13, జులై 2023, గురువారం

Samudram, Tiruvannamalai

                               తిరువణ్ణామలై లో సముద్రం 


తిరువణ్ణామలై అంటే అరుణాచలం. అరుణాచలం అంటే ఎఱ్ఱని పర్వతం. స్వయం శివ స్వరూపం కదా ! అక్కడ సముద్రం ఎక్కడున్నది ? అన్న సందేహం పాఠకులకు కలగవచ్చును.
 నగర మధ్యలో అంబరాన్ని అంటేలా కనిపించే అరుణగిరి గత నాలుగు యుగాలుగా పరమేశ్వర రూపంగా ఆరాదించబడుతోంది. పర్వతం చుట్టూ అష్ట దిక్పాలక లింగాలు, సూర్య చంద్ర లింగాలు, ఇంకా అనేక లింగాలు, నందులు, ఆశ్రమాలు నెలకొని ఉన్నాయి. భక్తులు చేసే గిరి ప్రదక్షిణ సమయంలో వీటన్నింటినీ సందర్శించవచ్చును. 
నగరంలో చాలా పురాతన ఆలయాలు కూడా కలవు. 
కానీ ఈ సముద్రం ఎక్కడి నుండి వచ్చింది అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.  
మనం చరిత్ర పుస్తకాలలో చదువుకొని ఉన్నాము. పూర్వం రాజులు దారుల పక్కన చెట్లు నాటించెను, నీటి కోసం చెరువులు త్రవ్వించెను అని. 
అలానే ఒక రాజు తన రాణి మనోభీష్టం నెరవేర్చడానికి తిరువణ్ణామలైలో సముద్రాన్ని పోలిన పెద్ద చెరువును త్రవ్వించారు. 
ఈ ఉదంతాన్ని స్వయంగా భగవాన్ శ్రీ రమణ మహర్షి తన శిష్యులకు తెలిపారు. 





ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించే రాజుగారి భార్య అంతఃపురంలో వేరువీరు మాట్లాడుకొంటున్న మాటలలో సముద్రం గురించి విన్నది. చెలికత్తెలు అడిగింది. ఎవరూ చూసినవారు కారు. అందరూ సముద్ర సౌందర్యం, అలల అల్లరి, కెరటాల సోయగం, అవి చేసే సవ్వడి గురించి విన్నవారే ! దానికే  వారు మరి కొంత జోడించి రాణిగారికి  తెలిపారు. 
వారు వర్ణించిన విధానం, అసలెప్పుడూ చూడని సముద్ర సోయగం రాణి మదిలో స్థిరపడి పోయింది. ఎలాగైనా ఒకసారి సముద్రాన్ని చూడాలి అన్న కోరిక కలిగింది. 
రాజుగారు ఆ సమయంలో చుట్టుపక్కల రాజ్యాల పాలకులతో సరిహద్దు వివాదాలు, ఆధిపత్య పోరులతో సతమత మౌతున్నారు. 
ఇది సరైన సమయం కాదని కోరికను మనస్సులో దాచుకొని ఉండిపోయారు మహారాణి. 





కొంత కాలం గడిచింది. పరిస్థితులు కొంత సర్దుకొన్నాయి. ఒకనాడు ఏకాంత మందిరంలో తనతో ముచ్చటిస్తున్న మహారాజుకు మనసులోని కోరికను వెల్లడించింది మహారాణి. 
మహారాజు కొంత తడబడ్డారు. చుట్టుపక్కల రాజ్యాలతో సంధి సంప్రదింపులు ఇంకా పూర్తి కాలేదు. యుద్ధం మాత్రం వద్దన్న నిర్ణయానికి వచ్చారు. అంతే ! శతృత్వభావాలు అలాగే ఉన్నాయి. రాజ్యకాంక్షతో ప్రతి ఒక్కరూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. 
రాణి కోరిక కాదనలేరు. పరిస్థితులు అనుకూలంగా లేవు. తిరువణ్ణామలై కి సమీప సముద్ర తీరం చేరుకోవాలంటే మరో రాజ్యం గుండా వెళ్ళాలి. ఆ పాలకుడే ఈ యుద్ధ వాతావరణానికి ప్రధాన కారకుడు. 
ఏమి చేయాలో పాలుపోలేదు. 
మంత్రులను పిలిపించుకొని విషయం తెలిపి, పరిష్కార మార్గం తెలుపమని కోరారు. 
వారంతా సుదీర్ఘంగా ఆలోచించి ఒక ఉపాయం కనుగొన్నారు. దాని ప్రకారం నగరానికి దక్షిణ పక్క ఉన్న విశాల ప్రదేశంలో ఒక పెద్ద కోనేరు అది కూడా సముద్రం మాదిరి ఉండేలాగా నిర్మించాలని!
దీనివలన మహారాణి కోరిక తీరుతుంది, యుద్ద వాతావరణం సరైన పనులు లేని ప్రజలకు పని కల్పించినట్లు అవుతుంది. అదే విధంగా ఈ కోనేరును శ్రీ అరుణాచలేశ్వరుని ఆలయ ఉత్సవాలకు వినియోగించుకోవచ్చును. 
అన్నీ విన్న మహారాజు తన అంగీకారం తెలిపారు. 
శరవేగంతో పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే కోనేరు త్రవ్వడం జరిగింది. చేసిన అదనపు హంగుల వలన అచ్చం సముద్రం మాదిరిగానే కనిపించసాగింది. ఒక శుభ ముహూర్తం రోజున రాజదంపతులు మందీమార్బలంతో సముద్రం చూడటానికి విచ్చేసారు. విశాలమైన నీటి వనరును చూసిన మహారాణి ఆనందపడింది. అప్పుడు మహారాజు సముద్రం ఇలాగే ఉంటుంది అని తెలిపారు. 
నాటి నుండి ఆ చెరువును "సముద్రం " అని పిలవసాగారు. 
అలా రాణీ గారి కోరిక మేరకు శ్రీ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో తిరువణ్ణామలై లో సముద్రం ఏర్పడింది. 
కాలక్రమంలో కొంత మేర విస్తీర్ణం తగ్గినా, కొన్ని చోట్ల అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నా నేటికీ చూపరుల దృష్టిని ఆకర్షించుకొనే గొప్ప సౌందర్యం సముద్రానిది. 
ప్రస్తుతం మామిడి ఇతర తోటలు ఒకపక్క మరోపక్క నీలి ఆకాశం దూరంగా పవిత్ర పరమేశ్వర రూపమైన అరుణాచలం. చూడటానికి అద్భుతంగా ఉంటుంది. 
సముద్రం ఒక గట్టున ఒక మహర్షి, నాగ ప్రతిష్టలు,ఇతర దేవీ దేవతల విగ్రహాలు ప్రతిష్టించారు. 
దేశ విదేశీ భక్తులు ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై ధ్యానం చేసుకోడానికి వస్తుంటారు. 






నగర పాలక సంస్థ వారు పూనుకొని నలుదిక్కులా గట్టు కట్టి, పడవ నడపడం, పిల్లలకు చిన్న ఉద్యానవనం లాంటివి ఏర్పాటు చేస్తే ఈ చారిత్రాత్మక నీటి వనరు మరింత ఆహ్లాదకరంగా కనపడుతుంది. ఎందరినో ఆకర్షిస్తుంది అనడంలో సందేహం లేదు. 
శ్రీ అరుణాచలేశ్వరుని ఆశీస్సులతో ఆ దిశగా పనులు జరుగుతాయని ఆశిద్దాము. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...