22, జూన్ 2024, శనివారం

Sri Maddi Anjaneyaswami Temple, Guravaya Gudem, Jangareddy Gudem



                     శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం 


రుద్రాంశతో వాయుదేవుని ఆశీర్వాదంతో  కేసరి మరియు అంజనా దేవికి జన్మించిన శ్రీ ఆంజనేయుడు జన్మతః బహుబలశాలి. 
అనంతర కాలంలో బ్రహ్మాది దేవతల నుండి అనేక వరాలను పొందిన చిరంజీవి. 
స్వామి రూపం, నామస్మరణ సకల భయాలను, దుష్టగ్రహ పీడల మరియు అనారోగ్యం నుండి,కాపాడి రక్షిస్తుంది అన్నది యుగాలనాటి విశ్వాసం. 
అందుకే ఎక్కువగా రహదారి మార్గంలో ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో శ్రీ హనుమంతుని పెద్దపెద్ద విగ్రహాలను మం రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతటా చూడవచ్చును. 
అదేవిధంగా మారుతీనందనుని ఉపాలయం లేని విష్ణు ఆలయం పుడమిలో కనపడదు. అది శ్రీ రామ, శ్రీ కృష్ణ, శ్రీ వెంకటేశ్వర మరియు శ్రీ నారసింహ స్వామి ఆలయం కావచ్చును. ప్రతి చోట అంజనాసుతునికి సముచిత స్థానం, ప్రత్యేక సన్నిధి ఉంటాయి. 
స్వామిని ఆరాధించి శ్రీరామ చరణాలకు చేరుకొని భక్తులు ఎందరో మనకు పురాణాలలో మరియు చరిత్రలో కనపడతారు. వీరు చూపిన మార్గంలో నడచి మరెందరో ఆధ్యాత్మిక పురోగతిని సాధించి ధన్యులయ్యారు. 
స్వామి వారికి ప్రత్యేక ఆలయాలు అనగా స్వయంవ్యక్తగా లేక భక్తులు ప్రతిష్టించినవి ఎన్నో మన రాష్ట్రంలో దేశంలో కనపడతాయి. శ్రీ వాయునందనుడు దక్షిణాముఖునిగా, పంచ ముఖునిగా, ఏకాదశ ముఖునిగా. సంజీవరాయునిగా, భక్త, దాస, అభయ, వీరాంజనేయునిగా కొలువుతీరి కొలిచిన వారి మనోభీష్టాలు నెరవేరుస్తూ, కాపాడుతున్నారు. 
భక్తకోటి వేలాదిగా సందర్శించే ఒక విశేష ఆలయం గురించి తెలుసుకొందాము. 
లంకాదహనకారి అయిన రామదూత అసురులను సంహరించారు అని విన్నాము కానీ ఆయన వారిని కూడా ఆదరించారని ఆత్మీయతతో అక్కున చేర్చుకున్నారని ఈ ఆలయ గాధ తెలుపుతోంది. మరెక్కడా లేని విధంగా స్వామి మద్ది చెట్టు కాండంలో కొలువై దర్శనమిస్తారు. 

















ఆలయ పురాణ గాథ 

సీతాదేవిని అన్వేషిస్తూ వానరసేన భారతఖండ నలుదిశలా వెళ్లిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ! అలా దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరులలో శ్రీ ఆంజనేయ స్వామి శత యోజన సముద్రాన్ని దాటి లంకలో ఉన్న జానకీ మాతను చూసి శ్రీ రామచంద్ర మూర్తి ఇచ్చిన అంగుళీకాన్ని ఇచ్చారు. ఆమెకు ధైర్యాన్ని కలిగించారు. 
ఆ సమయంలో తన మీదకు దాడికి ప్రయత్నించిన రాక్షసులను, రావణ కుమారుడైన అక్షయ కుమారుని కూడా సంహరించారు. రావణ సభలో రామదూత క్రింద రావణునికి హితవాక్కులు చెప్పారు. ఆగ్రహించిన రాక్షస రాజు శ్రీ హనుమంతుని తోకకు నిప్పు పెట్టడంతో అదే నిప్పుతో లంకా నగరాన్ని దహనం చేశారు. తిరిగి వచ్చి శ్రీ రామునికి సీతాదేవి యొక్క క్షేమసమాచారాలు తెలిపారు. 
ఆ సమయంలో రావణుని సైనికులలో ఒకరైన "మధ్యుడు"అనే వాడు స్వామివారి ధైర్యసాహసాలు, మాట తీరు, స్వామి భక్తి ప్రత్యక్షంగా చూసి ఆయన పట్ల ఆరాధనా భావాన్ని పెంచుకొన్నారు. నాటి నుండి నిరంతరం స్వామి వారి నామస్మరణ చేస్తూ రామ రావణ యుద్ధంలో అమరుడయ్యాడు. 
మరు జన్మలో మానవునిగా జన్మించి స్వామిని ఆరాధించేవాడు. 
అతని భక్తికి మెచ్చి దర్శనం అనుగ్రహించారట. అమితానందంతో స్వామిని స్తుతించి అక్కడే శాశ్వితంగా కొలువు తీరమని  కోరి తాను ఒక చెట్టుగా మారిపోయాడట. 
ఆ వృక్షం అతని పేరు మీద "మద్ది చెట్టు" గా పిలవబడుతోంది. 
జన్మజన్మలుగా తనను ఆరాధిస్తున్న భక్తుని కరుణించి కొలువైన ఈ క్షేత్రంలో  భక్తుని నామంతో కలిసి "శ్రీ మద్ది ఆంజనేయ స్వామి" పిలవబడుతూ శతాబ్దాలుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. 












క్షేత్ర విశేషాలు 

ఏలూరు నుండి జంగారెడ్డి గూడెం వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే "బయనేరు" నదీ తీరంలో ఎఱ్ఱ కాలువ ఆనకట్ట దగ్గర ఉంటుంది ఈ పవన క్షేత్రం. 
ఇక్కడ స్వామివారు కొలువైన విషయం ఆయనే స్వయంగా ఒక భక్తురాలికి స్వప్నసందేశం ఇచ్చారట. తరలి వచ్చిన గ్రామస్థులకు మద్ది చెట్టు తొర్రలో శ్రీ ఆంజనేయస్వామి దర్శనమిచ్చారట. అలాతొలి దర్శనం లభించినది సుమారు తొమ్మిది శతాబ్దాల క్రిందట అని చెబుతారు. 
సుమారు యాభై సంవత్సరాల క్రిందట ప్రస్తుత ఆలయం రూపుదిద్దుకొన్నట్లుగా తెలుస్తోంది. కానీ విశేషం ఏమిటంటే గర్భాలయం పైన మద్ది చెట్టు విమాన గోపురంగా శోభిల్లుతోంది. ఇలాంటి ప్రత్యేకత  మరెక్కడా కనిపించదు. 
ప్రధాన రహదారి నుండి కొద్దిగా లోపలి సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఆలయానికి ఆరు అంతస్థుల రాజగోపురం దూరానికి కనిపిస్తుంది. 
ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే సుందరమైన విశాలమైన ఆస్థాన మండపం. స్తంభాలకు మారుతీనందనుని రకరకాల రూపాలను సహజత్వం ఉట్టిపడేలా మలిచి నిలిపారు.  వర్ణమయమైన శిల్పాలు, మండపం ఆకర్షణీయంగాను, ఆహ్లాదకరంగాను ఉంటాయి. 
విశాలమైన ప్రదక్షిణా పధం. 
ఎందుకంటే శ్రీ ఆంజనేయస్వామి ప్రదక్షిణా ప్రియుడు. ఏ ఆలయంలోనైనా ఒకటి, మూడు చేసేవారు హనుమంతుని సన్నిధిలో పదకొండు, యాభైఒకటి, నూట ఒకటి చేస్తుంటారు. ఈ ఆలయంలోని ప్రదక్షిణ విశేషం ఏమిటంటే మనోభీష్టం నెరవేరాలంటే మనసులోని కోరిక స్వామివారికి చెప్పుకొని ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి. నలభై ఒక్క రోజులలో కోరిక తీరుతుంది అని అంటారు. ఆ తరువాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామికి ఆకుపూజ చేయించుకోవాలి అని చెబుతారు. ప్రతి రోజు ఎందరో భక్తులు ప్రదక్షిణాలు చేయడం ఈ క్షేత్రంలో చూడవచ్చును. 
గర్భాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి మద్ది చెట్టు కాండానికి ఉన్న తొర్రలో దర్శనమిస్తారు. 
ప్రధాన ఆలయానికి పక్కన స్వామివారికి మొక్కుబడులలో భాగంగా భక్తులు స్వయంగా పొంగలి చేసుకోడానికి ప్రత్యేక వంట స్థలం. అక్కడే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధి ఉంటాయి. 


























 

పూజలు - ఉత్సవాలు 

ప్రతి నిత్యం నియమంగా నిర్ణయించిన పూజలు ఉదయం నుండి రాత్రి వరుకు మూలవిరాట్టుకు జరుపుతారు. ఆది వారం మరియు సోమవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆ రోజుల్లో భక్తులు స్వయంగా శ్రీ లక్ష్మీ కుంకుమ పూజలు మరియు శ్రీ హనుమద్వివాహం చేసుకొనే అవకాశం లభిస్తుంది. 
సహజంగా వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే ఆలయాలలో శనివారం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో మంగళవారం భక్తుల సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. వెరసి మద్ది శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి నిత్యం భక్తుల సందడి కనపడుతుంది. 
మరో విశేషం మంగళవారాల్లో స్వామికి లక్ష తమలపాకులతో ఆకుపూజ నిర్వహించడం జరుగుతుంది. రుద్రాంశ సంభూతుడైన శ్రీ వాయునందనుడు కొలువైన ఈ క్షేత్రంలో కార్తీక మాసంలో విశేష పూజలు నిర్వహిస్తారు. 
ప్రతి నెల పూర్వాభాద్ర నక్షత్రం రోజున శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయస్వామి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. 
మద్ది శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలను అయిదు రోజులపాటు రంగరంగ వైభవంగా జరుపుతారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. 
దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యాన్నదానం జరుగుతోంది. భక్తులు సేదతీరడానికి విశాలమైన మండపాలు, అతిధి గృహాలు అందుబాటులో ఉన్నాయి. 
ముఖ్యంగా జాతకరీత్యా శని , రాహుకేతు ప్రభావాలు ఎదుర్కొంటున్నవారు, కుజదోషం తో వివాహం కాని వారు అధిక సంఖ్యలో మద్ది క్షేత్రానికి వస్తుంటారు. 
సాయంసంధ్యాసమయంలో సమీపంలోని ఎర్ర కాలువ జలాశయంలో నౌకావిహారం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
అయిదు కిలోమీటర్ల దూరంలోని జంగారెడ్డి గూడెం లో గోకుల తిరుమల  పారిజాతగిరి క్షేత్రం ఉంటుంది. కలియుగ వైకుంఠం తిరుమల తరువాత శ్రీ వేంకటేశ్వరుడు ఇక్కడ మాత్రమే సప్తగిరులపైన కొలువుతీరారు అన్నది భక్తుల విశ్వాసం. ప్రాతినిధ్యం భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 
శ్రీ రామదూత స్వయంభూగా వెలసిన మద్ది క్షేత్రం ఏలూరు, విజయవాడ, ద్వారకాతిరుమల, రాజమండ్రి నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. 

శ్రీ ఆంజనేయం !!!!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...