14, నవంబర్ 2015, శనివారం

Sri Kurmam


                                                   శ్రీ కూర్మం 

త్రిమూర్తులలో స్థితి కారకుడు మరియు లోక సంరక్షకుడు అయిన శ్రీ మన్నారాయణుడు అనేకానేక అవతారాలు ధరించారు. వాటిల్లో విశేష ప్రాముఖ్యం కలిగినవి దశావతారాలు. 
ఈ దశావతారాలలో రెండవది అయిన కూర్మావతార ఆలయం ఉండటం వలన ఈ క్షేత్రం శ్రీ కూర్మం గా ప్రసిద్ది చెందినది.  లోకంలో స్వామి కూర్మ రూపంలో కొలువైన ఆలయం ఇదొక్కటే !




పద్మ, కూర్మ, అగ్ని మరియూ విష్ణు పురాణాలలో ఈ క్షేత్ర ప్రస్తాపన ఉన్నది. ఈ అవతార ఆవశ్యకతను  విశదీకరించే గాధ వేదకాలం నాటిది.
దుర్వాస మహాముని శాప కారణంగా దేవతలు తమ సమస్త సంపదలను కోల్పోయారు. దిక్కుతోచని పరిస్థితులలో వైకుంఠ వాసుని శరణు కోరారు.


అనంత శయనుని ఆదేశం మేరకు ఆగర్భ శత్రువులైన దానవులతో కలిసి క్షీర సాగరాన్ని మదించడానికి సిద్దమయ్యారు. కవ్వంగా మంధర పర్వతాన్ని, దానికి చుట్టే తాడుగా సర్పరాజు వాసుకి ని ఎంచుకొన్నారు.
కానీ పర్వతాన్ని నిలపడం సమస్యగా మారింది. తిరిగి శ్రీహరే మార్గం చూపారు.


అదే కూర్మావతారం. స్వయంగా శ్రీవారు తాబేలు రూపంలో మంధర పర్వతాన్ని తన వీపున నిల్పుకొని సాగర మధనం విజయవంతంగా సాగేలా చేసారు.
పురాణాల ప్రకారం రాక్షస సంహారం జరపని సాత్విక రూపం మహావిష్ణువు ధరించినది ఆరవ మనువైన "చాక్షును"ని కాలంలో అని అవగతం అవుతోంది.
 తిరిగి ఇరవై ఎనిమిదో మహా యుగంలోని కృత యుగంలో ఏడవ మనువైన వైవస్వతుని కాలంలో శ్వేత మహారాజు తన పాపాన్ని తొలగించుకోడానికి తగిన మార్గం తెలుపమని నారద మహర్షిని అర్ధించారు. ఆ త్రిలోకసంచారకుడు మహారాజును పవిత్ర వంశధార నది సాగరునితో సంగమించే తీర్ధం వద్ద తపస్సు చేయమని తెలిపారు. శీఘ్ర గతిన ఫలితం  పొందడానికి కూర్మ మంత్రాన్ని ఉపదేశించారు.

ఆ ప్రకారం చేసిన శ్వేత రాజు కూర్మనాధుని సందర్శనం తద్వారా పాప విమోచనం పొందాడు. స్వామి రాజు కోరిక మేరకు అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నారు. తదనంతర కాలంలో విధాత బ్రహ్మ ఇక్కడ సుదర్శన మరియు గోపాల యంత్రాలను ప్రతిష్టించారు. దేవశిల్పివిశ్వకర్మ శ్రీ కూర్మ నాదునికి తొలి ఆలయాన్నినిర్మించారు. ద్వాపర యుగం వరకు దేవతలకే ఈ ఆలయంలో పూజలు చేసే అర్హత ఉండేది.    

శ్రీ బలరాముడు ఈ ఆది కూర్మ క్షేత్రం లోకంలో ఒకే ఒక్కటిగా వెలుగొందాలని, అందరికీ పూజార్హత లభించాలని శాసనం చేసారు. క్షేత్ర పాలకులుగా పంచలింగ క్షేత్రాలను ప్రతిష్టించారు. అవే నేటి శ్రీ కాకుళం పట్టణం లోని శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి( పడమర), కళింగ పట్టణం లోని శ్రీ కర్పూరేశ్వర స్వామి(తూర్పున), ఇప్పిలి గ్రామములో శ్రీ సుందరేశ్వర స్వామి(దక్షిణాన), సింగుపురము లోని శ్రీ హటకేశ్వర స్వామి, శ్రీ కూర్మం లోని  శ్రీ పాతాళ సిద్దేశ్వర స్వామి ఆలయాలు.

అదే విధంగా ఎనిమిది దిక్కులలో సాగరునితొ కలిపి శ్వేత, నారద, చక్ర, మాధవ, కౌటిల్య, వక్ర, నారసింహ   కోనేరులను ఏర్పాటు చేసారు.
ప్రస్తుతం  నిర్మలమైన నీటితో శ్వేత పుష్కరిణి ఆలయానికి ఎదురుగా కనువిందు చేస్తుంది. 
పాల కడలి నుండి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించినట్లుగా, ఇక్కడ కొలువైన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు అభయ వరద ముద్రలతో పద్మాసనావస్థగా సాక్షాత్కరించారని తెలుస్తోంది.


ప్రస్తుత ఆలయాన్ని కళింగ రాజులు ఆరంభించగా విజయనగరాధీశుడు శ్రీ కృష్ణ దేవరాయలు విస్తృత స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసారు.అందుకే విజయనగర శిల్ప శైలి ప్రస్పుటంగా కనిపిస్తుంది.
ఎందరో మహనీయులు, పాలకులు, ఐశ్వర్యవంతులు,సామాన్యులు స్వామిని ఎన్నోశతాబ్దాలుగా కొలుస్తున్నారు. 
ఎన్నో కైకర్యాలు సమర్పించుకొన్నారు అనడానికి ఆలయంలో కనిపించే లెక్కలేనన్ని తెలుగు మరియు ఒరియా భాషల లోని శాసనాలే నిదర్శనం.   




జగద్గురు శ్రీ ఆదిశంకరులు, వైష్ణవ మతాచార్యులు శ్రీ రామానుజాచార్యులు, ద్వైత మతాచార్యులు శ్రీ నరహరి తీర్ధులు,  శ్రీ చైతన్య మహా ప్రభువులు శ్రీ కూర్మనాధుని సేవించుకొన్నారని శాసనాధారాలు తెల్పుతున్నాయి.
సువిశాల ప్రాంగణం లోనికి ఉత్తరం పక్కన ఉత్తరాంధ్ర శైలిలో నిర్మించిన గోపురం గుండా ప్రవేశించాలి. ఎత్తైన ప్రహరీ గోడలతో, తూర్పు, దక్షిణ గోపుర ద్వారాలతో విశిష్ట శిల్పాలతో అత్యంత రమణీయంగా దర్శనమిస్తుందీ ఆ ఆలయం.
మరో విశేషం ఏమిటంటే తూర్పు పడమరలలో ధ్వజస్తంభాలు ఉండటం.
పదకొండో శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యుల వారు పడమర దిశలో నిలబడి జగద్రక్షకుని దర్శనం కొరకు ప్రార్దించగా అప్పటిదాకా తూర్పు దిశగా ఉండే స్వామి పశ్చీమ దిక్కుకు తిరిగారట. శ్రీ కూర్మ నాధుడు భక్తసులభుడు.






దేవాలయ కమిటీ వారిని ఎంతో అభినందించాలి. ఆలయానికి సంబంధించిన పౌరాణిక, చారిత్రక గాధలను, ప్రతి ఒక్క ప్రత్యేకతను, విశేషాన్ని, దర్శనీయ ప్రదేశ వివరాలను చక్కగా పెద్ద పెద్ద బోర్డుల రూపంలో ఏర్పాటు చేసారు.
మిగిలిన ఆలయాల వారు ఈ విధానాన్ని అనుసరిస్తే భక్తులకు క్షేత్ర ప్రాధాన్యత సంపూర్ణంగా తెలుసుకొనే భాగ్యం కలుగుతుంది.





ఢిల్లీ సుల్తానుల, ఇతర నవాబుల దాడులలో శిల్పాలకు కొంత మేర నష్టం కలిగింది. దాడుల నుండి ఆలయాన్ని రక్షించడానికి స్థానికులు గుగ్గిలం మరియు సున్నపు మిశ్రమంతో కప్పి ఒక గుట్టలా భ్రమింప చేసారట. 
కొన్ని చోట్ల ఆ గుర్తులు నేటికీ కనిపిస్తాయి. 
గ్రైనేట్ రాతి మీద చెక్కిన స్తంభాలు మనోహర శిల్పాలను ప్రదర్శిస్తాయి. 





ముఖ్యంగా అత్యంత చిన్నవిగా చెక్కిన తాండవ గణపతి, వీణాపాణి, గజాలు ఇతరములు చూపరులను అబ్బుర పరుస్తాయి. 
అదే విధంగా ఆలయ లోపలి గోడల పైన శతాబ్దాల క్రిందట సహజ వర్ణాలతో చిత్రించిన చిత్రాలు ఆకట్టుకొంటాయి. ముఖ్యంగా అనంత శయన భంగిమలో చిత్రించిన స్వామి వారి చిత్రం నేటి "3D" విధానానికి నాటి  రూపం. మనం ఎటు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లుగా ఉంటుంది.  





















శిల్ప కళకు మరో చిరునామాగా ఆలయ విమానాన్ని పేర్కొనాలి. ఎన్నో శిల్పాలు.  అష్ట దిక్కులా దిక్పాలకులను, సర్వేశ్వర రూపాలు, దశావతారాలు, కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మి దేవి ఇలా ఎన్నో రమణీయ శిల్పాలు.
ఒకే రాతి మీద 3D విధానంలో చెక్కిన వంద శివ లింగాలు పరీక్షగా చూస్తే తప్ప అర్ధం కావు.




శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ వైష్ణవి దుర్గ, శ్రీ రామానుజాచార్యుల, ఆళ్వార్ల మరియు శ్రీ నరాసింహ ఉపాలయాలు ఉంటాయి. దక్షిణ గోపురం దగ్గర శ్రీ చైతన్య మహా ప్రభువుల పాదాలు ఏర్పాటు చేసారు.





గర్భాలయంలో ఒక పక్కన  చందన లేపన సుందర పుష్పాలంకరణలో శ్రీ కూర్మ నాధుడు నాయన మనోహరంగా దర్శనం ఇస్తారు. ఎలాంటి గ్రహ దోషమైన  ఈ స్వామికి అభిషేకం జరిపిస్తే తోలిగిపోతుంది అన్నది తరతరాల విశ్వాసం.








మరో ఆకర్షణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నక్షత్ర తాబేళ్ల కేంద్రం. పిన్నలను పెద్దలను ఆకర్షిస్తుంది. తాబేళ్ళకు పెడితే పుణ్యం అని కూరగాయాలు అమ్ముతుంటారు.



ఆలయానికి వెనక పక్కన నిలువెత్తు దశావతార విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేసారు. చక్కగా ఉంటాయి.
శ్రీ కూర్మ నాధుని ఆలయానికి కొద్దిగా ముందు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ పాతాళ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం వస్తుంది.
పేరుకు తగినట్లుగానే దిగునకు ఉంటుంది లింగం. పక్కనే అమ్మవారు శ్రీ పార్వతీ దేవి సన్నిధి. నవగ్రహ మండపం కూడా కలదు.
శ్రీ బలరామ ప్రతిష్ట. పురాతన నిర్మాణం.








































































వంద లింగాలు 



















శ్రీ కూర్మ జయంతి వైభవంగా జరుపుతారు. అన్ని పర్వ దినాలలో విశేష పూజలు ఉంటాయి. ధనుర్మాస పూజలు, తిరుప్పావై గానం, గోదా కల్యాణం, వైకుంఠ ద్వార దర్శనం వైభవంగా నిర్వహిస్తారు.






3D చిత్రం 

ప్రతి నిత్యం ఎందరో భక్తులు వస్తుంటారు. శెలవు రోజులలో మరింత అధిక సంఖ్యలో భక్తులు ఆంధ్ర మరియు ఒడిషా రాష్ట్రాల నుండి శ్రీ కూర్మనాధుని సందర్శనార్ధం తరలి వస్తుంటారు. 
ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్క కూర్మావతార ఆలయంగా పేరొందిన శ్రీకూర్మం శ్రీకాకుళం పట్టణం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  ప్రతి పదిహేను నిముషాలకు ఒక బస్సు శ్రీకాకుళం నుండి శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం మీదగా శ్రీ కుర్మానికి నడుస్తాయి. 
ప్రతి ఒక్కారూ తప్పని సరిగా దర్శించవలసిన క్షేత్రం. 

కృష్ణం వందే జగద్గురుం !!!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...