24, నవంబర్ 2015, మంగళవారం

Sri Patan Devi Mandir, Patna

                                శ్రీ పటాన్ దేవి మందిరం, పట్నా 

  






దైవ భూమి అయిన భరత దేశంలో ఎన్నో ప్రాంతాలు స్థానికంగా కొలువైన దేవి లేదా దేవత నామం మీద ఏర్పడటం అందరికీ తెలిసిన విషయమే !
భూలోక వైకుంఠము శ్రీ రంగం, కలియుగ వైకుంఠము తిరుమల, శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువైన తిరువనంతపురం ఇలా ఎన్నో ఉదాహరణలుగా పేర్కొనవచ్చును. 









వాటిల్లో గతంలో మన పురాణాలలో, చరిత్ర గ్రంధాలలో "మగధ"గా పేర్కొనబడిన నేటి "బీహార్" రాజధాని "పట్నా" పేరు కూడా చేర్చవచ్చును.
"పుత్రకు"నిగా పేర్కొనబడే పాలకుని చేత స్థాపించబడిన "పాటలీ పుత్ర"  నేటి "పట్నా"గా మార్పు చెందడానికి వెనుక విశేష పౌరాణిక మరియు చారిత్రక గాధలు ముడిపడి ఉన్నాయి అని తెలుస్తోంది. 





బడీ పటాన్ దేవి 



దక్ష ప్రజాపతి గురించి అందరికీ తెలిసిన విషయమే !
ఆయన పుత్రిక "సతీ దేవి" తండ్రి మాటను కాదని శ్మశాన వాసి అయిన శంకరుని పరిణయ మాడటం వలన తండ్రి నిరాదరణకు గురి అయినది.
సర్వేశ్వరుని కించపరచడానికి తలపెట్టిన యాగమనీ తమకు పిలుపు లేదనీ తెలిసి దాక్షాయణి వెళ్లి దక్షుడు చేసిన అవమాన భారం తట్టుకోలేక హోమ గుండంలో దుమికి ఆత్మ త్యాగం చేసింది.
వార్త తెలిసిన ఆగ్రహించిన  మహేశ్వరుడు వీరభద్ర, కాల భైరవాది గణాలను పంపి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయించడం అసలు కధ ! ఇదే దక్షయజ్ఞం !






సతీ దేవి దూరం కావడంతో  విచారగ్రస్తుడైన పరమేశ్వరుడు ఆమె దేహాన్ని భుజం మీద వేసుకొని విరాగిగా మారి  లోకాలలో సంచరించసాగారు.  అమ్మవారి శరీరం ఆయనకు కనిపించినంత కాలం మామూలుగా మారరని గ్రహించిన శ్రీహరి సుదర్శన చక్రంతో సతీ దేవి దేహాన్ని ఖండించారు. ఆ భాగాలు భువిలో అనేక ప్రాంతాలలో పడినాయి. అవే శక్తి పీఠాలు. వీటిల్లో ప్రముఖమైనవి అష్టా దశ పీఠాలు. మిగిలిన భాగాలు పడిన 51 ప్రదేశాలను సిద్ద శక్తి పీఠాలు అని పిలుస్తారు. ముఖ్యమైన నాలుగు శరీర భాగాలు పడిన వాటిని  మహా శక్తి పీఠాలు అని పిలుస్తున్నారు. 








అమ్మవారి కుడి తొడ నేటి పాట్నా నగరంలోని  మహారాజ్ గంజ్ దగ్గర, సతీ దేవి పై వస్త్రం చౌక్ వద్ద పడినాయట. పాలకుడైన పుత్రకుడు అమితంగా అమ్మవారిని ఆరాధించేవాడట. సర్వకాలాలలో తనను కాపాడే దేవతకు ఆయనే ఆలయాలు నిర్మించారట. మహారాజ్ గంజ్ లో బడీ పటాన్ దేవి ఆలయం, చౌక్ వద్ద చోటీ పటాన్ దేవి ఆలయాలు ఉంటాయి.







 ఇలా రెండు చోట్ల కొలువైన అమ్మవారిని భక్తులు సంపూర్ణ విశ్వాసంతో ఆరాధిస్తారు. 
 చిత్రమైన విషయం ఏమిటంటే రెండు చోట్లా ఒక్క అమ్మవారే ఉండరు. గర్భాలయంలో రజత సింహాసనం మీద మూడు చిన్న సాలగ్రామ శిలలు ఉంటాయి.మూడు శిలలు మహా కాళీ, మహా లక్ష్మి, మహా  సరస్వతి. అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి. 
పుత్రకుడు కొలిచిన దైవంగా, పాటలీపుత్ర రక్షకురాలిగా అమ్మవారిని శ్రీ పటాన్ దేవి అని గౌరవంతో పిలిచేవారు. ఆ విధంగా అమ్మవారి పేరు  మీద పురం "పట్న" గా పిలవబడుతోంది.  









బడీ పటాన్ దేవి మందిర ప్రాంగణంలో లింగరాజు, శ్రీ హనుమంతుడు, శ్రీ భైరవుడు ఉపాలయాలలొ కొలువై ఉంటారు. ప్రతి నిత్యం ఎందరో భక్తులు అమ్మవారి దర్శనార్ధం వస్తుంటారు. మంగళ వారాలలో వీరి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది.
పర్వ దినాలలో వేలాది మంది రాష్ట్ర నలుమూలల నుండి వస్తారు. నవ రాత్రులూ, శివరాత్రి,  హనుమజ్జయంతి  లాంటి రోజులలో విశేష అలంకారాలు, పూజలూ నిర్వహిస్తారు.





చోటీ పటాన్ దేవి 





పట్నా పాత నగరంలో ఉన్న ఈ ఆలయం ఉత్తర దిశగా దుకాణాల, గృహాల నడుమ ఉంటుంది. బడీ దేవి ఆలయంతో పోల్చితే చాలా చిన్న మందిరం.
ఇక్కడ కూడా ముగ్గురమ్మలు కొలువై ఉంటారు.
పక్కనే పురాతన సిక్కు గురుద్వారా,మహ్మదీయుల మసీదు కూడా ఉంటాయి.వీటి నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది. ఇవి కూడా చరిత్ర కలిగినవి కావడం విశేషం. 









పట్నాలో తప్పక సందర్శించివలసిన మందిరాలలో బడీ చోటి పటాన్ దేవి మందిరాలు కూడా ఉంటాయి. పట్నా రైల్వే స్టేషన్ నుండి ఆటోలలో సులభంగా మొదట బడీ దేవి తరువాత చోటీ దేవి ఆలయాలను చేరుకోవచ్చును. వెళ్ళే మార్గంలో మా శీతలా దేవి మందిరం కూడా దర్శనీయ స్థలం.







మా శీతలా దేవి మందిరం 





నవరాత్రుల తొమ్మిది రోజులు విశేష సంఖ్యలో అమ్మవార్లను సేవించుకోడానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. ప్రత్యేక పూజలు, అలంకరణలు అమ్మవార్లకు జరుపుతారు. 
ఈ మందిరాలన్నీ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకూ భక్తజన సౌకర్యార్దం తెరిచే ఉంటాయి. 

శ్రీ మాత్రే నమః !!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...