ఆధ్యాత్మిక గోవా
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే భారత దేశ రాష్ట్రాలలో కేరళ, రాజస్థాన్, గోవా రాష్ట్రాలు తొలి మూడు స్థానాలలో ఉన్నాయి.
గోమంతక్ (గోవా)
మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పురాణకాలంలో "గోమంతక్" గా పిలవబడిన గోవా గురించి "స్కంద పురాణం"లోని "సహ్యాద్రి కాండం"లో ప్రస్తావించబడినది అని తెలుస్తోంది.
శ్రీహరి యొక్క అవతారమైన శ్రీ పరశురాముడు సముద్రుని నుండి పొందిన భూభాగంలో గోమంతక్ కూడా ఒక భాగంగా పేర్కొంటారు. భార్గవరాముడు ఇరవైరెండు సార్లు భూమండలం అంతా తిరిగి పాలకుడు అన్న ప్రతి ఒక్కరినీ సంహరించారు. అలా సొంతం చేసుకొన్న భూమిని శ్రీ కశ్యప మహర్షికి దానం చేశారట. మహేంద్రగిరిని చేరుకొని సాగరుని వద్ద నుండి తాను ఉండటానికి కొంత నేలను పొందారని మహాభారతంలోని శాంతిపర్వం పేర్కొంటోంది.
తీసుకొన్న భూమిలో అనేక ఆలయాలను నిర్మించిన శ్రీ పరశురాముడు పూజాదికాలు నిర్వహించడానికి కావలసిన బ్రాహ్మణులను వశిష్ట, భరద్వాజ, కౌశిక, కౌండిన్య, అత్రి లాంటి పది మంది మహర్షుల గోత్రానికి చెందిన వారిని ఎంచుకొని తెచ్చారట. వారే "గౌడ సారస్వత బ్రాహ్మణులు . వీరి ఆధ్వర్యంలో అనేక శివాలయాలు, విష్ణు ఆలయాలు, దేవీ ఆలయాలు నెలకొల్పబడినాయి. కాలక్రమంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకొని నేటికీ వీరు వీటిని ఏనాడో నిర్ణయించిన సంప్రదాయాల ప్రకారం పూజాదికాలు నిర్వహించడం చాలా గొప్ప విషయంగా అనిపించింది.
గోవా పేరు వినగానే ప్రతి ఒక్కరి మనస్సులలో రకరకాల ఊహలు మెదులుతాయి. పచ్చదనంతో నిండిన ప్రకృతి, సుందర సాగరతీరాలు, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, క్రమశిక్షణ కలిగిన ప్రజలు, ఎందరికో ఉపాధి కలిగిస్తున్న పర్యాటకం, చక్కని ఆహరం, క్రూజ్ లలో నృత్యగానాలు, నావలలో విచ్చలవిడిగా సాగే జూదం.
ఎవరికి కావలసిన వినోదం వారికి అందించే ఏకైక పర్యాటక ప్రదేశం గోవా ! ఈ సత్యం నాకు నెల రోజుల క్రిందట వెళ్ళినప్పుడు అర్ధం అయ్యింది. ఎలా అంటే గతంలో నాలుగుసార్లు గోవా వెళ్ళాను. క్రిందటి సంవత్సరం వెళ్ళినప్పుడు మాత్రమే గోవా లోని ఆలయాలన్నింటినీ సందర్శించాలన్న తలంపు కలిగింది. కుదరలేదు.
అనుకోకుండా ఈ సంవత్సరం కూడా వెళ్లే అవకాశం రావడంతో ముందుగా అందుబాటులోనికి వచ్చిన ఆలయాల సమాచారాన్ని పూర్తిగా రాసి పెట్టుకొన్నాను. వీలైనంత సమాచారాన్ని సేకరించుకొన్నాను.
కానీ శ్రీ పరశురాముని సొంతమైన ఈ భగవంతుని స్వస్థలం గతంలో ఎంతో క్రమబద్ధమైన, ఆధ్యాత్మిక క్షేత్రంగా వర్ధిల్లినట్లుగా తెలుస్తోంది.
మా పర్యటన
నేను పనిచేసే ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, బెంగళూరు యాజమాన్యం వారి ఉద్యోగులను మూడు రోజుల విహారయాత్ర నిమిత్తం గోవా తీసుకొని వెళ్లడం జరిగింది. మొత్తం 110 మంది. రాకపోకల మరియు అక్కడ ఉండటానికి రిసార్ట్ అన్నీ ఏర్పాటు చేశారు.
28 వ తేదీ ఫిబ్రవరి న విజయవాడ నుండి ఇండిగో విమానంలో బెంగళూరు మీదగా మధ్యాహన్నం గోవా డబోలిం ఎయిర్ పోర్ట్ చేరుకొని వాహనాలలో మాకు బస ఏర్పాటు చేసిన రిసార్ట్ ఉన్న కొల్లంగోట్ చేరుకున్నాము.
ఆ రోజుకు సాయంత్రం పార్టీ, విశ్రాంతి. కానీ నేను వెళ్లి పక్కనే ఉన్న స్కూటర్లు అద్దెకు ఇచ్చేవారితో మాట్లాడి రెండు వాహనాలకు అద్దె చెల్లించి వచ్చాను. మరునాటి ఉదయం దక్షిణ గోవా లోని కొన్ని ఆలయాలను సందర్శించాలన్న నిర్ణయం తీసుకొన్నాము. నాతొ పాటు మా విజయవాడ ఆఫీస్ లో పని చేసే శ్రీ దుర్గా రమేష్ మరియు శ్రీమతి వల్లీ మాత్రమే వస్తాము అన్నారు. మిగతావాళ్ళు అంతా గోవా తిరగడానికి బస్సులు వెళ్లాలని నిర్ణయం జరిగింది.
ఉదయం ఏడున్నరకు రిసార్టులో టిఫిన్ తీసుకొని బయలుదేరాము.
మాకంటూ లక్ష్యం ఒకటే వీలైనన్ని పురాతన ఆలయాలను దర్శించాలి. అంతే !
మాకు తెలిసినది ఆలయల పేర్లు మాత్రమే ! ప్రస్తుతం గూగుల్ మ్యాప్ లాంటివి అందుబాటు లోకి వచ్చాయి అదో భరోసా.వాహనాలను నడపటం వచ్చు, హిందీ బాగా వచ్చు ఈ ధైర్యాలన్నింటినీ మూటకట్టుకొని బయలుదేరాము.
రిసార్ట్ నుండి మెయిన్ రోడ్డు మీదకు వచ్చేటప్పటికి "సావల్ అనే ప్రదేశంలో "శ్రీ మహారుద్ర ఆమ్రేకర్ దేవస్థానం" కనపడింది. మా ఆలయ సందర్శన ఇక్కడి నుండి ప్రారంభించాలని లోపలికి వెళ్ళాము. మరొక అంశం ఏమిటంటే మేము వెళ్ళవలసిన ప్రదేశాలను ఎలా సులభంగా చేరుకోవచ్చునో అన్న సమాచారం ఏమన్నా లభిస్తుంది అన్న ఆశ.
మహాదేవుని దర్శనం చేసుకొని ఆలయ అర్చకుల వారిని మేము చూడదలచుకొన్న ఆలయాల వివరాలు అడిగాము. ఆయనకు తెలియలేదు కానీ వచ్చిన భక్తులు మాత్రం మాకు కొంత ఉపయోగపడే సమాచారం అందించారు.దాని ప్రకారం ఈ ఆలయాలు అన్నీ దక్షిణ గోవాలో ఉన్నాయి. ఉత్తర గోవా బీచ్ లకు ప్రసిద్ధి అయితే దక్షిణ గోవా ఆలయాలకు నిలయం. ముఖ్యంగా ఈ ఆలయాలు అన్నీ కూడా "పొండ" పరిసరప్రాంతాలలో అధికంగా ఉన్నాయి.
అంతృజ్ మహల్
పొండాని గోవా బాష అయిన కొంకిణిలో"అంతృజ్ మహల్"అని పిలుస్తారు. ఈ పదానికి అర్ధం ఏమిటంటే"శ్రీ మహావిష్ణువు పానుపుగా ఉండే అనంతుని శక్తి నిండిన ప్రదేశం" అని అర్ధం. మరోవిధంగా చెప్పాలి అంటే "పుణ్య తీర్థ స్థలం" అని కూడా చెప్పుకోవచ్చును.
అందుకేనేమో ఒకప్పుడు గోవా అంతటా ఉన్న ఆలయాలు పరాయి పాలకుల దాడులకు ఇక్కడికి తరలిరావడం, ప్రస్తుతం ప్రముఖ క్షేత్రాలుగా రూపుదిద్దుకోవడానికి కారణం అనిపించింది.
నేను చదివిన పుస్తకాలలో గోవా హిందూ ఆలయాల గురించిన సమగ్ర సమాచారం చాలా చక్కగా వివరించారు. వాటి ఆధారంగా చూడవలసిన ఆలయాల జాబితా తయారుచేయడం జరిగింది.
కదంబ రాజ వంశం
వీరు ఉత్తర కన్నడ మరియు కొంకణ ప్రాంతాలను 345 - 540 సంవత్సరాల కాలంలో పాలించారు అని తెలుస్తోంది. వీరు శివాంశ సంభూతులన్న ప్రతీతి ఉన్నది. వీరి శాసనాలలో కూడా అది కనిపిస్తుంది. నేటి కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు ఉత్తరాది లోని అనేక ప్రాంతాలు వీరి అధీనంలో ఉండేవని లభించిన శాసనాధారాలు తెలుపుతున్నాయి.
గోవా ను పాలించిన కదంబ రాజ వంశం వారు కూడా వీరికి చెందినవారే అని అంటారు. రాజ్య పతనానంతరం వీరు చాళుక్య వంశ ఆస్థానంలో వివిధ పదవులలో స్థిరపడ్డారట. గోవా (కొంకణ) ప్రాంతం చాళుక్యరాజుల అధీనం లోనికి వచ్చిన తరువాత కదంబ వంశస్థులను కొంకణ ప్రాంతానికి సామంతులుగా నియమించారట.
వీరు సుమారు నాలుగు వందల సంవత్సరాల పాటు పాలించారని తెలుస్తోంది.
గోవాలోని ఆలయాలు అన్నీ వీరి కాలంలోనే నిర్మించారట.
విదేశీయుల పాలనలో చాల వరకు ఆలయాలను కూల్చివేయడం జరిగిందట. వాటిని తిరిగి అదే శైలిలో, ఆధునిక విధానంలో పునః నిర్మించారని చెబుతున్నారు.
ఆలయాల విశేషాలు
ఇక్కడ కొన్ని ప్రత్యేక విషయాలను గమనించాలి. గోవా లోని అన్ని ఆలయాలు దరిదాపుగా కేరళ ఆలయాల మాదిరి సువిశాల ప్రాంగణంలో ఎత్తైన మండపాలతో ఉంటాయి. రాజగోపురాలు ఉండవు. ప్రవేశ ద్వారం మాత్రమే కనపడుతుంది. ఇక్కడి ఆలయాలలో ధ్వజస్థంభానికి బదులు దీపస్థంభం కనపడుతుంది. పర్వదినాలలో మరియు ముఖ్యమైన ఆలయ ఉత్సవాలలో సాయం సంధ్యాసమయంలో వందల దీపాలతో అలంకరిస్తారు. అద్భుతంగా ఉంటుందా దృశ్యం. ఆలయాలలో పెద్ద పెద్ద స్థంభాల పైన నిర్మించిన సభామండపం చక్కటి చిత్రాలతో దర్శనమిస్తాయి. గర్భాలయం పైన ఎత్తైన గుండ్రటి విమాన గోపురం నిర్మించబడి ఉంటుంది. అన్ని ఆలయాలలో గర్భాలయానికి దారి తీసే ప్రధాన ద్వారం అత్యంత రమణీయ స్వర్ణ లేదా రజత తోరణాలతో అలంకరించడం చాలా అద్భుతంగాను అదనపు శోభను సమకూర్చడం మెచ్చుకోదగిన విషయం. మూలవిరాట్టుల అలంకరణ కూడా చాలా సుందరంగా, నేత్రపర్వంగా ఉంటుంది.
సారస్వత నిర్మాణ శైలిలో నిర్మించిన అన్ని ఆలయాలలో పంచాయతన విధానాన్ని పాటిస్తారు. ఉపాలయాలు ప్రధాన ఆలయానికి నలుదిక్కులా ఉంటాయి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గోవా పర్యాటక ప్రదేశం కావడం వలన ఉదయం నుండి రాత్రి వరకు ఆలయాలు నిరంతరాయంగా తెరిచి ఉంటాయి.
దాదాపుగా అన్ని ఆలయాలు పునః నిర్మించిబడినవే ! పోర్చుగీసు వారి ఆక్రమణ తరువాత గోవా లోని వివిధ ప్రాంతాలలో ఉన్న గౌడ సారస్వత బ్రాహ్మణులు తమ ఆరాధ్యదైవాలను తీసుకొని, అనేక కష్టనష్టాలకు ఓర్చి రహస్యంగా పొండా ప్రాంతానికి చేరుకొన్నారని చరిత్ర తెలుపుతోంది. దక్షిణ గోవా చాలాకాలం హిందూ పాలకుల అధీనంలో ఉండటమే దీనికి ముఖ్య కారణం. తరువాత ఈ ప్రాంతం కూడా విదేశీ పాలన లోనికి వెళ్లినా వారు ఏకారణం చేతనో హిందూ దేవాలయాల జోలికి రాలేదు.
ఆలయ సందర్శనం
సావల్ ఆలయంలో భక్తులు ఒకరు చెప్పినట్లు మేము ఎక్కడ ఆగకుండా పనాజీ వెళ్లి అక్కడ శ్రీ మహాలక్ష్మీ ఆలయానికి చేరుకున్నాము.
నలుగురైదుగురు భక్తులు తప్ప రద్దీ లేదు. అర్చకులవారితో కొంతసేపు మాట్లాడే అవకాశం లభించింది. ఆంధ్రా నుంచి వచ్చామని చెప్పిన వెంటనే ఆలయ విశేషాలు, మిగిలిన ఆలయాల గురించి కూడా వివరించారు.
శ్రీ మహాలక్ష్మీ మందిరం, పనాజీ
గోవాలో చాలా శ్రీ మహాలక్ష్మీ ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో పురాతనమైనవి ప్రధానమైనవి పనాజీ, బందొర, కొల్వ లలో కనిపిస్తాయి. గోవా హిందువులు ఆరాధించే వారిలో శ్రీ మహాదేవుని తరువాత శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ శాంత దుర్గ తొలిస్థానాలలో ఉంటారు.
ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాలకు చెందినవిగా తెలుస్తోంది.
గోవా రాజధాని పనాజీ "గోమతి నది"(మాండవి నది) ఒడ్డున కొన్ని శతాబ్దాల క్రిందట నిర్మించబడిన పురాతన నగరం.
పనాజీ లో ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయ చరిత్ర పదహారో శతాబ్ద కాలానికి చెందినదిగా తెలుస్తోంది. ఉత్తర కర్ణాటక శివమొగ్గ ప్రాంతానికి చెందిన "హవ్యక బ్రాహ్మణుల" కులదైవం శ్రీ మహాలక్ష్మి.
వారు వేదమంత్రాలు పఠిస్తూ గ్రామాలలో తిరుగుతూ జీవించేవారట. వారు ఎక్కడికి వెళితే అక్కడికి తమ కులదైవం విగ్రహాన్ని తీసుకొని వెళ్లేవారట. అలా తిరుగుతూ గోవా ప్రాంతానికి చేరిన వారికి అక్కడి పోర్చుగీసు అధికారుల నుండి వేధింపులు ఎదురయ్యాయట.
తమ కులదైవత విగ్రహానికి ఎక్కడ ఆపద వాటిల్లుతుందో అన్న భయంతో వారు అనేక ప్రదేశాలలో రహస్యంగా ఉంది చివరకు భారతీయ హిందువు పోర్చుగీసు సైన్యాధికారి అయిన కామత్ అనే ఆయన వద్ద విగ్రహాన్ని ఉంచి వెళ్లిపోయారట. కామత్ కూడా కొంత కాలం పాటు శ్రీ మహాలక్ష్మీ విగ్రహాన్ని అనేక ప్రదేశాలలో దాచి ఉంచారట. చివరకు తనకున్న పరిచయాలతో పొర్చిగీసు గవర్నర్ నుండి అనుమతి తీసుకొని స్నేహితుల సహకారంతో 1819 వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని ప్రతిష్టించారు.
అప్పటి నుండి అమ్మవారు పనాజీవాసుల ఆరాధ్యదైవంగా పూజింపబడుతోంది.
నదీతీరానికి సమీపంలో దుకాణ మరియు గృహ సముదాయాల మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం లో శ్రీ గణపతికి ఒక ప్రత్యేక సన్నిధి కూడా ఉన్నది.
వినాయక చవితి, మహాశివరాత్రి, శ్రీరామ నవమి, దసరా నవరాత్రుల పర్వదినాల్లో పెద్ద ఉత్సవాలు జరుపుతారు. మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది అని చెప్పారు. చైత్రం, శ్రావణం, కార్తీక మాసాలలో విశేష పూజలు, మేళా నిర్వహిస్తారు.
ప్రసాదం తీసుకొని బయలుదేరాము.
పనాజీ లోని ఒక చర్చి
సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చి , పాత గోవా
పొండా వెళుతూ మేము పాత గోవా లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చి దగ్గర ఆగాము. గోవా లోని ముఖ్యమైన దర్శనీయ స్థలాలలో మొదటి స్థానంలో ఉన్నది. విదేశీయులు మరియు భారతదేశ సందర్శకులు అధిక సంఖ్యలో ఈ బాసిలికా ను సందర్శిస్తుంటారు.
పోర్చుగీసు వారి రాజధానిగా ఉన్న పాత గోవాలో ఉన్న ఈ "బాసిలికా" ( ప్రజలందరూ సమావేశం కావడానికి అనువైన విశాల నిర్మాణం).ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినది. ఈ కట్టడం 1605 వ సంవత్సరంలో ప్రారంభించబడింది.
సొసైటీ ఆఫ్ జీసస్ సహా స్థాపకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క భౌతిక కాయం ఇక్కడ భద్రపరచబడినది.
ఈయన గోవా నుండి చైనా వెళ్లి అక్కడ మరణించారట. మృతదేహాన్ని పోర్చుగీసు తీసుకొని వెళ్లి అక్కడ సమాధి చేశారట. రెండు సంవత్సరాల తరువాత కూడా మృతదేహం చనిపోయినప్పుడు ఎలా ఉన్నదో ఏ మాత్రం మార్పులేకుండా ఉన్నదట. తిరిగి గోవా తీసుకొని వచ్చి ఇక్కడ భద్రపరిచారట. నేటికీ పెద్ద మార్పులేకుండా ప్రత్యేక పేటికలో భద్రపరచబడి ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ శరీరాన్ని చూడటానికి ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో దేశవిదేశ పర్యాటకులు వస్తుంటారు.
భద్రతా కారణాల వలన ఎత్తైన ప్రదేశంలో ఉంచిన ఈ అద్దాల పెట్టెను పది సంవత్సరాలకు ఒకసారి క్రిందకు దించి అందరికీ దగ్గర నుండి చూసే అవకాశం కల్పిస్తారు. ఆఖరిసారి 2016వ సంవత్సరంలో జరిగింది. తిరిగి 2026 వ సంవత్సరంలో నిర్వహిస్తారు.
ఈ బాసిలికా ఎదురుగా మ్యూజియం కూడా ఉన్నది.
శ్రీ మంగీషీ దేవాలయం
పాత గోవా నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ మంగీషీ మహాదేవ మందిర్ సారస్వత బ్రాహ్మణుల కులదేవత అని అంటారు. ప్రస్తుత ఆలయం కూడా వారి ఆధ్వర్యంలోనే ఉన్నది.
శ్రీ మంగీషీ మహాదేవ హిమాలయాలలో భగీరథీ తీరంలో విధాత బ్రహ్మ దేవుడు ప్రతిష్టించారట.
అర్చకులుగా సారస్వతీ బ్రాహ్మణులను నియమించారట.
ప్రతికూల పరిస్థితులలో వారు లింగంతో హిమాలయాల నుండి దేశసంచారం చేస్తూ నేటి బీహార్ రాష్ట్రం మీదగా కొంకణ దేశంలోని ప్రస్తుతం "జువరీ" గా పిలవబడుతున్న అగనాశిని నదీ తీరంలోని "కుశస్థలి"గా పిలవబడిన నేటి "కర్తలిమ్" వద్ద స్థిరపడ్డారట. కానీ పోర్చుగీసువారు ఉత్తర గోవా ప్రాంతాలను ఆక్రమించడం వలన వారు హిందూ రాజుల పాలనలో ఉన్న దక్షిణ గోవా లోని "ప్రియోల్" గ్రామంలో స్థిరపడ్డారట.
స్థానిక ప్రభువులు, మరాఠా పాలకులు ప్రధమ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. చివరిసారిగా నూట యాభై సంవత్సరాల క్రిందట పునః నిర్మాణం, కొత్త నిర్మాణాలను నిర్మించారు.
చాలా రద్దీగా ఉన్నది ఆలయం. నివేదన నిమిత్తం దర్శనాన్ని ఆపేసారు. అభ్యంతకర వస్త్రధారణలో ఉన్న దేశీ విదేశీ సందర్శకులను పక్కకు పంపిస్తున్నారు భద్రతా సిబ్బంది. మేము ఆలయ కార్యాలయం వద్దకు వెళ్లి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేసాము.
ఆపదలో ఉన్న వారిని ఆడుకొనే దైవంగా శ్రీ మంగీషీ మహాదేవ ప్రసిద్ధి.
ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వ రకు నిరంతరంగా తెరిచి ఉండే ఆలయంలో నియమంగా రోజుకు నాలుగు పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం సాయంత్ర హారతికి ముందు పల్లకీసేవ ప్రత్యేకం.
శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ సూర్యనారాయణ, శ్రీ వీరభద్ర, శ్రీ కాలభైరవ సన్నిధులు కూడా ఉన్నాయి.
మహా శివరాత్రి, శ్రీరామనవమి, జన్మాష్టమి, దసరా నవరాత్రులు, గణేష నవరాత్రులు, అక్షయ తృతీయ, అనంతోత్సవం ఘనంగా జరుపుతారు.
మాఘ మాసాల్లో సప్తమి నుండి పొర్ణమి వరకు "జేష్ఠోత్సవాలు" తొమ్మిది రోజులపాటు లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు.
స్థానికులు మరియు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో దర్శించుకొనే గోవా హిందూ దేవాలయాలలో అగ్రస్థానం శ్రీ మంగీషీ మహాదేవ మందిరం అని ఆలయ ఉద్యోగి ఒకరు ఈ వివరాలన్నీ తెలిపారు.
అప్పటికి పదకొండున్నర అయ్యింది. ఎండ, ఉక్కబోత విజయవాడ వాళ్లమైనా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టసాగాయి. రకరకాల పండ్లతో చేసిన సలాడ్ అమ్ముతున్నారు. అది తిని నిమ్మకాయ సోడా తాగి బయలుదేరాము. తరువాతి గమ్యం శ్రీ మహాల్సా నారాయణి ఆలయం, మర్డోలీ. శ్రీ మహావిష్ణు కొలువైన దేవాలయం. ఆ రోజు నుండి ఆలయ ఉత్సవాలు ప్రారంభం అని ఆయన చెప్పారు.
శ్రీ మహాల్సా నారాయణి దేవాలయం
గోవాలో కూడా శివాలయాలు అధికం. అదే విధంగా ఆది శక్తి శ్రీ మహాలక్ష్మిగా, శ్రీ శాంత దుర్గ రూపాలలో అనేక ఆలయాలలో కొలువై దర్శనమిస్తారు. గోవాలో కూడా శక్తి ఆరాధన అధికం.
కొద్దిగా ఉన్న శ్రీమన్నారాయణ మూర్తి ఆలయాలలో చాలా ప్రసిద్ధి చెందినది శ్రీ మహాల్సా నారాయణి ఆలయం. కాకపోతే ఈ వైష్ణవ ఆలయంలో శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపంలో పూజింపబడతారు.
"మహాల్సా" అన్నది శ్రీహరి ధరించిన అనేక అవతారాలలో ఒకటి అయిన "మోహినీ" యొక్క మరో పేరు అని అంటారు. ఇలాంటి ఆలయాలు మహారాష్ట్ర, కర్ణాటకలో మరియు కేరళలో ఉన్నట్లుగా చెప్పారు. వాటిల్లో భక్తులను అమితంగా ఆకర్షించేది కర్ణాటక ఉడిపి జిల్లాలోని "హరిఖండిగే "అనే ఊరిలో ఉన్న శ్రీ మహాల్సా నారాయణి ఆలయం.
గోవాలో చాలా కుటుంబాలకు కులదేవత శ్రీ మహాల్సా నారాయణి. భవిష్య పురాణంలో ఈ దేవత ప్రస్థాపన ఉన్నట్లుగా ఆలయ చరిత్ర తెలుపుతోంది.
సారస్వత బ్రాహ్మణులలో వైష్ణవాన్ని అనుసరించేవారు ఈ అర్చనామూర్తిని నేపాల్ నుండి తెచ్చి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఆలయం నిర్మించి పూజించేవారట. అనంతర కాలంలో ఆ ప్రాంతం మొఘల్ సుల్తానుల పాలన లోనికి వెళ్లడంతో, రహస్యంగా గోవా తెచ్చారని అంటారు.
వారు ఇక్కడ నిర్మించుకున్న ఆలయం పదహారో శతాబ్దంలో పోర్చుగీసు వారు ధ్వంసం చేశారట. వారి ప్రాబల్యం తగ్గిన తరువాత ఇక్కడ కొత్తగా ఆలయాన్ని నిర్మించుకొన్నారట.
ప్రస్తుత ఆలయం సుమారు పద్దెనిమిదో శతాబ్ద మొదటి సంవత్సరాలలో నిర్మించబడినట్లుగా తెలుస్తోంది.
గోవాలో ఏ ఆలయానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మాదిరి ఎత్తైన రాజ గోపురాలు కనిపించవు. స్వాగత ద్వారం ఒకటి మాత్రమే ఉంటుంది. కానీ గర్భాలయ విమాన గోపురంతో సమానమైన ఎత్తులో దీప స్థంభం నిర్మిస్తారు. పర్వదినాలలో సాయం సంధ్యాసమయంలో దీపాలతో స్థంభం దేదీప్యమానంగా వెలిగిపోతుంది.
మరో విశేషం ఏమిటంటే మండపంలో టెలివిజన్ ద్వారా గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టును చక్కగా వివరంగా దర్శించుకొని అవకాశంతో పాటు ఫోటోలు తీసుకొనే అవకాశం కూడా ఇస్తారు.
మిగిలిన ఆలయాల మాదిరి ఇక్కడ కూడా పెద్ద స్తంభాల మీద నిర్మించిన ఆస్థాన మండపం, చిన్న అర్ధమండపం తరువాత గర్భాలయం.
గర్భాలయంలో ఒక అసురుని శరీరం మీద శ్రీ మహాల్సా నారాయణి స్థానిక భంగిమలో వెనుక కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో పానపాత్ర, ముందు కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో అసురుని శిరస్సు ధరించి దర్శనమిస్తారు. చేతిలోని శిరస్సు నుండి వస్తున్న రక్తాన్ని తాగుతూ ఒక సింహం పక్కనే కనపడుతుంది. మరో విషయం ఏమిటంటే అమ్మవారు యజ్ఞోపవీతం ధరిస్తారు. శ్రీ మహాల్సా నారాయణీది ఒక అరుదైన రూప విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న ఉత్సవాల సందర్బంగా శ్రీ మహాల్సాను శ్రీ మహాలక్ష్మిగాను, శ్రీ రామ, శ్రీ కృష్ణ, శ్రీ వెంకటేశ్వర ఇత్యాది రూపాల అలంకరణ చేస్తారట. ఇవి కాకుండా ప్రతి ఆదివారం విశేష పూజలు మరియు పల్లకీ సేవ ఉంటాయట. మాఘ మాసంలో పెద్ద జాతర నిర్వహిస్తారట. నవరాత్రులు ఇతర హిందూ పర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రత్యేక పూజలు చేయించుకొంటారు.
గర్భాలయానికి ఎదురుగా ఉన్న సన్నిధిలో వినమ్రంగా ముకుళిత హస్తాలతో స్థానిక భంగిమలో అంజనాసుతుడు కొలువై ఉంటారు.
ఉపాలయాలలో శ్రీ శాంత దుర్గ, శ్రీ లక్ష్మీనారాయణలతో పాటు శ్రీ మహాల్సా నారాయణి గణాలు అయిన "గ్రామపురుష్, భగవతి, దద్, సింహ పురుష్ మరియు మహా పురుష్" గర్భాలయం వెలుపల చుట్టూ ప్రత్యేక సన్నిధులలో కొలువై ఉంటారు.
సువిశాల ప్రాంగణంలో ఉన్న ఆలయానికి ఎదురుగా ఎత్తైన దీపస్థంభం తో బాటు దానికి సమానమైన ఎత్తులో ఉన్న ఇత్తడి దీపకుందీ వాటి పక్కన ధ్వజస్థంభం ఉంటాయి. మేము ధ్వజస్తంభాన్ని చూసింది ఇక్కడే ! అన్ని ఆలయాలలో దీపస్తంభాలే !
ఎండ ఎంతగా సతాయిస్తోందో, ఆలయంలో పెట్టిన తీపి ప్రసాదాలు అంత మధురంగా ఉన్నాయి.
ప్రతి నిత్యం ఆలయంలో అన్నప్రసాద వితరణ ఉన్నది. ఉత్సవాల సందర్బంగా ఈ రోజు మమ్మల్ని ప్రసాదం తీసుకొమ్మని చెప్పారు అక్కడి వారు.
ఇంకా చూడవలసిన ఆలయాలు ఉండటం వలన బయటికి వచ్చి మరోసారి సోడా తాగి ముందుకు బయలుదేరాము. అప్పటికి మార్గం గురించిన సరైన అవగాహన రావడంతో పెద్ద ఇబ్బంది లేకుండా పొండా వైపుకు కదిలాము.
కొద్ది దూరం వెళ్లిన తరువాత వచ్చిన జంక్షన్ లో నాలుగు ఆలయాల మార్గాన్ని తెలిపే బోర్డు కనపడింది. అక్కడికి పొండా నాలుగు కిలోమీటర్ల దూరం.
పొండా ఊరి లోనికి వెళ్లకుండా బోర్డు చూపించిన వైపుకి తిరిగాము. సరిగ్గా వంద మీటర్ల దూరంలో శ్రీ వినాయక ఆలయం.
శ్రీ గోపాల గణపతి ఆలయం
జంక్షన్ నుండి పైన బోర్డులో రాసిన ఆలయాలలో మొదటిది ఫార్మాగుడి అనే ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం గురించి సమగ్ర సమాచారం లభించలేదు. మేము అక్కడికి సుమారు ఒంటి గంటకు చేరుకున్నాము. అర్చకులు కూడా లేరు. ఒక వ్యక్తి మాత్రం ముఖమండపంలో కూర్చొని ఉన్నారు. ఫోటోలు తీసుకుంటాము అంటే సరే అన్నారు.
సుమారు వంద సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతంలో పశువుల కాపరి ఒకరికి శ్రీ వినాయక విగ్రహం అడవిలో లభించిందట. భక్తి శ్రద్దలతో అతను కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసి విగ్రహాన్ని అందులో ఉంచి పూజలు ప్రారంభించాడట. మిగిలిన గ్రామస్థులు కూడా అతనిని అనుసరించారట. కొద్ది రోజులలో గ్రామస్థుల జీవితాలలో ఎన్నో శుభపరిణామాలు కలిగాయట. దానితో శ్రీ గణపతి గురించి పక్క గ్రామాలకు చేరి భక్తులు రావడంతో ఆదరణ పెరిగిందట. అలా కొద్దీ సంవత్సరాలలో ప్రజలలో విశేష విశ్వాసాన్ని పొందిన ఆలయానికి గోవా తొలి ముఖ్యమంత్రి అయిన శ్రీ దయానంద్ బండోద్కర్ 1966 వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించి, పంచలోహ గణపతి ఉత్సవిగ్రహాన్ని సమర్పించుకున్నారు అని తెలుస్తోంది. ప్రధాన పూజలు ఈ
ఆలయం చిన్నదిగా ఉన్నా నిర్మాణ శైలిలో మిగిలిన ఆలయాలను పోలి ఉంటుంది.
గర్భాలయంలో చిన్న రాతి విగ్రహరూపంలో మరియు పంచలోహ రూపంలో ఆది దంపతుల బిడ్డ గజముఖుడు భక్తులను ఆశీర్వదిస్తున్నారు.
ఆలయం చక్కని ప్రశాంత వాతావరణంలో మమ్ములను ఆకర్షించింది. కాసేపు సేదతీరి బయలుదేరాము. తరువాత మేము దర్శించుకున్న ఆలయం శ్రీ నాగేశి మహా రుద్ర దేవస్థానం.
శ్రీ నాగేశి మహారుద్ర దేవస్థానం (సంస్థాన్ నాగేశి మహారుద్ర)
గోవాలో చిన్న పెద్ద ఆలయాలన్నింటినీ దేవస్థానాలు అనే పిలుస్తారు. కేరళలో దేవస్వం అని పిలిచినట్లు.
ఫార్మాగుడి నుండి ఒక కిలోమీటర్ల దూరంలో సారస్వత బ్రాహ్మణ సమాజ ఆధ్వర్యంలో ఉండే శ్రీ నాగేశీ మహారుద్ర సంస్థాన్.
స్వామి స్వయంభూ అని అంటారు. చాలా క్షేత్రాలలో విన్నట్లుగానే ఇక్కడ కూడా స్వామి వారి తొలి దర్శనం పశువులకాపరులకు లభించినట్లుగా చెబుతారు. అనంతరకాలంలో అనేక రాజవంశాలు తమతమ కైంకర్యాలను సమర్పించుకొన్నట్లుగా తెలుస్తోంది.
కదంబ వంశ రాజుల తరువాత పోర్చుగీసు వారి ఆక్రమణ దాకా గోమంతక్ లో ప్రధాన దర్శనీయ క్షేత్రంగా "బండివాద్" గ్రామంలో ఉన్న ఈ దేవాలయం ప్రసిద్ధి.
కానీ విదేశీయుల దాడులలో ఈ ఆలయం కూడా ధ్వంసం అయినది. ప్రస్తుత నిర్మాణాన్ని 1702 వ సంవత్సరంలో నిర్మించినట్లుగా ఆలయ అధికారులు చెప్పారు.కాలప్రభావానికి తగినట్లుగా మార్పులు చేర్పులు జరుగుతూ ప్రస్తుత రూపంలో కనిపిస్తోంది.
అందుబాటులో ఉన్న శాసనాల ఆధారాల ప్రకారం పదో శతాబ్దంలో చాళుక్య రాజు త్రిభువనమల్లుడు వేయించిన శాసనం లో ఆలయ నిర్వహణ నిమిత్తం అనేక భూములను దానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
వినాయకుడు, అమ్మవారు ఉపాలయాలలో దర్శనమిస్తారు. చాలా ప్రత్యేకంగా కనిపించినది ఏమిటంటే స్వామివారి ఉత్సవిగ్రహం ఖడ్గం, డాలు ధరించి యోధుని వేషధారణలో ఉపస్థిత భంగిమలో కనిపించడం. ఆలయ ఉత్సవాల సందర్బంగా ఇదే రూపంలో రధోత్సవంలో ఊరేగిస్తారు. ఈ విగ్రహం, అమ్మవారి విగ్రహం మరియు శ్రీ గణపతి విగ్రహం ఆలయ పునఃనిర్మాణం సమయంలో జరిపిన త్రవ్వకాలలో లభిచాయని తెలిసింది. మిగిలిన వివరాలు తెలియరాలేదు.
ఆ సమయంలో ఏదో ఉత్సవం జరుగుతుండటంతో ఎక్కువ మాట్లాడే అవకాశం లభించలేదు.
విశాల ప్రాంగణంలో ఆలయం అత్యంత శుభ్రమైన పరిసరాలతో ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడే కాదు అన్ని ఆలయాలు ఎంతో పరిశుభ్రంగా కనిపించాయి. నిర్వహణ చాలా చక్కగా ఉన్నది.
మా తరువాతి గమ్యం సమీపంలోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం.
శ్రీ మహాలక్ష్మీ ఆలయం
మన దగ్గర శ్రీ మహా లక్ష్మీ దేవిని సౌభాగ్యప్రదాయనిగా, సకల సంపదలను ప్రసాదించే దేవిగా ప్రసిద్ధి. గోవాలో ఆమె శక్తిసామర్ధ్యాలకు మరియు అధికారాన్ని అందించే దేవతగా పూజలు అందుకొంటున్నది.
ఆదిశక్తి అవతారంగా ఆరాధిస్తారు స్థానికులు.
గోవాలో చాలా ప్రదేశాలలో శ్రీ మహాలక్ష్మీ ఆలయాలు కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైనది బందొర ఉన్న ఈ ఆలయం. సారస్వత బ్రాహ్మణుల కులదేవత. ఈ ఆలయం కూడా పోర్చుగీసువారి పాలనలో కొంత దాడులకు గురైనట్లుగా తెలుస్తోంది. ఆరో శతాబ్దానికి ముందు నుండి ఈ దేవత పూజలు అందుకొంటున్నట్లుగా తెలుస్తోంది. ఏడో శతాబ్ద కాలంలో శిలాహార వంశ రాజులు అనేక కైకర్యాలు సమర్పించుకున్నారు అని శాసనాల ద్వారా తెలుస్తోంది.
చదివిన విషయాలకన్నా తిరిగి చూస్తూ మాట్లాడటం వలన ఎక్కువ విషయాలను తెలుసుకోవచ్చును అన్నది మరోసారి రుజువైనది. గోవాలో శివశక్తులారాధన అధికం అన్నది తెలిసింది. ఈ కారణంగానే ఎక్కువ శివాలయాలు, మహాలక్ష్మీ, శ్రీ శాంత దుర్గ ఆలయాలు గోవాలో కనపడతాయి.
కానీ చిత్రమైన విషయం తెలుసుకున్నది ఏమిటంటే మహాశివరాత్రి మరియు శ్రీరామ నవమి రెండింటినీ ఒకే విధంగా అంటే ఘనంగా అన్ని ఆలయాలలో నిర్వహించడం,
పనాజీ లో ఉన్న ఆలయం గ్రామదేవతది కాగా ఇక్కడ ఉన్నది మహాశక్తి ప్రదాయని ఆలయం అని చెప్పారు.
ప్రపంచప్రసిద్ధి చెందిన కొల్హాపూర్ మహాలక్ష్మి మాదిరిగా ఇక్కడ కూడా దేవి స్థానక భంగిమలో చతుర్భుజాలలో కొడవలి, కత్తి, డాలు మరియు పాత్ర ధరించి రమణీయ అలంకరణలో దర్శనమిస్తారు. మరో విశేషం ఏమిటంటే అమ్మవారి శిరస్సున శివలింగం ఉంటుందట. అది ఒక్క అభిషేక సమయంలో చూడటానికి వీలుపడుతుంది అని చెప్పారు.
సభామండపంలో చెక్కతో చెక్కిన భాగవత ఘట్టాల రూపాలు చాలా బాగున్నాయి.ఉపాలయాలలో శ్రీ నారాయణ, శ్రీ బాలేశ్వర్ , శ్రీ రావల్నాథ్ మరియు శ్రీ నారాయణ పురుష్ కొలువై ఉంటారు. వివాహాలు ఇతర కార్యక్రమాలు జరిపించుకోడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా భక్తులు ఉండటానికి వసతి గదులు , భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఎండ చాలా ఎక్కువగా ఉంది. విపరీతమైన చెమటలు, దాహం. మరోసారి నిమ్మకాయసోడా తాగి తరువాతి గమ్యం అయిన శ్రీ శాంత దుర్గా ఆలయానికి బయలుదేరాము. అప్పటికి సమయం మధ్యాహన్నం రెండు గంటలు.
శ్రీ శాంత దుర్గా దేవి ఆలయం
శ్రీ మహాలక్ష్మీ ఆలయానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గోవాలో ప్రసిద్ధి చెందిన శ్రీ శాంత దుర్గా ఆలయం. శ్రీ మహాలక్ష్మీ ఆలయం మాదిరి చాలా ప్రదేశాలలో ఉన్నాయి అమ్మవారి ఆలయాలు. కానీ శ్రీ గౌడ సారస్వత బ్రాహ్మణ కావలె మఠం ఆధ్వర్యంలో "కావలెం" అనే ఊరిలో ఉన్న ఈ దేవత వారి కులదేవత.
చుట్టూ పచ్చని చెట్లతో నిండిన పర్వతాలు, విశాల ప్రాంగణం మొదట్లో ఆలయ పుష్కరణి, ఎండవేడిమి తప్ప అన్నీ బాగున్నాయి.
మేము కొందరు మహారాష్ట్ర యాత్రీకులు తప్ప వేరెవరూ లేరు. వాళ్ళు వెళ్లిన తరువాత ఆలయ అర్చకులతో సంభాషించి వివరాలు సేకరించాను.
ఒకప్పుడు హరి హరుల మధ్య కలహం ఏర్పడి భీకర యుద్ధం చేసుకోసాగారట. వీరి పోరు జీవ కోటి కి అపాయం కనుక విధాత బ్రహ్మ ఆదిపరాశక్తిని ప్రార్ధించారట. ఆమె యుద్ధభూమిలో సాక్షత్కరించి ఇరువురినీ శాంతపరచారట. అందువలన అమ్మవారిని శ్రీ శాంత దుర్గ అని పిలుస్తారు.
స్థానక భంగిమలో ఉన్న అమ్మవారి చేతులలో రెండు పాములు ఉంటాయట. అవి శివకేశవులకు ప్రతీకలు అని చెప్పారు ఆయన.
ఆలయం పదిహేనో శతాబ్దం దాకా మార్మగోవా లోని కెలోషి అనే చోట ఉండేదట. పోర్చుగీసువారు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో గౌడ సారస్వత బ్రాహ్మణులు తమ కులదేవతతో ఇక్కడికి తరలివచ్చారట.
ప్రస్తుత ఆలయం పద్దెనిమిదో శతాబ్దంలో మరాఠా రాజులు నిర్మించారట. మిగిలిన ఆలయాల మాదిరి ఈ నిర్మాణం కూడా సారస్వత నిర్మాణ శైలిలో నిర్మించబడినది. సభామండపం మరియు గర్భాలయంపైనా ప్రత్యేకమైన పద్దతిలో శిఖరాలను నిర్మించారు.
నవరాత్రులు, మహాశివరాత్రి, శ్రీరామ నవమి లతో పాటు మిగిలిన హిందూ పండుగలను ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రులలో అమ్మవారిని బంగారు రథంలో ఊరేగిస్తారట.
ఉండటానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి.
దత్త ఆలయాలు
పక్కనే ఉన్న మహారాష్ట్రలో దత్త సంప్రదాయానికి విశేష ఆదరణ ఉన్నది. అనేక దత్త క్షేత్రాలు కూడా ఆ రాష్ట్రంలో ఉన్నాయని తెలుస్తోంది. ఆ ప్రభావంతో గోవాలో కూడా దత్త సంప్రదాయం చోటుచేసుకొన్నట్లుగా అనిపిస్తోంది. సుమారు అయిదు దాకా గుర్తింపు పొందిన దత్తాత్రేయ స్వామి ఆలయాలు గోవాలో ఉన్నాయట.
శ్రీ శాంత దుర్గ ఆలయానికి సమీపంలో ఉన్న దత్త ఆలయాన్ని కూడా సందర్శించుకొని "రామ్నాతి" వైపుకు బయలుదేరాము.
రామ్నాతి
ఇదొక ప్రత్యేక ఆలయం అని చెప్పుకోవాలి.
రావణసంహారం తరువాత శ్రీరామచంద్ర మూర్తి బ్రహ్మ హత్యాదోషాన్ని తొలగించుకోడానికి రామేశ్వరంలో శ్రీ మహేశ్వర లింగాన్ని ప్రతిష్టించిన గాథతో ఈ ఆలయానికి సంబంధం ఉన్నది అని అర్చకుల వారి మాటల ద్వారా అర్ధమైన విషయం. గర్భాలయానికి వెలుపల అమర్చిన వెండి తోరణం మీద రామేశ్వర లింగ ప్రతిష్ట ను విగ్రహ రూపంలో ఈ కారణంగానే పెట్టారు.
గతంలో "లొట్టోలి" అనే ఊరిలో ఉండే ఈ ఆలయం ఇక్కడికి సుమారు అయిదు వందల సంవత్సరాల క్రిందట పోర్చుగీసు వారి దాడుల నుండి తప్పించుకోడానికి ఇక్కడికి తరలించబడినది.
"రామ్నాతి" అంటే రామ్ మరియు నాథ్ (శివుడు) అని అర్ధం. ఊరికి అలా ఈ పేరు వచ్చినట్లుగా చెప్పారు. గర్భాలయంలో కూడా రెండు మూర్తులు కనిపిస్తాయి. శ్రీ రామ మరియు శ్రీ పరమేశ్వర (నాథ్) అర్చనమూర్తులు ఒకదాని వెనుక ఒకటిగా దర్శనమిస్తాయి.
గోవాలో అన్ని ఆలయాలలో పంచాయతన విధానం పాటిస్తారు. ఇక్కడ కూడా శ్రీ శాంతదుర్గ, శ్రీ కామాక్షి, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ కాలభైరవ, శ్రీ భేతాళ్ ఉపాలయాలలో దర్శనమిస్తారు.
రాబోయే ఆలయ ఉత్సవాల నిమిత్తం ఆలయాన్ని శుభ్రం చేసే కార్యక్రమం జరుగుతోంది.
మేము తయారు చేసుకొన్న జాబితాలో మరో రెండు ఆలయాలు ఉన్నాయి.
అందులో ముఖ్యమైనది అక్కడికి ముప్పై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తంబడి సుర్ల అనే ఊరిలోని శ్రీ మహాదేవ మందిరం. ఈ ఆలయం ఒక్కటే పోర్చుగీసు వారి దాడుల నుండి తప్పించుకొన్నట్లుగా తెలిసింది. పూర్తిగా రాతితో నిర్మించిన వెయ్యి సంవత్సరాల క్రిందటి ఆలయం చాలా సుందరమైన వనాల మధ్య ఉంటుంది అని తెలిసింది.
కానీ సమయం లేకపోవడం, అలసట, సాయంత్రం మరల తోటివారితో కలసి క్రూజ్ కి వెళ్ళవలసి ఉండటంతో చేసింది లేక కొల్లంగోట్ కి తిరుగు ప్రయాణం అయ్యాము.
వచ్చే దారిలో శ్రీ నవ దుర్గ ఆలయం మరియు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర బాలాజీ ఆలయాల వివరాలు కనిపించాయి.
ఇప్పటికి ఇదే ప్రాప్తం మరోసారి వచ్చి మిగిలినవి చూద్దాం అని రిసార్ట్ కు చేరుకున్నాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి