిర్మించబడినాయి. 
విశాల ప్రాంగణానికి పెద్ద స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. అక్కడ ధ్యాన ముద్రలో ఉన్న మహేశ్వరుని విగ్రహంతో బాటు శ్రీ కుమార స్వామి మరియు శ్రీ ధర్మ శాస్త మూర్తులను కూడా ఏర్పాటు చేశారు. ఇవి నూతన నిర్మాణాలు. 
మూడంతస్థుల రాజ గోపురానికి వెలుపల ద్వారానికి రెండు పక్కలా నందీశ్వరుడు భక్తులను స్వాగతిస్తుంటారు. 
ప్రాంగణంలో ధ్వజస్థంభం, నంది మండపం దాటిన తరువాత ఆస్థాన మండపంలో మరో నందీశ్వరుడు కొలువై ఉంటారు. ఎదురుగా గర్భాలయంలో చందన విభూది కుంకుమ లేపనలతో, సుందర పుష్ప అలంకరణలో  లింగ రూపంలో శ్రీ అగస్తీశ్వర స్వామి దర్శనమిస్తారు. ఉత్తరాభిముఖంగా శ్రీ పార్వతీదేవి నేత్రపర్వంగా ఉపస్థిత మూర్తిగా కొలువై ఉంటారు. 
 ప్రత్యేక సన్నిధిలో మరో లింగరాజు దర్శనమిస్తారు. చాలా సంవత్సరాల క్రిందట సమీప పొలంలో లభించినది అని చెబుతారు. 























ధ్వజస్థంభం వద్ద పురాతన శాసనాలు కనపడతాయి. ఆలయానికి గతంలో రాజులు సమర్పించిన కైంకర్యాల వివరాలు మరియు త్రిలింగ క్షేత్ర విశేషాలు కూడా పేర్కొనబడినాయి. 
నిత్యం నాలుగు పూజలు నిర్వహించే ఆలయంలో మాస శివరాత్రి, పౌర్ణమి, త్రయోదశి పూజలు జరుపుతారు. మహా శివరాత్రికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కార్తీక మాసంలో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. 
శివాలయానికి కొద్ది  దూరంలో తూర్పు ముఖంగా శ్రీ రామచంద్రుని ఆలయం కనపడుతుంది. పురాతన ఆలయాన్ని పునః నిర్మించారు. చిన్న రాజగోపురం అమర్చారు.  
చక్కని రామాయణ ముఖ్య ఘట్టాల మరియు దశావతార వర్ణ శిల్పాలతో ప్రాంగణం శోభాయమానంగా రూపుదిద్దుకొన్నది. గర్భాలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి రమణీయ అలంకరణలో కన్నుల పండుగగా స్థానక భంగిమలో కొలువై ఉంటారు. 
శ్రీ అంజనాసుతుడు ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. 


రామాలయం 









శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్థీశ్వర స్వామి ఆలయం, కొలకలూరు (చంద్ర కళ )

త్రిలింగ దేశంగా ప్రసిద్ధికెక్కిన నాలుగు ఆలయాలలో విశేషమైనది శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్థీశ్వర స్వామి ఆలయం. చాలా పురాతనమైనది. తగిన చరిత్ర, పౌరాణిక గాధ అందుబాటులో లేకపోవడం విచారకరం. ఆలయాన్ని కొంత మేర పునః నిర్మించడం జరిగింది. గర్భాలయంలో శ్రీ అగస్తీశ్వరస్వామి పెద్ద లింగ రూపంలో దర్శనమిస్తారు.  శ్రీ గణపతి, శ్రీ పార్వతీ దేవి ఇరుపక్కలా ప్రత్యేక సన్నిధులలో కొలువై ఉంటారు. 









 రాజగోపురం లాంటివి కనపడవు. ఆలయానికి వెలుపల రహదారి మీద ఉన్న నంది విగ్రహం తెలుపుతుంది ఆలయం ఎంతటి పురాతనమైనదో !!
గ్రామంలో శ్రీ మహావిష్ణువు ఆలయం కూడా కలదు. 
ఎత్తైన రథాలు రెండు ఆలయాలకు ఉన్నాయి. విశేష పర్వదినాలలో జరిగే రధోత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. 

శ్రీ దుర్గా సమేత శ్రీ అగస్థీశ్వర స్వామి ఆలయం , నందివెలుగు (అగ్ని కళ )









శ్రీ అగస్థ్య మహర్షి ప్రతిష్టించిన లింగం కాలప్రవాహంలో భూమిలో మరుగునపడి పోయింది. ఆ ప్రాంతమంతా దట్టమైన అడవిగా మారిపోయింది. ఒకప్పుడు నిత్య పూజలతో, వేద పఠనంతో, వేదాభ్యాసంతో కళకళలాడిన ప్రాంతం కళావిహీనంగా మారిపోయిందట. 
ఆ రోజులలో చాళుక్య రాజు విష్ణువర్ధనుని పాలనలో ఉండేది ఈ ప్రాంతం. గత చరిత్ర విన్న మహారాజు అగస్త్య ప్రతిష్ఠిత లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించారట. ఆయన యెంత గొప్పగా ఆలయాన్ని నిర్మించారన్న దాని గురించి నేటికీ కధలు వినిపిస్తున్నాయి. 
అమూల్యమైన రత్నాలను శ్రీ గణపతి ఉదరం లోను, నందీశ్వరుని కొమ్ములలో అమర్చారట. రత్నాల వలన వినాయకుని పొట్ట లోని కాంతి కిరణాలు నంది కొమ్ముల నుండి వెలువడే కిరణాలతో కలిసి గర్భాలయం లోని లింగం మీదకు ప్రసరించేవట. 




రత్న గర్భ గణపతి 
















నాటి శిల్పులది ఎంతటి నేర్పరితనం ! నాటి పాలకులది ఎంతటి భక్తి తత్పరత !
నంది కొమ్ముల నుండి వెలువడే వెలుగు మూలాన ఈ గ్రామాన్ని "నంది వెలుగు" అని పిలుస్తారు. 
అనంతర కాలంలో దుండగులు విగ్రహాలను పగుల కొట్టి రత్నాలను దోచుకొని పోయారట. 
ఎన్నో ఉపాలయాలతో కళకళలాడుతుంటుంది ఈ ఆలయం. 
ఇది శివ కేశవ క్షేత్రం. 
శ్రీ జ్యోతిర్గణపతి, శ్రీ కనక దుర్గా దేవి, శ్రీ కాలభైరవుడు, శ్రీ నటరాజ స్వామి, శ్రీ చండికేశ్వరుడు, శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్య, శ్రీ కంఠ శివాచార్య స్వామి, శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి  ఉపాలయాలలో కొలువై ఉంటారు. అమ్మవారు శ్రీ పార్వతీ దేవి విడిగా దర్శనమిస్తారు. 
శ్రీ అగస్తేశ్వర స్వామి గర్భాలయంలో రమణీయ చందన కుంకుమ విభూది లేపనాలతో, రమణీయ పుష్ప అలంకరణలో నేత్రపర్వంగా అనుగ్రహిస్తారు. ఎదురుగా మండపంలో స్వామిని చూస్తూ జ్యోతిర్నంది ఉపస్థితులై ఉంటారు. 
గ్రామం మధ్యలో ఉన్న చెరువులో పెద్ద నందిని నూతనంగా ఏర్పాటు చేశారు. సాయంసంధ్యా సమయంలో చెరువు ఒడ్డున నందీశ్వరుని సన్నిధిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. 











 శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం, దుగ్గిరాల 









శ్రీ అగస్త్య ముని ప్రతిష్టించిన మరో శివ లింగం కొలువైన ఆలయం శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం, దుగ్గిరాల. 
పూర్తిగా వెలుపలి భాగం పునః నిర్మించబడినది. 
 చక్కని వర్ణమయ శిల్పాలతో ఆలయ ప్రాంగణం శోభాయమానంగా దర్శనమిస్తుంది. 
నవగ్రహ మండపం ఏర్పాటు చేయబడింది. ప్రాంగణ ఈశాన్యంలో కళ్యాణ మండపం నిర్మించబడింది.
శ్రీ గణపతి, శ్రీ పార్వతీ దేవి విడివిడిగా సన్నిధులలో కొలువై ఉంటారు. 












గర్భాలయంలో శ్రీ నాగేశ్వర స్వామి లింగరూపంలో రమణీయ చందన కుంకుమ పుష్ప అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. 
ఆలయ ధ్వజస్థంభం వద్ద త్రిలింగ క్షేత్ర వివరాలు తెలిపే శిలాఫలకాన్ని చూడవచ్చును. 
దుగ్గిరాలలో అనేక విశేష ఆలయాలుఉన్నాయి . శ్రీ ధర్మశాస్త (అయ్యప్ప) ఆలయం, శ్రీ కాళీ అమ్మవారి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ వేణుగోపాల ఆలయం, సమీపంలో శ్రీ రావమ్మ తల్లి ఆలయం ఉన్నాయి. 
శ్రీ నాగేశ్వరస్వామి ఆలయ సందర్శనంతో త్రిలింగ క్షేత్ర దర్శనం ముగిసినట్లే ! తదనంతర ప్రయాణం శ్రీ కనకదుర్గమ్మ తల్లి వద్దకు. 

ఈ ప్రయాణంలో మరో విశేష ఆలయ సందర్శనం చేసుకొనే  అవకాశం లభిస్తుంది.  

శ్రీ ఆనందేశ్వర స్వామి ఆలయం, పెద కొండూరు  

కైలాసనాథుడు అర్ధనారీశ్వరునిగా ప్రసిద్ధుడు. అలా ఆయన సతీదేవితో కలిసి ఒకే లింగంలో దర్శనమిచ్చే ఆలయాలు ఎక్కడా లేవు. కానీ ఈ మధ్యనే అలాంటి లింగం ఉన్న ఒక పురాతన ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లో అది కూడా కృష్ణా నదీతీరంలో ఉన్నది అని కనుగొనబడింది. 
ఆ లింగం దుగ్గిరాల మండలం లోని పెద కొండూరు గ్రామంలోని శ్రీ ఆనందేశ్వర స్వామి ఆలయంలో ఉన్నది. కృష్ణానదీ గర్భంలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఒకే ఇంగంలో పార్వతీపరమేశ్వరుల రూపాలు కనిపించేది భారతదేశం మొత్తంలో ఇక్కడ మాత్రమే అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.  















ఆలయ చరిత్ర 

సుమారు పదహారు వందల సంవత్సరాల క్రిందట నేటి పల్నాడు ప్రాంతం నుండి ఈ ప్రదేశాలను పాలించారు ఆనంద గోత్రీకులు అనే రాజులు. 
జైన మతం ఉఛ్ఛ స్థితిలో ఉన్నక్రీస్తు శకం నాలుగో శతాబ్ద కాలంలో శైవ మతాన్ని తిరిగి వెలుగు లోనికి తేవడానికి స్థానిక పండితులు నిర్ణయించుకొన్నారు. జైన మతం పట్ల అభిమానం చూపుతున్న అనేక మంది హిందూ పాలకులు తిరిగి శైవం వైపుకు మరలారని చరిత్ర కారులు చెబుతారు. అలా మారిన వారిలో ఆనంద గోత్రీకులు ఒకరు.
వీరు అనేక హిందూ ఆలయాలను ముఖ్యంగా శివాలయాలను నిర్మించారు. పునః స్థాపించారు.   
నరసరావుపేట సమీపంలోని చేజెర్ల లోని శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఈ రాజులే నిర్మించారని చెబుతారు. వారు నిర్మించిన వాటిలో మరొకటి పెద కొండూరు గ్రామంలోని శ్రీ ఆనందేశ్వర స్వామి ఆలయం. 










అమరావతి , చేజెర్ల ఆలయాలలో మాదిరి ఇక్కడి లింగం కూడా పాలరాతి చెక్కడమే !
వాటికి భిన్నంగా ఈ లింగం పై భాగాన పురుష రూపం, క్రింద భాగాన స్త్రీ రూపం చెక్కారు. అనగా నాడు శివ తత్వంతో పాటు శక్తి తత్వానికి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చారని అర్ధం అవుతుంది. శివాద్వైతం మరియు శాక్తాద్వైతం కలిసినప్పుడు కేవలం ఈశ్వరాద్వైతం మాత్రమే ప్రస్ఫుటం అవుతుందంటారు. ఆ విధంగా పెద కొండూరు ఆలయం శ్రీ ఆనందేశ్వర స్వామి నిలయం గా పేరొందినది. 
శిధిలావస్థలో ఉన్న ఆలయాన్ని గ్రామస్థులు పూనుకొని పునః నిర్మించారు. ఆ సమయంలో లభించిన శిధిల శిల్పాలను, శాసనాలను ప్రాంగణంలో ఒక పద్దతిలో అమర్చారు. 
వాటిలో పన్నెండవ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మ, శ్రీ సరస్వతి, శ్రీ సూర్య, శ్రీ మహిషాసుర మర్దని శిల్పాలు కనపడతాయి. అదే విధంగా శాసనాలలో పదకొండు, పన్నెండు మరియు పదునాలుగవ శతాబ్దాలకు చెందినవి ఉండటం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. 
శ్రీ ఆనందేశ్వర స్వామి వారితో పాటు శ్రీ గణపతి మరియు శ్రీ పార్వతీ దేవి సన్నిధులుంటాయి. ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఆదిదంపతుల విగ్రహాన్ని సుందరంగా నిర్మించి నిలిపారు. 














శ్రీ ఆనందేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా స్థానిక గ్రామదేవత శ్రీ కనక పుట్టాలమ్మ ఆలయం ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల వారు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా అమ్మవారిని కొలుస్తారు. 
ఓపికగా చూస్తే కొలకలూరు, ఈమని, నందివెలుగు మరియు దుగ్గిరాల పరిసర ప్రాంతాలలో అనేక పురాతన ఆలయాలు కనిపిస్థాయి.ఒకనాడు ఈ ప్రాంతాలన్నీ హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలుగా వర్ధిల్లాయన్న సత్యాన్ని నేటి తరానికి తెలుపుతున్నాయి. 















నమః శివాయ !!!!







































































































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...