6, సెప్టెంబర్ 2017, బుధవారం

Meenakshi Amman Temple, Madurai


శ్రీ మీనాక్షి అమ్మన్ కోవెల, మధురై 





ఆలయాల రాష్ట్రం తమిళనాడు తలపుకు రాగానే గుర్తుకొచ్చే ఆలయాలలో ప్రధమ స్థానం మధురై లోని  శ్రీ మీనాక్షి దేవి అమ్మన్ దే !!
సుమారు నలభై అయిదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయం చుట్టూ మధురై నగరం విస్తరించి ఉంటుంది.
ఎన్నో పౌరాణిక మరియు చారిత్రిక విశేషాల నిలయమైన ఈ ఆలయం మీనాక్షీ అమ్మన్ ది గా పిలవబడుతున్నా తొలుత ఇక్కడ కొలువైనది సుందరేశ్వరుడే!!
శాప పరిహారార్ధం దేవేంద్రుడు ఇక్కడ పరమేశ్వరుని గురించి తపమాచరించి దర్శనం పొంది శాప విముకుడైనాడట. అతని కోరిక మేరకు లింగ రాజు ఇక్కడ శాశ్విత నివాసం ఏర్పరచుకున్నారు. తొలి ఆలయాన్ని, బంగారు పూల పుష్కరిణిని ఇంద్రుడే నిర్మించాడట !   
























నేటి తమిళనాడు మరియు కేరళ ప్రాంతాలను చాలా కాలం పాలించిన రాజ వంశాలలో పాండ్య రాజులది అగ్ర స్థానం. అనేక ఆధారాలను అనుసరించి వీరు క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నాటికే సుస్థిర స్థానంలో ఉంది పాలన సాగించారని తెలుస్తోంది.
పంచమ వేదం అయిన మహాభారతం ప్రకారం మలయధ్వజ పాండ్య రాజు పాండవుల తరుఫున కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.
ఈ మలయధ్వజ పాండ్య రాజే శ్రీ మీనాక్షీ అమ్మన్ పెంపుడు తండ్రి.
జనరంజక పాలకుడైన మలయధ్వజ రాజు ఆయన శ్రీ మతి అయిన కాంచనమలై దంపతులకు ఉన్న ఒకే ఒక చింత సంతానం లేకపోవడం.








జ్యోతిష్యుల మాట ప్రకారం పుత్రకామేష్టి యాగం చేయగా యజ్ఞ గుండం నుండి ఒక బాలిక ఉద్భవించినది. అపర పార్వతీ అంశగా తలంచి రాజ దంపతులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచారు. పుత్రులు లేకపోవడాన ఆమెకు అన్ని క్షత్రియ విద్యలలో శిక్షణ ఇప్పించారు. ఆమె అతిలోక సుందరిగాను అపరిమిత యుద్ధ నిపుణిరాలిగా పేరొందినది. తల్లితండ్రులు పెట్టిన పేరు "తదాతగై" అయినా ఆమె సుందర రూపం మీనాల్లాంటి కనుల వలన అందరూ "మీనాక్షీ" అని పిలిచేవారు.
చిత్రమైన విషయం ఏమిటంటే ఆమె పుట్టుకతో మూడు స్థనాలను కలిగి ఉన్నది. దాని గురించి చింతాక్రాంతులైన రాజదంపతులకు  ఆ శరీర వాణి "ఆమె తన భర్త కాబోయే పురుషుని కలిసిన మరుక్షణం మూడో స్థానం శరీరంలో కలిసి పోతుంది"అని తెల్పినది.








భార్యలతో తిరుమల నాయకర్ 






తండ్రి తరువాత పాలన చేపట్టిన తదాతగై భూమండలాన్ని జయించి, ఇంద్ర, సత్య,వైకుంఠ లోకాలను జయించి చివరగా కైలాసం చేరింది. ఆమె ధాటికి భూత గణాలు, నంది, భృంగి, శృంగి చెల్లాచెదురు అయ్యారు. చివరకు కైలాసనాధుడే స్వయంగా యుద్దానికి తరలివచ్చారు. ఆయనను చూడగానే ఆమె తృతీయ స్థనం అదృశ్యం కావడంతో, ఆయన ఎవరో అర్ధమైన ఆమె ఆయనకు ప్రణమిల్లింది.
ఆది దంపతుల వివాహం రంగరంగ వైభవంగా మధురై లో జరిగింది.
అలా పార్వతీ అంశ అయిన మీనాక్షీ దేవీమరియు శ్రీ సుందరేశ్వర స్వామి మధురై పట్టణాన్ని తమ స్థిరనివాసంగా మార్చుకొన్నారు.









ముందుగా కొలువైన భక్తులు ముందుగా శ్రీ కామాక్షీ అమ్మవారిని దర్శించుకున్న తరువాతే శ్రీసుందరేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం.
స్థానిక భంగిమలో అత్యంత సుందర అలంకరణలో సర్వాభరణాలు ధరించి  దర్శనమిచ్చే శ్రీ కామాక్షీ అమ్మ కుడిచేతిలో రామ చిలక ( శ్రీ విల్లి పుత్తూరు లోని శ్రీ ఆండాళ్ చేతిలో మాదిరి)ఉండటం ఒక విశేషంగా పేర్కొనాలి.
అదే విధంగా మధురై నటరాజ స్వామి  తాండవము సలిపిన అయిదు స్థలంలో ఒకటి.
తమిళనాడులో ఈ పంచ నాట్య సభా స్థలాలకు విశేష భక్తాదరణ ఉన్నది.
ఈ అయిదు క్షేత్రాలకు ఇంతటి ప్రాముఖ్యం రావడానికి సంబంధించిన కధ పురాతన తమిళ గ్రంధాలలో ఉన్నది అని చెబుతారు.















తన నృత్యంతో తానే పరవశించి పోతూ ఒక విధమైన తన్మయత్వంతో సర్వం మరచి నృత్యం చేస్తున్న నటరాజ స్వామి కాలి  పట్టా లోని మువ్వలు కొన్ని ఊడి ఈ అయిదు ప్రదేశాలలో పడ్డాయట. అందుకని వీటికి తడి ఆదరణ.
అవి చెన్నై సమీపం లోని తిరువళంగాడు (శ్రీ వదరణ్యేశ్వర స్వామి ఆలయం)- రత్న సభ, చిదంబరం (నటరాజ స్వామి ఆలయం)- కనక (బంగారు) సభ, మధురై (శ్రీ సుందరేశ్వర స్వామి  ఆలయం)- వెల్లి (వెండి) సభ, తిరునెల్వేలి (శ్రీ నెల్లిఅప్పార్ ఆలయం)- తామ్ర సభ, కుర్తాళం (శ్రీకుర్తాళ నాదర్ ఆలయం)- చిత్ర సభ.









మరో ప్రత్యేకత ఏమిటంటే అన్ని చోట్లా కుడి కాలు మీద నిలబడి ఎడమ కాలు ఎత్తి నృత్య భంగిమలో ఉండే నటరాజ స్వామి ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఉంటారు. అంటే ఎడమ కాలు మీద నిలబడి కుడి కాలు ఎత్తి దర్శనమిస్తారు. దీనికి సంబంధించిన ఒక కధ చెబుతారు.
రాజశేఖర పాండ్య రాజు నిత్యం పరమేశ్వరుని అత్యంత భక్తిశ్రద్దలతో సేవించేవాడు.
ఆయనకు ఎప్పుడు నటరాజ మూర్తిని చూసిన నా దైవం నిరంతరం కుడి కాలు మీదనే నిలబడి ఉంటారు దానివలన ఆ కాలు యెంత నొప్పి చేస్తుందో అన్న ఆలోచన కలిగేదట.
చివరకు ఆలోచన కాస్త ఆతుర్దాగా మారింది. నిరంతరం భోళా శంకరుడు ఆ భాదను ఎలా భరిస్తున్నారో అన్న చింత ఎక్కువైనది రాజశేఖరునకు.
ఒకనాడు ఆయన స్వామికి తన భాదను తెలుపుకొని "దేవా! నాకోసమైన నీవు నీ భంగిమ మార్చు."
అని విన్నవించుకొన్నాడట.
భక్తుడు తన గురించి  పడుతున్న తపన గ్రహించిన భక్త వత్సలుడు ఉదయానికి తన భంగిమ మార్చుకొన్నారట.
ఇలా ఎడమ కాలి మీద నిలబడి ఉండే వెండి నటరాజ మూర్తిని ఒక్క మధురై లోనే చూడగలం.














మరో విశేషం ఏమిటంటే మధురై శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయం రెండువందల డెబ్బై అయిదు  పడాల్ పెట్ర స్థలాల్లో అగ్రస్థానము లో ఉన్నది.
సుమారు ఏడు మరియు ఎనిమిది శతాబ్దాల మధ్య కాలానికి  చెందిన గాయక శివ భక్తులైన 63 మంది "నయమ్మార్లు" తమ ఆరాధ్య దైవమైన కైలాస నాధుని కీర్తిస్తూ గానం చేసిన పాటికాల ( పాటల దండ ) మూలంగా ఈ ఆలయాలకు పెట్ర స్థలాలుగా కీర్తించబడుతున్నాయి.
వాటిల్లో ముందు వరసలో ఉన్నవి చిదంబరం, రామేశ్వరం,కుంభకోణం, తంజావూరు, మధురై, తిరువణ్ణామలై మొదలైనవి.
ఇంతటి ప్రాముఖ్యమున్న శ్రీ సుందరేశ్వరుడు భార్య చాటు భర్తే !
మీనాక్షమ్మ మొగుడే!!
ఎందుకంటే ముందుగా అమ్మను సందర్శించిన తరువాతే అయ్య వద్దకు వెళ్ళాలి ఇక్కడ!










తొలుత దేవేంద్రుడు ఆలయం నిర్మించినా తదనంతర కాలంలో పాండ్య రాజులు తమ ఇంటి ఆడపడుచు ఆలయాన్ని సుందరంగా నిర్మించారు. వారి తరువాత చోళులు కూడా తమ వంతు కృషి ఆలయాభివృద్దికి చేశారు.
కాకపొతే వారు చేసిన శ్రమ వృధా పోయింది.
పదునాలుగు శతాబ్దంలో దక్షిణాన ఆధిపత్యం కోసం రాజ వంశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ఆసరాగా తీసుకొన్న ఢిల్లీ సుల్తాను తన సేనలను దక్షిణాపధానికి మళ్లించి దండ యాత్ర చేసాడు.
అతని సేనాని అయిన "మాలిక్ కాఫర్ " కూరత్వానికి ఎన్నో పట్టణాలు,ఆలయాలు ధ్వంసం అయ్యాయి.
మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం కూడా వాటిల్లో ఒకటి.
సుల్తాను సేనలు ఆలయాన్ని శిధిలం చేసి,సంపదను దోచుకొని వెళ్లారు.
అలా ముష్కరుల దాడితో దెబ్బ తిని ప్రాముఖ్యాన్ని కోల్పోయిన మధురైకి పునః వైభవాన్ని తెచ్చినది విజయ నగర సామంతులైన నాయక రాజులు.





















తొలుత విజయ నగర సామ్రాజ్య సామంతులుగా ఉన్న నాయక రాజులు తాము స్వతంత్రులైన తరువాత కూడా మధురై ఆలయ ప్రాభవాన్ని పెంపొందించే విధంగా ప్రణాళికా బద్దంగా వ్యహరించారు.
మొదట "విశ్వనాధ నాయకుడు"పాత శిధిల కట్టడాలను తొలగించి, వాటిమీద కొత్త నిర్మాణాలను నిర్మించే కార్యక్రమాన్నిప్రారంభించాడు.
ఆయన తరువాత వచ్చిన పాలకులు ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు.
కానీ పదిహేడో శతాబ్ద తొలినాళ్లలో పాలనకు వచ్చిన "తిరుమలై నాయకర్" ఏంటో శ్రద్ధ వహించి ఆలయ నిర్మాణం పూర్తి అయ్యేలా చేశారు. ఆలయ అంతర ప్రాకారంలో భార్యలతో ఉన్నఆయన విగ్రహాన్ని చూడవచ్చును.












చిత్రమైన గణపతి. వక్షస్థలం, సింహ పాదాలు. 









తమిళనాడులో ద్రావిడ సంప్రదాయ శిల్ప సౌందర్యాన్ని అతి స్పష్టంగా చూపే ఆలయాలలో శ్రీ మీనాక్షీ సోమసుందరం స్వామి ఆలయం ఒకటి.
మధురై పట్టణానికి నడిబొడ్డున ( పట్టణం ఆలయ నాలాగు దిక్కులా వ్యాప్తి చెందేలా ప్రణాళిక విశ్వనాధ నాయకుడు రచించాడు అంటారు) సువిశాల ప్రాంగణంలో నాలుగు మాడ వీధులతో నాలుగు దిక్కులా ఎత్తైన రాజగోపురాలతో అలరారే ఆలయ శోభా ఇంతని వర్ణించలేము.
రాజ గోపురాలతో కలిపి మొత్తం పదునాలుగు గోపురాలుంటాయి.
పదమూడో శతాబ్దంలో పాండ్య రాజులు నిర్మించిన తూర్పు గోపురం అన్నింట్లోనికి పురాతనమైనది కాగా, దక్షిణ గోపురం యెత్తైనది.
ప్రాంగణ మధ్య భాగంలో శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయం, దక్షిణం పక్కన శ్రీ మీనాక్షీ దేవి ఆలయం ఉంటాయి. ఈ రెండు ఆలయ విమానాలను బంగారు రేకులతో నిర్మించారు.
భక్తులు ఏ ద్వారం నుండి ఆలయం లోనికి ప్రవేశించినా దక్షిణం పక్క నుండి లోనికి వెళ్లి శ్రీ మీనాక్షి అమ్మన్ ను దర్శించు కోవాలి.










ఈ రెండు ఆలయాల మధ్యన ఏక శిల మీద చెక్కిన నిలువెత్తు "ముకురుని వినాయక" కొలువై ఉంటారు. ఏ విగ్రహం స్థానిక మారియమ్మన్ కోవెల పుష్కరణి పూడిక తీస్తున్న సమయంలో బయల్పడినదట. ప్రత్యేక కొలతతో చేసిన పెద్ద కుడుములు పర్వదినాలలో ఈ వినాయకునికి నైవేద్యం గా సమర్పించడం వలన ఈ పేరు వచ్చింది.
అలానే తిరుమలై నాయకర్ ఆధ్వర్యంలో ఆలయం నిర్మిస్తున్నప్పుడు శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న మండపానికి సంబంధించిన స్తంభాలను నిలిపి శిల్పులు వెళ్లి పోగానే ఒక కోతుల గుంపు వచ్చి వాటిని కూలదోసేవట!
దైవజ్ఞుల సలహా మేరకు ఒక స్థంభం పైన శ్రీ ఆంజనేయుని రూపం చెక్కి నిలిపిన తరువాత వానర మూక దండ యాత్ర ఆగిందట. పైన ఆ ఆంజనేయుని బొమ్మ ఉన్న స్థంభం అదే!
అదే విధంగా ఈ ఆంజనేయ స్థంభానికి సమీపంలో మరో స్థంభం పైన  "తాయి మనవాళ్ అమ్మన్"  రూపం చెక్కి ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు లేక వారి సమీప భక్తులు వచ్చి సుఖప్రసవం కొరకు ఆమె ముందు నేతి దీపాలను వెలిగిస్తుంటారు.















దక్షిణం పక్క నుండి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో కుడి పక్కన ఇంద్ర నిర్మిత " పోర్తమరై కుళం" ( బంగారు పుష్పాల కోనేరు) కనిపిస్తుంది.
నడిచి వెళ్లే మార్గం నలుమూలల ఉండే మండపాల పైభాగాన రమ్యమైన పురాణ వర్ణ చిత్రాలను, పుష్పాలను శోభాయమానంగా చిత్రించారు.
సహజ వర్ణ చిత్రాలను పుష్కరణి పక్కన ఉన్న మండపంలోనూ మరియు వెయ్యి కాళ్ళ మండపంలో ఏర్పాటు చేసిన సంగ్రహాలయంలోనూ చూడవచ్చును.










ప్రాంగణంలో ఉన్న "కిలి కూండు మండపం, పుథు మండపం,అష్ట శక్తి మండపం,పాండవ మండపం,వీరవసంత రాయ మండపం" ఇలా ఎన్నో మండపాలు చక్కని శిల్పాలను ప్రదర్శిస్తాయి.
అన్నిటిలోకి శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయం ధ్వజస్థంభం,నంది  మండపం ఉన్న "కంబతాది మండపం" అపురూప శిల్పాలకు నిలయం. ఇక్కడే పైన పేర్కొన్న శ్రీ ఆంజనేయ మరి తాయి మానవళ్ అమ్మన్ ఉంటారు. ఇక్కడి స్తంభాల పైన శ్రీ మీనాక్షి సోమసుందరేశ్వర కళ్యాణ శిల్పాలు,శివ కాళీ తాండవము ,   పాండవ మధ్యముడు అర్జనుడు సర్వేశ్వరుని నుండి పాశుపతాస్త్రం స్వీకరిస్తున్న దృశ్యం ఇలా ఎన్నో శిల్పాలు చూపరుల దృష్టిని ఆకట్టుకొంటాయి.
ఇక్కడ ఒక చిత్రమైన గణపతి శిల్పం అబ్బుర పరుస్తుంది.
గజముఖ వదనం, స్త్రీ శరీరం, సింహ పాదాలతో చిత్రంగా ఉండే ఈ శిల్పాన్ని చెక్కి శిల్పి ఉద్దేశ్యం ఏమిటో???











ప్రస్తుతం మ్యూజియం గా మార్చిన వెయ్యికాళ్ల మండపంలో అరుదైన సంగీత స్తంభాలు ఉంటాయి. ఎన్నో అరుదైన రాతి మరియు లోహ శిల్పాలను ఇక్కడ చూడ వచ్చును.
అదే విధంగా ఎన్నో అపురూప చిత్రాలను కూడా ఇక్కడ ఉంచారు.
మనిషికి అయిదు రూపాయలు ప్రవేశ రుసుము.
ప్రాంగణంలో నాలుగు దిక్కులా రకరకాల వస్తువులను విక్రయించే దుకాణాలను ఏర్పాటు చేసారు.
యాత్రకు వెళ్లి పాత్ర కొనాలి అన్నది ఒక ప్రాముఖ్యం ఉన్న తెలుగు సామెత కదా!!














ఉదయం అయిదు గంటల నుండిమధ్యాహన్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు భక్తుల కొరకు శ్రీ మీనాక్షీ సుందరేశ్వర స్వామి వార్ల ఆలయం తెరిచి ఉంటుంది.
ప్రతి నిత్యం ఎన్నో అభిషేకాలు, అలంకరణలు, ఆరగింపులు సేవలు జరుగుతాయి. ప్రతినెలా విశేష పూజలు నిర్వహిస్తారు.
నవరాత్రులు, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు జరుపుతారు.


















దేశం నలుమూలల నుండి మధురై కి రైలు మార్గంలో మరియు విమాన మార్గంలో సులభంగా చేరుకోవచ్చును. అందుబాటు ధరలలో వసతి సౌకర్యాలు లభిస్తాయి.
మధురై లో శ్రీ మారియమ్మన్ కోవెల, శ్రీ కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెల, ఆరు పాడై వీడు గా ప్రసిద్ధి కెక్కిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరు ఆలయాలలో రెండు "తిరప్పరై కుండ్రం మరియు పలమదురై చోళై "ఇక్కడే ఉన్నాయి.
నాయక రాజుల భవనం కూడా దర్శించవలసినదే !!
స్థానిక ఆలయాల సందర్శన కోసం కార్లు లభిస్తాయి.

నమః శివాయ !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...