20, సెప్టెంబర్ 2017, బుధవారం

Ashtabujakaram Temple, Kanchipuram

అష్టభుజ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం 

విష్ణు కంచి లోని మరో శ్రీ వైష్ణవ దివ్య దేశం "అష్టభుజ పెరుమాళ్ ఆలయం". 
ఎనిమిదో శతాబ్ద కాలంలో పల్లవ రాజులచే నిర్మించబడిన ఈ ఆలయం లోని మూలవిరాట్టు ప్రత్యేకంగాను, శాంత సుందరంగాను దర్శనమిస్తారు.  












ఈ ఆలయ పురాణ గాధ కూడా సరస్వతీ దేవి మరియు బ్రహ్మ దేవుల మధ్య వివాదానికి సంబంధించినదే !!!
తాను ఎన్ని అడ్డంకులు సృష్టించినా విధాత అశ్వమేధ యాగం కొనసాగించడంతో మరింత ఆగ్రహించిన అమ్మవారు భయంకరమైన సర్పాన్ని పంపినదట.
యాగ సంరక్షణార్థం ఉన్న శ్రీహరి ఆ క్రూర సర్పాన్ని సంహరించడానికి ఎనిమిది రకాల ఆయుధాలను చేపట్టారట.
నిలువెత్తు రూపంతో అష్ట భుజాలతో, రమణీయ అలంకరణతో శాంత సుందర రూపంతో భక్తులకు అభయం ఇస్తారు శ్రీ అష్ట భుజ పెరుమాళ్. స్వామి చక్రం, గద,కత్తి,బాణం, ధనుస్సు,పద్మం, శంఖు, డాలు ధరించి ఉంటారు.
మరో కథనం ప్రకారం గజరాజు గజేంద్రుని మొసలి బారి నుండి కాపాడి మోక్షాన్ని ప్రసాదించినది ఇక్కడే అని అంటారు. ఈ కారణం చేతనే ఆలయానికి వెలుపల ఉన్న పుష్కరిణిని "గజేంద్ర పుష్కరణి" అంటారు.
అమ్మవారు శ్రీ పుష్పక వల్లీ  తాయారు విడిగా మరో సన్నిధిలో కొలువుతీరి ఉంటారు.













శ్రీ ఆండాళ్, శ్రీ ఆంజనేయ, సుదర్శన చక్రం, ఆళ్వారులు ఉపాలయాలలో ఉంటారు.
పల్లవుల తరువాత చోళులు, విజయనగర రాజులు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేశారు.
చాలా చిన్న ఆలయం.
విశేషమైన శిల్పాలు కనపడవు.
పై ఆళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్ శ్రీఅష్టభుజ పెరుమాళ్ ని కీర్తిస్తూ పాశుర గానం చేశారు.
దివ్యదేశ హోదాను అందించారు.









ప్రతి నిత్యం ఆరు పూజలు జరిగే ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల కొరకు తెరచి ఉంటుంది.
వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు విశేషంగా జరుపుతారు.
శ్రీ సింగ పెరుమాళ్ ఆలయానికి చేరువలోనే ఉంటుంది ఆలయం.

జై శ్రీమన్నారాయణ !!!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...