8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

Vaikuntanatha Perumal Temple, Kanchipuram

శ్రీ వైకుంఠ నాథ పెరుమాళ్ ఆలయం,కంచి 



                                                                                             


ఆలయాల నగరం కంచి. తొలినాటి పల్లవ రాజులు నిర్మించిన గుహాలయాల నుండి విజయనగర రాజులు నిర్మించిన విరాట్ నిర్మాణాల దాకా ఎన్నో విశేష ఆలయాలకు నిలయం.
కాంచీపురంలో నెలకొన్న శ్రీ వైష్ణవ దివ్య తిరుపతులలో మరోకటి  శ్రీ వైకుంఠ నాథ పెరుమాళ్ ఆలయం.  పురాతన తమిళ గ్రంధాలలో, ఆళ్వారుల పాశురాలలో ఈ దివ్య క్షేత్రాన్ని "తిరు పరమేశ్వర విన్నగరం" అని పిలిచేవారు. 













వేల  సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతాన్ని పాలించే "విరోచనుడు"  అనే రాజు సంతానం లేకపోవడంతో పరమేశ్వరుని గురించి తపస్సు చేసాడట. సర్వేశ్వరుడు ప్రత్యక్షమై వైకుంఠ ద్వారపాలకులు అతని కుమారులుగా జన్మిస్తారని వరమిచ్చారట.
అలా అతని కుమారులుగా జన్మించిన జయవిజయులు నిరంతరం విష్ణు ధ్యానం చేస్తూ, ప్రజల మంచి కోరుకొంటూ పాలన సాగించారు. వారి భక్తికి సంతసించిన శ్రీమన్నారాయణుడు వారికి ఈ ప్రదేశంలో శ్రీ వైకుంఠ నాధునిగా దర్శనమిచ్చారు.








అద్భుతమైన శిల్పాలతో నిండిన ఈ  అరుదైన ఆలయాన్ని తొలిసారి ఏడో శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. తరువాత చోళ, విజయనగర రాజులు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా ఆలయంలో ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. రాజగోపురం ఉండదు. బయటకు చూడటానికి ఒక సాధారణ నిర్మాణంలాగ కనిపిస్తుంది. కానీ ఒక అరుదైన విశేష శిల్పనిర్మాణం శ్రీ వైకుంఠనాథ పెరుమాళ్ కోవెల.  ఇసుక రాతితో నిర్మించబడిన ఈ ఆలయంలో మండపాలు, గోడలు ,స్తంభాలు ఇలా అన్నీ ఎన్నో పురాణ గాధల శిల్పాలతో నిండి ఉంటాయి. అది కూడా గోడకు చిత్రాలను తగిలించిన తరహాలో చెక్కారు. అరుదైన నిర్మాణ ప్రక్రియగా పేర్కొనాలి. మండప స్థంబాలను కూర్చున్న సింహాల మీద చెక్కిన విధానం, అన్ని మృగరాజ శిల్పాలు ఒకే మాదిరి ఉండటం శిల్పుల నేర్పరితనాన్ని తెలుపుతుంది.
మతోన్మాదంతో జరిపిన విధ్వంసానంతరం, కాలక్రమంలో కొంతమేర తొలి నాటి సుందరతను  ఈ శిల్పాలు నేడు కోల్పోయినా కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆకర్షిస్తాయి.





















శ్రీ నారసింహ, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ గజవరద పెరుమాళ్, శ్రీ శేష తల్పశాయి రూపాలతో పాటు సృష్టికర్త శ్రీ బ్రహ్మదేవుడు, లయకారుడైన పరమశివుడు, మహాభాగవత ఘట్టాలను చక్కగా ఆలయ గోడల మీద మలచారు.
 మరో విశేషం ఏమిటంటే ఈ ఆలయ గర్భగృహం పైన ఉండే విమానం అష్టాంగ విమానం. ఇదొక అరుదైన ప్రక్రియ. చాలా తక్కువగా కనిపిస్తుంది.
మధురై లో ఉన్న కూడాల్ అళగర్ మరియు మధురైకి యాభై కిలోమీటర్ల దూరం లోని తిరుగోష్ఠియూర్ లోని సౌమ్య నారాయణ పెరుమాళ్ ఆలయంలో ఈ నిర్మాణ ప్రక్రియ కనపడుతుంది. ఈ రెండు ఆలయాలు కూడా నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.
దీనిలో గర్భాలయంలో ఉపస్థిత భంగిమలో, తొలి అంతస్థులో శయన భంగిమలో, రెండో అంతస్థులో స్థానక భంగిమలో పరంధాముడు కొలువై ఉంటారు. ఇలాంటి నిర్మాణాల నీడ సూర్యుడు ఏ దిశలో ఉన్నా భూమి మీద పడదు.
క్రింద ఉన్న గర్భాలయం లోని స్వామి దర్శనం ప్రతి నిత్యం అందరికీ లభిస్తుంది. తొలి అంతస్తులోని శేషశయన వాసుని దర్శనం ఒక్క ఏకాదశి రోజులలోనే !రెండో అంతస్థులోని వాసుదేవుని దర్శనం సామాన్యులకు లభించదు.
ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ బాగుంది. చుట్టూ అందమైన ఉద్యానవనం పెంచారు. ఉదయం ఏడు నుండి మధ్యాహన్నం పన్నెండు, తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు శ్రీ వైకుంఠనాథ పెరుమాళ్ భక్తుల సౌలభ్యం కొరకు తెరచి ఉంటుంది.








 ప్రతి రోజు నియమంగా ఆరు పూజలు జరుగుతాయి.
వైశాఖ మాసం (మే-జూన్)లో బ్రహ్మోత్సవాలు, మార్గశిరమాసం లో వచ్చే వైకుంఠ ఏకాదశి ఘనంగా నిర్వహిస్తారు.ధనుర్మాస వేడుకలు వైభవోపేతంగా జరుపుతారు.
పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులో ఒకరైన "తిరుమంగై ఆళ్వార్"  శ్రీ వైకుంఠ నాథ పెరుమాళ్ ని కీర్తిస్తూ పది పాశురాలను  గానం చేశారు. ఈ క్షేత్రానికి దివ్య దేశమనే శాశ్విత కీర్తిని అందించారు.
కంచిలో శ్రీ కైలాసనాథర్ ఆలయం తరువాత అంతటి పురాతన ఆలయం శ్రీ వైకుంఠ నాథ పెరుమాళ్ ఆలయమే. కంచి బస్టాండ్ వెనక ఉంటుందీ ఆలయం. ఉండటానికి అందుబాటు ధరలలో వసతి ఆహార సదుపాయాలు లభిస్తాయి.

నమో నారాయణాయ !!!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...