శ్రీ వైష్ణవ మహా దివ్య క్షేత్రం
ఈ మధ్యకాలంలో మన ఆంధ్రరాష్ట్ర నూతన రాజధానికి సమీపంలోని పెనుమాక గ్రామంలో ఒక ఆలయం గా కాకుండా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా , మరెన్నోఉన్నత లక్ష్యాలతో ప్రారంభించిన మహోన్నత కార్యక్రమంలో భాగం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం.
ఆలయ నిర్మాణ నిర్వాహక బృందానికి భగవంతుని ప్రేరణతో, సద్గురువుల సేవతో ఏర్పడిన కొన్ని ఉన్నతమైన భావాలు ఈ విశిష్ట కార్యక్రమానికి పునాది వేసాయి అని చెప్పవచ్చును.
"ఓం నమో నారాయణాయ" అన్న పావన అష్టాక్షరీ మంత్రంలోని ఎనిమిది అక్షరాల మాదిరి ఎనిమిది ఆశయాలతో ముందుకు వెళుతున్నారు.
అవి,
1. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ రంగనాథ స్వామి ఆలయం మరియు శ్రీ పరమపద నాధ స్వామి ఆలయం.
2. 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాల( దివ్య తిరుపతులు)మూలవిరాట్టుల ప్రతిష్ట.
3. సుదర్శన(చక్రత్తి) ఆళ్వార్ మండపం
4. 1000 సెంటీమీటర్ల ఎత్తైన శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం
5. ద్రావిడ వేద పాఠశాల
6. వృద్ధాశ్రమం
7. గో శాల ( సేవ).
8. నిత్యాన్నదానం
ఈ మధ్య వెళ్ళినప్పుడుచూసాను.పావన కృష్ణవేణి తీరంలో నిర్మించిన ఈ మూడు అంతస్థుల దివ్య ధామం ముందు శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యుల వారి ఎత్తైన రూపం అద్భుతంగా దర్శనమిస్తుంది.
అయిదు అంతస్థుల రాజ గోపురం.
పక్కనే శ్రీ కార్యసిద్ధి అంజనేయ స్వామి సన్నిధి.
శ్రీ సుదర్శన్ ఆళ్వార్ సన్నిధి.
మొదటి అంతస్థులో కలియుగ దైవం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి రమ్యమైన అలంకరణలో దివ్య దర్శనం అనుగ్రహిస్తారు.
రెండవ అంతస్థులో శ్రీరంగనాథుని దివ్య సన్నిధి తో పాటు వరుస క్రమంలో కొన్ని శ్రీ వైష్ణవ దివ్యదేశాల మూలవిరాట్టులను పద్దతిలో ప్రతిష్టించారు.
మూడవ అంతస్థులో శ్రీ పరమపద నాధ స్వామి సన్నిధి మిగిలిన దివ్యదేశాల అర్చామూర్తుల సన్నిధులను చక్కగా వరుసలో ఏర్పాటు చేశారు.
నిర్వాహకుల ఎనిమిది లక్ష్యాలు నెరవేరినట్లుగా భావించాలి.మహోన్నత ఆశయాలు. తగినట్లుగా నిర్మాణాలు, నిర్వహణ ఉండటం అభినందనీయం.
భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒక విధమైన తెలియని అనుభూతి, ప్రశాంతత, ఆధ్యాత్మిక పరిమళం నెలకొనివున్న దివ్య ధామం శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం, పెనుమాక.
విజయవాడ నుండి చక్కని రహదారి మార్గం ఆలయం వరకు ఉన్నది. సిటీ బస్సు సౌకర్యం కూడా లభిస్తుంది.
శలవు దినాన్నిఅద్భుతంగా ఆధ్యాత్మికంగా భగవంతుని సన్నిధిలో గడిపే భాగ్యం లభిస్తుంది శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో. ఇది స్వానుభవంతో చెబుతున్న మాట !!.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి