27, జూన్ 2024, గురువారం

Dwaraka Tirumala

            ద్వారకా తిరుమల వాసా గోవిందా గోవిందా !!!!


భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ భారతీయులు స్థిరపడ్డారో అక్కడ మరో హిందూ దేవీ దేవత ఆలయం లేకున్నా ఒక కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని ఆలయం మాత్రం తప్పక  కనపడుతుంది. 
ఏడుకొండల మీద యుగాల క్రిందట కొలువైన శ్రీవారి పట్ల భారతీయులకు గల భక్తిప్రపత్తులకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును. 
విదేశాలలోనే కాదుమన దేశంలో కూడా ఎన్నో శ్రీ బాలాజీ ఆలయాలు నెలకొని ఉన్నాయి. కానీ చిత్రంగా మన రాష్ట్రంలో పెద్ద తిరుపతితో పాటు చిన్న తిరుపతి కూడా ఉన్నది. 
పశ్చిమ గోదావరి ( ప్రస్తుత ఏలూరు జిల్లా)లో ఉన్న ద్వారకా తిరుమల పుణ్య క్షేత్రం యుగ యుగాల నుండి "చిన్న తిరుపతి" ప్రసిద్ధి చెంది పిలువబడుతోంది.
ఎన్నో విశేషాల నిలయమైన ద్వారకా తిరుమల త్రేతాయుగానికి ముందు నుండి ఉన్నది అని క్షేత్ర పురాణ గాథ తెలుపుతున్నది.




















క్షేత్ర గాథ 

కృతయుగంలో "ద్వారక మహర్షి" శ్రీ మహా విష్ణువు" దర్శనాన్ని అపేక్షిస్తూ వందల   సంవత్సరాలు తపస్సు చేశారట. ఎత్తైన చీమల పుట్టలు ఆయన చుట్టూ ఏర్పడినాయట. 
మహర్షి దీక్ష భక్తి ప్రపత్తులకు సంతసించిన వైకుంఠవాసుడు నిజరూప దర్శమనమిచ్చారట. ద్వారకా మహర్షి శ్రీ రామచంద్రుని తాత అయిన శ్రీ అజ ,మహారాజు ఈ క్షేత్రంలో శ్రీనివాసుని సేవించారని బ్రహ్మ పురాణం పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. 
కానీ స్వామి వాల్మీకం పైన సాక్షాత్కరించినందున నడుము క్రిందిభాగం శ్రీ ద్వారక మహర్షి కి పాద సేవ నిమిత్తం అని పై భాగం సాధారణ భక్తుల దర్శనార్ధం కొరకు అంటారు.
వైష్ణవ క్షేత్రాలలో పెరుమాళ్ళ పాద దర్శనానికి విశేష ప్రాముఖ్యం ఉన్నది. తొలినాళ్లలో ఆ పాద దర్శనం భక్తులకు లభించేదికాదని చెబుతారు.
పదకొండవ శతాబ్దానికి చెందిన శ్రీ వైష్ణవ ఆచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంత కర్త అయిన శ్రీ శ్రీ శ్రీ  రామానుజాచార్యులు వారు ద్వారకా తిరుమల క్షేత్రాన్ని సందర్శించారట. ఆయన అక్కడి వారికి పరమాత్మ పాద దర్శన ప్రాధాన్యతను వివరించి మరో అర్చనామూర్తిని స్వయంవ్యక్త రూపం వెనుక ప్రతిష్టించారు అని తెలుస్తోంది. అలా భక్తులకు శ్రీనివాసుని రెండురూపాల మరియు పాద దర్శనం లభ్యమవుతోంది. 
అర్ధమండపంలో శ్రీ పద్మావతీ అమ్మవారు, శ్రీ నాంచారీ దేవి, శ్రీ ఆండాళ్ మరియు శ్రీ దేవి భూదేవి అమ్మవార్లు కొలువై దర్శనమిస్తారు. గర్భాలయానికి ఎదురుగా శ్రీ ద్వారకా మహర్షి మరియు కీర్తనాచార్య శ్రీ అన్నమయ్య విగ్రహాలు , ధ్వజస్థంభం వద్ద అంజనాసుతుడు మరియు వినతానందనుడు స్వామివారికి ముకుళితహస్తాలతో వందనం చేస్తూ కొలువై ఉంటారు. గర్భాలయ ప్రదక్షిణాపధంలో పన్నిద్దరు ఆళ్వారుల సన్నిధులుంటాయి. 















ఆలయ విశేషాలు 


మొదటిగా చెప్పుకోవలసినది శ్రీవారు కొలువు తీరిన పర్వతం గురించి. అనంతుడు అనే సర్పరాజు ప్రార్ధన మేరకు ద్వారకా మహర్షి అతను శిలా రూపం దాల్చిన పర్వతం మీద తపస్సు చేశారట. గమనిస్తే క్రింద నుండి పైకి వెళ్లే మార్గం పాము చుట్టుకొని ఉన్నట్లుగా కనిపిస్తుంది. 
మనం శేషాచలం పర్వతాలను చూస్తే శిఖర భాగాన తిరుమలనాధుడు, తోక భాగాన శ్రీశైలవాసుడు మధ్యలో శ్రీ అహోబిల నారసింహుడు కొలువై ఉంటారు. 
అదే విధంగా  ద్వారకా గిరి మీద కూడా ఒక పక్కన శ్రీ మల్లికార్జునస్వామి కొలువై దర్శనమిస్తారు. ఆ విధంగా ద్వారకా తిరుమల హరహర క్షేత్రం.  
ప్రధాన ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలియదు కానీ ప్రస్తుత ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన శ్రీ ధర్మ అప్పారావు ఆయన భార్య శ్రీమతి చిన్నమ్మా రాణి నిర్మింపచేసినట్లుగా తెలుస్తోంది. స్వామివారికి అలంకరించే అధికశాతం నగలు వారు సమర్పించారని అంటారు. 




శ్రీ వారి భద్రగజం 







కేశ ఖండనశాల 




శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయం 













గత కొన్ని సంవత్సరాలలో ఆలయ అభివృద్ధి ఘనంగాజరిగింది. ఎన్నో చక్కని గోపురాలు, మండపాలు, నిత్య కళ్యాణ మండపం, అతిథి గృహాలు, ఉద్యానవనాలు, భక్తులకు అవసరమైన ఇతర నిర్మాణాలను   మరియు విశాలమైన దారులు నిర్మించారు. ఆధునిక విధానంలో అనేక శిల్పాలను మండప స్థంభాలపైన నిలిపారు. ముఖ్యంగా దశావతార శిల్పాలు సుందరంగా జీవం ఉట్టి పడేలా కనిపిస్తాయి. 
భక్తులకు నిత్యాన్నదానం రూపంలో స్వామివారి ప్రసాదం వితరణ జరుగుతుంది. 
ఇరవై సంవత్సరాల క్రిందటి ద్వారకా తిరుమలకు నేటి ద్వారకా తిరుమలకు ఏ మాత్రం పోలికలేదు. చక్కని  నిర్మాణాలతో, ఆధునిక సదుపాయాలతో కూడిన వసతులతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండటం విశేషం. 

ఆలయ పూజలు మరియు ఉత్సవాలు 

ఉదయం సుప్రభాత సేవతో మొదలయ్యి అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు మరియు ఆరగింపులు అన్నీ నిర్ణయించిన విధానం మేరకు జరుపుతారు. ఏకాదశి, పొర్ణమి, అమావాస్య తిథులలో, పునర్వసు మరియు శ్రావణ నక్షత్రం ఉన్న రోజులలో సంక్రమణం నాడు మండపంలో స్వామివారికి ప్రత్యేక అర్చన మరియు ప్రసాద నివేదన చేస్తారు. 
ఉగాది ఆస్థానం, శ్రీ సీతారామ కళ్యాణం, శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రావణ మాసంలో మూడురోజుల పాటు పవిత్రోత్సవాలు, కార్తీక మాసం క్షేరాబ్ది ద్వాదశినాడు పుష్కరణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ధనుర్మాస పూజలు మరియు భోగినాడు గోదా కళ్యాణం అపురూపం. ఇలా ప్రతి రోజు, ప్రతి నెల స్వామివారి దర్శనానికి మరియు ఉత్సవాలకు తరలి వచ్చే భక్తసందోహంతో ద్వారకా తిరుమల శోభాయమానంగా ఉంటుంది. 
ఇవన్నీ ఒకటైతే వైశాఖ మాసంలో పది రోజులపాటు నిర్వహించే తిరుకల్యాణోత్సవాలు మరో ఎత్తు. అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. 
పల్లె వాతావరణం,పర్వత శిఖరం, దేవదేవుడు కొలువైన క్షేత్రం, శబ్ద వాయు కాలుష్యం లేని సుందర రమణీయ ఆధ్యాత్మిక సౌరభాలను విరజిమ్మే అద్భుత క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన ద్వారకా తిరుమల. 



శ్రీ సంతాన వేణు గోపాల జగన్నాథ స్వామి ఆలయం,  లక్ష్మీపురం 


















శ్రీ కుంకుళమ్మ అమ్మవారి దేవాలయం, గ్రామ దేవత, ద్వారకా తిరుమల 









దివ్య క్షేత్రం అనగానే ఆ చుట్టుపక్కల కొన్ని అనుబంధ పురాతన ఆలయాలు తప్పనిసరిగా నెలకొనిఉంటాయి . 
అదే విధంగా ద్వారకా తిరుమల  పరిసర గ్రామాలలో కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి. 
మొదటగా ద్వారకా తిరుమల గ్రామదేవత అయిన శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి దేవాలయం పర్వత పాదాల వద్ద ఉంటుంది. అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి. 
ద్వారకా తిరుమల నుండి ఏలూరు వైపు వెళితే కిలోమీటర్ల దూరంలో "చిన్న పూరి" గా పిలవబడే శ్రీ సంతాన వేణు గోపాల జగన్నాథ స్వామి ఆలయం, లక్ష్మీపురం వస్తుంది. స్వామి సంతానాన్ని ప్రసాదించే వానిగా ప్రసిద్ధి. 
ద్వారకా తిరుమల నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈస్ట్ యడవల్లి గ్రామంలో  "చిన్న భద్రాచలం" గా పిలిచే శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం  (మద్ది శ్రీ ఆంజనేస్వామి ఆలయానికి వెళ్లే దారిలో) ఉంటుంది. పురాతన ఆలయం. శ్రీ రామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 
చిన్న సింహాచలం అని పిలిచే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్న ఐ ఎస్ జగన్నాథ పురం ద్వారకా తిరుమలకు సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు. మరో దివ్య క్షేత్రం "చిన్న అన్నవరం"గా పిలిచే రంగాపురంలో శ్రీ భూనీళా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది. రంగాపురం ద్వారకా తిరుమలకు సుమారు ముప్పై అయిదు  కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 
సమీప పట్టణం మరియు జిల్లా కేంద్రం అయిన  ఏలూరులో పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ సంతాన వేణు గోపాల స్వామి ఆలయాలు దర్శనీయమైనవి. 





నమో వెంకటేశాయ !!!!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...