1, అక్టోబర్ 2024, మంగళవారం

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం 


ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ పఠన మరియు శిలా శాసనాలను  పరిశీలన చేయాలి. 
ఎందుకంటే ఈ రోజు మనం ప్రయాసపడుతూ సందర్శించే క్షేత్రాలు ఒకప్పుడు గొప్ప తీర్థ పుణ్య క్షేత్రాలుగా ప్రసిద్దికెక్కినవి అని గ్రంధాలు మరియు శాసనాలు తెలుపుతాయి. అంటే గతంలో నేటి చిన్న చిన్న గ్రామాలు నిరంతరం భక్తుల రాకపోకలతో సందడిగా నిత్య పూజలతో, ఉత్సవాలతో శోభాయమానం గా ఉండేవని తెలుస్తుంది. 
ఈ ఉపోద్ఘాతం వెనుక ఉన్న విషయం నేడు మరుగున పడిపోయిన ఒక విశేష క్షేత్ర ప్రాధాన్యత తెలుపడానికి చేస్తున్న ప్రయత్నంలో దొరికిన హృదయాలను కలచివేసే సమాచారం.

దక్షిణ భారత దేశ ప్రత్యేకత 

సువిశాల మన దేశం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా భాష, ఆచారవ్యవహారాలు, ఆహార విహారాలు మరియు నిర్మాణశైలి విషయంలో ఉత్తర మరియు దక్షిణ భారత దేశాల మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనపడతాయి. 
దక్షిణ భారత దేశంలో నేడు ఉన్న ఆరు రాష్ట్రాల మధ్య కూడా ఆది నుండి కూడా ఎన్నో భిన్న విభిన్న మరియు సమాన జీవనశైలి కనపడుతుంది. 
ఇక ఆలయ నిర్మాణశైలి తీసుకొంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తనదైన ప్రత్యేక నిర్మాణ విశేషాలు కలిగి ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 
ముఖ్యంగా కర్ణాటకలో కనిపించే ఆలయ నిర్మాణశైలి అత్యంత క్లిష్టమైనది ప్రత్యేకమైనది. 
మనకు నేడు క్రీస్తుశకం నాలుగు లేదా అయిదు శతాబ్దాల నిర్మాణాలు కనపడతాయి. వీటిలో కొన్ని గుహాలయాలు. 
ఇవి ఎక్కువగా బాదామీ చాళుక్య రాజుల కాలంలో వారు పాలించిన బాదామీ, పట్టదక్కల్ మరియు ఐహోళే లలో కనపడతాయి. ఈ మూడు ప్రదేశాలలో గుహాలయాల నుండి విశేష రాతి కట్టడాల వరకు కనపడతాయి. 
వీరి నుంచి విడిపోయిన కల్యాణి లేదా పశ్చిమ చాళుక్యులు మరియు తూర్పు లేదా వేంగి చాళుక్యులు , రాష్ట్రకూటులూ, పశ్చిమ గంగ వంశం, శూణులు, కదంబ వంశం, హొయసల పాలకులు ఈ ప్రత్యేక ఆలయ నిర్మాణశైలిని మరింత మెరుగుపరిచారు. సుందరంగా, ఆకట్టుకొనే నిర్మాణాలను చేశారు. దక్షిణభారత దేశంలోని మరే  ప్రాంతంలోనూ కనిపించని విలక్షణశైలి అని చెప్పాలి. 
అవన్నీ కూడా ఆ రోజులలో ప్రజల ఆదరణ గొప్పగా పొందినవి కావడం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం. ఆ రోజులలో మన దేశంలో పర్యటించిన విదేశీ యాత్రీకులు, నాటి రాజాస్థానాలలో ఉన్న కవిపండితులు 
ఈ రాజవంశాల వారు నిర్మించిన అనేక ఆలయాలు నేడు శిధిలావస్థలో ఉన్నాయి. అయినా వాటి ఆకర్షణ ఏ మాత్రం తగ్గలేదు. కాకపోతే వాటిని సందర్శన మాత్రం కొంత వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం అని చెప్పాలి. ఇవన్నీ కూడా రక్షిత కట్టడాలుగా పురావస్తు శాఖవారి ఆధ్వర్యంలో ఉన్నాయి. 
అలాంటి వాటిలో గతమెంతో ఘనకీర్తి కలిగిన శ్రీ కైతభేశ్వర స్వామి వారు కొలువైన ఆలయం గురించిన విశేషాలు తెలుసుకొందాము. 





గతమెంతో ఘనకీర్తి 

" బంగారు కలశాలతో శోభించే విమానశిఖరాలతో, నిరంతరం ప్రతిధ్వనించే వేదమంత్రాలతో శాస్త్ర ప్రకారం విశ్వకర్మ నిర్మించిన ఆలయాలు ఒక ఎత్తు. విశాలమైన ప్రాంగణాలతో, చుట్టూ పచ్చదనపు సోయగం నిలుపుకొన్న చక్కని విశాలమైన గృహాలు మరో పక్క, కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయి కనిపించే దుకాణాలు. యేమని చెప్పాలి "కుప్పతూర్" గొప్పదనాన్ని, యేమని పొగడాలి కుప్పత్తూర్ అందాలను ! అమరావతి, అలకాపురి ముల్లోకాలలోని ఏ పట్టణం కూడా కుప్పతూర్ కు సాటి లేదు రాదు"
ఇది ఒక శాసనంలో రాసిన విశేషాలు. సాటిలేని శోభను సంతరించుకున్న ఆ పట్టణం ఒకప్పటి పేరు కుప్పత్తూర్, కుంతలనగర నేటి పేరు "కుబతూర్". 
కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లా సొరబ్ తాలూకాలో రెండు వేలు కూడా దాటని జనాభా కలిగిన చిన్న పల్లె. 
ఒకనాటి గొప్పదనాన్ని ప్రదర్శించే ఆలయాలు, శిధిల నిర్మాణాలు మాత్రం చాలా కనపడతాయి. 

ఆలయాలు 

కుబతూర్ ఒకప్పుడు గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. ఎన్నో ఆలయాలు కనిపించేవని చెబుతారు. హిందూ ఆలయాలు కాదు జైన మందిరాలు కూడా కనిపిస్తాయి.కల్యాణీ చాళుక్యులు జైనాన్ని గౌరవించారు. 
రామేశ్వర, కైతభేశ్వర(కోటిలింగేశ్వర) మరియు పారశ్వథనాథ్ బాసాడి ప్రస్తుతం వెలుగులో ఉన్న ఆలయాలు. 

శ్రీ రామేశ్వర ఆలయం 

మూలస్థాన ఆలయం అని స్థానిక నామం. ఇక్కడ ఈ ఆలయం మొదట నిర్మించారు,
 శ్రీ రామేశ్వర ఆలయం 1065 వ సంవత్సరంలో నిర్మించబడినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. 
ప్రస్తుతం చిన్న మండపం గర్భాలయం ఎదురుగా చిన్న  నంది మండపం మాత్రమే ఉన్నాయి. 
ముఖ లేక రంగ మండపంలో శివతాండవ శిల్పం చుట్టూ దిక్పాలకులు, నంది, గణేశా కుమారస్వామి, పార్వతీదేవి కనిపిస్తారు. సప్త మాతృకలు మరియు కాళికాదేవి శిల్పాలు సుందరంగా ఉన్నాయి నేటికీ. 
చిన్న గద్దె మీద ఉన్న నాగ శిల్పాలు హిందూ సంప్రదాయంలో నాగ పూజకు ఉన్న ప్రాధాన్యతను తెలుపుతాయి. 






శ్రీ కైతభేశ్వర స్వామి ఆలయం 

మహేశ్వరుడు లింగరూపంలో శ్రీ కైతభేశ్వర స్వామి గా కొలువైన విశేషాలు ద్వాపర యుగం నాటివిగా తెలుస్తున్నాయి. 
బాణాసురుడు అనే అసుర రాజు గొప్ప శివ భక్తుడు. ఇతని కుమార్తె ఉష శ్రీ కృష్ణుని మనుమడైన అనిరుద్ధుని ప్రేమించి వివాహం చేసుకొన్నది. ఉషాపరిణయం గా ప్రసిద్ధి చెందిన వృత్తాంతం. 
ఇతని నగరానికి ఈశ్వరుడే రక్షణ. 
తనకున్న శివభక్తి కారణంగా అనేక శివలింగాలను ప్రతిష్టించాడు బాణాసురుడు. ఇక్కడ ప్రతిష్టించినది కోటి లింగాలలో చివరిది . అందువలన స్వామిని కోటీశ్వరుడు అని పిలిచేవారు. శాసనాలలో కూడా అదే పేరు కనిపిస్తుంది. కాలగతిలో శ్రీ కైతభేశ్వరస్వామి గా పిలవబడుతున్నారు. 
కానీ మరోగాధ కూడా వినిపిస్తుంది. 
మధుకైటభులు అనే అసురులు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా ఆయన చెవి నుండి జన్మిచారని చెబుతారు. దేవీ భాగవతంలో వీరి వృత్తాంతం ప్రస్తాపించబడినది. వరగర్వంతో లోకకంటకులుగా మారిన వారిని శ్రీహరి తనదైన శైలిలో సంహరించారని పురాణం తెలుపుతోంది. 
వారిరువురూ అనేక శివలింగాలను ప్రతిష్టించారని అంటారు. 
అలా కైతభుడు ప్రతిష్టించిన లింగం కావడాన శ్రీ కైతభేశ్వర స్వామి అని పిలుస్తున్నారు అని చెబుతారు. మొదటివాడైన మధు ప్రతిష్టించిన లింగం శ్రీ మధుకేశ్వర స్వామి గా పిలవబడుతూ బనవాసి అనే ఉత్తర కన్నడ జిల్లా లోని ఊరిలో ఉన్నది అని చెబుతారు. ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరం. 

ఆలయ విశేషాలు 

తుంగభద్రా నదికి ఉపనది అయిన "వరదా నది" తీరంలో ఉంటుందీ ఆలయం. 
తూర్పు ముఖంగా ఉండే ఏక కూట ఆలయంలో శ్రీ కైతభేశ్వర స్వామి లింగరూపంలో దర్శనమిస్తారు. 
పూర్తిగా నగీషీ చెక్కిన నున్నటి స్తంభాలతో కూడిన ఆలయ ముఖమండపానికి అయిదు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ముఖమండపానికి మూడు దిక్కులా ప్రహరీ గోడలాగా మూడు అడుగుల ఎత్తైన గోడ ఉంటుంది. ఆ గోడపైన సూక్ష్మాతి సూక్ష్మ చెక్కడాలను అతి రమణీయంగా చెక్కారు. పైకప్పు కూడా సుందరమైన పురాణగాధల, వివిధ దేవీ దేవతల రూపాలతో నింపారు. 
ముఖ మండపాన్ని గర్భాలయంలో కలుపుతూ చిన్న అర్ధ (అంతర) మండపం ఉంటుంది. 
ఇక్కడ శ్రీ మహావిష్ణువు, శ్రీ గణేష, సప్త మాతృకలు మరియు నాగదేవతలు కనిపిస్తారు. ఆలయానికి వెలుపల అష్టదిక్పాలకులను వారివారి స్థానాలలో సుందరంగా మలచి నిలపడం అపురూపంగా కనిపిస్తుంది. ఎలాంటి లెక్కలు కొలతలు వేసారో తెలియదు. కానీ అన్నీ ఒక ఎత్తులో సమాన దూరంలో ఉంటాయి. 
అష్టదిక్పాలకులే కాకుండా తాండవ గణేష, హరిహర, బ్రహ్మ, సదాశివ, భైరవ, పార్వతి, ఉమా మహేశ్వర మరియు సూర్య రూపాలను కూడా ప్రత్యేక స్థానాలలో నిలిపారు. 
ప్రతి శిల్పం లేదా చెక్కడం నాటి శిల్పుల నేర్పరితనాన్ని,వారి నైపుణ్యాన్ని,పురాణాల పట్ల దేవీదేవతా రూపాల పట్ల వారికీ గల అవగాహన ప్రశంసనీయం. 
చిత్రమైన విషయం ఏమిటంటే శివాలయాలలో తప్పనిసరిగా దర్శనమిచ్చే నందీశ్వరుడు ఇక్కడ కనిపించడు. ముష్కరుల దాడులలో నంది విగ్రహం భిన్నమైనది అని చెబుతారు. 
కొద్ది దూరంలో భూమి లో నిర్మించిన చిన్న ఆలయం కనిపిస్తుంది. క్రిందకి వెళ్ళడానికి మెట్ల దారి ఉన్నది. 
వివిధ పాలకుల కాలాల నాటి శాసనాలు చాలా కనపడతాయి. 
ప్రస్తుతం కనిపించే నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యబోయే మనలాంటి సందర్శకులు గతంలో ఈ ఆలయం ఎంత శోభాయమానంగా ఉండేదో ఊహించుకొంటే నేటి పరిస్థితికి బాధ కలగకుండా ఉండదు. 
 ఆలయాన్ని, చేరుకునే మార్గాన్ని,ప్రయాణ సౌకర్యాలను మరియు ప్రాంగణ పరిసరాల్లో కనీస సౌకర్యాలను ఏర్పాటుచేసి అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. 

పారశనాథ ఆలయం (బసాది)

ఇరవై నాలుగు జైన తీర్థంకరులలో ఇరవై మూడో వాడు శ్రీ పారశనాధ్. ఈయన క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దానికి చెందిన వారు అని తెలుస్తోంది. 
కదంబ వంశ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. సాధాసీదా నిర్మాణం. 
కుబతూర్ లో శ్రీ లక్ష్మీనరసింహ మరియు గ్రామదేవత శ్రీ ద్యామవ్వ ఆలయాలు కూడా ఉన్నాయి. 
శ్రీ మహిషాసురమర్ధిని రూపంలో కనిపించే శ్రీ ద్యామవ్వ కోరికలుతీర్చే తల్లిగా స్థానికులు విశ్వసిస్తారు. 
మనదేశంలో మరుగునపడిన ఎన్నో పురాతన హిందూ పుణ్య క్షేత్రాలలో ఒకటైన కుబతూర్  
కు బెంగళూరు నుండి శివమొగ్గ (షిమోగా) మీదగా చేరుకోవచ్చును. వంద కిలోమీటర్ల దూరం.  గోకర్ణ నుండి కూడా సందర్శించుకునే అవకాశం ఉన్నది. నూటఇరవై కిలోమీటర్ల దూరం. 
వసతి సౌకర్యాలు భోజనం శివమొగ్గ లోనే లభిస్తాయి. 
కర్ణాటక రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో నెలకొని బాహ్యప్రపంచానికి అంతగా పరిచయం లేని  అద్భుత నిర్మాణాల జాబితాలో ఉన్న కుబతూర్ తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం. 

నమః శివాయ !!!!     



26, ఆగస్టు 2024, సోమవారం

Sri Durga bhavani Temple, Dhanakonda, Vijayawada

 

                      శ్రీ దుర్గ భవాని ఆలయం, విజయవాడ 

ఇంతకు ముందు  చెప్పినట్లు మన రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ సరైన విషయసమాచారం అందుబాటులో లేకపోవడాన అవి పూర్తిగా వెలుగు లోనికి రావడం లేదు. 
అలాంటి ఒక ఆలయం మన విజయవాడ నగర నడిబొడ్డున ఉన్నది అంటే ఆశ్చర్యం వేస్తుంది. 
ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ మొదట ఇక్కడే కొలువై ఉండేదన్నది క్షేత్రపురాణం. 
గుంటూరు నుండి వస్తున్నప్పుడు వారధి మీద నుండి  ఎదురుగా చూడండి ఈ సారి ఎత్తైన కొం మీదకు వెళ్లే దారి పైన ఆలయం కనపడతాయి. అదే శ్రీ దుర్గా భవానీ దేవి కొలువైన ధనకొండ. 
ఒకప్పుడు మొఘల్ రాజు విడిది చేసిన ప్రదేశం కావడం వలన మొఘల్రాజ పురం అనిపిలుస్తారు. 
 ఒకప్పుడు ఊరికి దూరమేమో కానీ నేడు ప్రధాన వ్యాపార, విద్యాసంస్థల, గృహాల సముదాయంతో నిండి ఉంటుంది మొఘల్రాజపురం. 
సరిగ్గా అక్కడే ఎత్తైన ధనకొండ మీద శ్రీ దుర్గాభవాని కొలువైన వృత్తాంతం ఏమిటో తెలుసుకొందాము. 





     

  


















క్షేత్రగాధ 

సుమారు రెండువందల సంవత్సరాలకు పూర్వం ఇదంతా అటవీ ప్రాంతం. పశువుల కాపర్లు తమ పశువులను మేత కోసం కొండ పరిసర ప్రాంతాలకు తీసుకొనివెళ్లేవారట. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా పశువులు ఇటూ అటూ వెళుతుంటాయి కదా !
అలా కొన్ని పశువులు కొండ పైభాగానికి వెళ్లి పోయాయట. వాటికి కాచే బాలుడు వెతుక్కుంటూ తాను కూడా  పైకి వెళ్ళాడట. ప్రస్తుతం అమ్మవారు కొలువై ఉన్న గుహ ప్రాంతానికి వెళ్లేసరికి అతనికి కాలి గజ్జెల శబ్దం వివిపించిందట. ఎవరూ కనపడలేదు. కానీ శబ్దం మాత్రం ఆగకుండా ఎవరో అక్కడ సంచరిస్తున్నట్లుగా వస్తూనే ఉన్నది. 
భయపడిన బాలుడు పశువులను తోలుకొని వెనక్కి వెళ్ళిపోయాడట. ఇలా పశువులు పైకి వెళ్లడం, వెతుకుతూ బాలుడు వెళ్లడంకొన్ని రోజులు జరిగాయి. ప్రతి రోజు కాళీ అందేలా శబ్దము వినిపించేది. ఎవరూ కనిపించేవారు కాదు. 
ఒకరోజున అదే విధంగా పైకి వెళ్లిన బాలునికి గుహ వద్ద ఒక మహిళ కనపడిందట. ఎవరో తెలియకపోయినా నమస్కరించాడు బాలుడు. ఆమె ఆశీర్వదించి నీకు కొండా బంగారాన్ని ఇస్తాను తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పో! అని సంచీడు స్వర్ణాన్ని ఇచ్చిందట. బాలుడు బంగారు మూట తీసుకొని క్రిందకి వెళుతూ కుతూహలంతో వెనక్కి తిరిగి చూశాడట. అప్పటిదాకా కనిపించి స్త్రీమూర్తి గుహలో శిలగా మారిపోయిందిట. ఇల్లుచేరిన బాలుడు బంగారాన్ని చూపించి తల్లితండ్రులకు విషయాన్ని తెలిపాడట. 
అందరూ కలిసి పైకి వెళ్లి చూడగా గుహలో శ్రీచక్ర రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారట. రూపం లేక పోయినా శ్రీ చక్రం లో అమ్మవారి రూపం కనులు, పాదాలు స్పష్టంగా కనిపించాయి. అప్పటి నుండి గ్రామస్థులు ప్రతి దసరాకు జాతర నిర్వహించి, అమ్మవారికి పూజలు చేసేవారట. వెళ్లడానికే సరైన దారి ఉండేదికాదట. 
1987 వ సంవత్సరంలో స్థానిక భక్తులు, యువకులు అందరూకలిసి ఈ దారి ఏర్పాటు చేశారు అని  తెలుస్తోంది. 











అసలు స్థానం 

శ్రీ దుర్గా భవాని దేవి ఇక్కడ శిలా రూపం ధరించడానికి ముందుగానే ఇక్కడి నుండి ఇంద్రకీలాద్రికి వెళ్లిపోయారని ఆలయ గాథ తెలియజేస్తోంది. కానీ నేటికి గజ్జెల చప్పుడు ఆలయ పరిసరాలలో వినిపిస్తుంది అని అంటారు. 
ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి సౌమ్య రూపిణి. కానీ ధనకొండ మీద   ఉగ్ర రూపం. 
శాంతింపచేయడానికి అనేక అర్చనలు జరుపుతారు. కానీ అమ్మ భక్తసులభురాలు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. 
 మెట్ల మార్గం ఏర్పడిన తరువాత అమ్మవారి దర్శనానికి వచ్చే సంఖ్య పెరగసాగింది. గతంలో శుక్ర మరియు ఆదివారాలలో పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని పూజించుకొని పొంగలి వండి నివేదన చేసేవారట. 
నేడు ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.











ఆలయ విశేషాలు

పర్వత పాదాల నుండి మెట్ల మార్గం ఉన్నది. మొక్కుబడి అంటే మెట్లకు పసుపుకుంకుమ పెట్టవలసి ఉన్న భక్తులు ఆ మార్గంలో వస్తారు. నిటారుగా ఉంటాయి మెట్లు.  సాధారణ భక్తులు కొండ సగం వరకూ మోటార్ సైకిల్ మీద లేదా ఆటోలో చేరవచ్చును. అక్కడి నుండి కొద్దీ మెట్లు ఎక్కితే అక్కడ శ్రీ గణపతి మరియు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వస్తుంది. 
ఆదిదంపతుల కుమారులకు మొక్కి ముందుకు కదిలితే  తొమ్మిది మలుపుల దారి ప్రధాన ఆలయానికి దారి తీస్తుంది.  తొలి మలుపు  దగ్గర స్వాగత తోరణం, శ్రీ గణపతి శ్రీ కుమార స్వామి ఉంటారు. 
ప్రతి దగ్గర అమ్మవారి వివిధ రూపాలైన శ్రీ త్రిపుర సుందరి దేవి, శ్రీ రేణుకాదేవి, శ్రీ గాయత్రీ దేవి, శ్రీ దుర్గా దేవి, శ్రీ లక్ష్మీ దేవి, శ్రీ మహిసాసుర మర్ధిని, శ్రీ సరస్వతి దేవి విగ్రహాలను ఉంచారు. 
తొమ్మిదవ మలుపు దగ్గర శ్రీ అభయ ఆంజనేయ స్వామి దక్షిణాముఖునిగా  దర్శనమిస్తారు. పక్కనే నాగదేవతల సన్నిధి. 
సహజంగా కొండ ఎక్కేటప్పడు ఆయాసపడటం, కాళ్ళు నొప్పులు పుట్టడం జరుగుతాయి.  కానీ ఇక్కడ నిర్మించిన మార్గం అలాంటి ఇబ్బందులు లేకుండా వృద్దులు మరియు భారీకాయులు కూడా సులభంగా ఎక్కే విధంగా ఉంటుంది. 
కొండను తొలిచి గుహాలయానికి ముఖమండపం నిర్మించారు. ఆలయ విమానశిఖరం మరియు కలశ స్థాపన కూడా చేశారు. 
గర్భాలయంలో శ్రీ చక్ర రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అని తెలుసుకున్నాము కదా ! పూజలకు, అలంకారాలు వీలుగా శ్రీ దుర్గ భవానీ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. ప్రస్తుతం అన్ని పూజలు ఆ విగ్రహానికే !
ప్రస్తుతం గర్భాలయానికి ఇరుపక్కలా రెండు విగ్రహాలను ఏర్పాటు చేశారు. 
గర్భాలయానికి వెలుపల ధ్వజస్థంభం, పక్కనే అమ్మవారి సింహవాహనంకనిపిస్తాయి . 
ఆలయానికి వెలుపల భక్తులు కూర్చోడానికి వీలుగా విశాలమైన మండపాలను నిర్మించారు. 
దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 
మంగళ, శుక్ర మరియు ఆదివారాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి ఏడు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. 
ముఖ్యంగా అమ్మవారు ఐదోతనాన్ని కాపాడే దేవతగా, సంతానాన్ని ప్రసాదించే అమ్మగా, ప్రమాదాల బారి నుండి కాపాడే తల్లిగా ప్రసిద్ధి. 
పర్వత పైభాగం నుండి చూస్తే విజయవాడ నగరం దూరంగా ప్రవహిస్తున్న కృష్ణా నది మనోహరంగాకనిపిస్తాయి . 
ఆలయంలో ప్రతి శుక్రవారం మరియు ఆదివారం భక్తులకు అన్నప్రసాద వితరణ సేకరించిన విధుల ద్వారా ఏర్పాటు చేశారు. చిత్రమైన విషయం ఏమిటంటే ఆది దంపతులది అర్ధనారీశ్వర ఏకరూపం. అమ్మవారితో పాటు అయ్యవారు కూడా కొలువై ఉంటారు ప్రతి క్షేత్రంలో !
కానీ ఇక్కడ లింగరాజు ఉండరు. 







కొండ క్రింద కొద్దీ దూరంలో మొగల్రాజపురం శివాలయంగా పిలవబడే  శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. స్వామివారు  బ్రహ్మ సూత్రం కలిగిన పెద్ద లింగ రూపంలో దర్శనమిస్తారు. 
పైన ఉన్న ఆలయానికి క్రింద ఉన్న ఆలయానికి క్షేత్రపాలకుడు రుద్రంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయుడు. 
మొఘల్రాజపురంలో తప్పక చూడవలసినవి ఇక్కడ ఉన్న గుహాలయాలు. మొఘల్రాజపురం గుహలు గా పిలవబడే ఇవి మూడు భాగాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరు లేక ఏడవ 
శతాబ్దంలో కొన్ని విష్ణుకుండిన వంశ పాలకుల చేత మిగిలినవి తూర్పు  రాజుల చేత నిర్మించబడినట్లుగా చరిత్రకారులు నిర్ధారించారు. ప్రస్తుతం పురావస్తు శాఖవారి నిర్వహణలో ఉన్న ఈ గుహలు తప్పక చూడవలసినవి.    



3, ఆగస్టు 2024, శనివారం

Vadakkunathar Temple, Thrissur

                                  కేరళ లోని తొలి శివ క్షేత్రం 

కేరళ రాష్ట్రానికి ఉన్న మరో పేరు "దేవతల స్వస్థలం". 
ఈ పేరు రావడానికి గల కథ శ్రీ మహా విష్ణువు లోకసంరక్షణార్ధం ధరించిన అనేకానేక అవతారాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ పరశురామావతారం తో ముడిపడి ఉన్నది. 
 ఏమా కథ అంటే ముందుగా శ్రీ పరశురాముని గురించి తెలుసుకోవాలి. 

శ్రీ పరశురాముడు 

మహర్షి జమదగ్ని , రేణుక దంపతులకు శ్రీ మహా విష్ణువు భార్గవ రామునిగా జన్మించారని పురాణాలు తెలుపుతున్నాయి. 
జమదగ్ని మహర్షి వద్ద "సురభి"అనే ఆవు ఉండేదట. కామధేనువు గర్భాన జన్మించిన సురభి తల్లి మాదిరి కోరినవన్నీ ప్రసాదించే శక్తి కలిగి ఉండేది. వేటకు వచ్చి అలసిపోయి మహర్షి ఆశ్రమంలో ఆతిధ్యం స్వీకరించాడు ఆ ప్రాంత పాలకుడైన కార్తవీర్యార్జనుడు. 
సురభి సంగతి తెలిసి తనకు ఇవ్వమని కోరారట. జమదగ్ని మహర్షి నిరాకరించడంతో ఆయనను సంహరించి గోవును బలవంతంగా తీసుకొని పోయారట. ఆ సమయంలో ఆశ్రమంలో లేని పరశురాముడు ఆగ్రహించి ద్వంద యుద్ధంలో కార్తవీర్యార్జుని అంతం చేశారట.
అక్కడితో ఆగకుండా అధికారమదంతో పాలకులు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్నారు.  పాలించే అర్హత లేదు అని నిర్ణయించుకొని ఇరవై ఒక్కమార్లు భూమండలం అంతా తిరిగి రాజు అన్నవారిని సంహరించారు. 
చివరకు శాంతించి పాలకులను చంపడం వలన సంక్రమించిన పాపాన్ని తొలగించుకోడానికి యజ్ఞం చేసి తానూ రాజుల నుండి స్వాధీనం చేసుకొన్న భూమిని అర్హులకు దానం ఇచ్చారట. 
దానం చేసిన నేలలో ఉండకూడదు అన్న నియమం ప్రకారం ఆ ప్రదేశాన్ని వదిలి సముద్రుని వద్దకు వెళ్లి తనకు కొంత భూమిని ఇవ్వమని కోరారట. 
అలా పొందిన ప్రాంతాన్ని "పరశురామ భూమి" అని పిలుస్తారు. ఆ ప్రదేశమే నేటి కేరళ. శ్రీ భార్గవ రాముడు శ్రీహరి అంశ కనుక కేరళను దేవతల స్వస్థలం గా పిలుస్తారు. 

కేరళ లోని తొలి శివాలయం 

గౌరీనాధుడు అశ్వద్ధ వృక్షం క్రింద స్థిరపడ్డారు అని  చెప్పుకొన్నాము కదా ! ఆ క్షేత్రమే కేరళ సాంస్కృతిక రాజధానిగా పేరొందిన త్రిసూర్. 
నగరం నడి  మధ్యలో ఉన్న "స్వరాజ్ రౌండ్ " అని పిలవబడే సువిశాల ప్రదేశం మధ్యలో చిన్న పర్వతం ఉంటుంది కేరళ తొలి శివాలయం. వృషాచలం అని అంటారు. ప్రధాన అర్చనామూర్తిని  శ్రీ వడక్కునాథర్ స్వామి గా పిలుస్తారు. "వడక్కు" అనగా దక్షిణం. నాథర్ అంటే అధిపతి. అనగా శ్రీ పశుపతి ఉత్తర దేశానికే కాదు దక్షిణ ప్రాంతానికి కూడా అధిపతి. 






క్షేత్రాల ఆవిర్భావం 

సగరుడు ఇచ్చిన భూమిని తన పాదస్పర్శతో పావనం చేయమని గురువైన పరమేశ్వరుని కోరారట. శిష్యుని కోరిక మన్నించి సపరివార సమేతంగా కైలాసనాధుడు ఉత్తర దేశం నుండి దక్షిణ దేశం వచ్చారట. వచ్చే ముందు ఒక షరతు విధించారట. ఆయనకు నచ్చిన ప్రదేశంలో స్థిరపడి పోతారు. దాని మీద ప్రశ్నించకూడదు. అంగీకరించారట అవతారపురుషుడు. 
అశ్వద్ధ వృక్షాలతో నిండిన ప్రశాంత సుందర ప్రదేశం మహేశ్వరుని ఆకర్షించింది. ఒక అశ్వద్ధ వృక్షం క్రింద ధ్యానముద్రలో ఉపస్థితులైన లింగరాజు అక్కడే స్థిరపడిపోయారు. 
గురువు అనుమతి పొందిన పరశురాముడు సర్పరాజు వాసుకిని పిలిచి నేలను నివాసయోగ్యం చేయమని కోరారట. సర్పాలు నేలలోని విషపదార్ధాలు తొలగించాయట. 
తనకు సహాయం చేసిన సర్పాలకు ప్రత్యేక పూజార్హత కల్పించారు. అందుకే  మరెక్కడా కనిపించని విధంగా కేరళలోని ప్రతి ఆలయంలోనూ నాగ దేవత ప్రత్యేక సన్నిధి కనిపిస్తుంది. "మన్నార్ శాల" కేరళలో ప్రసిద్ధ నాగరాజ క్షేత్రం. 
అదే విధంగా భార్గవుడు నూట ఎనిమిది శివలింగాలను, నూట ఎనిమిది శ్రీ భగవతీ క్షేత్రాలను, నూట ఎనిమిది శ్రీ ధర్మశాస్త ఆలయాలను ఏర్పాటు చేశారట. క్షేత్ర పాలకునిగా గంగాధరుడు, క్షేత్ర రక్షణ కొరకు శ్రీ భగవతి. క్షేత్ర కావలి దేవతగా శ్రీ ధర్మశాస్త లను నియమించారట. ఈ కారణం చేతనే కేరళ లోని ప్రతి చిన్నా పెద్ద ఆలయాలలో శ్రీ ధర్మశాస్త మరియు శ్రీ భగవతి దేవి ఉపాలయాలలో దర్శనమిస్తారు. 
శ్రీ పరశురాముడు ఆలయాలలో పూజాదులు చేయడానికి అర్హులైన బ్రాహ్మణులను కర్ణాటక ప్రాంతం నుండి రప్పించారట. 
నేటికీ కేరళలో పరశురామ ప్రతిష్ఠిత శివలింగాలను, శ్రీ భగవతీ ఆలయాలను శ్రీ ధర్మశాస్త కోవెలలను సందర్శించుకోవచ్చును. 






ఆలయ గాథ 

 అశ్వద్ధ వృక్షం క్రింద లింగరూపంలో స్థిరపడిన లయకారుడు ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. కేరళను పాలించిన ఒక రాజు ఆలయం నిర్మించాలని నిర్ణయం చేసి ఎదురుగా ఉన్న ప్రదేశంలో నాలుగు ద్వారాలతో పెద్ద ఆలయం నిర్మించి లింగాన్ని గర్భాలయంలో ప్రతిష్టించారట. అది ఎవరు ? ఎప్పుడు ఆలయం నిర్మించారు ? అన్న వివరాలు అందుబాటులో లేవు. 
కానీ ఆలయం నిర్మించి వెయ్యి సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం అయ్యింది అంటారు. కేరళ లోని అత్యంత పురాతన ఆలయం అని కూడా చెప్తారు. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర ప్రస్థాపన ఉన్నట్లుగా తెలుస్తోంది.  అనంతర కాలంలో కేరళను పాలించిన అందరు పాలకులు శ్రీ వడక్కు నాథర్ ను సేవించారు. ఆలయాభివృద్దికి విశేష కృషి చేశారు. 
తొలుత స్వామి స్థిరపడిన అశ్వద్ధ వృక్షం ను " మూల స్థానం" గా ప్రత్యేక హోదాను ఇచ్చి పూజిస్తున్నారు. 
సుమారు పది ఎకరాల సువిశాల స్థలంలో నగర నడిమధ్యలో నిర్మించబడిన శ్రీ వడక్కునాథర్ ఆలయంలో ఎన్నో ఉపాలయాలు ఉంటాయి. 
గర్భాలయ వెలుపలి ప్రాకారంలో శ్రీ గోశాల కృష్ణ, శ్రీ సింహాదర, శ్రీ ధర్మశాస్త, శ్రీ వేటక్కారన్, నాగదేవతలు, జగద్గురు  శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ఈ ఉపాలయాలలో కొలువై ఉంటారు. 

శ్రీ ఆది శంకరుల వృత్తాంతం 

 హిందూ మతాన్నిపునరుద్దరించడంలో  విశేష కృషి చేసిన జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు శ్రీ వడక్కు నాథర్ వరప్రసాదం. 
సంతానం లేని ఆర్యాంబ మరియు శివగురు దంపతులు మండల కాలం నిష్టగా శ్రీ వడక్కు నాథర్ ను సేవించి స్వామినే తమ బిడ్డగా పొందారు అని చెబుతుంది "కేరళీయ శంకర విజయం" అనే పురాతన మలయాళ గ్రంధం.
తూర్పు గోపురం గుండా  ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే మన కుడి పక్కన కనపడుతుంది శ్రీ ఆది శంకరుల సన్నిధి. పక్కనే ఉన్న ప్రదేశంలోనే శ్రీ శంకరులు విదేహులయ్యారని చెప్తారు. 
కానీ శంకరులు కేదారనాథ్ వద్ద దేహం విడిచారని మిగిలిన గ్రంధాలు అన్నీ తెలుపుతున్నాయి. కేదారనాథ్ ఆలయం వద్ద ఆయన సమాధి ఉంటుంది. 










ఆలయ విశేషాలు 

వృషాచల పర్వతం మీద తొమ్మిది ఎకరాల విశాల స్థలంలో నాలుగు కేరళ శైలిలో నిర్మించబడిన ద్వారాలను కలుపుతూ దుర్బేధ్యమైన కోట గోడలాంటి ఎత్తైన ప్రహరీ ఉంటుంది. తూర్పు ద్వారానికి ఎదురుగా ఆలయం వెలుపల మూల స్థానం ఉంటుంది. తూర్పు మరియు పడమర ద్వారాల గుండానే ఆలయం లోనికి ప్రవేశం. దక్షిణ ద్వారాన్ని ఒక్క త్రిసూర్ పూరం సందర్బంగా మాత్రమే తెరుస్తారు. పూరం సంబరాలను వీక్షించడానికి శ్రీ వడక్కు నాథర్ గజారూఢులై ఆలయం వెలుపలికి ఆ ఒక్క రోజు మాత్రమే వస్తారు. 
ప్రాంగణం లోనికి ప్రవేశించగానే సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంది "కూతంబళం".

కూతంబళం 

నృత్య సభ అని అర్ధం. 
నలువైపులా మూసివేయబడి నాట్య శాస్త్రం నిర్దేశించిన నియమాల ప్రకారం నిర్మించబడిన పవిత్ర స్థలం. భగవంతుని ప్రీత్యర్ధం పురాణాలను గేయ నృత్య పద్దతిలో ప్రదర్శించడం కోసం ఏర్పాటు చేయబడినట్లు చెబుతారు. 
కేరళ లోని ప్రముఖ ఆలయాలలో ఈ కుతంబళం కనపడుతుంది. ఇక్కడ కూడా ప్రతి నిత్య సాయంత్రం ఏదో ఒక నృత్య విధానంలో ప్రదర్శన ఉంటుంది. 
శ్రీ గోశాల కృష్ణ సన్నిధి దాటిన తరువాత "వృషభ" సన్నిధి కూడా ఈ ఆలయ ప్రత్యేకత. సహజంగా ముఖ లేదా అర్ధ మండపాలలో దర్శనమిచ్చే నందీశ్వరుడు ఇక్కడ వృషభ గా విడిగా ఉపాలయంలో కొలువై పూజలు అందుకొంటుంటారు. 
అక్కడ నుండి వరుసగా శ్రీ సింహోదర, శ్రీ ధర్మశాస్త, శ్రీ వేటక్కారన్, శ్రీ నాగ దేవత, శ్రీ ఆది శంకర ఉపాలయాలు. 
శ్రీ వడక్కు నాథర్ ఆలయం లోని వెలుపలి ప్రాకారంలో కనిపించే మరి రెండు ప్రత్యేకతలను తెలుసుకోవాలి. 
ఆలయ ప్రతి దిక్కు అనేక తూర్పు, ఈశాన్యం, నైరుతి ఇలా ఆ దిశలో ఏ ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయో ప్రత్యేకించి రాసి ఉంచారు. అనగా చిదంబరం, వారణాశి, రామేశ్వరం ఇలా రాసి ఉంటుంది. 

వ్యాస శిల 

శ్రీ ధర్మ శాస్త ఆలయం వెనుక పక్కన ఒక అశ్వద్ధ వృక్షం క్రింద మూడు బాషలలో పెట్టబడిన సూచన అందరినీ ఆకర్షిస్తుంది. 
సూర్యోదయం అయిన తరువాత సూర్యాస్తమయం లోపల అక్కడ " హరిః శ్రీ గణపతయే నమః" అని చేతి వేళ్ళతో అక్కడ మట్టిలో లో లేదా వృక్షం చుట్టూ నిర్మించిన రాతి గోడ మీద కానీ రాయాలి. అలా రాయడం వలన అన్ని పనులు నిర్విఘ్నంగా సాగుతాయి అని చెబుతారు. అంతకు మించి వివరాలు తెలియరాలేదు. 
ప్రదక్షిణ ముగించుకొని లోనికి వెళుతున్నప్పుడు పురాతన మండపంలో నాలుగు వందల సంవత్సర క్రిందట సహజ వర్ణాలతో చిత్రీకరించబడిన నృత్యనాధ,  వాసుకి శయన, నందికేశ్వర చిత్రాలు కనిపిస్తాయి. ప్రస్తుతం వీటికి వారసత్వ  సంపద క్రింద పరిరక్షిస్తున్నారు. 
అంతర ప్రాంగణంలో మొత్తం మూడు గర్భాలయాలు కనిపిస్తాయి. కేరళలో గర్భాలయాన్ని శ్రీ కోవెల అని పిలుస్తారు.  ప్రధాన శ్రీకోవెలలో  శ్రీ వడక్కు నాథర్ స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. విశేషం ఏమిటంటే ఇక్కడ నెయ్యి మరియు కొబ్బరి నీటి తో మాత్రమే అభిషేకం జరుపుతారు.. అభిషేకం జరిపిన నెయ్యి సుమారు ఆరు అడుగుల ఎత్తున లింగం పై గడ్డకట్టుకొని మంచు కప్పినట్లుగా కనపడుతుంది. 
త్రిసూర్ వేడి ప్రదేశం. లోపల దీపాలు వెలుగుతుంటాయి. అయినా అన్ని అడుగుల ఎత్తున నెయ్యి కరగకుండా ఉండటం ప్రత్యేకత. అదీకాక ప్రతినిత్యం రెండు సార్లు మొత్తం ఆరు అడుగులకు అలంకరణ చేస్తారు.  
అప్పుడప్పుడు విరిగి పడిన వాటిని భక్తులకు ఇస్తారు. 
స్వామి వారు తూర్పు ముఖంగా కొలువై ఉండగా అదే శ్రీ కోవెలలో వెనుక పక్క శ్రీ పార్వతీ దేవి పడమర ముఖంగా దర్శనం ప్రసాదిస్తారు. కేరళలో కనిపించే ప్రత్యేకతలో ఇదొకటి. ఒకే గర్భాలయంలో రెండుపక్కలా అమ్మవారు అయ్యవారు కొలువై ఉండటం. ఆది దంపతులు అర్ధనారీశ్వరులు కదా !
శ్రీ వడక్కు నాథర్ సన్నిధికి ఎదురుగా శ్రీ గణపతి, దక్షిణం పక్కన శ్రీ శంకరనారాయణ మరియు శ్రీ రామ సన్నిధులు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే వృషాచలం శ్రీ వడక్కు నాథర్ ఆలయం హరిహర క్షేత్రం. 
కేరళ క్షేత్రాలలో కనిపించే మరో ప్రత్యేకత ఏమిటంటే శ్రీ హరి శ్రీ రాముడు, శ్రీ కృష్ణ ఇలా ఏ రూపంలో ఉన్నా చతుర్భుజాలతో ఒక్కరే గర్భాలయంలో దర్శనమిస్తారు. 
కేరళలో శ్రీ రామ ఆలయాలతో పాటు ఆయన సోదరులైన భారత, లక్ష్మణ, శత్రుఘ్నుల ఆలయాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా మూలవిరాట్టు చతుర్భుజాలతో కొలువై ఉంటారు. 







ఆలయ పూజలు - ఉత్సవాలు 

ఉదయం నాలుగు నుండి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో నియమంగా నాలుగు పూజలు జరుపుతారు. అమావాస్య, పౌర్ణమి, సోమవారాల్లో, శబరిమల ఆలయం తెరిచి ఉంచే రోజులలో రద్దీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. విడి రోజులలో స్థానిక భక్తులు మాత్రమే వస్తుంటారు. 
ఓనం, విషు లాంటి స్థానిక పర్వదినాలలో ప్రత్యేక పూజలు చేస్తారు.భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.   శ్రీ వడక్కు నాథర్ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు నాలుగు. 

మహా శివరాత్రి 

పరమేశ్వరునికి విశేషమైన రోజు. శివరాత్రి పర్వదినాన రోజంతా లేత కొబ్బరి నీటితో నిరంతరాయంగా స్వామికి అభిషేకం జరుపుతారు. సాయంత్రం ఆలయం చుట్టూ ఉన్న వేలాది దీపాలను వెలిగిస్తారు. శ్రీ వడక్కు నాథర్ ఆలయం దీప కాంతులతో శోభాయమానాంగా వెలిగి పోతుంది. 

పూరం 

కేరళ రాష్ట్రంలో అనేక ఆలయాలలో "పూరం " నిర్వహిస్తారు. పూరం అనగా సంబరం అని అర్ధం. అందరూ కలిసి చేసుకొనే ఉత్సవ సంబరం. 
కేరళలో గత మూడు వందల సంవత్సరాలుగా  నిర్వహిస్తున్న త్రిసూర్ పూరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. 
చాలా చిత్రంగా త్రిసూర్ పూరం ప్రారంభం అయ్యింది. 
గతంలో అంటే పద్దెనిమిదో శతాబ్దం వరకు కేరళలో ఆరట్టుపుళ పూరం ప్రసిద్ధి. త్రిసూర్ చుట్టుపక్కల ఉన్న ఆలయాల వారు అందులో పాల్గొనేవారు. ఒక సంవత్సరం కొన్ని కారణాల వలన శ్రీ వడక్కునాథర్ ఆలయం మరియు మరికొన్ని ఆలయాల వారు ఆరట్టుపుళ పూరంలో పాల్గొనడానికి అనుమతి నిరాకరించబడినది. 
అప్పుడు కొచ్చిన్ రాజు అయిన "రామ వర్మ కుంజి పిళ్ళై థంపురం" (శాక్తన్ థంపురం అని పిలుస్తారు) త్రిసూర్ లోని వడక్కు నాథర్ ఆలయూయం వద్దనే ఎందుకు పూరం నిర్వహించకూడదు అని నిర్ణయం తీసుకొన్నారు. 
చుట్టుపక్కల ఉన్న పది ఆలయాలను తీసుకొని వాటిని రెండు జట్లుగా విడతీసారు. ఒకటి తిరువంబాడి శ్రీ కృష్ణ ఆలయం రెండవది శ్రీ పరమేక్కవు భగవతీ ఆలయం. మొదటి త్రిసూర్    పూరం 1796 వ సంవత్సరంలో జరిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ నిరంతరాయంగా త్రిసూర్ పూరం జరుగుతోంది. 
సుందరంగా అలంకరించబడిన దేవస్థాన ఏనుగులు. వందల సంఖ్యలో నేర్పరులైన చండామేళం మరియు పంచ వాయిద్య కళాకారులు, నృత్యకారులు చివరగా లక్షలాదిగా ప్రజలు ఈ పురంలో భాగస్వాములు అవుతారు. 
ఏనుగుల విన్యాసాలు, వాయిద్య కారుల ప్రతిభ, టపాసుల మోత మరియు ప్రజల ఉత్సాహం అన్నీ కలిసి త్రిసూర్ పూరం కేరళ జాతీయ పర్వదినంగా మార్చాయి. ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా పూరం చూడటానికి వస్తున్నారు అని నిర్ధారించబడినది. 
ముఖ్యంగా పటాసుల మోతతో త్రిసూర్ పట్టణం దద్దరిల్లిపోతుంది అంటే అతిశయోక్తి లేదు. 
తిరువంబాడి శ్రీ కృష్ణ ఆలయం మరియు పరమెక్కవు శ్రీ భగవతీ ఆలయం రెండు కూడా శ్రీ వడక్కు నాథర్ ఆలయానికి సమీపంలోనే ఉంటాయి. అదేవిధంగా శాక్తన్ థంపురం త్రిసూర్ లో విడిది చేసిన రాజభవనం కూడా దగ్గరలోనే ఉంటుంది. 

అనయోట్టు 

ఏనుగులతో కేరళ ప్రజల ఉన్న అనుబంధం వర్ణింపలేనిది. అవిభాజ్యమైనది. 
వారి ప్రతి ఆలయ ఉత్సవం ఏనుగులతో ముడిపడి ఉంటుంది. ఒకవేళ ఆలయానికి ఏనుగు లేకపోతే మరో ఆలయం నుండి లక్షల రూపాయల అద్దె కట్టి మరీ తెస్తారు. దానిని వారు ఆలయ మరియు ఊరి గౌరవంగా భావిస్తారు.  
అలాంటి ఏనుగులతో  జతపడిన ఉత్సవం అనయోట్టు. ఈ పదానికి అర్ధం ఏనుగులకు ఆహరం. గజం అంటే గణపతి ప్రతి రూపం. 
ప్రతి సంవత్సరం కేరళ పంచాంగం ప్రకారం "కర్కాటక మాసం"(జులై, మన ఆషాఢమాసం) మొదటి రోజున శ్రీ వడక్కు నాథర్ ఆలయంలో అష్టద్రవ్య మహా గణపతి హోమం చేస్తారు.  హోమం లో పాల్గొన్నభక్తులు  తరువాత గజ పూజ చేస్తారు. అనంతరం ఏనుగులకు నిర్ణయించబడిన ఆరోగ్యకరమైన ఆహరం అందిస్తారు. 
వేలాదిగా భక్తులు అనయోట్టు లో పాల్గొంటారు. 

తిరువదిరై 

శ్రీ వడక్కు నాథర్తి ఆలయంలో నిర్వహించే నాలుగవ ఉత్సవం తిరువదిరై లేక ఆరుద్ర దర్శనం. 
శ్రీ నటరాజ స్వామి జన్మదినంగా భావిస్తారు. 
తమిళనాడులోని చిదంబరంలో అత్యంత ఘనంగా చేస్తారు. 
మార్గశిర మాసంలో వచ్చే తిరువదిరై ఉత్సవం సందర్బంగా పెద్ద ఎత్తున ప్రజలు శ్రీ వడక్కు నాథర్ దర్శనానికి తరలి వస్తారు.
ఇలా ఎన్నో విశేషాల నిలయమైన శ్రీ వడక్కు నాథర్ ఆలయం కేరళలో దర్శనీయ ఆలయాలలో ఒకటి. ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం అయిన గురువాయూర్ వెళ్లాలంటే త్రిసూర్ నుండే వెళ్ళాలి. 
త్రిసూర్ రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరం స్వరాజ్ రౌండ్. 
స్టేషన్ దగ్గరలో వసతి భోజన సౌకర్యాలు అందుబాటు ధరలలో లభిస్తాయి. 

నమః శివాయ !!!!  

 


2, ఆగస్టు 2024, శుక్రవారం

Sri Bramaramba Sameta Sri Bugga Malleswara Swami Temple, Morjampadu

                               దక్షిణ శ్రీశైలం  మోర్జంపాడు


జిల్లాలోని చాలా మందికి కనీసం పేరైనా తెలియని కృష్ణానదీతీరం లోని చిన్న గ్రామం మోర్జంపాడు. 
కానీ చారిత్రకంగా పౌరాణికంగా గొప్ప పేరున్న తీర్థ పుణ్య క్షేత్రం. 




ఆలయ పూర్వ గాథ 

ఎవరు ప్రతిష్టించారో తెలియదు ? ఎప్పుడు ప్రతిష్టించారో అస్సలు తెలియదు ? ఎవరు తొలి ఆలయాన్ని నిర్మించారో కూడా తెలియదు ?
ఎన్నో విషయాలు గుప్తంగా ఉన్న మోర్జంపాడు ఒకప్పుడు మునివాటిక అని అంటారు. సహజంగా మహర్షులు నిత్య అనుష్టానానికి నీరు అవసరమని ఆశ్రమాలను ఎక్కువగా నదీతీరాలలో ఏర్పాటు చేసుకొంటుంటారు. అదేవిధంగా నిత్య పూజల నిమిత్తం ఒక శివ లింగాన్ని కూడా ప్రతిష్టించుకొనే వారు అని తెలుస్తోంది. 
అలా వందల సంవత్సరాల క్రిందట మహర్షులు ప్రతిష్టించిన శివలింగమే నేటికీ శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామిగా పూజలు అందుకొంటోంది. 
పద్దెనిమిదో శతాబ్దంలో అమరావతి జమీందారు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ప్రాంతాలలో పర్యటించారట. ఆ సమయంలో ఆలయం గురించి తెలిసి సపరివారంగా విచ్చేసి పూజలు చేయించుకొన్నారట. శిధిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునఃనిర్మించడానికి మరియు ఆలయ నిర్వహణ కొరకు కైకర్యాలు సమర్పించారట. 
అనంతర కాలంలో భక్తులకు లభించిన శుభఫలితాలతో ఆలయం క్రమంగా అభివృద్ధి చెంది ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 











దక్షిణ శ్రీశైలం 

శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి కొలువైన మోర్జంపాడు ఆలయానికి, జ్యోతిర్లింగ క్షేత్రం మరియు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన శ్రీశైలానికి కొన్ని సారూప్యతలు ఉండటం వలన దక్షిణ శ్రీశైలంగా పిలవబడుతోంది. 
శ్రీశైలం మరియు మోర్జంపాడు రెండు క్షేత్రాలు అటవీప్రాంతంలో కృష్ణవేణీ నదీతీరంలో నెలకొని ఉన్నాయి. అక్కడ కొలువైనది శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జునస్వామి ఇక్కడ దర్శనమిచ్చేది కూడా శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. రెండు క్షేతాలు మల్లయ్య స్వామి కొలువైనవే !
శ్రీశైలంలో ప్రత్యేకం శ్రీ వృద్ధ మల్లికార్జునస్వామి సన్నిధి. ముడతలు పడిన లింగ రూపంలో స్వామి ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తారు. 
అదేవిధంగా మోర్జంపాడులో కూడా శ్రీ వృద్ధ మల్లిఖార్జున స్వామి కొలువై ఉంటారు. స్వామి ఆలయానికి విడిగా ధ్వజస్థంభం ఉండటం మూలాన గతంలో మొదట ప్రతిష్టించిన స్వామి ఈయనే అని భావిస్తారు. 
శ్రీశైలంలో పీఠ పాలిక శ్రీ భ్రమరాంబ దేవి ప్రధాన ఆలయానికి వెనుక ఎత్తైన ప్రదేశంలో విడిగా కొలువై దర్శనమిస్తారు. మోర్జంపాడులో కూడా అమ్మవారు శ్రీ భ్రమరాంబ దేవి శ్రీ మల్లేశ్వరస్వామి కొలువైన ఆలయం వెనుక ఎత్తైన ప్రదేశంలో దర్శనమిస్తారు. 
శ్రీశైల క్షేత్రంలో గర్భాలయానికి సమీపంలోని బావి నీటినే స్వామివారి అభిషేకాలకు ఉపయోగిస్తారు. మోర్జంపాడులో గర్భాలయంలో స్వామివారి పక్కనే బుగ్గ రూపంలో గంగమ్మ కొలువై ఉంటుంది. 
ఈ సారూప్యాల వలన స్థానికులు మోర్జంపాడు దక్షిణ శ్రీశైలంగా భావిస్తారు. వివిధ కారణాల వలన శ్రీశైలం వెళ్లలేనివారు తమ మొక్కులను ఇక్కడ తీర్చుకొంటారు. 
 సువిశాల ప్రాంగణంలో కృష్ణా తీరానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తూర్పు ముఖ ఆలయానికి పడమర వైపున ప్రవేశ ద్వారం ఉంటుంది. పచ్చని చెట్లతో ప్రశాంత వాతావరణం  నిండిన ప్రాంగణంలో భక్తులు విశ్రాంతి తీసుకోడానికి బల్లలు కూడా ఏర్పాటు చేశారు. బిల్వాష్టకం, శివ పంచాక్షరీ స్తోత్రం పెద్దగా రాయించి పెట్టారు. 
క్షేత్రానికి పాలకుడు రుద్రంశ అయిన అంజనీపుత్రుడు. శ్రీరామ దూత శ్రీ భక్త ఆంజనేయునిగా దర్శనమిస్తారు. ఎదురుగా శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి ఉపాలయం ఉంటుంది. 
ఎత్తైన ప్రదేశంలో ఉన్న అమ్మవారి సన్నిధికి పక్కన నూతనంగా నాగ మిధున స్వరూప శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్టించారు. 
ప్రధాన గర్భాలయ ముఖమండపం సాదాసీదాగా కనపడుతుంది. అర్ధమండపంలో శ్రీ గణపతి, శ్రీ భద్రకాళీ మరియు శ్రీ వీరభద్రుడు దర్శనమిస్తారు. 
గర్భాలయంలో లింగరూపంలో శ్రీ మల్లేశ్వరస్వామి కొలువై ఉంటారు. 
స్వామి వారి కుడివైపున నీటి బుగ్గ ఉంటుంది. సర్వకాలసర్వావస్థలలో బుగ్గలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఉదయం నుండి మధ్యాహన్నం అంటే అలంకరణకు ముందు వరకు భక్తులు స్వయంగా బుగ్గ నీటితో స్వామికి అభిషేకం చేసుకొనే భాగ్యం లభిస్తుంది. 
ఈ బుగ్గ లోనికి ఎక్కడ నుండి నీరు వస్తుంది అన్నది తెలియదు. నీరు పాచిపట్టదు. చెడువాసన రాదు. ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండటం విశేషం. 
లింగం క్రింద నుండి నీరు రావడం కొన్ని ఆలయాలలో కనపడుతుంది. కానీ పక్కనే బుగ్గతో కొలువైన గంగాధరుడు మాత్రం ఒక్క శ్రీ బుగ్గ మల్లేశ్వరుడు మాత్రమే !
ప్రధాన ఆలయానికి ఎదురుగా ఆలయ పుష్కరణి ఉంటుంది. 

నాగ బంధం 

మన రాష్ట్రంలో ఎక్కడా కనిపించని విశేషం మనకు ఇక్కడ కనపడుతుంది. 
గత కొంతకాలంగా మనం తరుచుగా వింటున్న పదం "నాగ బంధం". 
తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం మరియు పూరి శ్రీ జగన్నాధ మందిర విషయంలో కూడా ఈ పద ప్రయోగం జరిగింది. అందరిలో నాగ బంధం అంటే ఏమిటి అనే కుతూహలం పెరిగినది. 
నాగ బంధం అంటే రక్షణ కవచం. 
నాగ బంధం ఒక తాంత్రిక ప్రయోగం గా అభివర్ణిస్తారు. తంత్రంతో ఒక అయిదు తలల నాగసర్పాన్ని నాగ బంధంలో బంధనం చేస్తారు. ఎక్కువగా ఈ నాగ బంధం విశేష సంపదకు కాపలాగా ఉంచుతారు అని చెబుతారు. 
నాగ బంధం చేదు ఆలోచనలతో వచ్చినవారికి హాని, మంచి తలంపుతో వచ్చినవారికి మంచి చేస్తుంది అని విశ్వసిస్తారు. 
నాగ శిల్పాలు ఎక్కువగా బాదామీ చాళుక్యులు నిర్మించిన ఆలయాలలో కనపడతాయి. ఉదాహరణకు ఆలంపూర్ నవబ్రహ్మ ఆలయంలో పైకప్పుకు, స్తంభాల పైన సుందరంగా చిత్రమైన రూపాలలో చెక్కిన నాగశిల్పాలు కనపడతాయి. కొంతవరకు పల్లవుల మరియు చోళుల కాలంలో నిర్మించిన ఆలయాలలో కూడా నాగ శిల్పాలు కనిపిస్తాయి. 
మిగిలిన రాజులు ముఖ్యంగా విజయనగర రాజులు నిర్మించిన ఆలయాలలో నాగ శిల్పాలు చాలా అరుదు. 
ఎక్కడో దాచిన సంపదకు రక్షణగా ఉండే నాగ బంధం మోర్జంపాడు ప్రధాన ఆలయ వెనుక వేయడానికి కారణం ఏమిటి ?
ఆలయానికి రక్షణ అని అనుకుందాము. గతంలోనే కాదు నేటికీ ఇది అటవీ ప్రాంతం. ఇక్కడికి వచ్చే భక్తులకు రక్షణ. 
మనం సహజంగా అంటూ ఉంటాము కదా నాగ దోషం లేదా నాగ శాపం అని. జన్మ సమయాన్ని  బట్టి నిర్ణయించిన నక్షత్ర ప్రకారం నాగ, మణి లేదా ఫణి అన్న పేర్లు పెడుతుంటాము కదా పిల్లలకు. అదే విధంగా వివాహం  వారి చేత, వివాహం అయినా సంతానం లేనివారి చేత నాగ ప్రతిష్టలు చేయిస్తుంటాము. ఇవన్నీ నాగ దోషం తొలగిపోవడానికి చేసే పరిహారాలు. 
అన్నింటికీ మించి ధ్యానంలో యోగమార్గంలో భగవంతుని సందర్శించడం. మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయని అంటారు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత , విశుద్ధ, ఆజా మరియు సహస్రార చక్రాలను ఒకదాని తరువాత ఒకటిగా సాధించడం వలన సహస్రార చక్ర దర్శనం అవుతుంది అంటారు. ఈ దర్శనం మానవ జన్మకు కావలసిన పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అంటారు యోగులు. అనగా భగవంతుని సందేశం ఈ మానవ జన్మ పరమార్ధం అర్ధం అవుతాయి. 
పురాతన ఆలయానికి వేసిన నాగ బంధం కావడాన పై కారణాలలో ఏదైనా కావచ్చును. మహర్షులు వేయించింది కనుక ఏకారణం లేకుండానూ మానవాళికి ఏ ప్రయోజనం లేకుండా ఉండదు. 
ముక్తి క్షేత్రం అయిన వారణాసిలో కూడా ఒక ఆలయానికి ఇలాంటి ఒక నాగ బంధం ఉన్నది అంటారు. నేను ఇలాంటి నాగ బంధాన్ని గిద్దలూరు పట్టణానికి సమీపంలో ఉన్న మోక్షగుండం ఊరిలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శిలా ఫలక రూపంలో చూడటం జరిగింది. 











ఆలయ పూజలు మరియు ఉత్సవాలు 

గతంలో ఒక్క సోమవారం మాత్రమే ఆలయం భక్తుల కొరకు తెరిచి ఉండేదట. కానీ ప్రస్తుతం ప్రతిరోజూ తెరుస్తున్నారు. నిత్య పూజలు జరుగుతున్నాయి. 
పరిమిత సంఖ్యలో భక్తులు ప్రతిరోజూ వస్తుంటారు. కానీ పెద్ద సంఖ్యలో భక్తులు కార్తీక మాసంలో సోమవారాలతో సహా అన్ని రోజులు  అదే విధంగా మహా శివరాత్రికి వస్తారు. 
యుగయుగాల నుండి పూజలు అందుకొంటున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి కొలువైన దక్షిణ శ్రీశైలం అయిన మోర్జంపాడు పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పిడుగురాళ్ల నుండి ఆటోలు లభిస్తాయి. ఆలయం వరకు చక్కని రహదారి ఉన్నది. 

నమః శివాయ !!!!  





Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...