19, జులై 2023, బుధవారం

Pancha Bhavannarayana Temples, Andhrapradesh

                        పంచ భావన్నారాయణ క్షేత్రాలు

మన రాష్ట్రంలో నెలకొని ఉన్న అనేకానేక పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం గల ఆలయాలలో పరమ శివుడు కొలువైన "పంచారామాలు" ముఖ్యమైనవి. 
కానీ వాటితో సమమైన స్థానం కలిగిన పంచ భావన్నారాయణ ఆలయాలు. కానీ దురదృష్టవశాత్హు ఆ క్షేత్రాలకు రావలసిన గుర్తింపు రాలేదనిపిస్తుంది. 
పంచారామాల మాదిరిగానే ఈ  అయిదు క్షేత్రాలు కూడా రాష్ట్రం లోని వివిధ జిల్లాలలో ఉన్నాయి. 
అవి శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం, సర్పవరం(కాకినాడ), శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం, పొన్నూరు, శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం, బాపట్ల, శ్రీ భూ సమేత శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం, పెద గంజాం (బాపట్ల), శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం, భావదేవరపల్లి (కృష్ణ జిల్లా). 
ఈ అయిదో క్షేత్రం గురించి కొంత చర్చ నడుస్తోంది. కొందరు నరసరావుపేట(పల్నాడు జిల్లా)లో ఉన్నది అని, మరి కొందరు పశ్చిమ గోదావరి జిల్లా లోని పట్టిసీమ అంటారు. 
కానీ నరసరావుపేట ఆలయ పూర్తి వివరాలు అందుబాటులో లేవు. పట్టిసీమ ప్రధానంగా శైవక్షేత్రం. శ్రీ వీరభద్ర స్వామి ప్రధాన అర్చా మూర్తి. శ్రీ భావన్నారాయణ స్వామి క్షేత్ర పాలకుడు అంటారు. కానీ ఆయన ఒక ఉపాలయంలో కొలువుతీరి ఉంటారు. 
ఈ కారణాల వలన కృష్ణ జిల్లా లోని భావదేవరపల్లి గ్రామంలోని ఆలయాన్ని అయిదవ క్షేత్రంగా తీసుకోవడం జరిగింది. స్వామివారు కొలువు తీరడం వలన ఈ గ్రామానికి భావదేవరపల్లి అన్న పేరు రావడం కూడా మరో కారణం. 
మరి కొంత మంది పొన్నూరు, బాపట్ల, పెద గంజాం లతో పాటు ఇనుమళ్ల మరియు పాదర్తి గ్రామాలను ఈ పంచ భావన్నారాయణ క్షేత్రాలలో కలుపుతారు. ఇనుమళ్ల గ్రామం  నరసరావు పేటకు దగ్గిరగా ఉండటం వలన దానిని నరసరావుపేట ఆలయంగా పరిగణిస్తున్నారు అనుకోవాలి. ఈ ఆలయానికి సంబంధించిన పౌరాణిక గాధ మరియు చరిత్ర తెలియరావడం లేదు.  
ఇక ఒంగోలు పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరాన ఉన్న పాదర్తి గ్రామంలో ఒక చిన్న శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం కలదు. ఈ ఆలయానికి కూడా తగినంత పౌరాణిక, చారిత్రక ప్రత్యేకతలు లేకపోవడం వలన వీటిని పరిగణన లోనికి తీసుకొనలేము. మొదట చెప్పిన  అయిదు ఆలయాలను పరిగణ లోనికి తీసుకోడానికి మరో కారణం వాటి పౌరాణిక గాధలు. 
బాపట్ల, పెద గంజాం, సర్పవరం మరియు భావదేవర పల్లి ఆలయాల గాధలు దరిదాపుగా ఒకటే ! అన్నీ కూడా వినత మరియు కద్రువల మధ్య నెలకొన్న వివాదంతో ముడిపడి ఉంటాయి.  పొన్నూరు గాధ మాత్రం భిన్నంగా ఉంటుంది. 
మూల గాధలోని ప్రధాన పాత్రలైన "వినుత మరియు కద్రువ" ల మధ్య వాదన జరిగింది సముద్ర తీరాన.  సర్పవరం, భావదేవరాపల్లి, బాపట్ల మరియు పెద గంజాం నాలుగు కూడా సముద్రతీర ప్రదేశాలే ! పొన్నూరు సాగరానికి కొద్దిగా దూరంగా ఉంటుంది. 
ఈ సారూప్యం కూడా ఈ క్షేత్రాలను పంచ భావన్నారాయణ క్షేత్రాలుగా పరిగణించడానికి తోడ్పడింది. 
నైమిశారణ్యంలో అగస్థ్య మహర్షి మునులకు శ్రీ భావన్నారాయణ తత్వం గురించి 
విశిదీకరించారని బ్రహ్మ వైవర్తన పురాణం పేర్కొంటోంది. స్వామి భక్త రక్షకుడు.నిత్య జీవితంలో అనుకోకుండా ఆపదలను లేదా అపవాదాలు ఎదుర్కొనే వారిని కాపాడేవాడు అని ప్రతీతి. 
ఈ ఆలయాలు అన్నింటిలోనూ వైఖానస ఆగమ పద్దతిలో నిత్య పూజాదులు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, శ్రీ రామ నవమి, శ్రీ కృష్ణాష్టమి ఇతర వైష్ణవ పర్వదినాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్థానిక పర్వదినాలైన ఉగాది, సంక్రాంతి, దీపావళి లలో ప్రత్యేక పూజలు జరుపుతారు. శ్రావణ, కార్తీక మరియు ధనుర్మాస పూజలు ఘనంగా చేస్తారు. 
ఇప్పుడు ఒక్కో క్షేత్ర వివరాలను తెలుసుకొందాము. ముందు ఈ క్షేత్రాల పురాణ గాధ గురించి  తెలుసుకొందాము. 

పురాణ గాధ 

కశ్యప మహర్షికి వినత మరియు కద్రువ భార్యలు. సవతుల నడుమ ఉండే సహజ పంతాలు, పోటీ కొంత శత్రుత్వం వీరి మధ్య కూడా ఉండేది. భర్తను వెయ్యి మంది నాగులు సంతానంగా కావాలని పొందినది కద్రువ. దానికి బదులుగా నాగులను జయించగల కుమారులు ఇద్దరిని ప్రసాదించమని కోరింది వినత. వారిలో ఒకరు శ్రీ సూర్య నారాయణుని రధసారధి అరుణుడు(అనూపుడు). రెండవ వాడు అమిత బలవంతుడు , పక్షులకు రాజు శ్రీ మహావిష్ణువు వాహనం అయిన గరుత్మంతుడు. 
ఒకనాడు సవతులు ఇద్దరూ సాగరతీరానికి విహారానికి వెళ్లారు. అక్కడ క్షీరసాగర మధనంలో ఉద్భవించిన ఉచ్ఛశ్వం అక్కడ పరుగులు తీస్తూ కనిపించింది. వారిరువురి మధ్య అశ్వం వర్ణం గురించి వాదన జరిగింది. వినత అశ్వం పూర్తిగా తెల్లగా ఉంది అన్నది. ఆమెను అన్ని విషయాలలో వ్యతిరేకించే కద్రువ గుఱ్ఱం తెల్లని కానీ దాని తోక మాత్రం నల్లగా ఉన్నది అన్నది. వాదన కాస్తా వివాదం లోనికి పంతాలు పందాలకు దారి తీసింది. ఎవరు చెప్పింది నిజమైతే వారికి  ఓడినవారు జీవితాంతం దాస్యం చేయాలన్నది షరతు. అప్పటికి చీకట్లు ముసురుకోవడంతో మరుసటి రోజు ఉదయం వచ్చి చూద్దామని వెళ్లిపోయారు. 
తాను చెప్పింది అబద్దం అని తెలిసిన కద్రువ నాగ కుమారులను పిలిచి అశ్వం యొక్క తోకను నల్లగా మార్చమని ఆదేశించింది. అన్యాయం చేయడానికి వారంతా నిరాకరించారు. ఒక్క తక్షకుడు మాత్రం అంగీకరించాడు. కోపించిన కద్రువ కుమారులను సర్పయాగంలో మరణించమని శపించింది. అది వేరే కధ. 
తక్షకుడు అశ్వం యొక్క తోకను చుట్టుకోవడం తో అది నల్లగా కనపడింది. ఓడిన వినత కద్రువకు దాస్యం చేయవలసి వచ్చింది. అప్పటికి వినతకు సంతానం కలుగ లేదు. ఆమెకు జన్మించిన అండాలు రెండువది జీవం పోసుకోలేదు. తాను తల్లి కాలేదన్న ఆక్రోశంతో జన్మించిన అండాలలో ఒక దానిని పగల కొట్టడం జరిగింది. పూర్తిగా శరీరం రూపు దిద్దుకొని బిడ్డ జన్మించి తనను ఇలా చేసినందుకు సవతి దాస్యం చేయమని శపించాడన్నది మరో గాధ. 
ఆమె సముద్ర తీరాన శ్రీ మహావిష్ణువు ను తనకు  దాస్యవిముక్తి కలిగించే శక్తివంతుడైన కుమారుని ప్రసాదించమని తపస్సు చేసింది. అలా ఈ ఉదంతం కారణంగా  ఈ క్షేత్రాలు ఏర్పడినాయి అని తెలుస్తోంది.  
 విష్ణు పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం ధరించిన అవతారాలు మొత్తం ఇరవై నాలుగు. ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో మాత్రమే పూజలు అందుకొనే శ్రీ భావన్నారాయణ మరియు శ్రీ చెన్నకేశవ వాటిలో లేకున్నా అవి భక్తుల మనో భావాల నుండి ఏర్పడిన రూపాలుగా భావించాలి.  
ఏ రూపంలో సేవించినా భక్తసులభుడు వైకుంఠ వాసుడు అన్నది భక్తులకు తెలిసిన విషయమే !

శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం, పెద గంజాం 









నూతనంగా ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లాలో ప్రముఖ వస్త్ర వ్యాపార కేంద్రం అయిన చీరాలకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద గంజాం గ్రామాన్ని గతంలో "గంధ పురి" అని పిలిచేవారట. కాలక్రమంలో గంజాం గా పిలవబడసాగింది. కొద్ది దూరం రైల్వే స్టేషన్ వద్ద మరో గంజాం ఏర్పడింది. అందువలన ఒకటి చిన గంజాం గా మరొకటి పెద గంజాంగా  పిలవబడసాగాయి. 



















వినతా దేవి ప్రార్థనకు ప్రత్యక్షమైన  శ్రీ భావన్నారాయణ స్వామి తన దేవేరులతో కలిసి ఈ పావన ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు అని తెలుస్తోంది. అనేక మంది మహర్షులు స్వామిని సేవించుకొని మోక్షం పొందారు. 
తొలి ఆలయాన్నిక్రీస్తుశకం  ఒకటవ శతాబ్దంలో మొదటి చోళులలో ప్రముఖుడైన "కరికాళ చోళుడు"నిర్మించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. అనంతర కాలంలో అనేక మంది రాజ వంశాలవారు ఆలయాభివృద్దికి తమ వంతు సహకారం మరియు కైకర్యాలు అందించారని శాసనాలు తెలియచేస్తున్నాయి. 













ఆలయ విశేషాలు 

సువిశాల ప్రాంగణంలో తూర్పు ముఖంగా ఎలాంటి రాజ గోపురం లేకుండా ప్రవేశద్వారం ఉంటుంది. ప్రవేశ ద్వారానికి వెలుపల అంజలి ఘటిస్తూ వినతా సుతుడు భక్తులకు స్వాగతం పలుకుతుంటాడు. 
ఇక్కడే విఘ్ననాయకుడు ఆదిదంపతుల ముద్దుల తనయుడు శ్రీ గణపతి స్థిరనివాసం ఏర్పరచుకొని ఉపస్థితులై ఉంటారు. 
ఎదురుగా ధ్వజస్థంభం , బలి పీఠం ఉంటాయి. విశాలమైన ముఖమండపం పై భాగాన భూనీళా సమేత శ్రీ భావన్నారాయణ స్వామి శిల్పం కనపడుతుంది. ఇదే మండపానికి దక్షిణ ద్వారం కూడా ఏర్పాటు చేయబడినది. దాని పైన ఆదిశేషుని పడగల నీడన శయనించిన శేషతల్ప సాయి సుందర శిల్పం దర్శనమిస్తారు. 
ముఖ, అర్ధ మండప స్తంభాల పైన తెలుగు, కన్నడ మరియు తమిళ శాసనాలుకనపడతాయి.     అర్ధ మండపం లోనికి ప్రవేశించే ద్వారానికి నిలువెత్తు రూపాలలో వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు స్వామి సేవలో నిమగ్నమైఉన్నారు . 
అర్ధ మండపంలో శ్రీ నమ్మాళ్వార్, శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులవారు కొలువై ఉంటారు. పక్కనే దక్షిణాముఖులై శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనమిస్తారు. ఈ అర్చనామూర్తిని కరికాళ చోళుని కాలంలో ప్రతిష్టించడం జరిగిందని చెప్తారు. తిరువనంతపురంలో వెలిసిన స్వామిని పోలి ఉండటం విశేషం. 
విడిగా సన్నిధిలో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. 
గర్భాలయంలో శ్రీ భూనీళా సమేత శ్రీ భావన్నారాయణ స్వామి పుష్ప, స్వర్ణాభరణ భూషితులై నేత్రపర్వంగా స్థానక భంగిమలో భక్తులకు అభయం ప్రసాదిస్తుంటారు. 
 క్షేత్రాలకుడైన అంజనాసుతుడు దక్షిణాముఖుడై ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. స్వామి కొలిచినవారి కోర్కెలు తీర్చే కొంగు బంగారమని భక్తులు విశ్వసిస్తారు. మంగళ వారాలు, శనివారాలు విశేషపూజలు కేసరీ నందనునికి జరుపుతారు. 
ప్రాంగణంలో కొంత మేర శిధిలమైనా సౌందర్యాన్ని కోల్పోని శిల్పాలు కనిపిస్తాయి. ఆలయ ప్రకారం నిర్మాణము కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కొండరాళ్లతో మనిషి సులభంగా కదిలే స్థలం వదిలి రెండు వరుసలలో నిర్మించడం జరిగింది. ఇలాంటి ప్రకారం మనకు శ్రీశైల ఆలయంలో కనపడుతుంది. 
ప్రాంగణంలో స్థానిక భక్తులు స్వంత న్వయంతో శ్రీ రామ నామ సప్తాహం జరిపి శ్రీరామ కోటి స్తంభాన్ని నిర్మించారు. 
మన రాష్ట్రంలో అరుదుగా కనిపించే శిల్ప విన్యాసం ఈ ఆలయంలో కనిపిస్తుంది. 
మార్చి నెల మొదటి వారంలో తిరిగి అక్టోబర్ నెల చివరి వారంలో ప్రత్యక్షనారాయణుడు తన తొలి  కిరణాలతో శ్రీ భావన్నారాయణ స్వామిని అభిషేకిస్తారు. 
నాటి శిల్పుల నిర్మాణ కౌశలానికి, వారికి గల ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి ఆశ్చర్యం కలుగుతుంది. 
నిత్య పూజలు, భజనలు జరుగుతాయి. 
విశేష పౌరాణిక చారిత్రక విశేషాలను స్వంతం చేసుకొన్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 
చీరాల పట్టణం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద గంజాం చేరుకోడానికి స్వంత లేదా ప్రవేటు వాహనాల మీద ఆధారపడటం ఉత్తమం. చీరాలలో  భోజన సౌకర్యాలు లభిస్తాయి. దేశంలోని అన్ని ప్రదేశాల నుండి చీరలకు రైలు సదుపాయం ఉన్నది. 

శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి ఆలయం, పొన్నూరు














ఆర్తులను ఆదుకొనేవానిగా శ్రీ భావన్నారాయణునికి పేరు. అలా ఒక భక్తునికి అండగా నిలిచినందున స్వామిని శ్రీ సాక్షి భావనారాయణుడు అని పిలుస్తారు. 
తొలి యుగంలో "గోష్టీ వనం" గా పిలవబడిన ఈ ప్రదేశంలో సృష్టికర్త శ్రీ బ్రహ్మదేవుడు తపస్సు చేశారట. శ్రీ మన్నారాయణుడు సాక్షాత్కరించి విధాతకు సృష్టి రహస్యాలను బోధించారట. కమలాసనుడు స్వామిని ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొమ్మని కోరగా అనంతర యుగంలో ఆయన కోరిక నెరవేరునని తెలిపారట. 
మహర్షులలో ఒకరుగా కీర్తి గడించిన "అత్రి మహాముని" కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో శ్రీ హరి ని సందర్శించాలన్న తలంపుతో తీవ్రమైన తపస్సు చేశారట. సంతుష్టుడైన వైకుంఠ వాసుడు దర్శనం అనుగ్రహించారట. 
మహర్షి "స్వామి ఇంతకాలం నీ రూపాన్ని ఇలా మనస్సులో భావించుకొని నిన్ను ప్రార్ధించాను. కనుక నా వినతి మేరకు శ్రీ భావన్నారాయణుడు అన్న పేరుతొ ఇక్కడ ఉండుము " అని ప్రార్ధించారట. మహాముని కోరిక మేరకు స్వామి అక్కడ స్థిరపడినారట. 
కొన్ని యుగాలు గడిచిపోయాయి. 
కాలక్రమంలో  గోష్టీ వనం "స్వర్ణపురి" గా పిలవబడసాగింది. ఈ ప్రాంతానికి చెందిన ధనవంతుడైన బ్రాహ్మణునికి సంతానం లేకపోవడంతో గూని వాడైనా మేనల్లుడు గోవిందుని తోడుగా తీసుకొని కాశీ క్షేత్రానికి వెళ్ళాడట. అక్కడ ఒక మండలం పాటు దీక్షగా కాశీ విశ్వనాధుని, శ్రీ భావనారాయణుని సంతానం ప్రసాదించమని కోరుకొన్నారట. 
అప్పుడు మేనల్లుడు మామని శ్రీహరి కృపతో కుమార్తె జన్మిస్తే తనకిచ్చి వివాహం చేయమని కోరాడట. బిడ్డ జన్మించినప్పుడు కదా అని సరే అన్నాడట మామ. 
వారు తిరిగి గ్రామానికి వచ్చిన కొంతకాలానికి బ్రాహ్మణుని భార్యగర్భవతి కావడం త్వరలో ఒక ఆడశిశువుకు జన్మనివ్వడం జరిగింది. 
కొన్ని సంవత్సరాలకు ఆ బాలిక యుక్తవయస్సుకు వచ్చింది.  గోవిందుడు మామకు కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానన్న వాగ్దానం గుర్తు చేసాడు.  అందవికారుడు, దానం లేని వాడికి తన ఒక్కగానొక్క సుందర గారాల పుత్రికను ఇవ్వడం ఇష్టం లేక పోయింది. అందువలన ఇవ్వను అంటూ తాను ఏ భావన్నారాయణ సన్నిధిలో మాట ఇవ్వలేదు అన్నాడట. 
ఆవేదన చెందిన గోవిందుడు ఊరి పెద్దలకు విషయం చెప్పి తాను కాశీ వెళ్లి శ్రీ భావన్నారాయణను సాక్షిగా తీసుకొని వస్తాను అని వెళ్ళాడట. 






ప్రయాసలుపడి వారణాశి చేరుకొని శ్రీ భావన్నారాయణ సన్నిధిలో తన మామ మాటతప్పిన విషయం గురించి విన్నవించుకొని వాపోయాడ. ఆ అమాయకుని వేదన చూసి స్వామి తాను అతనితో వారి గ్రామానికి వచ్చి సాక్ష్యం చెబుతానన్నారు. కానీ మార్గంలో అతను ఎట్టి పరిస్థితులలో వెనుతిరిగి చూడకూడదు అన్న షరతు విధించి బయలుదేరారట. 
స్వర్ణపురి వద్దకు వచ్చేసరికి వెనుక ప్రభువు వస్తున్న అడుగుజాడలు వినపడక పోవడంతో గోవిందుడు వెనుతిరిగి చూడగా స్వామి ప్రస్తుతం ఆలయం ఉన్న చోట శిలగా మారిపోయారట. 
విషయం తెలిసిన గోవిందుని మామ తన తప్పు ఒప్పుకొని గోవిందునితో తన కుమార్తె వివాహం చేసాడట. అలా స్వామి యుగాల ముందు విధాతకు ఇచ్చిన మాటతో పాటు నిజ భక్తునికి సాక్షిగా నిలిచారు. 
అందువలన శ్రీ సాక్షిభావన్నారాయణ స్వామిగా పిలవబడుతున్నారు. ఈ క్షేత్రంలో గల మరొక విశేషం ఏమిటంటే స్వామి వారి ఆదేశం మేరకు అర్చకస్వాములు ఎక్కడి నుండో వచ్చారు. నాటి నుండి వారి వారసులే అర్చకత్వ భాద్యతలు నెరవేరుస్తున్నారు. 
ఉపాలయాలలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు, శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వైఖానసులు, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ కాశీ విశాలాక్షి,  శ్రీ రామానుజాచార్యులవారు దర్శనమిస్తారు. పన్నిద్దరు ఆళ్వార్ల సన్నిధి కూడా కలదు. 
ముఖ మండపంలో స్వామి వారు కాశీ నుండి ఇక్కడికి తరలి రావడానికి కారణమైన శ్రీ అక్క లక్షి, గోవింద దంపతుల విగ్రహాలు ఉంటాయి. 
వెలుగు చూసిన శాసన ఆధారాల ఆధారంగా మొదటి ఆలయాన్ని కుళోత్తుంగ చోళుని కాలంలో నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. తదనంతర కాలంలో స్థానిక పాలకులు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేశారు.  
పంతొమ్మిదవ శతాబ్దంలో అమరావతి పాలకునిగా ఉన్న శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆయన శిలా విగ్రహం ప్రాంగణంలో ఉంటుంది. 
పొన్నూరు నగరంలో శ్రీ ఆంజనేయ, శ్రీ గరుత్మంత, దశావతార, శ్రీ పరమేశ్వర ఆలయాలు తప్పక సందర్శించవలసినవి. 











శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం, బాపట్ల 

 స్వామివారి పేరు మీదగా భావపురి గా పిలువబడి,కాలక్రమంలో బాపట్లగా మారిన  ఊరిలో స్వామి కొలువు తీరడం వెనక ఉన్న పురాణ గాధ కద్రువ మరియు వినతల మధ్య నెలకొన్న వివాదంతో ముడిపడి ఉన్నది అంటారు. కానీ ఇదుమిద్దంగా ఇది అని   తెలియరాలేదు. బహుశా ఆమె ఈ ప్రదేశంలో కూడా స్వామివారి గురించి తపస్సు చేసి ఉండవచ్చును.  
 ప్రస్తుత ప్రధాన  ఆలయం చోళ రాజుల నిర్మితంగా శాసనాల ఆధారంగా తెలుస్తోంది. చోళ సామ్రాజ్యం పదమూడో శతాబ్దం నాటికి పూర్తిగా క్షీణించి పోయింది. ఒకటవ, రెండవ కుళో త్తుంగ చోళ రాజుల కాలంలోనే చోళ సామ్రాజ్యం నేటి ఒడిషా మరియు   ఛత్తీస్ ఘడ్ వరకు విస్తరించినది అని చరిత్ర పుస్తకాలలో ఉన్నది. ఒకటవ కుళోత్తుంగుడు శైవ మతాభిమాని.కనుక రెండవ కుళోత్తుంగుని కాలంలోనే   బాపట్ల భావన్నారాయణ ఆలయ నిర్మాణం జరిగి ఉండాలి అనుకోవాలి.
పంతొమ్మిదో శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఆలయాన్ని అభివృద్ధి   చేసారని శాసనాధారాలు తెలుపుతున్నాయి.  
శ్రీమన్నారాయణుడు శ్రీ క్షీర భావన్నారాయణ స్వామిగా పూజలందుకునే  ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి తాయారు, శ్రీ ఆండాళ్, శ్రీ కేశవ స్వామి, శ్రీ రంగనాయక, శ్రీ జ్వాలా   నరసింహ, శ్రీ రామ ఆదిగా గల దేవతల సన్నిధులతో పాటు వైఖానస, గరుడాళ్వార్, పన్నిద్దరు ఆళ్వారుల సన్నిధులు కూడా కలవు.
ఇవన్నీ గర్భాలయం చుట్టూ,ప్రదక్షిణా ప్రాంగణంలోనే నెలకొని ఉండటం విశేషం
పూర్తిగా రాతి నిర్మిత ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. చోళ నిర్మాణమైన ఎక్కడా వారు నిర్మించిన అనేక ఆలయాలలో మాదిరి  శిల్పకళ   కనపడదు.
కానీ వెలుపలి గోడలపైన ఎన్నో తమిళ మరియు తెలుగు శాసనాలు చదవ గలిగే స్థితిలో కనపడతాయి.శనివారాలలో విశేష పూజలు జరుగుతాయి
తొలి  ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ముఖ్యమైన పండుగలు.శ్రీరామనవమికి, కృష్ణ    జన్మాష్టమి  ఇతర శ్రీ వైష్ణవ పర్వదినాలను కూడా వైభవంగా జరుపుతారు.
ధనుర్మాసంలో తిరుప్పావై గానం చేస్తారు. భోగి నాడు శ్రీ గోదా కళ్యాణం రంగరంగ వైభవంగా జరుపుతారు.
పాత రాజ గోపురం 2011 సంవత్సరంలో కుప్పకూలిపోయింది.ప్రస్తుతం నూతన గోపుర నిర్మాణం జరుగుతోంది.
ఆలయం ఉదయం ఆరు నుండి పదకొండున్నర వరకు,తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఏడున్నర వరకు తెరచి ఉంటుంది.
ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఆలయాన్ని మరింతగా అభివృద్ధి   చేయవలసిన అవసరం ఉన్నది.  

శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం, భావదేవరపల్లి 


పంచ భావన్నారాయణ స్వామి ఆలయాలలో నాలుగవది కృష్ణా జిల్లా లోని నాగాయలంక కు సమీపంలో ఉన్నది. 
వినత మరియు కద్రువల మధ్య నెలకొన్న వివాదంతో ఈ క్షేత్ర గాధ ముడిపడి ఉన్నది. 
సవతి కద్రువ చేతిలో పందెంలో ఓడిపోయిన వినత సముద్ర తీరంలో తనకు అత్యంత శక్తివంతుడైన కుమారుని ప్రసాదించమని శ్రీహరిని కోరుకుంటూ తపస్సు చేసిన స్థలంగా చెబుతారు. ఆ తరువాతనే గరుత్మంతుడు జన్మించడం, తల్లి దాస్య విముక్తి కొరకు దేవలోకం నుండి అమృతభాండం తేవడం జరిగాయి.   
ఆలయం చిన్నదైనా పునః నిర్మించడం వలన శోభాయమానంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న గాధల ఆధారంగా తొలి ఆలయం సుమారు పదహారు వందల సంవత్సరాల క్రిందటిది అని విశ్వసిస్తారు స్థానికులు. 
పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో వచ్చిన దివిసీమ ఉప్పెన సమయంలో సుమారు వెయ్యి మందికి పైగా ప్రజలు ఈ ఆలయంలో తలదాచుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. నాటి నుండి శ్రీ రాజ్య లక్ష్మీ సమేత శ్రీ భావన్నారాయణ స్వామి పట్ల  మరింత భక్తి విశ్వాసాలు పెరిగాయి. 
నిత్య పూజలతో కళకళలాడే ఈ క్షేత్రానికి మచిలీపట్టణం లేదా విజయవాడ నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. 
విజయవాడ నుండి కృష్ణానది కరకట్ట మార్గంలో వెళితే తోట్లవల్లూరు, ఐలూరు, శ్రీకాకుళం, నడకుదురు ఇలాంటి పురాతన క్షేత్రాలను చూసుకొంటూ వెళ్లవచ్చును. 

శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం, సర్పవరం 

కాకినాడ పట్టణానికి అతి సమీపంలో ఉన్న సర్పవరంలో శ్రీ భావన్నారాయణ స్వామి కొలువు తీరడానికి సంబంధించిన గాధ మరల వినత మరియు కద్రువల మధ్య తలెత్తిన వివాదంతో ముడిపడి ఉండటం విశేషం. దీనిని గురించి బ్రహ్మ వైవర్తన పురాణం తెలుపుతుంది. 
తన మాట వినని నాగ కుమారులను అగ్ని కీలలలో ఆహుతి అవ్వమని కద్రువ శపించిన విషయం తెలిసినదే కదా!  అప్పుడు వారిలో పెద్దవాడైన ఆదిశేషువు ఈ ప్రదేశానికి వచ్చి శ్రీ మన్నారాయణుని గురించి తీవ్రమైన తపస్సు చేశారట. స్వామి సాక్షాత్కరించి అతనిని తన పాన్పుగా నిత్య సూరిగా ఉండమని వరమిచ్చారట. 
ఈ సంఘటన వలన సర్పం వరం పొందిన ఈ ప్రదేశంగా  సర్పవరం అన్న పేరొచ్చింది అంటారు. 
అగస్థ్య మహర్షి సౌనకాది మునులకు ఈ క్షేత్ర మహత్యాన్ని వివరించారని పురాణాలు తెలుపుతున్నాయి. 
 బ్రహ్మ  లోకంలో సమస్త దేవతలు కూర్చొని ఇష్టాగోష్టి సలుపుతున్న వేళ విష్ణు మాయ  ప్రస్థాపన వచ్చిందట. విధాతతో సహా అందరూ లోక సంరక్షకుడు అయిన శ్రీహరి మాయ నుండి ఎవరూ తప్పించుకోలేరు అని ఏకాభిప్రాయం వెలిబుచ్చారట. 
కానీ నారద మహర్షి నిరంతర నారాయణ మంత్రాన్ని జపించే తన మీద విష్ణుమాయ పనిచేయదని గర్వంగా ప్రకటించారట. 
కొంత కాలం తరువాత లోకసంచారం చేస్తూ దేవర్షి సర్పవరం ప్రాంతాలకు వచ్చారట. అక్కడ గల  పుష్కరుణులు  ఆయనను ఆకర్షించాయట. ఒక దానిలో స్నానం చేయగానే మహర్షి అందమైన యువతిగా మారి పోయారట. గతాన్ని మర్చిపోయారట. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆ ప్రాంత రాజకుమారుని ప్రేమలో పడి వివాహం చేసుకొని అరవై మంది మగపిల్లలకు జన్మనిచ్చారట. వారికి పెట్టిన పేర్ల ద్వారానే మన తెలుగు సంవత్సర నామాలైన "ప్రభావ, విభవ ..." వచ్చాయంటారు. 
మరో రాజుతో జరిగిన యుద్ధంలో ఆమె భర్త, పిల్లలు మరణించారట. ఆ శోకాన్ని భరించలేక ఆమె రెండవ  పుష్కరణి లో దూకినదట. 
అలా దూకిన రాణి తిరిగి నారద మహర్షి రూపంలో వెలుపలికి వచ్చారట. జరిగినదంతా గుర్తుకు వచ్చి  అంతా విష్ణుమాయ అని అర్ధం చేసుకొని తన అహంకారానికి చింతించి శ్రీ మన్నారాయణుని క్షమించమని వేడుకొన్నారట. భక్తసులభుడైన శ్రీహరి ప్రత్యక్షమై నారదుని సంతోషపరచారట. ఈ సరోవరాలు ఆలయంలో నేటికీ కనిపిస్తాయి. 





తొలి ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. 
ఎత్తైన రాజగోపురం, సుందర శిల్పాలతో కూడిన కళ్యాణ మండపం, ఆస్థాన మండపాలలో చోళుల, విజయనగర నిర్మాణ శైలులు కనిపిస్తాయి. కాలక్రమంలో అనేక రాజ వంశాల వారు ఆలయ అభివృద్ధిలో తమ వంతు కృషి చేశారని తెలుస్తోంది. 
శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయ సందర్శన ఇహపర సుఖాలను ప్రసాదించేది. 
 పంచ భావన్నారాయణ ఆలయాలను చేరుకోడానికి రైలు, రహదారి మార్గాలు ఉన్నాయి. అన్ని ప్రదేశాలలో చక్కని వసతి సౌకర్యాలు అందుబాటు ధరలలో లభిస్తాయి. 
భక్తుల భావాల నుండి వెలిసిన శ్రీ భావన్నారాయణ స్వామి కొలిచినవారి కొంగు బంగారం అన్నది భక్తుల అనుభవాల వలన ఏర్పడిన  విశ్వాసం నేడు  విశ్వవ్యాప్తం అయ్యింది. 

ఓం నమో నారాయణాయ !!!!


 
 










 
 





 





















































































































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...