Azhagia Singa Perumal Temple, Kanchipuram

    అళగియ సింగ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం 



కాంచీపురం లోని మరో శ్రీ వైష్ణవ దివ్య దేశం అళగియ సింగ పెరుమాళ్ రూపంలో శ్రీహరి కొలువైన "తిరువేలు క్కాయి". అంటే పరమాత్మ ఇష్టపడి కొలువు తీరిన స్థలం అని అర్ధం. 
విష్ణుకంచి లో ఉన్న ఈ ఆలయ పురాణ గాధ కూడా విధాత బ్రహ్మ దేవునితో ముడిపడి ఉన్నది. 








ఒకసారి తామిరువరులలో ఎవరు గొప్ప అన్న వివాదం తలెత్తినది శ్రీ లక్ష్మి మరియు సరస్వతి దేవిల నడుమ. వివాదాన్ని పరిష్కరించుకోడానికి తొలుత  దేవేంద్రుని వద్దకు పిదప బ్రహ్మ వద్దకు వెళ్లారు.
వారి ఇద్దరి తీర్పు సరస్వతీ దేవికి నిరాశ కలిగించినది. ఆమె ఆగ్రహం తో సత్య లోకం విడిచిపెట్టి అజ్ఞాతంలో ఉండసాగింది.







అదే సమయంలో సృష్టి కర్త శ్రీమన్నారాయణుని సహకారం అపేక్షిస్తూ త్రీవ్ర తపస్సు చేసి ఆయన సలహా మేరకు అశ్వమేధ యాగం చేయ తలపెట్టారు. కానీ ధర్మపతి తో కలిసి చేయవలసిన యాగము అది. ఏమి చేయాలో తెలియక అందరి సలహా మేరకు గాయత్రీ దేవిని సరసన పెట్టుకొని యాగం ఆరంభించారు బ్రహ్మ.
అసలే తాను  మహాలక్ష్మి కన్నా తక్కువ దానినని స్వయంగా తెలిపిన భర్త తానూ లేకున్నా యాగం ఆపకుండా మరో స్త్రీని సరసన పెట్టుకొనడంతో  సరస్వతీ దేవి ఆగ్రహం రెట్టింపు అయినది.







అదుపు తప్పిన ఆవేశంతో యాగాన్ని భగ్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి  అవన్నీ విఫలం కావడంతో ఆఖరి యత్నంగా "కాపాలికుడు " అనే రాక్షసుని పంపినది సరస్వతీ దేవి.
భీకర గర్జనలతో వస్తున్న కాపాలికుణ్ణి చూసిన బ్రహ్మ వైకుంఠ వాసుని స్మరించుకున్నారు.
భక్త రక్షకుడు నరహరి రూపంలో ఆ దుష్ట రాక్షసుణ్ణి సంహరించి యాగం సక్రమంగా పూర్తి అయ్యేలా చేసి  అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.,








గర్భాలయంలో శ్రీ సింగ పెరుమాళ్ యోగబంధం లో ఉపస్థితః భంగిమలో దర్శనమిస్తారు. కానీ తొలుత స్వామి స్థానిక భంగిమలో ఉగ్ర రూపంలో ఉండేవారట.
తదనంతర కాలంలో భృగు మహర్షి చేసిన ప్రార్ధనలకు శాంతించి యోగ మూర్తిగా మారారు అని అంటారు.
స్వయం వ్యక్త గా సాక్షాత్కరించిన స్వామివారికి తొలి ఆలయం పల్లవ రాజులు ఎనిమిదో శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి.







వారి తరువాత చోళులు, విజయనగర రాజులు ఆలయాభివృద్దికి తమవంతు కృషి చేశారు.
తూర్పు దిశగా  ఉండే ఈ ఆలయంలో ప్రధాన అర్చనా మూర్తి తో పాటుగా అమ్మవారు శ్రీ అమృత వల్లీ తాయారు, శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ సుదర్శన చక్రం విడివిడిగా కొలువుతీరి ఉంటారు.
పన్నెండు మంది శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ప్రముఖులైన "పై ఆళ్వార్, భూతత్తి ఆళ్వార్, తిరుమలై సై ఆళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్ శ్రీ అళగియ సింగ పెరుమాళ్ ని కీర్తిస్తూ పాశుర గానం చేశారు. ఈ కారణంగా తిరువేలు క్కాయి నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటిగా శాశ్విత స్థానం పొందినది.
ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో ప్రతి నిత్యం నియమంగా ఆరు పూజలు చేస్తారు.
స్వాతి నక్షత్రం రోజున, శ్రీ నరసింహ జయంతి, ధనుర్మాస పూజలు విశేషంగా నిర్వహిస్తారు.
అన్నింటికన్నా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఘనంగా చేస్తారు.
శ్రీ వరద రాజా స్వామి లేదా శ్రీ అష్ట భుజాంకర ఆలయం నుండి సులభంగా తిరువేలు క్కాయి శ్రీ అళగియ సింగ పెరుమాళ్ కోవెలకు చేరుకోవచ్చును. అత్యంత సమీపంలో ఉంటుంది.


జై శ్రీమన్నారాయణ !!!!




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore