శ్రీ ఉలగండ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం
కంచి లో ఉన్న శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ఈ ఆలయం ఎన్నో విధాలుగా ప్రత్యేకం.
కంచి లో ఉన్న అర్చనామూర్తులలో ఎత్తైన రెండు విగ్రహాలలో ఒకటి ఈ ఆలయంలో ఉంటుంది.
ముప్పై ఐదు అడుగుల ఉలగండ పెరుమాళ్ (లోకాలను కొలిచిన పరంధాముడు)విగ్రహం ఒక అద్భుత అనుభూతిని ప్రసాదిస్తుంది.
శ్రీమహావిష్ణువు వామనునిగా వచ్చి రాక్షస రాజు బాలి ని మూడు అడుగుల నెల కోరుకొని "త్రివిక్రము"నిగా మారి తొలి రెండు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించి,బలి కోరిక మేరకు మూడో అడుగు రాక్షస చక్రవర్తి తలా మీద పెట్టి పాతాళానికి పంపారు.
ఈ కధ మనందరికీ తెలిసినదే !
కానీ ప్రహ్లాదుని మనుమడు అయిన బలి చక్రవర్తి కి అందరూ అతనిని పాతాళానికి పంపిన త్రివిక్రమ రూపన్ని వేనోళ్ళ కొనియాడుతుంటే ఆసమయంలో తన తల మీద శ్రీ పాదం ఉండటం వలన ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోలేక పోయానని బాధపడిపోయాడు.
అతని ప్రార్ధనకి,తనయందు గల భక్తికి సంతసించిన శ్రీ హరి అతనికి తన త్రివిక్రమ రూప సందర్శనా భాగ్యాన్ని ఇక్కడ అనుగ్రహించారని స్థానిక పురాణ గాధ. బాలి కోరిక మేరకు స్వామి చిన్న సర్పరూపంలో ప్రధాన అర్చనా మూర్తికి ఒక పక్కన స్వయంవ్యక్తగా వెలిశారు. అందుకే ఆళ్వారులు తమ పాశురాలలో ఈ క్షేత్రాన్ని "తిరు ఊరేగం"గా సంబోధించారు.
ఎడమ కాలిని ఆకాశాన్ని తాకేలా, కుడిపాదం బాలి తలమీద ఉంచి ముక్కోటి దేవతల నీరాజనాలను అందుకుంటున్నట్లుగా ఉండే ఈ నల్లరాతి త్రివిక్రమ రూపం భక్తుల హృదయాలలో శాశ్వత ముద్ర వేస్తుంది.
రెండో విశేషం ఏమిటంటే ఈ పడమర దిక్కుగా ఉన్న చిన్న ఆలయంలో మరో మూడు దివ్య దేశాలు ఉండటం. ఈ నాలుగు క్షేత్రాల గురించి "తిరుమంగై ఆళ్వార్,తిరుమలశై ఆళ్వార్ తమ పాశురాలలో ప్రస్తుతించారు.
తీరు ఊరేగం తరువాత తోలి ప్రాకారంలో మిగిలిన మూడు ఆలయాలు ఉంటాయి.
అవి తిరుక్కారకం, కార్వాణం మరియు తిరునీరంగం.
తిరుక్కారకం లో శ్రీ కరుణాకర పెరుమాళ్ దేవేరీలతో స్థానిక భంగిమలో ఉంటారు. చూడటానికి ఉపాలయం మాదిరి ఉంటుంది ఆలయం.
కార్వాణం
తిరుక్కారకం
తిరు కార్వాణం లో స్వామి కాల్వర్ గా స్థానిక భంగిమలో ఉంటారు. తిరు నీరంగంలో ఎలాంటి అర్చనా మూర్తి ఉండదు. శ్రీజగదీశ్వర స్వామి గా పిలిచే ఒక ఉత్సవిగ్రహం ఉంటుంది అంతే !ఈస్వామి గురించి తిరుమంగై ఆళ్వార్ తన పాశురాలలో ఉదాహరించినందున ఇక్కడ ఈ దివ్య దేశం ఉన్నట్లుగా భావించబడుతోంది.
మరో మూడు రూపాలు ఉన్న ప్రధాన పూజలన్నీ ఉలగండ పెరుమాళ్ కే !
ఈ ఆలయం ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి పది వరకు తెరిచి ఉంటుంది.
నియమంగా ఆరు పూజలు ప్రతి రోజు జరుగుతాయి.జనవరిలో ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
తీరు నీరగం
శ్రీఅమృతవల్లీ తాయారు సన్నిధి
శాసనాధారాల ప్రకారం ఈ ఆలయాన్ని ఆరు ఏడు శతాబ్దాల సమయంలో పల్లవ రాజులు నిర్మించినట్లుగా తెలుస్తోంది.
చోళులు, విజయనగర రాజులు కూడా ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు.
కంచి బస్టాండ్ కు అతి సమీపంలో శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో ఉంటుందీ ఆలయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి