23, జులై 2023, ఆదివారం

Kadapa Temples 1

                                     కడప కోవెల కబుర్లు 


సహజంగా క్షేత్ర దర్శనం, తీర్థ యాత్రలు అనగానే అందరి దృష్టి తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లేదా కేరళ లేక కర్ణాటక వైపు చూస్తుంటారు. 
ముఖ్యంగా మన రాష్ట్రం నుండి అనేక మంది యాత్రీకులు వివిధ రాష్ట్రాలకు తరచు వెళుతుంటారు. 
కానీ కొంత ఆసక్తి మరి కొంత అన్వేషణ ఇంకొంత ఆధ్యాత్మిక దృష్టి ఉంటే మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అనేక పురాతన, పౌరాణిక మరియు చారిత్రక నేపథ్యం కలిగిన అనేక మహిమాన్విత దేవళాలు కనిపిస్తాయి. 
 నా ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలను వెళ్లే అవసరం నాకు దైవానుగ్రహంతో అనేక జిల్లాలలోని ప్రసిద్ధ, అపురూప మరియు మరుగున పడి ఉన్న ఎన్నో దైవ సన్నిధులు సందర్శించుకునే అరుదైన అవకాశం లభించింది. ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా సందర్శించడానికి ఆ దేవదేవుడు నాకు ఆరోగ్య, శక్తిసామర్ధ్యాలు ప్రసాదించాలని పూర్తి శరణాగతితో వేడుకొంటున్నాను. 
మొదటగా తిరుమల వాసుని చేరుకోడానికి తొలి అడుగుగా పేరొందిన కడప జిల్లాలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఒంటిమిట్ట, నందలూరు, పుష్పగిరి, గండికోట, రాయచోటి, గండి, సిద్దవటం, ప్రొద్దుటూరు లాంటి ప్రదేశాలలో పురాతన, చారిత్రక ఆలయాలు నెలకొని ఉన్నాయి. ఇవి కాకుండా స్థానికులకు తప్ప బయటివారికి తెలియని మరెన్నో విశేష పురాతన నిర్మాణాలు ఈ జిల్లాలో కనపడతాయి. వాటిలో కొన్ని ఆలయాలను వరసగా పరిచయం చేస్తాను. 

శ్రీ రంగనాథ స్వామి ఆలయం, పులివెందుల 

ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రదేశం. వన్యమృగాలు తిరగాడుతుండేవట. ముఖ్యంగా పెద్ద పులులు మందలు మందలు గా సంచరించేవట. అందువలన "పులి మందల" అనేవారట. కాలగతిలో "పులివెందుల"గా మారింది అంటారు. 
నేడు అతి వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ ప్రసిద్ధికెక్కిన ఈ నగరంలో చాలా చిన్నాపెద్దా ఆలయాలున్నాయి. 
వాటిల్లో ముఖ్యమైనవి శ్రీ రంగనాథ స్వామి ఆలయం, మిట్ట శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం. 
తొలుత శ్రీ రంగనాథ స్వామి ఆలయం గురించి తెలుసుకొందాము. కారణం పులివెందుల పురపాలక సంఘం వారి అధికార చిహ్నం ఈ ఆలయ గోపురమే !







శ్రీ రామచంద్రుని వంశంలో జన్మించిన వాడు "మాంధాత రాజు". పాలకునిగా ప్రజల మన్నలను పొందినవాడు. తన శౌర్య పరాక్రమాలతో ముల్లోకాలను జయించారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. 
మాంధాత గొప్ప విష్ణు భక్తుడు. 
దేశ పర్యటనలో "పాపాఘ్ని నది" సమీపంలో విడిది చేశారట. అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై ఇక్కడ తన ఇష్టదైవమైన శ్రీ వైకుంఠ నాధునికి ఒక ఆలయం నిర్మించాలి అనుకున్నారట. స్వయంపర్యవేక్షణలో శ్రీ భూ నీళాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని నిర్మింపచేశారట. 
మహాభారత, భాగవత పురాణాలలో మాంధాత మహారాజ ప్రస్థాపన ఉన్నదని అంటారు. అనగా పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయం సుమారు త్రేతాయుగం నాటిదిగా భావించవచ్చును. 
అనేక వేల సంవత్సరాల తరువాత తిరిగి విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నేటి రూపు సంతరించుకొన్నది అని శాసనాలు తెలుపుతున్నాయి. 
విజయనగర సామ్రాజ్యం పతనం చెందిన తరువాత ఈ ప్రాంతాన్ని అనేకమంది రాజులు పాలించారు. అధికారం కోసం అనేక యుద్దాలు జరిగాయి. వాటిల్లో ఈ ఆలయం కూడా దాడికి గురైనది. మరాఠా రాజుల కాలంలో మరోసారి ఈ ఆలయం వెలుగు లోనికి వచ్చింది. 
పీష్వా బాలాజీ బాజీరావు ఆలయ నిర్మాణానికి , మూలవిరాట్టు ప్రతిష్టాపనకు కావలసిన నిధులను కైంకర్యంగా సమర్పించుకొన్నారని శాసనాలు తెలుపుతున్నాయి. 
అనంతర కాలంలో కూడా శ్రీ రంగనాథ స్వామి ఆలయం దాడులకు లోనైనట్లుగా తెలుస్తోంది. 

ఆలయ విశేషాలు 

సువిశాల ప్రాంగణంలో నలుదిక్కులా చక్కని శిల్పాలతో కూడిన ప్రవేశ గోపురాలతో శోభాయమానంగా స్వాగతిస్తుంది పులివెందుల పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రంగనాథస్వామి ఆలయం. 
మండపాలకు అందమైన శిల్పాలు చెక్కబడికనబడతాయి . అవన్నీ కూడా విజయనగర శైలిలో ఉండటం చెప్పుకోవలసిన అంశం. 
గర్భాలయంలో శేషశయనునిగా శ్రీ రంగనాథ స్వామి శయన భంగిమలో రమణీయ అలంకరణలో నేత్రపర్వంగా దర్శనం ప్రసాదిస్తారు. దేవేరులు శ్రీ భూదేవి, శ్రీ నీళా దేవి గర్భాలయానికి ఇరుపక్కలా ప్రత్యేక సన్నిధులలో కొలువై ఉంటారు. 






ఉపాలయాల్లో వాయునందనుడు శ్రీ ఆంజనేయుడు, వినతా తనయుడు శ్రీ గరుత్మంతుడు ఉంటారు. పురాతన కాలం నుండి సంప్రదాయంగా వస్తున్న నాగ ప్రతిష్టలు ఇక్కడ కూడా కనపడతాయి. 
ప్రతి నిత్యం నియమంగా నాలుగు పూజలు జరిగే శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు, శ్రీ రామనవమి, శ్రీకృష్ణాష్టమి, ఇతర శ్రీ వైష్ణవ మరియు స్థానిక పర్వదినాలైన ఉగాది, సంక్రాంతి సమయాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. 
ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో మన రాష్ట్రం నుండే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. 

శ్రీ వృషభాచలేశ్వర స్వామి ఆలయం, వేంపల్లె 

పులివెందులకు సమీపంలోని మరో విశేష పౌరాణిక ప్రాశస్త్యం గల క్షేత్రం శ్రీ మన్నారాయణుడు కలియుగ దైవంగా ఇలలో కొలువు తీరిన మరో విశేష ఆలయం. 
లోకకంటకులైన అసురులు వర గర్వంతో లోకాలను అల్లకల్లోలం చేసినప్పుడల్లా జగద్రక్షకుడైన శ్రీహరి వారిని అంతం చేయడానికి ఒక అవతారం ధరించడం మనందరికీ తెలిసిన విషయమే !
ఈ క్షేత్ర గాధ కూడా  జగన్నాధుడు చేసిన  రాక్షస సంహారంతో ముడిపడి ఉన్నది కావడం విశేషం. 

క్షేత్ర గాధ 

గతంలో వృషభాసురుడు అనే రాక్షసుడు త్రిమూర్తులలో ఎవరు శీఘ్రంగా కరుణిస్తారు, వరాలను ప్రసాదిస్తారు అని ఆలోచన చేసాడట. అతనికి జీవులను సృష్టించి వారి ఆయుర్దాయాన్ని నిర్ధారించే విధాత ఎందరికో సులభంగా వారు కోరిన కోర్కెలను అనుగ్రహించినట్లుగా గ్రహించాడట. 
సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని గురించి తీవ్రమైన తపస్సు చేసాడట. కమలాసనుడు సంతృప్తి చెంది దర్శనం ఇచ్చారట. తనకు మానవుల చేతగాని, దేవతల చేతగాని మరణం లేని వరం కోరాడట వృషభాసురుడు. 
వరం అనుగ్రహించారు విరించి. తన ఆలోచన ఫలించి కోరిన కోర్కె లభించడంతో ముల్లోకాలను ఆక్రమించుకొన్నాడట. యజ్ఞ యాగాదులు చేస్తున్న మహర్షులను వేధించసాగాడట. 
అలాగని అతను విష్ణు లేక శివ ద్వేషి కాదు. తన అధికారాన్ని చూపించాలన్న తలంపుతో గతంలో మిగిలిన రాక్షసులు చేసిన అకృత్యాలనే చేయసాగాడు. 
మునులు, మహర్షులు వైకుంఠ వాసుని అసుర బాధ నుండి విముక్తి కలిగించమని ప్రార్ధించారట. 
దీనజన రక్షకుడైన దామోదరుడు రాక్షసుడు దేవతలు, మానవుల నుండి మృత్యువు రాకూడదని కోరుకుకున్నాడు. కానీ జంతువుల గురించి మరిచిపోయాడు. కనుక తానొక వృషభ రూపం ధరించి రాక్షసునితో పోరు చేసాడట. తనకు మరణం తప్పదన్న విషయాన్ని గ్రహించిన వృషభాసురుడు తన శరీరాన్ని శిలగా మార్చి దాని మీద స్వామిని కొలువు తీరమని కోరాడట. 
అలా శ్రీ మహావిష్ణువు ఇక్కడ అర్చారూపంలో స్థిరపడ్డారు. 

పాపాఘ్ని నది 

కర్ణాటకలోని చిక్బల్లార్పూర జిల్లాలోని నంది కొండల్లో ఉద్భవించినది పాపాఘ్ని నది. పేరు తెలుపుతున్నట్లుగా సకల పాపాలను హరించేదిగా పాపాఘ్ని నది ప్రసిద్ధి. పెన్నానది ఉపనది. కర్ణాటకలో కొంత దూరం, ఆంధ్రప్రదేశ్లో కొంత దూరం ప్రయాణించి చివరకి కడప జిల్లాలోని కమలాపురం వద్ద పెన్నా నదితో సంగమిస్తుంది. 
పాపాఘ్ని నది ఎంత ప్రసిద్ధమో తీరంలో వెలసిన క్షేత్రాలు కూడా అంత మహిమాన్వితమైనవి. ముఖ్యంగా గండి మరియు శ్రీ వృషభాచలం. 
వృషభాచలంలో పైనుండి జాలువారే పాపాఘ్ని జలాలను అందునా వర్షాకాలంలో ఒక మధురానుభూతి. 







ఆలయ విశేషాలు 

స్థానికంగా "ఎద్దుల కొండ"గా పిలవబడే వృషభాచలం మీద విశాల ప్రాంగణంలో పురాతన ఆలయ స్థానంలో అదే విధంగా నూతన ఆలయాన్ని నిర్మించారు. 
గర్భాలయంలో శ్రీ వృషభాచలేశ్వరుడు వరద, కటి హస్తాలతో స్థానక భంగిమలో నయనమనోహరంగా దర్శనం ప్రసాదిస్తారు. ప్రత్యేక సన్నిధిలో శ్రీ పద్మావతి అమ్మవారు చతుర్భుజాలతో వరద, అభయ హస్తాలతో ప్రశాంత వదనంతో ఉపస్థిత భంగిమలో కొలువై ఉంటారు. 
పన్నిద్దరు ఆళ్వార్లు, శ్రీ ఆంజనేయుడు, శ్రీ గరుత్మంతుడు ఉపాలయాలలో కనిపిస్తారు. 
వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు విశేషంగా చేస్తారు. అన్ని పర్వదినాలలో భక్తులు పెద్ద సంఖ్యలో కోరిన కోర్కెలు తీర్చే శ్రీ పద్మావతి సమేత  శ్రీ వృషభాచలేశ్వరుని దర్శించుకోడానికి తరలి వస్తుంటారు. 
వేంపల్లె కడపకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడికి క్షేత్రం అయిదు కిలోమీటర్లు. ఆటోలు లభిస్తాయి. నేరుగా కొండ పైకి వెళ్ళడానికి రహదారి మార్గాన్ని నిర్మించారు. 
అదే విధంగా విశేష హనుమత్ క్షేత్రమైన "గండి" ఇక్కడకు పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. వేంపల్లె నుండి వెళ్లవచ్చును. 

ఓం నమో నారాయణాయ !!!! 

 

   
  
   

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...