24, మార్చి 2020, మంగళవారం

Kanchipuram Temples


                        కంచి లోని శ్రీ వైష్ణవ దివ్య దేశాలు 







కాంచీ పురంలో మొత్తం పదునాలుగు శ్రీ వైష్ణవ దివ్యదేశాలుండగా వీటిల్లో తొమ్మిది  శివ కంచిలో, అయిదు విష్ణు కంచిలో ఉన్నాయి. అన్నింటిలోనికి  ముఖ్యమైనది శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల. శివ కంచిలో నాలుగు దివ్యదేశాలు కలిసి ఒక్క  శ్రీ ఉలగండ పెరుమాళ్ ఆలయంలోనే ఉంటాయి.  ఒకటి శ్రీ కామాక్షీ అమ్మన్ ఆలయంలో మరొకటి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఉండగా మిగిలిన మూడు  విడిగా ఉంటాయి. విష్ణు కంచిలో నాలుగు ఆలయాలు శ్రీ వరద రాజా స్వామి ఆలయానికి సమీపంలోనే ఉంటాయి. ఈ జాబితాలో లేని "తిరుప్పుకులి" కంచి కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
ఈ మాసం విష్ణు కంచి లోని నాలుగు దివ్య దేశాల గురించి తెలుసుకొందాము. ఈ నాలుగు దివ్యదేశాల ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ గాధ ఒక్కటే !
 ఒకసారి తామిరువరులలో ఎవరు గొప్ప అన్న వివాదం తలెత్తినది శ్రీ లక్ష్మి మరియు సరస్వతి దేవిల డుమవివాదాన్ని పరిష్కరించుకోడానికి తొలుత  దేవేంద్రుని వద్దకు పిదప బ్రహ్మ వద్దకు వెళ్లారు.
వారి ఇద్దరి తీర్పు సరస్వతీ దేవికి నిరాశ కలిగించినదిఆమె ఆగ్రహం తో సత్య లోకం విడిచిపెట్టి అజ్ఞాతంలో ఉండసాగింది. అదే సమయంలో సృష్టి కర్త శ్రీమన్నారాయణుని సహకారం అపేక్షిస్తూ త్రీవ్ర తపస్సు చేసి ఆయన సలహా మేరకు అశ్వమేధ యాగం చేయ తలపెట్టారుకానీ ధర్మపత్నితో కలిసి చేయవలసిన యాగము అదిఏమి చేయాలో తెలియక అందరి సలహా మేరకు గాయత్రీ దేవిని సరసన పెట్టుకొని యాగం ఆరంభించారు బ్రహ్మఅసలే తాను  మహాలక్ష్మి కన్నా తక్కువ దానినని స్వయంగా తెలిపిన భర్త తానూ లేకున్నా యాగం ఆపకుండా మరో స్త్రీని సరసన పెట్టుకొనడంతో  సరస్వతీ దేవి ఆగ్రహం రెట్టింపు అయినదిఅదుపు తప్పిన ఆవేశంతో యాగాన్ని భగ్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. వాటిని అడ్డుకొని యాగాన్ని రక్షించిన శ్రీహరి వివిధ ఆలయాలలో కొలువు తీరారు అని తెలుస్తోంది.  
పతి దేవుడు చేస్తున్న యాగాన్ని అరికట్టడానికి ఆగ్రహంతో వాగ్దేవి చేసిన ప్రయత్నాలలో ఒకటి  

శ్రీ యధోత్కారి పెరుమాళ్ ఆలయం ( తిరువెక్క)


 పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరైన శ్రీ తిరుమలై సై ఆళ్వార్ కొంతకాలం కాంచీపురంలో నివసించారు. ఆ సమయంలో ఒక పేద వృద్ధ మహిళ ఆయనకు సేవలు చేసేది. ఆమె సేవలకు సంతసించిన ఆళ్వార్ తన తపశ్శక్తితో ఆమెను సుందర యువతిగా మార్చారు. అపురూప సౌందర్యంతో ఉన్న ఆమెను చూసిన రాజు వివాహమాడి తన మహారాణిగా చేసుకొన్నారు.
కాలం తనమానాన తాను సాగిపోసాగింది. రాజు వృద్దుడయ్యాడు. కానీ రాణి శరీరంలో ఆమె సౌందర్యంలో ఏమాత్రం మార్పు రాలేదు. ఆశ్చర్యపోయిన రాజు ఆమె కాలగమనంలో మారక పోవడానికి గల కారణం తెలుపమని నిర్బంధించాడు. తప్పక నిజాన్ని తెలిపింది రాణి.
అప్పటికి ఆళ్వార్ కాంచీపురం వదిలి వెళ్లిపోయారు. ఆయన శిష్యుడు " కని కణ్ణన్" శ్రీ యధోత్కారి పెరుమాళ్ కోవెలలో ఉండేవారు. రాజు ఆయనను ఆస్థానానికి పిలిపించుకొని ఆళ్వార్ ను పిలవమని ఆయన వచ్చి తనను కీర్తిస్తూ కీర్తనలను పాడాలని ఆదేశించారు. దానికి ఆగ్రహించిన కణ్ణన్ తన గురువు శ్రీమన్నారాయణుని తప్ప అన్యులను కీర్తించరని తెలిపారు. రాజు అతనికి ధనాన్ని ఆశ చూపించారు. అయినా శిష్యుడు సమ్మతించలేదు. దానితో పాలకుని అహం దెబ్బతిని కోపంతో కణ్ణన్ తన రాజ్యం నుండి బహిష్కరించారు.
రాజ్యం విడిచి పోతూ " నిన్ను నిత్యం సేవించే కని కణ్ణన్ ఈ రాజ్యం విడిచి పోతున్నాడు.  నీకు ఇక్కడ పని ఏమున్నది ? నాతొ రా !" అన్నాడు పెరుమాళ్ తో. భక్తుని ఆదేశంతో స్వామివారు ఆదిశేషుని చాపలాగా చుట్టుకొని అతనిని అనుసరించారు. ఇరువురూ  సరిహద్దులు దాటగానే
రాజ్య మంతటా చీకట్లు కమ్ముకున్నాయి. అనేక దుశ్శకునాలు కనిపించాయి. ప్రజలంతా భయభ్రాంతులు అయ్యారు. మంత్రుల సలహా మేరకు రాజు కణ్ణన్ విడిది చేసిన ప్రదేశానికి వెళ్లి క్షమాపణ చెప్పుకొని ఆయనను సగౌరవంగా రాజ్యానికి ఆహ్వానించారు.
తిరిగి వెళుతూ  " కణ్ణన్ తిరిగి వెళుతున్నాడు. నీవు తిరిగి రా !" అనడంతో స్వామి అనుసరించారు. ఈ సంఘటనకు నిదర్శనంగా మిగిలిన ఆలయాలలో కుడి చేతి మీద శయనించి స్వామి ఇక్కడి  గర్భాలయంలో శయన భంగిమలో ఎడమ చేతిని  శిరస్సు క్రింద పెట్టుకొని కనపడతారు. నాటి నుండి "సొన్న వనం సైద పెరుమాళ్" ( ఆజ్ఞను శిరసావహించి చేసే పెరుమాళ్) అని పిలవసాగారు.
అసలు శ్రీహరి ఈ క్షేత్రంలో  కొలువు తీరడం వెనుక ఉన్న గాధ ఏమిటంటే ఆగ్రహంతో ఎలాగైనా విధాత చేస్తున్న అశ్వమేధ యాగాన్ని విధ్వంసం చేయ తలపెట్టిన సరస్వతి దేవి జలరూపం దాల్చి మహోగ్ర వేగంతో యాగస్థలి వైపుకు ప్రవహించసాగింది. నీటి ప్రవాహాన్ని ఆపడానికి వైకుంఠ వాసుడు ప్రవాహ మార్గంలో ఆదిశయనునిగా అవతరించారు. ప్రవాహ మార్గం మారిపోయింది. నాడు సరస్వతీ దేవి దాల్చిన నీటి ప్రవాహమే నేడు కంచి పట్టణం పక్కన ప్రవహించే వేగావతి నది.
శ్రీ మన్నారాయణుడు నీటి వేగాన్ని ఆపిన స్థలంగా ఇది వేగవనై అని పిలువబడి కాలగతిలో తిరువెక్క గా మారింది. ఈ ఆలయ పుష్కరణిలోనే తొలి ముగ్గురు ఆళ్వార్ లలో ఒకరైన "పొయిగై  ఆళ్వార్" అయోనిజునిగా కలువ పూలలో అవతరించినది. తదనంతర కాలంలో ప్రముఖ శ్రీ వైష్ణవ ఆచార్యులైన "శ్రీ మానవల ముని" లోకానికి శ్రీ సూక్త భాష్యాన్ని తెలిపినట్లుగా తెలియవస్తోంది.
అమ్మవారు శ్రీ కోమలవల్లి" విడిగా సన్నిధిలో దర్శనమిస్తారు.
పొయిగై, తిరుమలై సై, తిరుమంగై ఆళ్వార్లులతో పాటు నమ్మాళ్వార్ శ్రీ యధోత్కారి పెరుమాళ్ ని కీర్తిస్తూ పాశుర గానం చేశారు.
 శ్రీ అష్టభుజ పెరుమాళ్ ఆలయానికి ఎదురు సందులో ఉండే ఈ ఆలయం ఉదయం  ఆరు నుండి పదకొండు వరకు, సాయంత్రం నాలుగు నుండి ఏడు వరకు భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉంటుంది.

శ్రీ దీప ప్రకాశ పెరుమాళ్ ఆలయం (తిరుత్తాంక)


శ్రీ అళగియ సింగ పెరుమాళ్ కోవెలకు సమీపంలో ఉంటుంది ఆలయం.
బ్రహ్మ దేవుని యాగం భగ్నం చేయడానికి  ఆగ్రహంతో ఉన్న వీణాధరి అసురులను పంపకం చేసింది. వారు వెలుతురు వస్తున్న ప్రతి మార్గాన్ని అడ్డుకొన్నారు. దానితో నలుదిశలా అంధకారం అలముకొన్నది.
విధాత విష్ణువును ప్రార్ధించారు. అంతర్యామి జ్ఞానమార్గాన్ని నిర్దేశించే జ్ఞానజ్యోతి రూపంలో లోకాలను అద్వితీయమైన వెలుగుతో ప్రకాశింపచేశారు. అందుకనే ఇక్కడి స్వామిని "శ్రీ దీప ప్రకాశ పెరుమాళ్" (విళక్కు ఓలి పెరుమాళ్) అని పిలుస్తారు.
తొలి ఆలయ నిర్మాణం చోళ రాజులు నిర్మించగా, విజయనగర ప్రభువులు ఆలయాభివృద్దికి కృషిచేశారు అని శాసనాల ఆధారంగా తెలుస్తోంది. రెండంతస్తుల రాజ గోపురాన్ని కలుపుతూ ఎత్తైన ప్రహరీ గోడ కలిగిన ఈ ఆలయంలో మూలవిరాట్టు స్థానక భంగిమలో పడమర ముఖంగా దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీ మరకతవల్లీ తాయారు ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. ఉపాలయాలలో ఆండాళ్ళు, ఆళ్వారులు ఉంటారు.
తిరుత్తాంక శ్రీ వేదాంత దేశికుల జన్మస్థలం. అందుకని వీరికొక ప్రత్యేక సన్నిధి వీరి ఆరాధ్య దైవమైన శ్రీ లక్ష్మీ హయగ్రీవులకు మరో సన్నిధి కలవు. చక్కని పూల మొక్కల మధ్య అలరారుతూ ఉండే ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం ఆరు నుండి రాత్రి పది గంటల వరకు తెరచి ఉండే ఆలయంలో నిత్యం నియమంగా ఆరు పూజలు జరుపుతారు.
పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ తిరుమంగై ఆళ్వార్ శ్రీ దీప ప్రకాశ పెరుమాళ్ ని కీర్తిస్తూ రెండు పాశురాలను గానం చేశారు.

నమో నారాయణాయ !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...