Ammani Amman Gopuram, Tiruvannamalai

                          అమ్మణి అమ్మన్ గోపురం, తిరువన్నామలై 

తిరువన్నామలై అన్నా అరుణాచలం అన్న అరుణగిరి అన్నా అన్నీ ఒకటే ! 
ఈ దివ్య ధామంలో కైలాస నాధుడు స్వయంగా పర్వత రూపంలో కొలువుతీరిన ఏకైక క్షేత్రం. 
ఎన్నో శతాబ్దాలుగా స్వామి ఇక్కడ దేవతల, దిక్పాలకుల, మహర్షుల, కారణ జన్ముల, మానవుల సేవలను స్వీకరిస్తూ  అనుగ్రహిస్తున్నారు.






పంచ భూత స్థలాలలో అగ్ని క్షేత్రం తిరువన్నామలై. ఎందరో రాజులు మహారాజులు ఇక్కడ అరుణా చలేశ్వరుని  దేవాలయ నిర్మాణంలో పాలుపంచుకొన్నారు. అధికార అర్ధ అంగ బలం ఉన్న వారే కాదు, పరిపూర్ణ భక్తి, విశ్వాసం ధృడ సంకల్పం కలిగిన భక్తులు అనేక మంది తమ శక్తి మేరకు ఆలయ అభివృద్దికి పాటుపడ్డారు.
అలాంటి వారిలో అగ్రగణ్యురాలు "అమ్మని అమ్మన్".





రాజ గోపురం, తిరుమంజన గోపురం, పై గోపురం, వెల్లాల గోపురం, కిళ్ళీ గోపురం ఇలా ఎన్నో గోపురాలతో కళకళ లాడే ఆలయ నిర్మాణాలలో ఉత్తర గోపురమైన "అమ్మని అమ్మన్ గోపుర" నిర్మాత "అమ్మని అమ్మన్".
తిరువన్నామలై కి సమీపంలోని జవధి కొండల వద్ద ఉన్న "చెన్న సముద్రం" అనే గ్రామంలో జన్మించినది అమ్మని అమ్మన్.
చిన్నతనం నుండే  సతతం సర్వేశ్వరుని నామ ధ్యానంలో మునిగి తెలుతుండేది.
తల్లి తండ్రులు పెళ్లి చేస్తే పిల్లకు ఈ భక్తి పిచ్చి తొలగి పోతుందని భావించి, తెలిసిన కుర్రవానితో ఆమె వివాహం జరిపించారు.





తొలినాటి రాత్రి ఆమె తన భర్తకు తన సంకల్పం తెలిపి సమీప అరణ్యాలకు వెళ్లి జలపాతాల క్రింద  తీవ్ర ధ్యానంలో కొన్ని రోజుల పాటు బాహ్య ప్రపంచ ధ్యాస లేకుండా ఉండి పోయింది.అనతి కాలం లోనే అనేక దివ్య శక్తులను పొందినది.
ఆమె సహచరులు ఆమె సాక్షాత్ పార్వతీ దేవి అంశగా భావిస్తారు. ఆమె గత జన్మల గురించిన అనేక గాధలు స్తానికంగా వినిపిస్తాయి.




కొంతకాలానికి అరుణాచలం చేరిన అమ్మని అమ్మన్ స్వామి సేవలో, ఆలయ అభివృద్దిలో పాల్గొనేది. అప్పటికి ఉత్తర గోపురం మాత్రం పూర్తి కాలేదు. ఆమె తిరువన్నామలై చుట్టుపక్కల గ్రామాలలోని భక్తుల ఇండ్లకు వెళ్లి గోపుర నిర్మాణానికి వారి వంతు సహాయం చేయవలసినదిగా అర్ధించేది. దానం లేదని ఎవరైనా అబద్దం చెప్పారో ఆ సమయంలో వారి ఇంట్లో ఎంత దానం ఉన్నదో అణాపైసలతో బయట పెట్టేది.
ఆమె దివ్య శక్తులకు నివ్వెరపోయిన భక్తులు క్షమాపణలు కోరుకొని మనస్పూర్తిగా విరాళాలు సంపర్పించుకోనేవారు.



ఆలయ వృక్షం 

చివరగా ఆమె మైసూరు మహారాజు వద్దకు వెళ్లి తన మనస్సులోని ఆకాంక్ష తెలియచ్చేప్పినది. రాజు ఎంతో ధనాన్ని ఆమెకు అందించారు. కావలసిన పైకం సమకూడటంతో ఆమె నిపుణులైన శిల్పులను పిలిపించి ఉత్తర గోపుర నిర్మాణ భాద్యతలను అప్పగించినది.
ఎంతో దీక్షతో ఆమె చేపట్టిన కార్యక్రమం పూర్తిచేసినది. అందుకే ఉత్తర గోపురాన్ని "అమ్మని అమ్మన్ గోపురం" అని పిలుస్తారు.





తిరువన్నామలై ఆలయంలో నెలకొని ఉన్నమరో నిర్మాణ చాతుర్యం ఏమిటంటే ఆలయ వృక్షం అయిన పొగడ చెట్టు వద్ద నేల మీద ఒక వృత్తాకారం చెక్కారు. అందులో నుంచొని ఒక్కో దిక్కుకు చూస్తే ఆ పక్క ఉన్న గోపురాలన్నే ఒక వరుసలో కనపడతాయి. అలా అక్కడ నుండి అన్ని దిక్కులలో ఉన్న గోపురాలను వీక్షించవచ్చును.
ఇరవై అయిదు ఎకరాల ప్రాంగణంలో మరెక్కడ నుండీ అన్ని గోపురాలను చూడలేము.




అమ్మని అమ్మన్ గోపురం 






అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో అనేక మందిని భక్తి మార్గంలో నడిపించిన మహనీయురాలు శ్రీ అమ్మని అమ్మన్. ఈమె జీవ సమాధి ఈశాన్య లింగానికి ఎదురుగా ఉంటుంది. తప్పక సందర్శించవలసిన ప్రదేశం. 


ఈశాన్య లింగం 

అమ్మని అమ్మన్ జీవ సమాది 

ఓం అరుణా చలేశ్వరాయ నమః !!!!



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore