Sri Pachayamman Temple, Tiruvannamalai

                       శ్రీ పచ్చయమ్మన్ ఆలయం, తిరువన్నామలై 

తిరువన్నామలై భువిలో కైలాసం. ఈ క్షేత్రం లోని ప్రతి అంగుళం పరమ పవిత్రమైనది. అందుకే ఇక్కడ అడుగుకొక ఆలయం, చిన్న మందిరం ఏదో ఒకటి కనిపిస్తుంది. భక్తులను ఆకర్షిస్తుంది. 
కాకపోతే తిరువన్నామలిలో తప్పక దర్శించాల్సిన ఆలయాలలో "శ్రీ పచ్చయమ్మన్ ఆలయం" ఒకటి. 
పవిత్ర అరుణగిరి పాదాల వద్ద నెలకొన్న ఈ ఆలయం ఎన్నో విధాలుగా మిగిలిన ఆలయాలకు భిన్నంగా చెప్పుకోవాలి. తమిళనాట ఎన్నో పచ్చయమ్మన్ ఆలయాలు ఉన్నాయి. భక్తులు ఈమెను అపర దుర్గా అవతారంగా ఆరాధిస్తారు. 












అమ్మవారు కంచిలో తపస్సు ముగించుకొని ఏడుగురు ఋషులతో, సప్త కన్యలతో శివ సేవకు అరుణాచలం బయలుదేరినది. మార్గ మధ్యమంలో మహిషాసురుడు  ఆమె సౌందర్యానికి ముగ్ధుడై, వాస్తవం మరిచి, మొహందకారానికి లోనై చెరపట్టబోయాడు.  అమ్మవారు భీకర రూపం ధరించి  సహాయంగా వచ్చిన మునీశ్వరులతో కలిసి ఆ మదాంధుని హతం చేసారు. 
ఆమె నేటి  "పావల  కుండ్రు" ఆలయం ( వివరాలు ఈ బ్లాగ్లో ఉన్నాయి ) ఉన్న ప్రదేశంలోని గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకొన్నారు. లేత పసుపు ఆకుపచ్చ వర్ణాల మిళితమైన పవిత్ర ధర్భాలతో నిర్మించిన  ఆశ్రమం లోనికి రాగానే అమ్మవారి శరీరం పూర్తి హరిత వర్ణం సంతరించుకొన్నది. నాటి నుండి "పచ్చయమ్మన్" అని పిలవసాగారు.









నాడు ఆమెకు బాసటగా నిలిచిన మునీశ్వరులు ఆలయ ప్రాంగణంలో రెండు వరుసలలో ఆయుధాలు ధరించి అమ్మ సేవకు సదా సిద్దం అన్నట్లుగా కూర్చొని ఉంటారు. ఎత్తైన ఈ రూపాలు చూపరులను అబ్బురపరుస్తాయి.  
వారిని "వాల్యు మునీశ్వరార్, కరుముని, విలాడన్ ముని, శంభుని ఈశ్వరార్, ముత్తు ముని, వీరముని".  వీరి వాహనాలైన అశ్వము, గజము, లోట్టిపిట్ట, ఆలయ వెలుపల ఉత్తర భాగాన కనపడతాయి. 
వీరిని కావలి దైవాలుగా భక్తులు కొలుస్తారు. 
సుమారు ఎనిమిదో శతాబ్దం నుండి ఇక్కడ కొలువైన పచ్చయమ్మన్ ప్రస్తుత ఆలయం నిర్మించి సుమారు నూట పాతిక సంవత్సరాలు. ఒక కుటుంబం వారు తరతరాలుగా పూజాదికాలు                నెరపుతున్నారు.











అద్భుత శిల్పాలు ఆలయమంతటా కనిపిస్తాయి. 
గర్భాలయంలో అమ్మవారితో పాటు  సప్త కన్నికలు, వివిధ దేవీ రూపాలు కొలువై పూజలు అందుకొంటారు. 
దక్షిణం వైపున ఆలయ పుష్కరణి ఉంటుంది. 
మంగళ, శుక్ర వారాలలో, అమావాస్య, పౌర్ణమి రోజులలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.






1905లో తిరువన్నామలై లో ప్లేగు వ్యాధి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు భగవాన్ 
 శ్రీ రమణ మహర్షి కొన్ని నెలల పాటు ఇక్కడ ఈ కోవెలలో ఉన్నారట. అలానే 1908లో కూడా కొన్ని మాసాల పాటు అమ్మవారి సేవలో గడిపారట.


  





ముఖ్యంగా గ్రహ దోషాలతో వివాహం కాని ఆడపిల్లలు అమ్మవారికి నేతి దీపం వెలిగించి, ప్రత్యేక పూజలు జరిపిస్తే దోషాలు తొలగి పోయి తగిన వరునితో వివాహం జరుగుతుంది అన్నది స్థానిక విశ్వాసం. 
తిరువన్నామలై బస్సు స్టాండ్ కి సమీపంలో ప్రశాంత వాతావరణంలో ఉండే ఈ ఆలయం అందరికీ మానసిక శాంతిని  ప్రసాదించ గలదు.   
శ్రీ పచ్చయమ్మన్ ఎందరికో కులదేవత. వారి ఇండ్లలో ఏ శుభకార్యం జరిగినా తొలి పిలుపు అమ్మవారికే ! ఆలయ విశేషాల గురించి అరుణాచల మహిమ లాంటి ఎన్నో పురాతన గ్రంధాలు వివరంగా తెలుపుతున్నాయి. 
చైత్ర పౌర్ణమికి ఘనంగా ఆలయ ఉత్సవాలను నిర్వహిస్తారు. లక్షలాదిగా భక్తులు రాష్ట్రం నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి కూడా తరలివస్తారు.  


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore