28, జులై 2023, శుక్రవారం

Sri Panikeswara Swamy Temple, Panyam

 

                            కరములు ప్రసాదించిన కపర్ది 


తీర్ధయాత్రలు అనగానే ,మన ఆలోచనలు మరియు ప్రణాళికలు అన్నీ తమిళనాడు, కర్ణాటక లేదా ఉత్తర భారత దేశం వైపు మళ్ళుతాయి.  మనరాష్ట్రంలో ఎన్నో విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగి , శిల్ప సౌందర్యాలను ప్రదర్శించే ఆలయాలు కలవు. 


















రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. అద్భుత ఆలయాలకు నిలయం కూడా !
అంతటి విశేషమైన సీమలో నేటికీ చక్కని ఆలయాలు, నిర్మాణాలు కనపడతాయి. 
ఒక్క రాయలసీమ లోనే కాదు కోనసీమ, కోస్తా ఆంధ్ర అన్నిచోట్లా చూడచక్కని దేవాలయాలు కనపడతాయి. 
స్థానికులు కూడా వాటి పట్ల ఆసక్తి చూపించకపోవడం విచారకరం. 
ప్రతి గ్రామం లేదా నగరంలో ఒక పురాతన ఆలయం కనపడటం మన  రాష్ట్ర గొప్పదనం. వాటిని అభివృద్ధి చేసుకోలేకపోవడం, వాటిని గురించి ప్రచారం చేసుకోలేక పోవడం మన దురదృష్టం. 
ఈ విషయాలను పక్కన బెట్టి నేను ఈ మధ్యన దర్శించిన మరో పురాతన దేవాలయం విశేషాలను చూద్దాము. 
నవనంది క్షేత్రాల సీమ నంద్యాల పట్టణానికి సమీపంలోని "పాణ్యం" లో గొప్ప ఆలయం ఒకటి కలదు. మరికొన్ని పురాతన ఆలయాలు ఉన్నాయి కానీ ఇది చాలా ప్రత్యేకమైనది. 
(శ్రీ సుంకులమ్మ ఆలయం, శ్రీ వీరనారాయణ స్వామి దేవాలయం, శివాలయం)
ఈ ఆలయ గాధ,చరిత్ర మరియు నిర్మాణ విశేషాలు అన్నీ సుమారు పన్నెండవ శతాబ్దపు నాటివిగా తెలుస్తున్నాయి. 














విష్ణువర్ధన రాజు 

హొయసల పాలకులలో ఈయన ఒక పేరొందిన పాలకుడు గా చరిత్ర గుర్తించింది. సుమారు అర్ధ శతాబ్ద కాలం దక్షిణ భారత దేశాన్ని ముఖ్యంగా నేటి కర్ణాటక ప్రాంతాలను జనరంజకంగా పాలించిన వాడు విష్ణువర్ధనుడు. 
జన్మతః విష్ణువర్ధనుడు జైనుడు. అప్పటి దాకా హొయసల రాజులు జైన మతాన్ని అవలంభించేవారు. ప్రముఖ వైష్ణవ గురువు, విశిష్టాద్వైత వ్యాఖ్యాత శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యుల ప్రభావంతో విష్ణువర్ధనుడు హిందూమతం లోనికి మారాడు. గురువు ప్రభావంతో శ్రీ వైష్ణవ సంప్రదాయాలను అనుసరించినా శైవంతో పాటు, జైన బౌద్ధ మతాలను ఆదరించారని తెలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బేలూరు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాత విష్ణువర్ధనుడే !
విష్ణువర్ధనునికి విపరీతమైన రాజ్యకాంక్ష ఉండేదట. స్వయంగా గొప్ప యోధుడు అయిన ఆయన నిరంతరం రాజ్య విస్తరణ కోసం యుద్ధాలలో మునిగి తేలుతుండేవాడట. ఒకసారి ఆయన యుద్దానికి బయలుదేరి తిరిగి తన మందిరానికి సుమారు పదిహేను సంవత్సరాల తరువాత వచ్చారట. 
విష్ణువర్ధనుడు యుద్దానికి వెడలినప్పుడు కుమార్తె వయస్సు ఒక సంవత్సరం మాత్రమే ! తిరిగి వచ్చేనాటికి యుక్తవయస్సుకు వచ్చింది. 
నాటి రాత్రి కుమార్తె తండ్రి వద్దనే నిద్రించినదట. నిద్రలో మహారాజు చేతులు తెలియకుండానే ఆ చిన్నారి వక్షస్థలం తాకాయట. వెంటనే నిద్ర లేచిన విష్ణువర్ధనుడు తాను తెలియక చేసినా తప్పు తప్పే కదా ! అని చింతించాడట. 


























మరునాడు సభలో జరిగినది చెప్పి దానికి తగిన శిక్ష కూడా తెలుపని గురువులను,న్యాయ కోవిదులను, మంత్రులను అడిగారట. వారు న్యాయ శాస్త్రాలలో చేతులను ఖండించడమే తగిన శిక్ష అని తెలిపారట. 
కుమార్తె, ఇద్దరు రాణులు వద్దని వారించినా వినకుండా చేతులను మోచేతి దాకా ఖండించుకున్నాడట. 
 బాధను తట్టుకోలేక రక్తసిక్తమైన చేతులతో తిరుగుతూ ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న పెద్ద పాముపుట్టలో మరణించాలన్న ఆలోచనతో తెగిన చేతులు పెట్టి సృహతప్పి పోయాడట. అప్పుడతనికి స్వప్నంలో మహేశ్వరుడు దర్శనమిచ్చి ఇది ఒక పవిత్ర ప్రదేశం అని అతనిని ఇక్కడకు రప్పించడానికి ఇదంతా సృష్టించానని చెప్పారట. నీ చేతులు నీకు వస్తాయి. నాకు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించామని ఆదేశించారట. 
సృహ లోనికి వచ్చిన రాజు చేతులు యధాప్రకారం ఉండటం చూసి ఇదంతా ఈశ్వర లీల అని తలంచి ఆలయాన్ని నిర్మించారట. 
"పాణియం" అనగా హస్తాలు అని అర్ధం. తనను చేతులు ప్రసాదించి, చేసిన పాపాన్ని తొలగించిన స్వామి కనుక " శ్రీ పాణికేశ్వర స్వామి" అన్న పేరుతో లింగాన్ని ప్రతిష్టించారట. 








ఆలయ విశేషాలు 

పాణ్యం ఊరికి దూరంగా చెరువు గట్టున, పచ్చని పొలాల మధ్య నెలకొని ఉంటుంది ఆలయం. తూర్పుముఖంగా అయిదు అంతస్థుల రాజా గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఒక పురాతన, మరొక నూతన నిర్మాణ ఆలయము కనిపిస్తాయి.  
ప్రాంగణంలో దక్షిణ దిశలో నైరుతి దిక్కులో ఉన్న పురాతనమైనదే విష్ణువర్ధన మహారాజు నిర్మించిన ఆలయం అని చెబుతారు. 
ఆలయం దరిదాపుగా శిధిలావస్థలో ఉన్నదని చెప్పవచ్చును. అనంతర కాలంలో పాలన లోనికి వచ్చిన అన్యమతస్థుల దాడులలో ఆలయం ఈ స్థాయికి వచ్చిందని చెబుతారు. 
ముఖమండపం పూర్తిగా నేల మట్టమైనది. అందులో ఉండిన భిన్నమైన శ్రీ వినాయక, శ్రీ రామ, లక్ష్మణ, గుఱ్ఱం పైన ఖడ్గం ధరించి యుద్దానికి వెళుతున్న విష్ణువర్ధన శిల్పాలు ఒక పక్కన పెట్టి ఉంటాయి. నాటి శిల్పులు మలచిన శిల్పాలు, లతలు, యక్షిణులు, పుష్పమాలలు నేటికీ సుందరంగా కనిపిస్తాయి. స్తంభాల పైన తమిళ శాసనాలు కనిపిస్తాయి.   
గర్భాలయంలో శ్రీ పాణికేశ్వర స్వామి లింగ రూపంలో కొలువై ఉంటారు.

గోపురంలో గొడ్డలి 

ఆలయం విమానంలో ఒక గొడ్డలి ఉంటుంది. అది అక్కడ గుచ్చుకొని ఉండటానికి సంబంధించి రకరకాల కధలు స్థానికంగా  వినిపిస్తాయి. వాటి విషయం ఎలా ఉన్నా అది ఎలా అక్కడికి చేరుకొన్నది అన్నది ఒక పెద్ద ప్రశ్న.  రాతి పలకల మధ్య ఇరుక్కొని ఉన్న గొడ్డలిని తీస్తే ఆలయం మొత్తం కుప్పకూలిపోతుంది అని స్థానికులు విశ్వసిస్తారు.
క్రింద నుండి చూస్తే పూర్తిగాకాకున్నా పిడి భాగం కనపడుతుంది. 
ఆలయం వెనుక ఒక పెద్ద పాము పుట్ట కనపడుతుంది. ఆ నాడు విష్ణువర్ధన రాజు బాధ తట్టుకోలేక పాము కాటుతో మరణిద్దాం అన్న ఆలోచనతో చేతులు పెట్టినది దీనిలోనే అంటారు. 
పక్కనే నాగ ప్రతిష్టలు కనిపిస్తాయి. 

శ్రీ పాణికేశ్వర స్వామి ఆలయం 








పురాతన ఆలయం అంత కాదు కానీ ఈ నిర్మాణం కూడా పాతదే !
ఈ రెండు ఆలయాల మధ్యన ఒక రాతి కళ్యాణ మండపం ఉంటుంది. ఈ ఆలయానికి దక్షిణం పక్క ఒక ద్వారం కూడా కనపడుతుంది. ఇక్కడ ఒక ఋషి లేదా సిద్ధుని విగ్రహం కనపడుతుంది. 
గర్భాలయంలో శ్రీ పాణికేశ్వర స్వామి లింగ రూపంలో విభూది, చందన, కుంకుమ శోభితులై దర్శనమిస్తారు. ముఖ మండపంలో నందీశ్వరుడు కొలువై ఉంటారు. 
మండపంలో పైన తెలిపిన ఆలయ గాధ రాసి ఉంచారు. 
ప్రాంగణం ఉత్తర భాగాన మరో సన్నిధిలో అమ్మవారు దర్శనమిస్తారు. స్వామివారికి, అమ్మవారికి విడివిడిగా ధ్వజస్తంభాలు ఉంటాయి. 






ఆగ్నేయ దిశలో వట వృక్షం క్రింద పడమర ముఖంగా వాయునందనుడు చిన్న గద్దె  మీద సింధూరవర్ణ శోభితులై ఉంటారు. 
పాత ఆలయం వద్ద, రాజగోపురం వద్ద తెలుగు, కన్నడ మరియు తమిళ శాసనాలు కనపడతాయి. ఇవన్నీ ఆలయానికి సమర్పించుకున్న కైంకర్యాల వివరాలను తెలిపేవిగా చెబుతారు. 
రాజగోపురానికి, ముఖమండపానికి కొంత మర్మత్తుల ఆవశ్యకత కనపడుతుంది. 
నిత్య పూజలు జరిగే ఈ ఆలయాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా వెళ్లి సందర్శించుకునే అవకాశం ఉన్నది. 
సోమవారాలు, కార్తీకమాసంలో, శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. 











 నంద్యాల లేదా కర్నూలు నుండి సులభంగా పాణ్యం చేరుకోవచ్చును. ప్రధాన రహాదారి నుండి ఆలయం వరకు రానూ పోనూ ఆటో మాట్లాడుకొని వెళ్లడం ఉత్తమం. సొంత వాహనంలో అయితే ఆలయం వరకు వెళ్ళవచ్చును. 
వసతి మరియు భోజన సదుపాయాలు కర్నూలు లేదా నంద్యాలలో లభిస్తాయి. 
తగినంత ప్రచారం కల్పిస్తే శ్రీ పాణికేశ్వర స్వామి ఆలయం ఒక ప్రధాన దర్శనీయ క్షేత్రంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. 











 నమః శివాయ !!!











1 కామెంట్‌:

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...