20, సెప్టెంబర్ 2017, బుధవారం

Thiruparankundram

               

                తిరుప్పరంకుండ్రం శ్రీ మురుగన్ ఆలయం 

             





ఆది దంపతుల ముద్దుల కుమారుడు కొలువైన ప్రసిద్ధి చెందిన ఆరుపాడై వీడు ఆలయాలలో ఒకటి తిరుప్పరంకుండ్రం శ్రీ మురుగన్ ఆలయం. మదురై పట్టణంలో భాగమైన ఈ క్షేత్రం యొక్క పురాణ గాధ పలమదురై చోళై క్షేత్రానికి చెందిన గాథే !!!













 ఇక్కడ కుమార స్వామి సూరపద్ముని యుద్ధంలో ఓడించి, తన సేవకునిగా చేసుకొన్నారు.
సదాశివుని వరము తో ఒకటిగా మారిన అసుర సోదరులు సూరుడు, పద్ముడు, వరబలంతో ముల్లోకాలను ఆక్రమించి అందరినీ అష్టకష్టాల పాలు చేస్తుండేవారు.
 ఆ రాక్షసుణ్ణి అదుపు చేయగలిగినది ఒక్క పార్వతీనందనుడు మాత్రమేనని శ్రీ మహావిష్ణువు తెలుపగా మన్మధుని సహాయంతో సర్వేశ్వరుని తపస్సు భగ్నం చేయగలిగారు దేవతలు. ఈ క్రమంలో మన్మధుడు త్రినేత్రుని క్రోధాగ్ని జ్వాలలకు భస్మం కావడం అది వేరే కధ !









అప్పుడు వెలువడిన త్రినేత్రుని తేజస్సు నుండి షణ్ముఖుడు ఉద్భవించడం అతను దేవసేనలతో కలిసి సూరపద్మునితో భీకర యుద్ధం చేసి అతనిని బలహీనునిగా చేసి  తండ్రి ఇచ్చిన వరం వృధాపోకుండా, అన్నదమ్ములలో ఒకరిని తన వాహనంగా, రెండోవారిని తన ధ్వజం గా చేసుకొన్నారు. మయూరవాహనుని గెలుపుతో విముక్తులైనారు దేవతలు.













తమకు రక్షణను అనుగ్రహించిన పార్వతీ నందనునికి దేవేంద్రుడు తన కుమార్తె "దేవసేన"ను ఇచ్చి వివాహం జరిపించారు. దేవ సేనాధిపతిగా నియమించారు.
ఆ వివాహానికి ఆదిదంపతులు, శ్రీహరి దంపతులు, సరస్వతీ దేవి బ్రహ్మదేవుడు, దిక్పాలకులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, ఇలా అందరూ ఆహ్వానితులుగా విచ్చేశారు.
ఆ విధంగా ఈ పర్వతం అతి పవిత్రమైనదిగా పేరొందినది.












ఇది గుహాలయం. పాండ్య రాజుల కాలంలో ఆలయ  తొలి భాగ నిర్మాణం ఆరో శతాబ్దానికి ముందే  జరిగినట్లుగా తెలుస్తోంది.తరువాత విజయనగర మరియు నాయక రాజుల ఆధ్వర్యంలో ప్రస్తుత నిర్మాణాలు జరిగినట్లు శాసనాలు తెలుపుతున్నాయి.ఏడు అంతస్థుల రాజ గోపురం, ఆస్థాన, ముఖ,మహా, అర్ధ మండపం ఇవన్నీ విజయనగర శిల్ప రీతులను ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తాయి.
వ్యాఘ్రపాద ముని, తాండవ గణపతి, వారాహి దేవి, తాండవ శివుడు, అష్టభుజ కాళీ, త్రివిక్రమ, పార్వతీపరమేశ్వర కళ్యాణం ఇలా అరుదైన శిల్పాలు కనపడతాయి.
అరుణగిరి నాథర్, నక్కీరర్ లాంటి కుమార స్వామి గాయక భక్తుల అదేవిధంగా సంబందార్, సుందరార్ లాంటి శివ భక్తుల శిల్పాలు కూడా ఈ మండపాల స్తంభాల పైన కనిపిస్తాయి.













ఆరు పాడై వీడు లోని ఆలయం కావడాన, పర్యాటక ప్రాధాన్యత కలిగిన మదురై పట్టణానికి సమీపంలో ఉండటం వలన ప్రతి నిత్యం వేలాదిగా భక్తులతో కోలాహలం నెలకొని ఉంటుంది ఆలయ పరిసరాలలో !!
వెయ్యి అడుగుల కన్నా ఎత్తులో ఉన్న నల్ల రాతి పర్వతానికి చెక్కిన గుహల్లో విఘ్ననాయకుడు గణపతి, లింగరాజు పరంగిరినాథర్ గాను, జగన్మాత పార్వతీ దేవి, శ్రీమహావిష్ణువు నాలుగు గుహలలో కొలువుతీరి ఉంటారు.
ప్రధాన అర్చనామూర్తి శ్రీ మురుగన్ ఇక్కడ ఉపస్థితః భంగిమలో మధ్య గుహలో కొలువుతీరి ఉంటారు. ఆయనకు ఒక పక్కన దేవేరి దేవయాని,నారద మహర్షి, కన్యాదాత దేవేంద్రుడు, బ్రహ్మదేవుడు ఉండగా,గుహ లోపలి గోడలకు సూర్యుడు,చంద్రుడు,దిక్పాలకులు, గంధర్వులు ఆదిగా గలవారి మూర్తులు చెక్కబడి ఉంటాయి. పాదాల వద్ద స్వామివారి వాహనాలైన గొఱ్ఱె మరియు గజము ఉంటాయి. ఆరు పాడై వీడు ఆలయాలలో ఇక్కడ ఒక్క చోటే కుమారస్వామి కూర్చున్న భంగిమలో కనిపిస్తారు. దేవి లింగం, నవ సైనిక సన్నిధి, నందీశ్వరుడు  భార్యతో సహా  ఉపాలయా లలో దర్శనమిస్తారు.










లోకకంటకుడు అయిన సూరపద్ముని మీద విజయం సాధించి వచ్చిన కుమారునితో పాటు ఆయన ఆయుధమైన వెల్ కి కూడా ఇక్కడ అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. ఇద్దరికీ పునుగు పిల్లి నూనెతో అభిషేకం ఇక్కడ ప్రత్యేకం. అంతే కాదు ఒకే ప్రాంగణంలో శివకేశవులు ఎదురెదురుగా కొలువైన ఒకేఒక్క క్షేత్రం కూడా ఇదే !!!  కొలువైన దేవీదేవతల వాహనాలైన నంది, మయూరం, మూషికం, గరుడుడు ధ్వజస్థంభం వద్ద ఉపస్థితులై ఉంటారు.
పర్వతాగ్రం మీద ఉన్న ఆలయంలో శ్రీ విశ్వనాధ స్వామి కొలువై ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి భక్తులే కాదు నయమ్మారులు కూడా ఈ క్షేత్ర మహిమను గురించి పాటికా గానం చేసినందున తిరుప్పరంకుండ్రం తేవర స్థలంగా కూడా ప్రసిద్ధి చెందినది.
ఉదయం అయిదు గంటలనుండి ఒంటిగంట వరకు , తిరిగి సాయంత్రం నాలుగు  నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తుల సౌకర్యం కొరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో నిత్యం పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.
ప్రతి నెల విశేష పూజలు నిర్వహిస్తారు. సుబ్రహమణ్య సష్టి, శివరాత్రి, గణేష చతుర్థి లాంటి పర్వదినాలలో మరియు కార్తీక మాసంలో, నవరాత్రులలో ఘనంగా ఉత్సవాలు జరుపుతారు.
మదురై పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుప్పరంకుండ్రం చేరుకోడానికి అన్ని రకాల వాహనాలు లభిస్తాయి.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః !!!

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...