17, నవంబర్ 2015, మంగళవారం

Mahavir Mandir, Patna

                              శ్రీ సంకట మోచన మందిరం, పట్నా 

శ్రీ రామ దూతగా పేరొందిన శ్రీ ఆంజనేయుని తలిచిన వారికి గ్రహ, దుష్ట శక్తుల ప్రభావం పడదని, రామచంద్రుని కృపా కటాక్షాలు సంపూర్ణంగా లభిస్తాయన్నది శతాబ్దాల విశ్వాసం. అందుకే దేశమంతటా ఎన్నో హనుమంతుని ఆలయాలు, మందిరాలు నెలకొల్పబడినాయి.
ఆపదలను నివారించే వానిగా పవన సుతుడు మిక్కిలి ప్రసిద్దుడు. ఈ కారణంగా రహదారుల మీద  లెక్కలేనన్ని వానర యోధుని విగ్రహాలను నిలుపుతుంటారు.  


కాలక్రమంలో భక్తుల అనుభవాలతో చాలా మందిరాలు ప్రముఖ దర్శనీయ క్షేత్రాలుగా పేరొందాయి. అలాంటి వాటిల్లో బీహారు రాష్ట్ర రాజధాని పట్నా నగర ప్రధాన రైల్వే స్టేషన్ వెలుపల ఉన్న శ్రీ సంకట మోచన మందిరం ఒకటి. 




ముఖ్యమైన విశేషం ఏమిటంటే అన్ని ఆలయాలలో ఒకే మూల విరాట్టు కొలువై ఉంటారు. ఇక్కడ మాత్రం రెండు రూపాలలో అంజనా సుతుడు భక్త జనుల పూజలందుకొంటుంటారు.
ఈ విగ్రహాలు ఏనాటివో ఎవరికీ తెలియదు.
లభిస్తున్న ఆధారాల ప్రకారం రామభక్తుడైన శ్రీ బాలానంద స్వామి పదిహేడువందల ముప్పై వ సంవత్సరంలో చిన్న మందిరాన్ని ఈ విగ్రహాలకు నిర్మించారని తెలుస్తోంది.


భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే స్వామిగా కాల గతిలో విశేష గుర్తింపు పొందిన మందిరం క్రమంగా నేటి రూపును సంతరించుకొన్నది. 
వేలాదిగా భక్తులు ప్రతి నిత్యం స్వామిని సేవించుకోవడానికి వస్తుంటారు. మంగళ మరియు శని వారాలలో వేలాదిగా భక్తులు స్వామి దర్శనానికి తరలి వస్తారు. 


గర్భాలయంలో కొలువైన రెండు రూపాలలో ఒకదానిని "పవిత్రానాయ సాధూనాం" అంటే మంచి వారిని కాపాడే మూర్తిగా, రెండవది "వినాశాయచ దుష్కృతాం" అనగా దుష్టులను శిక్షించే వానిగా వర్ణిస్తారు.
సింధూర వర్ణ శోభితులై నిలువెత్తు రూపంలో సంకట మోచన స్వామి వారు నేత్ర పర్వంగా కొలువై ఉంటారు.

మూడు అంతస్థులుగా నిర్మితమైన ఈ మందిరంలో కైలాస వాసుడు లింగ రూపంలో, గీతోపదేశ పార్ధసారధి, శబరి సేవలను స్వీకరిస్తున్న దశరధ నందనులు, శ్రీహరి, శ్రీ దుర్గ, సీతారామ కళ్యాణ ఘట్టం, చదువుల తల్లి సరస్వతి రూపాలను పాలరాతి విగ్రహాల మీద చెక్కి ప్రతిష్టించారు.






మూలవిరాట్టుకు ఎదురుగా రామచరిత మానస రూపకర్త సంత్ శ్రీ తులసీదాస్ విగ్రహాన్ని చిన్న మండపంలో ఉంచారు.
ప్రాంగణం లోనే పూలు, నైవేద్యానికి కావలసిన మిఠాయిలు లభిస్తాయి.




పగలు సూర్య కిరణాల మరియు రాత్రి విద్యుత్ దీపాల కాంతిలో ఈ మందిరం శోబిస్తూ ఉంటుంది.


నియమంగా రోజూ నిత్య పూజలు, శ్రీ వాల్మీకి రామాయణ ప్రవచన గానం నిర్వహిస్తారు. ఉదయం అయిదు గంటల   నుండి రాత్రి ఎనిమిది గంటల వరకూ నిరవధికంగా భక్తుల సౌలభ్యం కొరకు తెరిచి వుంటుంది. 
హనుమాన్ జయంతి, శ్రీ రామ నవమి, ఇతర పర్వదినాలలో విశేష పూజలు, విపరీతమైన భక్తుల సందడి నెలకొంటుంది. 




ఆలయ ట్రస్ట్ అధ్వర్యంలో పలు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. అతి త్వరలో తూర్పు చేమ్పారం జిల్లా లోని "కేసరియా" అనే ఊరిలో "విరాట్ రామాయణ మందిరం" నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రాంగణంలో నమూనాను వీక్షించవచ్చును. 


నగర నది బొడ్డున అత్యంత జనసమ్మర్ధ ప్రదేశంలో ఉన్నా ప్రాంగణంలో అనుభవమయ్యే ప్రశాంతత అనిర్వచనీయం. జీవితంలో ఎదురయ్యే సంకటాలను దూరం చేసే సంకట మోచన హనుమాన్ మందిరాన్ని పట్నా నగరాన్ని సందర్శించేవారు తప్పని సరిగా దర్శించుకోవలసిన మందిరం.

జై హనుమాన్!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...