26, జులై 2023, బుధవారం

Sri Sangameshwara Swami Temple, Machhumarri (Atmakuru)

           శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం, సంగమేశ్వరం














దేవాలయం అనగానే సుందరమైన ఒక పవిత్ర కట్టడం, పురాణ శిల్పాలతో నిండిన గోపురాలు, , దూరానికి కూడా వినిపించే చిరు గంటల నాదం తో శోభాయమానంగా నింగిని తాకేలా సగర్వంగా నిలిచిన  ధ్వజస్థంభం కనుల ముందు కదలాడతాయి. కర్ణ పుటాలు స్వామిని అర్చిస్తూ పలికే వేదమంత్రాలను హృదయానికి చేరుస్తాయి. గర్భాలయంలో నేత్రపర్వమైన అలంకరణతో కొలువైన దేవతామూర్తిని చూడగానే మనస్సు మరియు శరీరం పులకిస్తాయి. అసంకల్పితంగా  కైమోడ్చి మొక్కుతాము. స్వామి రూపాన్ని మది నిండా నింపుకొని పునః దర్శనాన్ని వాంఛిస్తూ వెనుతిరుగుతాము. 

సుప్రభాతాలు, అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు మరియు ఆరగింపులూ ప్రతి నిత్యం ప్రతి ఆలయంలో విధిగా జరిగే కైంకర్యాలు. 

 అలాంటివి నిత్యం జరగకుండా వారానికి ఒకసారి, నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి పూజాదికాలు నిర్వహించే ఆలయాలు కూడా కొన్ని మనదేశంలో ఉన్నాయి. అలా జరపడానికి క్షేత్ర గాధలు లేక కొన్ని స్థానిక నియామాలు కారణంగా ఉండటం మనకు తెలిసిన విషయమే !







 కానీ అలాంటి నియమ నిబంధనలు లేకుండా కేవలం ప్రకృతి కారణంగా పన్నెండు నెలలలో కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఒక క్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం విశేషంగా పేర్కొనాలి.

కైలాసనాధుడు కొలువు తీరిన ఈ క్షేత్రం పేరు సంగమేశ్వరం. 

శ్రీ సంగమేశ్వరునిగా గంగాధరుడు పిలవబడుతున్న క్షేత్రాలు అనేకం మన రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఈ ఆలయం అనేక  విశేషాల నిలయం. 

క్షేత్ర గాధ 

అందుబాటులో ఉన్న స్థానిక గాధల ద్వారా తెలుస్తున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 
సతీ దేవి తండ్రి, ప్రజాపతి అయిన దక్షుడు అల్లుడు మహేశ్వరుని పిలవకుండా తలపెట్టిన యాగానికి సతీదేవి పిలవకుండానే వెళ్ళింది. కుమార్తె, లోకపాలకురాలు అని కూడా చూడకుండా అవమానించాడు అహంకారి దక్షుడు. అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి దేహత్యాగం చేసింది ఇక్కడే అని అంటారు. సతీదేవి దేహ నివృత్తి జరిగిన స్థలంగా "నివృత్తి సంగమేశ్వరం"గా కూడా పిలుస్తారు. 
పాండవులు వనవాస కాలంలో క్షేత్ర సందర్శనం చేస్తూ జ్యోతిర్లింగ స్థానమైన శ్రీశైలం వచ్చారట. శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామివార్లను కొంత కాలం సేవించుకొన్నారట. ఇప్పటికీ ఉన్న భీముని కొలను లాంటి ప్రదేశాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. 














తిరిగి తమ సంచారం సాగించిన వారు పావన కృష్ణాతీరాన్ని చేరుకొన్నారట. అక్కడ కృష్ణానదితో 
ఉపనదులైన భవనాశిని  తో పాటు మరో అయిదు నదులు సంగమిస్తాయని తెలుసుకొన్నారట. 
ఆ నదులు "కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలపహారిణి, భీమరాతి మరియు భవనాశిని". చిత్రమైన విషయం ఏమిటంటే  వీటిలో భవనాశిని మగ నది అని అంటారు. పురుషనది తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుంది. మిగిలినవి పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. అన్ని నదులూ కలిసి జ్యోతిర్లింగ మరియు అష్టాదశ పీఠమైన పవిత్ర  శ్రీశైలాన్ని తాకుతూ ఆ క్షేత్ర మట్టిని తమలో కలుపుకొని ప్రవహిస్తాయి.   
సప్త నదీ సంగమ క్షేత్రమే కాకుండా సంగమేశ్వరంలో ఆ కాలంలో ఏకాదశ తీర్ధాలు కూడా ఉండేవట. అవి "దేవద్రోణి, భుజంగ, భాణుక, దశాశ్వమేధ, సప్త కోటేశ్వర, గాయత్రి, వైశ్యానర, సౌభాగ్య, చక్రతీర్ధ, అఘనాశిని మరియు విశ్వామిత్ర". 
ఇంతటి పవిత్ర తీర్థ స్థలంలో శివలింగ ప్రతిష్ట చేయడం శుభకరం అని అక్కడ ఉన్న మహర్షులు ధర్మరాజుకు చెప్పారట. 
స్వయం జటాధరుడు, గంగాదేవితో కలిసి కొలువు తీరిన ముక్తి క్షేత్రం అయిన వారణాసి నుండి లింగాన్ని తెచ్చి ప్రతిష్ట చేస్తే ఇంకా దివ్యంగా ఉంటుందని కూడా వారు తెలిపారట. 
వాయునందనుడైన భీమసేనుడు ఆ భాద్యతను తీసుకొని బయలుదేరాడట. కానీ నిర్ణయించిన ముహూర్త సమయానికి తిరిగి రాలేక పోయాడట. 
మహర్షులు నిర్ణయించిన సుముహూర్తం దాటిపోకూడదని వారి సలహా మేరకు ధర్మనందనుడు వేప చెట్టు కాండాన్ని లింగంగా మలచి సమయానికి ప్రతిష్టించారట. 












భీమసేనుడు కాశీ నుండి తెచ్చిన లింగాన్ని ఆలయం వెనుక నేటికీ చూడవచ్చును. 
అనంతర కాలంలో రాజుల కైంకర్యాలతో ఆలయం అభివృద్ధి చెందినది అని అక్కడ కనిపించే శాసనాలు తెలుపుతాయి. 

ఆలయ విశేషాలు 

సుమారు 1981 వ సంవత్సరం వరకు ఆలయానికి భక్తులు నిత్యం వచ్చి స్వామివారిని దర్శించుకొనేవారట.   
కృష్ణానది మీద శ్రీ శైలం ఆనకట్ట నిర్మించిన తరువాత ఈ ఆలయం పూర్తిగా నీట మునిగిపోయిందట. తిరిగి ఆలయ దర్శనం జరిగింది 2003 వ సంవత్సరంలో ! అంటే దరిదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు జలాధివాసం చేసిన తరువాత జలకంఠేశ్వరుడు వెలుపలికి వచ్చారు. 
ఈ రెండు దశాబ్దాల కాలంలో పురాతన ఆలయం చాలా మేరకు శిధిలం అయ్యింది. 
స్థానికులు కలిసి కొంతమేర ఆలయాన్ని పునఃరుద్దరించారు. 
ఈ రెండు దశాబ్దాలలో నీటి మట్టం తగ్గి ఆలయం వెలుపలికి వచ్చిన ప్రతిసారీ భక్తులు మరికొన్ని నిర్మాణాలను చేశారు.మరికొన్నింటిని పునఃనిర్మించారు. 
నేటికీ అత్యంత సాదాసీదాగా కనిపిస్తుంది నిర్మాణం. గతంలో ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉండేవట. వాటిని కర్నూలు మరియు మరికొన్ని ఇతర ప్రాంతాలలోని వివిధ ఆలయాలకు తరలించారట. 
























ప్రస్తుతం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఉపాలయాలలో శ్రీ గణపతి, శ్రీ షణ్ముఖ, శ్రీ లక్ష్మీ నృసింహ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ సీతా లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పురాతన  విగ్రహాలను ఉంచారు. శ్రీ పంచముఖ ఆంజనేయ, శ్రీ దక్షిణామూర్తి, సప్త మాతృకల శిల్పాలు కూడా కనపడతాయి. 
ఉత్తర దిశగా ఉన్న ప్రవేశ ద్వారం ఒక్కప్పుడు గోపురంతో ఉండేదట.దక్షిణ , తూర్పు దిక్కులలో కూడా గోపురాలు ఉండేవట. నేడు లేవు.ముఖ మండపం  శిధిలమైనది. తాత్కాలిక మరమ్మతులు చేశారు. ముఖ మండపంలో కనిపించే స్థంభాల పైన చెక్కిన చెక్కడాలను చూస్తే ఒకప్పుడు ఈ దేవాలయం ఎంత చక్కని శిల్పసంపదతో శోభిల్లేదో అనిపిస్తుంది. ఇక్కడ కూడా కొన్ని దేవతా మూర్తులు ఉంటాయి. 
గర్భాలయంలో ఒక పక్కన శ్రీ గణపతి మరొపక్కన శ్రీ లలితా దేవి కొలువై ఉంటారు. మధ్యలో శ్రీ సంగమేశ్వర స్వామి శిలాజంగా మారిన దారు లింగ రూపంలో దర్శనమిస్తారు. 











నదిలో నీటి ప్రవాహం తగ్గడం మొదలయ్యే మార్చి నెల నుండి ఆలయం నెమ్మదిగా బయల్పడుతుంది. రాష్ట్రంలో, ఎగువ రాష్ట్రాలలో వర్షాల మూలంగా ఏర్పడే వరద నీటి ఆధారంగా జూన్ నెలాఖరు వరకు ఆలయ సందర్శనం చేసుకోడానికి అనువుగా ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే ఏప్రిల్ లేదా మే నెలలో వెళ్లడం ఉత్తమం. నది ఒడ్డు నుండి ఆలయం వరకు బాట ఏర్పాటు చేస్తారు. సొంత వాహనాలలో వెళ్లేవారు ఆలయం వరకు వెళ్లవచ్చును. 
ఇన్ని నదులు, తీర్థాలు గల ప్రదేశం బహుశా భారతదేశంలో మరెక్కడా లేదు. 
మార్చి నుండి జూన్ వరకు ఈ ఆలయాన్ని సందర్శించుకోవచ్చును. 
బస్సులలో వెళ్లదలచిన వారు కర్నూలు, విజయవాడ ఇతర ప్రాంతాల వారు ఆత్మకూరు చేరుకోవడం ఉత్తమం. అక్కడ నుండి "మచ్చుమర్రి"(సంగమేశ్వరం) చేరుకోడానికి బస్సులు, ఆటోలు దొరుకుతాయి. సొంత వాహనాలలో వెళ్లే వారు నందికొట్కూరు లేదా ఆత్మకూరు నుండి నేరుగా ఆలయం వద్దకు చేరుకోవచ్చును. 
యాత్రీకుల భోజనం కొరకు శ్రీ కాశీనాయన భక్త బృందం వారు ఏర్పాటు చేశారు. రోజంతా అన్నదానం జరుగుతుంది. 








విశేష పౌరాణిక గాధ , చరిత్ర మరియు పవిత్ర తీర్థ స్థలి అయిన సంగమేశ్వరం సందర్శించడం ఒక జీవిత కాలపు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది అంటే అతిశయోక్తి లేదు. 

నమః శివాయ !!!!   


  
























































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...